Homeజాతీయంపొత్తుల పంచాయితీ కొలిక్కి వచ్చేదెప్పుడన్నదే ఆసక్తికరంగా మారింది !!!

పొత్తుల పంచాయితీ కొలిక్కి వచ్చేదెప్పుడన్నదే ఆసక్తికరంగా మారింది !!!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోనున్నాయా..? ఇప్పటికే ఇరు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ షురూ అయిందా..? దీనిపై వినిపిస్తోన్న వాదనలేమిటి..? ఏ ఏ సీట్లపై చర్చలు సాగుతున్నాయి..?

ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయిందా? బీజేపీ కలిసినా కలవకపోయినా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు ఖరారైపోయిందా? అంటే ఈ రెండు పార్టీల శ్రేణుల నుంచీ కూడా ఔననే సమాధానం వస్తోంది. ఎన్నికలు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. దానికి తోడు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని చెబుతున్నారు.

ఏవో రెండు మూడు జిల్లాలు మినహా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు కూడా ఖరారైపోయాయని చెబుతున్నారు. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో జనసేన బలం పెరిగిందన్న విషయాన్ని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. హీరోగా, పొలిటీషియన్ గా జనసేనాని పవన్ కల్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలోనే ప్రజలు ఆయన సభలకు హాజరౌతున్నారు.

తెలుగు రాష్ట్రాలలో అత్యంత జనాకర్షణ సామర్థ్యం ఉన్న వారిలో పవన్ కల్యాణ్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. అయితే ఈ జనాకర్షణ ఎన్నికలలో విజయానికి దోహదపడుతుందా అంటే మాత్రం కచ్చితంగా ఔనన్న సమాధానం రాదు. గత ఎన్నికలలో 130కి పైగా స్థానాల్లో పోటీ చేసిన జనసేన కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించింది. ప్రస్తుతం కూడా ఆ పార్టీకి జనాదరణ పెరిగినా ఒంటరిగా ఎన్నికల సమరాంగణంలో గెలిచే సామర్థ్యం మాత్రం లేదనే చెప్పాలి.


ఇందుకు కారణాలెన్నో ఉన్నా.. ప్రధానంగా పార్టీ ఆవిర్భవించి పుష్కర కాలం గడిచినా ఇప్పటికీ సంస్థాగత నిర్మాణం లేదు. అలాగే పవన్ కల్యాణ్ మినహా మరో నాయకుడు కనిపించరు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంతే. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నా.. ఆయన క్రౌడ్ పుల్లర్ కాదు. వీరిద్దరినీ మినహాయిస్తే మిగిలిన వారంతా ఆటలో అరటి పండుతో సమానం. పవన్ కళ్యాణ్ ఒంటరి నాయకత్వం వలన పార్టీ జనంలోకి బలంగా వెళ్ళలేక పోతోంది. ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు ఆయన పార్టీ నిర్మాణంపై దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేశారు. శిక్షణా శిబిరాలు నిర్వహించి, సభ్యత్వాలు నమోదుపైనా దృష్టి సారించారు.

ఆ తరువాత పార్టీలో చంద్రబాబు కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్‌ చేశారు. శిక్షణా శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ లేకపోయినా, టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండటానికి అదే కారణం. అందుకే టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు చాటుకుని, స్థిరంగా నిలిచింది. ఏ రాజకీయ పార్టీ అయిన పదికాలాలు నిలవాలంటే, సంస్థాగత నిర్మాణం అవసరం. అది లేక పోవడమే జనసేన లోపం.

ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే, 2019 ఫలితాలే పునరావృతం అవుతాయి. అంతే కాదు, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఫలితంలో మార్పు ఉండదు.బీజేపీ దేశంలో బలమైన శక్తి కావచ్చు కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బీజేపీకి నిండా ఒక శాతం ఓటు బలం కూడా లేదు. అందుకే వైసీపీని ఓడించే శక్తి ఒక్క టీడీపీకి తప్ప మరో పార్టీకి లేదు. సో .. వైసీపీని ఓడించి, జగన్ పాలనకు ముగింపు పలకడమే జనసేన లక్ష్యం అన్న పవన్ ముందున్న ఏకైక ఆప్షన్ తెలుగుదేశం పార్టీతో అవగాహన కుదుర్చుకోవడం ఒక్కటే.

అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చే ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లోనైనా వైసీపీ గెలుపును అడ్డుకోవాలన్న లక్ష్యం నెరవేరాలంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న జనసేన పార్టీతో పొత్తు తెలుగుదేశం పార్టీకీ అవసరమే. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్యా పొత్తు పొడుపుకు మార్గం సుగమమయ్యేలా చర్చల ప్రక్రియకు తెరలేచింది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా వరకూ ఒక అవగాహన కుదిరింది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఇప్పిటికే ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు కూడా చాలా వరకూ ఖరారైందని చెబుతున్నారు.

పొత్తులో భాగంగా ఏడు జిల్లాలలో 20 స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని చెబుతున్నారు. మిగిలిన జిల్లాలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అవగాహన కుదిరిన స్తానాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెన పల్లి, కృష్ణా జిల్లాలో పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్, తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలోనూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్ల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాలలోనూ జనసేన అభ్యర్థులు రంగంలో ఉంటారు. ఇక విశాఖ జిల్లాలో పెందుర్తి, భీమిలి, గాజువాక, చోడవరం నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు లేదా తిరుపతిలో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తుంది.

ఇక ప్రకాశం జిల్లా లోని దర్శి, గిద్దలూరు స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించింది. నెల్లూరు, విజయనగరం, అనంతపురం జిల్లాలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి. మొత్తం మీద వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనల పొత్త ఖాయమని ఆ రెండు పార్టీలూ కూడా ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాలనుకుంటున్న తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ‘కెమిస్ట్రీ’ బాగుందికానీ ‘మ్యాథ్స్’ మాత్రం వీక్ గా ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపుకన్నా తనకు బలమున్న ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రలోనే ఎక్కువ సీట్లు కేటాయించాలని జనసేన డిమాండ్ గా ఉంది. 25 నుంచి 30 సీట్లవరకే టీడీపీ తులాభారం తూగుతోంది. జనసేన తులాభారం మాత్రం 40 సీట్లు లక్ష్యంగా తూగుతోంది. ఏయే నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాలనేది చంద్రబాబు ముందుగానే నిర్ణయించి పెట్టుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే కొన్నిచోట్ల తఖరారు తప్పడంలేదంటున్నారు.

గుంటూరు పశ్చిమ కోసం జనసేన పట్టుబడుతుండగా తూర్పు కేటాయించే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పొత్తులపై అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి సీనియర్లతో తాజాగా ఓ రహస్య భేటీని నిర్వహించారట. జనసేనతో కలిసి పొత్తులకి వెళుతున్నాం.. పార్టీ అధికారంలోకి రావడం కోసం త్యాగాలకు సిద్ధమవ్వాల్సిందేనని పార్టీ ముఖ్య నేతలకు చంద్రబాబు గతంలోనే ఓ క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, మేమే అధికారంలోకి వస్తాం..

అని జనసేనాని పదే పదే చెబుతుండడంతో, చంద్రబాబు ఒకింత గుస్సా అవుతున్నారు. జనసేన, టీడీపీ పొత్తు కుదిరినా, అధికారంలోకి వచ్చేది టీడీపీయేననీ, జనసేన పార్టీ ఆ ప్రభుత్వంలో కొన్ని మంత్రి పదవులు సాధించే అవకాశం మాత్రమే వుంటుందని అప్పటిదాకా టీడీపీ శ్రేణులు భావిస్తూ వచ్చాయి. ఎప్పుడైతే, మేం అధికారంలోకి వస్తాం.. అని పవన్ కళ్యాణ్ చెప్పారో, అప్పటినుంచి టీడీపీకే మంత్రి పదవులు బిచ్చేమేసే అవకాశం వుంటుందని టీడీపీ శ్రేణులు గుస్సా అవడం మొదలైంది. కింది స్థాయిలో జరిగే రచ్చ అలాగే వుంటుంది. విడిపోయి పోటీ చేస్తే ఇరువురం నష్టపోతామన్న ప్రతిపాదన చంద్రబాబు నుంచివస్తోంటే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే భావన జనసేనాని కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో, పొత్తులపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెస్తున్నారట. నారా లోకేష్ యువగళం పాదయాత్ర టైం కల్లా రెండు పార్టీలూ కలిస్తే.. ఫలితం బావుంటుందన్నది చంద్రబాబు యోచనగా తెలుస్తోంది.

Must Read

spot_img