Homeఅంతర్జాతీయంప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఉద్రికంగా మారింది..

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఉద్రికంగా మారింది..

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లడం ఉద్రికంగా మారింది.. తమ నేతను అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ.. పోలీసులకు పీటీఐ పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది..

  • ఇమ్రాన్ ఖాన్ పై అవినీతి ఆరోపణల కేసు వివాదం తీవ్ర స్థాయికి చేరుతోందా…?
  • ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేయకుండా పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం వంటివి వ్యూహంలో భాగమేనా…?
  • ఇంతకూ ఇమ్రాన్ ఖాన్ పై అవినీతి ఆరోపణల కేసు విచారణ పూర్తయిందా…?

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీక్‌ -ఏ- ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నడం చర్చనీయాంశమైంది.. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను ఆయన మద్దతుదారులు అడ్డుకొన్నారు. ఈ క్రమంలో పోలీసులపై కొందరు రాళ్లు రువ్వగా.. ఇమ్రాన్‌ మద్దతుదారుల్ని చెరదగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు, భాష్పవాయు గోళాల్ని ప్రయోగించారు. దీంతో లాహోర్‌లోని జమన్‌ పార్క్‌లో ఇమ్రాన్‌ నివాసం వద్ద పరిస్థితులు రణరంగాన్ని తలపించాయి. ఈనేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన వీడియో సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్‌చేశారు. తాను జైలుకు వెళ్లినా, తనను చంపేసినా ప్రజలు మాత్రం తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

‘పోలీసులు నన్ను అరెస్టు చేయడానికి వచ్చారు. ఇమ్రాన్‌ ఖాన్‌ జైలుకు వెళ్తే ప్రజలు నిద్రపోతారని వారు భావిస్తున్నట్టున్నారు. అది తప్పని మీరు రుజువు చేయండి. ప్రజలు సజీవంగా ఉన్నారని నిరూపించండి. వీధుల్లోకి వచ్చి మీ హక్కుల కోసం పోరాడండి. ఆ భగవంతుడు ఇమ్రాన్‌కు అన్నీ ఇచ్చాడు. కానీ మీ యుద్ధంలో నేనూ పోరాడుతున్నా. నేను నా జీవితమంతా పోరాడా.. దాన్ని కొనసాగిస్తాను. ఒకవేళ నాకేదైనా జరిగితే.. వాళ్లు నన్ను జైలులో పెట్టొచ్చు. చంపేయొచ్చు కూడా. ఇమ్రాన్‌ ఖాన్‌ లేకపోయినా పోరాడగలమని మీరు నిరూపించాలి. ఒక వ్యక్తి చేసే బానిసత్వ పాలనను ఎప్పటికీ అంగీకరించబోమని మీరంతా నిరూపించాలి” అని పిలుపునిచ్చారు ఇమ్రాన్ ఖాన్..

ఇమ్రాన్‌ ఖాన్‌ను తమ కస్టడీలోకి తీసుకొనేందుకు అధికారులు ఆయన నివాసానికి చేరుకోగా.. అప్పటికే పీటీఐ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మద్దతుదారులు ఇమ్రాన్‌ నివాసం వద్దకు తరలివచ్చారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కెనాన్లు, భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఆ సమయంలో పీటీఐ శ్రేణులు చేసిన దాడిలో ఇస్లామాబాద్‌ డీఐజీకి గాయాలయ్యాయి. ఇమ్రాన్‌ ఇంటివైపు వచ్చే అన్ని దారులనూ మూసివేశారు. అయితే, ఏ కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసేందుకు వచ్చారనే విషయంలో మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదని స్థానిక మీడియా పేర్కొంది. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తూ పీటీఐ నేత ఫరూక్‌ హబీబ్‌ ట్వీట్‌చేశారు. మరో నేత ఫవాద్‌చౌదరి.. తోషఖానా కేసులో అరెస్టు వారెంట్లు ను ఇస్లామాబాద్‌ కోర్టులో ఛాలెంజ్‌ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ కేసు విచారణకు వస్తుందని పేర్కొన్నారు.

మరోవైపు, పాకిస్థాన్‌ అధికార పార్టీ పీఎంఎల్‌-ఎన్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌ మరియమ్‌ నవాజ్‌ షరిఫ్‌ మాట్లాడుతూ.. ఎవరైనా పోలీసు అధికారులు, లేదా సిబ్బంది గాయపడితే.. అందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానిగా ఉండగా.. విదేశీ పర్యటనల్లో వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. ఈ కేసుకు సంబంధించిన మూడు సార్లు విచారణకు పిలిచినా ఇమ్రాన్‌ హాజరుకాకపోవడంతో సెషన్సు కోర్టు ఆయనపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది.. విదేశాలకు వెళ్లినప్పుడు, విదేశీ అతిథులు వచ్చినప్పుడు వారి నుంచి పాకిస్తాన్ నేతలు, అధికారులకు అందే బహుమతులను దాచే ఖజానాను తోశఖానా అంటారు.

ఇలా పొందిన బహుమతులలో కొన్నిటికి ఈ తోశఖానాకు అప్పగించకుండా ఇమ్రాన్ తన వద్దే ఉంచుకున్నారన్నది ఆరోపణ. విదేశీ ప్రతినిధులు బహుకరించిన మూడు వాచీలను విక్రయించడం వల్ల 3.6 కోట్ల డాలర్ల మొత్తం సంపాదించారని ఇమ్రాన్‌పై ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇమ్రాన్‌కు స్థానిక కోర్టు ఒకటి జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు మార్చ్ 13 వరకు సస్పెండ్ చేసింది. ఆ గడువు ముగియడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లడంతో ఇప్పుడు ఘర్షణలు జరుగుతున్నాయి.. లాహోర్‌లోని జమాన్ పార్క్‌లో ఉన్న ఇమ్రాన్ ఇంటికి వెళ్లేందుకు లాహోర్, ఇస్లామాబాద్ పోలీసులు ప్రయత్నించగా పీటీఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఇమ్రాన్ ఖాన్ ఏ కేసులోనూ దోషిగా తేలలేదని.. కోర్టుకు హాజరుకానందుకే ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పీటీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు జారీ చేసిన వారెంట్ ఉపసంహరించుకోవాలంటూ పీటీఐ నేత, మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. రెండు వారాల కిందట కూడా ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన నివాసానికి వెళ్లగా.. అక్కడ ఇమ్రాన్ ఖాన్ లేరని చెప్పడంతో తిరిగివెళ్లిపోయారు..

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.. ఇమ్రాన్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు.. పీటీఐ పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మరి… ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి..

Must Read

spot_img