మేం మొదటి నుంచీ శాంతి చర్చలకు సిధ్దంగానే ఉన్నాం..కానీ పాశ్చాత్యదేశాలే యుధ్దాన్ని ఎగదోస్తూ వచ్చాయని ఆరోపించారు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్. ఉక్రెయిన్ యుద్దం మొదలై మరో రెండు రోజుల్లో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ మధ్య పుతిన్ ఆరోగ్యం బాగోలేదంటూ మరోసారి పుకార్లు వ్యాపిస్తున్న తరుణంలో యుధ్దం విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.
ఉక్రెయిన్ ప్రస్తుత పరిస్థితికి పాశ్చాత్య దేశాలదే బాధ్యత అని, సమస్య పరిష్కారానికి ఆ దేశాలు సిద్ధంగా లేవని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆక్షేపించారు. ఇప్పటికీ మేం అలాగే చర్చలకు సిద్ధంగానే ఉన్నామని మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటన నేపథ్యంలో.. జాతిని ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు. ‘మేం సమస్యను పరిష్కరించేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
దేశం ఎదుర్కొంటోన్న సవాళ్లను దశలవారీగా జాగ్రత్తగా, క్రమపద్ధతిలో పరిష్కరిస్తాం. కానీ మా వెనక పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రష్యా సరిహద్దు వద్దకు నాటో విస్తరించాలని భావించింది. మనం మన దేశ ఉనికి గురించే మాట్లాడుతున్నాం. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితికి పాశ్చాత్య దేశాలదే బాధ్యత.సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ఆ దేశాలు సిద్ధంగా లేవు. వాటి వైఖరి కారణంగానే సమస్య మరింత జఠిలం అవుతోంది.
యుద్ధం కోసం ఆ దేశాలు 150 బిలియన్ల డాలర్లు ఉదారంగా ఇచ్చాయి. ప్రస్తుతం స్థానిక ఘర్షణను అంతర్జాతీయ ఘర్షణగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌కు ఇరాక్, యుగోస్లావియా గతి పట్టిస్తారు. కానీ మేం ప్రపంచ భద్రత కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నాం’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. సోమవారం బైడెన్ ఉక్రెయిన్‌లో ఆకస్మిక పర్యటన చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి ఏడాది కావస్తున్న నేపథ్యంలో సంఘీభావ సంకేతకంగా ఆయన ఆ దేశ రాజధాని కీవ్‌కు వెళ్లారు. యుధ్దం మొదలయ్యాక ఉక్రెయిన్ వెళ్లడం ఆయనకిది మొదటిసారి.. జో బైడెన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న వెంటనే ప్రత్యేక వాహనంలో ఆ దేశాధ్యక్షుడి అధికార నివాసానికి బయలుదేరి వెళ్లారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. యుద్ధ నేపథ్యంలో తదుపరి చర్యలను అడిగి తెలుసుకున్నారు. జో బైడెన్ తో పాటు వచ్చిన అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రతినిధులతో వొలొదిమిర్ జెలెన్ స్కీ సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ కు 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు జో బైడెన్. అత్యాధునిక ఆయుధ సామాగ్రిని అందజేస్తామని హామీ ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి సాగుతోన్న రష్యా దాడిని.. ‘కిరాతకం, అన్యాయమైన యుద్ధం’ అని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర విమర్షలు చేసారు. బాటిల్ నుంచి భూతం
బయటికొచ్చిందంటూ బైడెన్‌పై పుతిన్ నిప్పులు కక్కారు.
ఏడాది కాలంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే ఉండటానికి కారణం అమెరికా సహా నాటో దేశాలే కారణమన్న ఆరోపణలున్నాయి. అయితే నువ్వా-నేనా అన్నట్లుగా ఏడాది కాలంగా సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వేలాది మంది ఉక్రెయిన్ ప్రజలు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో అపారమైన ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఇరు దేశాల బలగాలు అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. కొన్ని చోట్ల ఒకరికి మరికొన్ని చోట్ మరొకరిది పైచేయిగానే ఉన్నా మళ్లీ ఆక్రమించుకోవడం జరిగింది. అటు రష్యా వైపు సైతం అపారమైన ప్రాణనష్టం, ఆర్థిక నష్టం జరిగింది. కానీ రష్యాకు ఉన్న సహజ వనరులను అమ్ముకుంటూ తన లాభం తాను చూసుకోవడం జరిగింది. భారత్ చైనా దేశాలకు తక్కువ ధరకే ముడు చమురు సరఫరా చేసింది.
ఉక్రెయిన్ భుజంపై తుపాకీ పెట్టిన పాశ్చాత్య దేశాలు తమతో యుద్ధం చేస్తోన్నాయని పుతిన్ ఆరోపించారు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన తాము యుద్ధానికి దిగడానికి ముందే ఉక్రెయిన్ చర్చల కోసం సన్నద్ధమై ఉందని, అయితే పాశ్చాత్య దేశాలు.. తమపై యుద్ధం చేయడానికి ఉక్రెయిన్ ను ప్రోత్సహించాయని అన్నారు. ఈ యుద్ధం నుంచి ఉక్రెయిన్ ను వెనక్కి పిలిపించే ప్రయత్నాలకు బదులుగా మరింత ఆజ్యం పోస్తోన్నాయంటూ పుతిన్ ధ్వజమెత్తారు.
ఫలితంగా వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాయని ఆరోపించారు. ఉక్రెయిన్ ను పాశ్చాత్య దేశాలు తమపై ఎంత ఎక్కువగా రెచ్చగొడుతుంటే తాము అంత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుందని వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. తమ ముందున్న లక్ష్యాన్ని అందుకోవడానికి క్రమబద్ధంగా ప్రయత్నాలు సాగిస్తామని స్పష్టం చేశారు.