Homeతెలంగాణజూనియర్లకు సీనియర్స్ ఏ విధంగా చెక్ పెట్టనున్నారు ..?

జూనియర్లకు సీనియర్స్ ఏ విధంగా చెక్ పెట్టనున్నారు ..?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ..అగ్రనేతలే కాదు యువనేతలు కూడా ఆయా సెగ్మెంట్ లలో తొడ గొట్టేందుకు సిద్దమవుతున్నారు. కుదిరితే పార్టీ టికెట్ లేదంటే రెబల్. బరిలో ఉండడం పక్కా అంటూ లెక్కలేసుకుంటున్నారు.అందుకు ఇప్పటినుంచే జనంలోకి దూసుకు పోతున్నారు. సోషల్ యాక్టివిటీస్ తో గ్రౌండ్ వర్క్ మొదలెట్టేసారు కొందరు.. మరి పకడ్బందీ ప్లాన్ తో బరిలో దిగబోతున్న ఆ యువ నేతలెవరనుకుంటున్నారా ?

రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. సంచలనాలకు, ప్రయోగాలకు ఈ జిల్లా పెట్టింది పేరు. నాడు ఎన్టీ రామారావు పార్టీ స్థాపన క్రమంలో, నల్గొండ నుంచే బరిలో దిగి ప్రయోగాత్మకంగా సక్సెస్ అయ్యారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఆర్.దామోదర్ రెడ్డి లాంటి నేతలు ఏళ్లకు ఏళ్లుగా ఆయా నియజకవర్గాల్లో తిష్ట వేశారు. ఇన్నాళ్లు ఎదురులేని ఆధిపత్యం సాగించారు. ఎవరూ పోటీకి రాకుండా, తిరుగు లేకుండా ప్లాన్ చేసుకున్నారు. కానీ రాను రాను రాజకీయాలు మారిపోతున్నాయి. ఇప్పుడు యువత సైతం రాజకీయాలపై ఆసక్తి కనబర్చుతోంది. దీంతో ఇప్పటివరకు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఈ దిగ్గజాలకు వ్యూహాత్మకంగా చాప కింద నీరులా, యువనేతలంతా చెక్ పెడుతూ వస్తున్నారు.

ట్రెండ్ ను ఫాలో కాకుండా సెట్ చేస్తూ తమదైన రాజకీయ వ్యూహాల్ని రచిస్తున్నారు. ఇక మెట్టుదిగని సీనియర్లపై రివర్స్ ఎటాక్ షురూ చేస్తున్నారు. పాలిటిక్స్ .. కు కొత్త రక్తం ఎక్కిస్తూ, సమరానికి సై అంటున్నారు. అందుకు జనాన్ని తమవైపుకు తిప్పుకునేలా సామాజిక సేవలే అస్త్రాలుగా పాలిటిక్స్ లో రాణించేందుకు సిద్దమవుతున్నారు. అందులో భాగంగానే నల్గొండ నియోజకవర్గానికి చెందిన పిల్లిరామరాజు, ఆలేరులో బీర్ల ఐలయ్య, హుజూర్ నగర్ లో పిల్లుట్ల రవి తగ్గేదేలే అంటున్నారు. హేమా హేమీలతో తలపడేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఈసారి ఎన్నికలు .. మరింత రసవత్తరంగా సాగుతాయని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.

మరో విశేషమేంటంటే రెడ్డి ఆధిపత్యం, హవా సాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిసి నేతలు సవాల్ గా మారడం అగ్ర నేతలకు మింగుడు పడని అంశంగా మారిందనే చర్చ తాజాగా జోరందుకుంది. అయితే ఈ పరిస్థితి .. పార్టీల కతీతంగా కనిపిస్తోందని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ప్రధాన పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఈ పరిస్థితి మరింతగా ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల రేసే .. ఓ రేంజ్ లో ఉండే అవకాశముందని స్థానికంగా టాక్ వినిపిస్తోంది.

ఇక నల్గొండ నియోజకవర్గానికి చెందిన పిల్లిరామరాజు ప్రస్తుతం బీఆరెఎస్ పార్టీలో పనిచేస్తున్నారు.

కాకపోతే స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో వైరం పెట్టుకుని, తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ కౌన్సిలర్ గానే ఉన్నా, నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. సామాజిక సేవలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శుభ, అశుభ కార్యాలకు హాజరై తన వంతు ఆర్ధిక సహాయం చేస్తూ అందరూ గుర్తు పట్టేలా ప్లాన్ చేసుకున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన రామరాజు సొంత సామాజిక వర్గం, ప్రజల మద్దతుతో మరింత దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల నాటికి బరిలో దిగడం పక్కా ఖాయమంటూ ఇప్పటికే హింట్ ఇచ్చేశారు.

అయితే ఇప్పటికే సిట్టింగ్ లకే సీట్లని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అవకాశం వస్తే అధికార పార్టీ నుంచి లేదంటే రెబల్ గా నైనా బరిలో దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ మధ్య rks పేరుతో ఫౌండేషన్ స్థాపించి ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు పిల్లి రామరాజు. చాప కింద నీరులా నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.అగ్రనేతల టచ్ లో ఉంటూ బీఅర్ఎస్ పార్టీ టికెట్ కోసం ట్రై చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ప్రస్తుతం కొరకరాని కొయ్యలా మరారని నల్గొండలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇటు భూపాల్ రెడ్డి కూడా పిల్లి రామరాజును మొదట్లో లైట్ తీసుకున్నా, ఆయన దూకుడు చూసి అలెర్ట్ అయిపోయారట. ఎక్కడ తన సీటుకు ఎసరు వస్తుందో నని తెగ టెన్షన్ పడుతున్నారట. దాంతో పిల్లిరామరాజు దూకుడుకు కళ్లెం వేసేందుకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తన ప్రయత్నాల్లో తానున్నా, రామరాజు మాత్రం మరింత వేగం పెంచేశారని సమాచారం. దీంతో ఈ సెగ్మెంట్లో టిక్కెట్ కోసం టగ్ ఆఫ్ వార్ తప్పదన్న టాక్ స్థానికంగా కాస్త గట్టిగానే వినిపిస్తోందట. ఇక గులాబీ బాస్ .. మాట ఇచ్చినట్లు .. సిట్టింగ్ కే టిక్కెట్ ఇస్తారో.. లేక యువ నేత జోరుకు సై అంటారోనన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. మరోవైపు రెబల్ గానైనా పోటీకి రెడీ అంటుండడంతో, సెగ్మెంట్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

ఇక ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకా హుజూర్ నగర్ లో కూడా మరో బిసి నేత సమరానికి సై అంటున్నారు.

ఓజో ఫౌండేషన్ అధినేత “పిల్లుట్ల రవి” హుజూర్ నగర్ లో రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. సామాజిక సేవలతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల గణేష్ ఉత్సవాల సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా విగ్రహాలు పంపిణీ చేసి యువతను అట్రాక్ చేశారు. యూత్ ఇంపాక్ట్ అయ్యే కార్యక్రమాలతో ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.వ చ్చే ఎన్నికల నాటికి పార్టీ టికెట్ తో లేకుంటే, ఇండిపెండెంట్ గా నైనా బరిలో దిగి సత్తా చాటే వ్యూహం తో బిజీ బిజీగా ఉన్నారీయన.

గత ఏడాది కాలంగా ఇటు ఉత్తమ్ కు అటు స్థానిక ఎమ్మెల్యే కు కూడా ముచ్చెమటలు పట్టిస్తున్నారు పిల్లుట్ల రవి. ఇక ఆలేరు కాంగ్రెస్ ఇన్చార్జి బీర్ల ఐలయ్య కూడా తనదైన స్టైల్ లో దూసుకు పోతున్నారు. రెండేళ్లుగా బీర్ల ఫౌండేషన్ పేరుతో సోషల్ యాక్టివిటీస్ చేస్తూ, ప్రజల్లో నాని పోయారు. ఆపదలో ఉన్న వారికి ఆర్ధిక సహాయం, పేద విద్యార్దులకు ఆర్ధిక భరోసా ఇస్తూ నియోజకవర్గంలో తనకంటూ ఓ వ్యవస్థను ఏర్పరచుకున్నారు. పార్టీ కార్యక్రమాలు, సామాజిక సేవలతో జాతీయ నేతల మదిలో పడ్డారు. ఈ మధ్య పీసీసీ కమిటీ లో పదవి తెచ్చుకుని రేవంత్ టీమ్ గా ముద్ర వేసుకున్నారు. ఆలేరు టికెట్ కూడా లైన్ క్లియర్ అయినట్టు ఢిల్లీ పెద్దల నుంచి లీకు రావడంతో బీర్ల ఐలయ్య మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారట.

నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ దఫా జూనియర్లు రాజకీయంగా సందడి చేస్తుండడంతో, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల రేస్ మామూలుగా ఉండకపోవచ్చని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ యువ నేతల జోరుకు పార్టీలు ఏ నిర్ణయం తీసుకోనున్నాయన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది. దీనికితోడు ఇప్పటికే పాతుకుపోయిన నేతలకు వీరేమాత్రం చెక్ పెట్టగలరన్న అంచనాలపై నియోజకవర్గ్లాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. అయితే నల్గొండపై బీజేపీ సైతం కన్నేయనుందన్న వార్తలతో .. ఇప్పటికే పాతుకుపోయిన పార్టీలు .. ఏం చేస్తాయన్న ఆసక్తి సర్వత్రా వెల్లువెత్తుతోంది.

యువ నేతలను పక్కన పెడితే, రెబల్ బెడద తప్పదని, సీనియర్లను పక్కన పెడితే, మరో సమస్య తలెత్తక మానదని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినాయకత్వాలకు .. టిక్కెట్ల కేటాయింపు .. పెద్ద తలనెప్పిగా మారనుందని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నల్గొండలో ఎన్నికల వేళ .. టిక్కెట్ సిత్రాలు .. రసవత్తరంగా సాగుతాయన్న అంచనాలు .. స్థానికంగా రాజకీయ హీట్ ను రేకెత్తిస్తున్నాయి. మొత్తానికీ యువనేతల దూకుడు, సామాజిక సేవలతో అగ్ర నేతలకు చెమటలు పడుతున్నాయనే టాక్ సర్వత్రా చర్చనీయాంశమైంది. మరి వారి దూకుడుతో సీనియర్ నేతల వ్యూహం ఎలా ఉండనుంది.. జూనియర్ లకు సీనియర్ లు ఏ విధంగా చెక్ పెడతారన్నదే ఆసక్తి కరంగా మారింది.

మరి యువనేతలు .. టిక్కెట్ రేసులో ఏమేరకు సక్సెస్ అవుతారన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Must Read

spot_img