భయంకరమైన యుధ్దం ఒకవైపు కొనసాగుతుండగా యుధ్దక్షేత్రంలో తలమునకలుగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి 45 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు. భర్తను ఉద్దేశించి పెట్టిన ఆ కొన్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ పోస్టుతో పాటు తనతో దిగిన తాజా ఫోటోను కూడా నెటిజన్లతో పంచుకున్నారు.
‘మీరు మారలేదు అలానే ఉన్నారు’అంటూ జెలెన్‌స్కీ భార్య సోషల్ మీడియాలో పెట్టిన భావోద్వేగ పోస్ట్ నెటిజన్లను కదలించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి నలబై అయిదేళ్లు నిండాయి. జవనరి 25 జెలెన్‌స్కీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన భార్య ఒలెనా జెలెన్‌స్కా భావోద్వేగ పోస్ట్ తోపాటు జెలెన్‌స్కీ ఫోటోను కూడా పంచుకున్నారు. “మీరు నన్ను తరచుగా ఎలా మారాను అని అడుగుతుంటారు.
కానీ మీరు ఎప్పటికీ మారలేదు. నేను 17 ఏళ్ల వయసులో కలుసుకున్నప్పుడూ ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడూ చాలా అరుదుగా నవ్వుతున్నారు. మీరు మరింత బాగా నవ్వుతూ ఉండేలా పరిస్థితులు రావాలని కోరుకుంటున్నాను.. అందుకు ఏం చేయాలో కూడా మీకు తెలుసు. ఐతే మీకు కాస్త మొండి పట్టదల ఎక్కువ’.

‘ప్రధానంగా ముందు మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మంచిగా నవ్వండి. ఎప్పటికీ మీకు దగ్గరగా ఉండేలా అవకాశం ఇవ్వండి” అటూ జెలెన్ స్కీ సతీమణి ఒలెనా భావోద్వేగంగా ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. కాగా, ఈ జంట 2003లో పెళ్లి చేసుకున్నారు, వారికి ఇద్దరూ పిల్లలు కూడా. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
దీంతో నెటిజన్లు మీరిద్దరూ ప్రపంచానికే గొప్ప హిరోలు, దేశాన్ని రక్షించటం కోసం పోరాటానికి సిద్ధపడిన రియల్ హిరో జెలెన్ స్కీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ వారిద్దర్నీ ప్రశంసలతో ముంచెత్తారు. యుధ్దం ఎంత తీవ్రస్థాయిలో జరుగుతున్నా తనను తాను రక్షించుకుంటూ సైనికులను కలుసుకుంటున్నారు జెలెన్ స్కీ..యుధ్దం మొదలై ఏడాది దాటుతున్నా ఏ ఫలితం తేలడం లేదు.
అయినా మొక్కవోని విశ్వాసంతో తన బలగాలకు గుండెదైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా ఎత్తులకై పై ఎత్తులు వేస్తూ నాటో దేశాలను కన్విన్స్ చేస్తూన్నారు. వారి సాయాన్ని అర్థిస్తూ సైన్యానికి ఆయుధాలు అందజేస్తున్నారు. ఈమధ్యే తాను అమెరికా కూడా విజిట్ చేసారు. బైడెన్ కలసిన నేపథ్యంలో అబ్రామ్ ట్యాంకులను కూడా సాధించుకు వచ్చారు. అవి ఉక్రెయిన్ కు చేరితే రష్యాకు చుక్కలు చూపిస్తాయని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు.
ఏడాది కాలంగా ఏ రోజూ వదలకుండా సోషల్ మీడియాలో తన దేశ ప్రజలను పలకరిస్తూ వస్తున్నారు. పుతిన్ కు ధీటుగా సమాధానాలిస్తూ అంతర్జాతీయంగా ఉక్రెయిన్ కు మద్దతు కూడగట్టుకుంటున్నారు. దీంతో ఎక్కడా ఏ లోటు లేకుండా ఉక్రెయిన్ సైనికులు కరడు గట్టిన రష్యా బలగాలను ఎదుర్కుంటున్నారు.
- అయితే జెలెన్ స్కీ అమెరికా వెళ్లడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడ్డారు..
జెలెన్ స్కీ అమెరికా పర్యటనపై రష్యా తీవ్రంగా స్పందించింది. జెలెన్ స్కీ అమెరికా పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనీ ఉక్రెయిన్ తో ఇక శాంతిచర్చలకు అవకాశమే లేదని రష్యా తేల్చిచెప్పింది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాల ఆయుధ సరఫరా సంఘర్షణను మరింత తీవ్రం చేస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ కు ఎదురుదెబ్బలు తప్పవన్నారు.
పోయిన సంవత్సరం ఫిబ్రవరి 24 న యుధ్ధం మొదలైంది. ఆ తరువాత తొలిసారిగా జెలెన్ స్కీ మాత్రుదేశం వీడి అమెరికా వెళ్లారు. ఆ పర్యటన వల్ల అమెరికా సహా పలు దేశాల నుంచి ఆయుధాలతో పాటు ఆర్థిక సాయం కూడా సాధించుకున్నారు. రష్యాను ఎండగట్టడానికి ఆయన ఏ వేదికనూ వదులుకోవడం లేదు. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్ గా మాట్లాడారు. ఉక్రెయిన్ స్వాతంత్య్రం కోసం మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు చెప్పారు. యుద్ధం ఇంకా ముగిసిపోలేదన్నారు. కానీ, సమయం మించిపోయింది. ఎవరు గెలుస్తారో తేలిపోయింది.
అయినా కానీ యుద్ధం, కన్నీళ్లు ఇంకా నిలిచే ఉన్నాయి. మనందరి ఉమ్మడి పోరాటం స్వేచ్ఛ కోసం, ప్రజాస్వామ్యం, జీవించే హక్కుకోసం అని అన్నారు. మొదటి రెండు ప్రపంచ యుద్ధాలను జెలెన్ స్కీ ప్రస్తావించారు. మూడో ప్రపంచ యుద్ధానికి అవకాశం లేదన్నారు. తమ భూభాగంలో రష్యా దురాక్రమణను అడ్డుకుంటామని ప్రకటించారు. యుద్ధంలో ఉక్రెయిన్ గెలిచిన నాడు ప్రపంచంలోని స్వేచ్ఛాకాముక ప్రజలు అందరూ సంబరాలు చేసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు.