Homeఅంతర్జాతీయంప్రధాని మోదీ తన విధానాలతో భారత్ కొత్త రూపు..

ప్రధాని మోదీ తన విధానాలతో భారత్ కొత్త రూపు..

కళ్ళు ఉన్నవాడు ముందు మాత్రమే చూస్తాడు..తెలివి ఉన్నవాడు ప్రపంచాన్నిచూస్తాడు.. అలాంటి ద్రుక్పదం ఉంది కాబట్టే ప్రధాని మోదీ తన విధానాలతో ప్రపంచం మొత్తాన్ని భారత్ వైపు చూసేలా చేస్తున్నారు. అందుకే పక్కలో బల్లెం లా ఉన్న పాకిస్తాన్ నానా విధాలుగా ఆర్థిక కష్టాలు పడుతోంది.. సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడే చైనా త్వరలో కాళ్ళ బేరానికి వచ్చే అవకాశం కూడా ఉంది.. ప్రతిదానికి కాళ్లల్లో కర్రలు దూర్చే అమెరికా సైతం.. ఇప్పుడు మనకు వంత పాడుతోంది.. ఇన్ని పరిణామాలు జరిగాయి అంటే దానికి కారణం ఒకే ఒక్కడు అదే నరేంద్ర మోదీ.. ఆయన వెంట అడుగులో అడుగేస్తూ దేశ ప్రతిష్టను పెంచుతున్న క్యాబినెట్ టీం.. ముఖ్యంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఆ దిశగా ప్రపంచదేశాలు మెచ్చే విధంగా దూసుకుపోతున్నారు.

అలాంటి ప్రధాన మంత్రి తమకు ఉండే బాగుండునని శత్రు దేశం పాకిస్తాన్ కూడా కోరుకుంటున్న సమయంలో తగుదునమ్మా అంటూ ప్రవేశించింది బీబీసీ..దేశంలో ఉన్న అనేక మీడియా సంస్థల్లో ఒకటైన బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ బీబీసీకి మన దేశం అభివ్రుద్ది చెందడం విషయంలో ఎప్పుడూ అసంత్రుప్తిగానే ఉంటుంది. మన దేశంలో జరిగే నెగెటివ్ వార్తలను హైలైట్ చేస్తూ భారత్ పరువు తీసే కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.

మొన్నటికి మొన్న అలాంటిదే ఓ ప్రక్రియ మళ్లీ మొదలుపెట్టింది. ‘‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’’ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఓ డాక్యుమెంటరీని రెండు భాగాలుగా ప్రసారం చేసింది. 2002లో గుజరాత్‌ అల్లర్ల సమయానికి మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని హైలైట్ చేస్తూ.. ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఈ పరిణామాన్ని ఊహించని బీబీసీ వెంటనే సోషల్ మీడియా వేదికల నుంచి సదరు డాక్యుమెంటరీని తొలగించారు. భారతీయ మూలాలున్న బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందని బ్రిటన్ పార్లమెంటులోనే ఆరోపించారు. అసలు బీబీసీకి ఇండియా అంతర్గత విషయాలపై అంత ఆసక్తి దేనికి..? అదో విదేశీ చానెల్ మన దేశంలో కార్యక్రమాలను ప్రసారం చేసుకుంటు తన అస్థిత్వాన్ని కాపాడుకునే సంస్థ. దాని అస్థిత్వం పూర్తిగా భారత్ నిర్ణయంపైనే ఉంటుంది.

సాక్షాత్తూ ఆ కంపెనీ మాత్రుదేశం అయిన బ్రిటన్ స్వయంగా ప్రధాని మోదీని ప్రస్తుతిస్తూ భారతదేశంలో వ్యాపార సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాల కోసం తహతహలాడుతూ ఉంటే ఈ చానెల్ చేసిన పని రెండు దేశాల మధ్య అనవసరపు ఇబ్బందిని తెచ్చిపెట్టింది. ఇందుకు ఆ దేశం నుంచి బీబీసీకి ఇప్పటికే మొట్టికాయలు పడ్డాయి. ఈ డాక్యుమెంటరీని సహజంగానే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆదరించింది. డాక్యుమెంటరీని అడ్డుపెట్టుకుని మోదీని విమర్షించడానికి ఉపయోగించుకోవాలని తలంచింది. కానీ విషయం తెలిసిన భారత ప్రజల నుంచి బీజేపీకి అనూహ్య మద్దతు లభించింది.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏకే ఆంటోనీ కుమారుడు దీనిపై స్పందించారు. భారత్‌లో అంతర్గతంగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. విదేశీ మీడియా జోక్యం చేసుకుని విభేదాలు సృష్టించే అవకాశం కల్పించరాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేరళ డిజిటల్ కమ్యూనికేషన్స్ చీఫ్ అనిల్ కె ఆంటొనీ ఏకంగా తన పార్టీకి రాజీనామా కూడా సమర్పించారు. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం జరిగినదానిపై ఇప్పుడు రాద్ధాంతం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

పైగా భారత్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ విషయంలో క్లీన్ చిట్ ఇచ్చిన విషయం మరవరాదని చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో విదేశీయులను లేదా వారి సంస్థలను మన సార్వభౌమత్వాన్ని అణగదొక్కడానికి లేదా మన సంస్థలను నాశనం చేయడానికి అనుమతించకూడదని వ్యాఖ్యానించారు.

  • అయితే ఇదే అంశంపై భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం తన దోరణిని వదులు కోలేకపోయారు..

జమ్మూలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఓ విదేశీ మీడియా సంస్థ స్రుష్టించిన ఈ డాక్యుమెంటరీని నిరోధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ విమర్షలు గుప్పించారు. పత్రికలను నిషేధించవచ్చు.. పత్రికలను అణచివేయవచ్చు.. సంస్థలను నియంత్రించవచ్చు.. సీబీఐని ఉపయోగించవచ్చు. కానీ నిజం నిజమే’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే సరిగ్గా జనరల్ ఎలక్షన్లకు ఇంకో ఏడాది ఉందనగా, ప్రతిపక్ష నాయకుడి పాదయాత్ర పూర్తవనుండా సమయం చూసుకుని ప్రసారం చేయబడిన బీబీసీ డాక్యుమెంటరీ దేశంలో ఏ సంచలనం స్రుష్టించలేదు.

పైగా దానిని అడ్డు పెట్టుకుని చేయాలనుకున్న, చేసిన విమర్షలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గానీ ఇతర మంత్రులు కానీ స్పంధించలేదు. కేవలం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాత్రమే స్పందించారు. ‘బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని ధ్వజమెత్తారు.

విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి చొప్పించాలనే లక్ష్యంతో రూపొందించారని ఆరోపించారు. ప్రజలను తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని దుయ్యబట్టారు. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇటువంటి కథనాన్ని ప్రచారం చేయడంలో బీబీసీ వ్యక్తుల అసలు ధోరణి కనిపిస్తోందని తెలిపారు. దీనిని ప్రసారం చేయడంలో ఎజెండా ఏమిటని ఆయన నిలదీశారు.

ఈ డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని సదరు విదేశీ సంస్థ బీబీసీ.. ఇటీవల భారత్‌ మినహా ఇతర దేశాల్లో విడుదల చేసింది. భారత్‌లో బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయకున్నా.. కొందరు వ్యక్తులు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్‌లో బ్లాక్‌ చేయాలంటూ యూట్యూబ్‌, ట్విటర్‌లను కేంద్రం ఆదేశించింది. వాటిని తొలగించాలని, భవిష్యత్‌లో ఈ వీడియో అప్‌లోడ్‌ కాకుండా బ్లాక్‌ చేయాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

దేశంలో హిందువులు గోవులను అతి పవిత్రంగా పూజిస్తారు కాబట్టి గొడ్డు మాంసం తినరాదని నిషేధించారు. గో జాగరణ అంశంపై ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా దృష్టి సారించింది. మోడీ తరహా హిందూ జాతీయవాదానికి రికార్డు సంఖ్యలో భారత ఓటర్లు మద్దతిస్తున్నారంటూ ప్రధాని విజయం వెనుకు రహస్యం ఇదేనని తెలిపింది.

”భారతదేశం పనిచేసే తీరును హిందూ మత విధానంగా మార్చడం, భారతదేశ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక స్వభావాన్ని కోలుకోలేని రీతిలో మార్చడమనేది ఇక్కడ ప్రాధమిక లక్ష్యంగా వుందంటూ ఆరోపణలు కూడా రాజకీయ నిపుణుల ద్వారా చేయించింది. 2019 ఆగస్టులో 370వ అధికరణను రద్దు చేస్తూ వివాదాస్పదమైన చర్య తీసుకోవడం, తర్వాత జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని విభజించి, కేంద్ర పాలిత ప్రాంతంగా అనూహ్యమైన రీతిలో మార్చడంపై డాక్యుమెంటరీ వ్యాఖ్యానిస్తూ, ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన 9వారాల తర్వాత కాశ్మీర్‌కు సైనిక బలగాలు పంపబడ్డాయని తెలిపింది.

ఫలితంగా కేంద్రం ప్రత్యక్ష నియంత్రణలోకి ఆ ప్రాంతం వెళ్లిపోవడంతో ‘సమాచార స్తంభన’ నెలకొందని డాక్యుమెంటరీ వెల్లడించింది. మతాన్ని భారతదేశ పౌరసత్వంతో ముడిపెట్టడానికి ఉద్దేశించిన సీఏఏకి వ్యతిరేకంగా ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడం, అటుపై 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో మతోన్మాద హింస చోటు చేసుకోవడంపై మాట్లాడుతూ, ”ముస్లిం ఆందోళనకారులపై కరడుగట్టిన హిందూ మత పెద్దలు బెదిరింపులకు దిగారు.

” అంటూ నేరుగా డాక్యుమెంటరీ ద్వారా విమర్షలకు తెగబడింది బీబీసీ. ఆయన పాలనలో దేశంలో ‘మతపరమైన కల్లోలం’ ఏర్పడిందని డాక్యుమెంటరీలో చూపించేందుకు తహతహలాడింది. గుజరాత్‌ అల్లర్లలో ఆయన పాత్ర లేదంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ దేశంలో ”ఆందోళనలు మాత్రం పోవడం లేదు” అని డాక్యుమెంటరీ స్వంతంగా తనకు నచ్చిన తీర్పునే వెల్లడించింది. ఇలా ఏక పక్షంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని నిర్మించిన ఈ డాక్యుమెంటరీ దేశ ప్రజలను మనోభావాలను కించపరిచేలా ఉంది.

Must Read

spot_img