Homeతెలంగాణఅయోధ్యపై పోస్ట్...ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు

అయోధ్యపై పోస్ట్…ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు

తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ పై మళ్లీ కేసు నమోదైంది. దీంతో తెలంగాణవ్యాప్తంగా ఓ ఆసక్తికర చర్చ వినిపిస్తోంది. ఇక రాజాసింగ్ ఫ్యూచర్ ఏమిటోనన్నదే చర్చనీయాంశంగా మారింది. ఓవైపు పార్టీ సస్పెన్షన్ ఎత్తివేయలేదు.. మరోవైపు మళ్లీ కేసు నమోదైంది.. దీంతో రాజాసింగ్ ఏం చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో బీజేపీ ఫైర్ బ్రాండ్ ఘోషా మహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవలే అతి కష్టం మీద బెయిల్ పై బయటకు వచ్చారు. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోను.. మతాల మధ్య ఘర్షణలు పెడుతున్నారనే అభియోగం మేరకు ఆయనపై పోలీసులు కేసులు పెట్టడం.. ఆయన సతీమణి గవర్నర్ను కలిసి విన్నవించడం..బీజేపీ నుంచి ఆయనను సస్పెండ్ చేయడం అంతా తెలిసిందే.

అయితే.. బెయిల్ పై వచ్చిన తర్వాతైనా.. రాజాసింగ్ కుదురుగా ఉన్నారా? అంటే లేనే లేరు. తాజాగా మరోసారి నోటి దూల తీర్చేసుకున్నారు. దీంతో మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్విటర్లో రాజాసింగ్ అయోధ్య పై పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యల పై సంజాయిషీ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని, మీడియాతో మాట్లాడవద్దని తదితర షరతులను విధించింది. జైలు నుండి విడుదల అయిన తర్వాత ఇప్పటి వరకూ మీడియాతో మాట్లాడకుండా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా ఉన్న రాజాసింగ్ ఓ పోస్టుకు కామెంట్ పెట్టడంతో పోలీసులు స్పందించారు.

వెంటనే ఆయనకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రాజాసింగ్ సోషల్ మీడియా కామెంట్ పై పోలీసులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశం అయ్యింది. అంతేకాదు.. గత కేసుల్లో హైకోర్టు పెట్టిన షరతులను ఉల్లంఘించారని సదరు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులకు రాజాసింగ్ తరఫు న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు. అయితే నోటీసుల్లోని అంశాలు సంతృప్తి కరంగా లేవని పోలీసులు చెప్పారు. న్యాయ నిపుణులతో సంప్రదించి చర్యలు తీసుకుంటామన్నారు.

మరో వైపు తనపై పోలీసులు కేసు నమోదు చేయడం పై రాజాసింగ్ స్పందించారు. బాబ్రీ మసీదు పై ఒవైసీ సోదరులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పారు. వాళ్ల పై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తనకు ఒక న్యాయం.. వారికొకన్యాయమా? అని నిలదీశారు. అధికారుల మెప్పు పొందేందుకే తనపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. తనపై ఎక్కువ కేసులు పెట్టినవారికి కేటీఆర్ డీజీపీ పోస్టు ఇస్తానని ఆశ పెట్టారేమో..అందుకే తనపై లేనిపోని కేసులన్నీ పెడుతున్నారు అంటూ ఆరోపించారు. అంతేకాదు మీకు డీజీపీ పోస్టు కావాలంటే తనను ఎన్ కౌంటర్ చేయండీ అంటూ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి రాముడు అంటే ఎందుకు అంత పగ అంటూ ప్రశ్నించారు రాజాసింగ్. తాను ఏం మాట్లాడినా కేసులు పెట్టే పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం అనుచిత వ్యాఖ్యలు చేసే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఎందుకు చర్యలు తీసుకోరు? అంటూ ప్రశ్నించారు. ఎందుకంటే టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల దోస్తీ అటువంటిదని ఎంఐఎం పార్టీ ఏం చెబితే అది చేయటమే టీఆర్ఎస్ పార్టీ పని అంటూ వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్.

ఈ నేపథ్యంలోనే, 295-A ఐపిసి సెక్షన్ కింద కేసు నమోదు చేశారు మంగళహాట్ పోలీసులు. దీనిపై స్పందించిన రాజాసింగ్.. బాబ్రీ మసీదు పై ఓవైసీ సోదరులు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. వాళ్లపై ఎందుకు కేసు నమోదు చేయాలని ప్రశ్నించిన రాజాసింగ్.. కెసిఆర్, కేటీఆర్, ఓవైసీ సోదరుల మెప్పు పొందేందుకు పోలీసులు పోటీపడి తనపై కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహించారు. చనిపోయే వరకు రామనామ జపం చేస్తూనే ఉంటానని, హిందుత్వ సిద్ధాంతం కోసం, రాముడి కోసం బుల్లెట్ తూటాలకైనా ఎదురొడ్డి నిలుస్తానని, అవసరమైతే తూటాలకు బలి కావడానికి అయినా సిద్ధంగా ఉన్నానన్నారు రాజా సింగ్.

కాగా గత నవంబర్ లో రాజాసింగ్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై పీడీ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. జైలు నుంచి విడుదలయ్యే వేళ ర్యాలీలు నిర్వహించకూడదని, మూడు నెలల పాటు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయొద్దని పేర్కొంది. మీడియా, సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. రాజాసింగ్ పై పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్‌ భార్య ఉషా భాయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రాజాసింగ్ కు బెయిల్ ఇవ్వటం, పీడీ యాక్ట్ ఎత్తివేయటం జరిగింది. ఇదిలా ఉంటే, కొద్దిరోజుల కిందట బీజేపీ నుంచి రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది ఆ పార్టీ అధిష్టానం. ఓ కేసులో జైలుకు వెళ్లిన ఆయన.. బయటికి కూడా వచ్చారు. ప్రస్తుతం సొంతంగానే ముందుకెళ్తున్నారు. అయితే బీజేపీ మాత్రం సస్పెన్షన్ ను ఎత్తివేయలేదు. పైగా పెద్దగా పట్టించుకున్నట్లు కూడా కనిపించటం లేదు.

ఫలితంగా గోషామహల్ అడ్డాలో అనేక ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి. సింపుల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే రాజాసింగ్ అంటే గోషామహల్..! గోషామహల్ అంటే రాజాసింగ్ అన్నట్టు ఉంటుంది కథ..! కానీ సీన్ మారుతోంది. బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్ అయ్యాక, తెరపైకి కొత్త రాజకీయ సమీకరణాలు వచ్చేస్తున్నాయి. అదే పార్టీకి చెందిన మరో యువ నేత వేగంగా పావులు కదిపే పనిలో పడ్డారట..! నిజానికి రాజాసింగ్ జైలుకు వెళ్లిన సమయంలోనే దీనిపై తెగ వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది.

ఫలితంగా అసలు గోషామహల్ లో ఏం జరుగుతోంది…? జరగబోతుందనేది..? రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కమలం పార్టీ. జైలుకి వెళ్లి వచ్చిన ఆయన.. బయటికి వచ్చారు. అయితే ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తారని అందరూ భావించారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వారి నుంచి పెద్దగా స్పందన లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన వైఖరితో పార్టీకి కూడా చాలాసార్లు ఇబ్బందులు రావటం, చాలా మంది నేతలతో సఖ్యత లేకపోవటంతో కమలం పెద్దలు మరోలా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ రాజాసింగ్ మాత్రం.. నియోజకవర్గంలో తెగ పర్యటిస్తున్నారు. ఇదే స్థానంపై బీజేపీలో ఉన్న యువ నేత విక్రమ్ గౌడ్ కన్నేశారు. ఇతను గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పని చేసిన మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు. తండ్రి చనిపోయిన తర్వాత కూడా విక్రమ్ గౌడ్ కూడా చాలా రోజుల పాటు కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ అనంతరం బీజేపీలో చేరారు. ఆయనకంటూ ఓ వర్గం ఉంది.

ఈ సీటుపై ఆశగా ఉన్నప్పటికీ, రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సీటు నుంచి రెండుసార్లు రాజాసింగే గెలిచారు. వచ్చేసారి కూడా ఆయన బరిలో ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. సరిగ్గా ఇదే అంశం .. విక్రమ్ గౌడ్ కు ఛాన్స్ గా మారినట్లు తెలుస్తోంది.
రాజాసింగ్ జైలులో ఉన్నప్పటి నుంచే విక్రమ్ గౌడ్ లైన్ లోకి వచ్చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే మళ్లీ బలపడుతున్నాయి. మరోవైపు రాజాసింగ్ సొంత కుంపటి పెట్టే ఆలోచనలో ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.

అలా కుదరకపోతే ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారని తెలుస్తోంది. గోషామహల్ లోని తాజా రాజకీయ పరిణామాలపై రాజాసింగ్ ఓపెన్ కావటం లేదు. ఇక విక్రమ్ గౌడ్ నుంచి రియాక్షన్ లేదు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్వతంత్రంగా బరిలో ఉంటారనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ నిజమేనా..? నిజంగానే రాజాసింగ్ ను బీజేపీ పూర్తిగా వదులుకుంటుందా..? వచ్చే ఎన్నికలో విక్రమ్ గౌడే బరిలో ఉంటారా..? అనేది తేలాల్సి ఉంది. వీటికి భవిష్యత్ పరిణామాలతోనే సమాధానం దొరికే ఛాన్స్ ఉందని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరుణంలో మళ్లీ ఆయనపై కేసు నమోదు కావడం .. మరింత హాట్ రాజకీయాలకు తెర తీసిందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.

మరి రాజాసింగ్ నెక్ట్స్ స్టెప్ ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది

Must Read

spot_img