Homeతెలంగాణరాజకీయం అంటేనే పులి మీద సవారి..

రాజకీయం అంటేనే పులి మీద సవారి..

రాజకీయం పులి మీద సవారి లాంటింది.. ఒక్కసారి దిగితే మళ్లీ ఎక్కలేం.. ప్రాణాలతో మిగలం.. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అందునా రాజకీయాల్లో బలయ్యేది నాయకులు కాదు.. వారిని నమ్మి పని చేసిన వారే. సీమలో గత కొన్ని దశాబ్ధాలుగా కళ్లకు కనిపిస్తున్న నిజం. సరిగ్గా అలాంటి నిజమే చాలా ఏళ్ల తరువాత కనిపించింది. రాజకీయాలు ఎంత స్వార్థపూరితమే.. దానిని నమ్మి అడుగులు వేసిన ఎలా బలవుతారో చెప్పే సంఘటన అక్కడ కనిపించింది. ఒక కోర్టు తీర్పు.. నాటి నుంచి నేటి వరకు సాగుతున్న స్వార్థపూరిత రాజకీయ ప్రస్థానాన్ని కళ్లకు కట్టింది.

రాజకీయాల్లో అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప.. నిజమైన లీడర్లు కనిపించరు. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు మనకు కొన్ని వాస్తవాలను తెలిసొచ్చేలా చేస్తాయి. అలాంటి సంఘటనకు అనంతపురం జిల్లా కోర్టు వేదికైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. అనంతపురం జిల్లా కోర్టు ఈనెల 24వ తేదీన ఒక సంచలన తీర్పు ఇచ్చింది.

ఆరు మంది వ్యక్తులకు జీవితకాలపు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇలాంటివి చాలానే తీర్పులు వచ్చి ఉంటాయి. కానీ ఈ తీర్పు వెనుక ఆరు జీవితాలు ఉన్నాయి. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది.. దీని వెనుక అసలు కథేంటో చూస్తే.. అనంతపురం జిల్లాలో ఆధిపత్యం కోసం జరిగే చాలా హత్యలు
లాంటిదే ఇది కూడా. అది ధర్మవరం మండలం బడన్నపల్లి గ్రామం. అంతా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలే.

అప్పటి వరకు గ్రామం ప్రశాంతంగా ఉంది. 2017 డిసెంబరు 6వ తేదీ ఉదయం 9గంటల సమయంలో చెన్నారెడ్డి అనేక స్టోర్ డీలర్ తన మోపెడ్‌లో యూరియా బ్యాగువేసుకుని పొలానికి వెళ్లారు. అక్కడ కొందరు వ్యక్తులు రెండు బైకుల్లో వెంబడించారు. చెన్నారెడ్డిని అతని తోట వద్ద అటకాయించి కళ్లలో కారం చల్లి కొడవళ్లతో నరికారు. వదిలేయండి వదిలేయండి అంటూ ప్రాధేయ పడినా వారి మనసు కరగలేదు.

ఆ సమయంలో తోటలో పనిచేస్తున్న చెన్నారెడ్డి భార్య భాగ్యలక్ష్మి, అక్క శాంతమ్మ, అన్న కొడుకు ఎర్రగుంట రాఘవరెడ్డి కేకలు వేసుకుంటూ అక్కడికి వెళ్లారు. ఇది చూసిన ఆరుగురు బైక్‌లలో పారిపోయారు. ఈ ఘటనపై చెన్నారెడ్డి భార్య భాగ్యలక్ష్మి ధర్మవరం రూరల్‌ పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేసింది. అసలు ఈ హత్య
ఎందుకు జరిగిందంటే.. ఆధిపత్యం, పాత కక్షలు.. నాయకుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు.

ప్రస్తుతం హత్యకు గురైన బడన్నపల్లికి చెందిన ఎర్రగుంట చెన్నారెడ్డి, అదే గ్రామానికి చెందిన కపాడం సూర్యనారాయణ కుటుంబాల మధ్య కక్షలు ఉన్నాయి. సూర్యనారాయణ తండ్రి నాగన్నను 30 ఏళ్ల క్రితం హత్య చేశారు. ఈకేసులో చెన్నారెడ్డి ముద్దాయిగా ఉన్నాడు. అయితే మధ్యలో అంతా రాజీ అయ్యారు. యధాప్రకారం ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ 2016, 17 సమయంలో ధర్మవరంలో మళ్లీ ఆధిపత్య పోరు ప్రారంభమైంది.

అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓటమి తరువాత సైలెంట్ అయ్యారు. 2014లో ఎన్నికల్లో సూర్యనారాయణ గెలవడంతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహాం వచ్చింది. ఇన్ని రోజులు అధికారం కోసం పాకులాడిన వారికి ఒక ఆయుధం చేతికొచ్చినట్టైంది.

  • ఎమ్మెల్యే సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిల మధ్య వార్..

అప్పటికే ఎమ్మెల్యే సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిల మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. సహజంగా ప్రతిపక్షంలో ఉన్న వారు సైలెంట్ గా ఉండటం.. అధికారంలో ఉన్న రెచ్చిపోవడం సహజం. గ్రామాల్లో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. దీనిని కట్టడి చేయాల్సిన నాయకులు మరింత రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసుకున్నారు. దీంతో పాత కక్షల మళ్లీ మనసులో మెదిలాయి.

తన తండ్రిని చంపిన చెన్నారెడ్డిపై కక్ష తీర్చుకోవాలని సూర్యనారాయణ తన కుమారులు గంగాధర్‌, నాగరాజుకు చెప్పేవాడు. అదే సమయానికి 2017 నవంబరు 29న బడన్నపల్లి రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరిగింది. అధికార గర్వం బాగా పెరిగిపోయి, ఏం జరిగినా మన నాయకుడు వెనుకేసుకొస్తారన్న ధీమా పెరిగిపోయింది. దైవ కార్యక్రమంలో కూడా రాజకీయాలు వచ్చాయి.

చెన్నారెడ్డితో సూర్యనారాయణ, అతని కుమారులు, బావ పెద్దన్న, అతని కుమారులు శివయ్య, గంగాప్రసాద్‌ వాగ్వాదానికి దిగి, చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆవేశంతో మాట్లాడుతున్న మాటలు చాలా దూరం తీసుకెళ్తాయి. అనంతపురం జిల్లా వంటి ప్రాంతంలో అయితే మరీ ఎక్కువగా ఉంటాయి.

హత్య చేస్తామనే మ్యాటర్ వచ్చిందంటే.. చెన్నారెడ్డిని మనం చంపకపోతే అతను గంగాధర్‌ను చంపుతాడు అని అందరూ మాట్లాడుకున్నారు. అలా చెన్నారెడ్డి హత్యకు ప్లాన్ వేసి అనుకున్నది చేశారు. ఈ ఘటనపై చెన్నారెడ్డి భార్య భాగ్యలక్ష్మి ధర్మవరం రూరల్‌ పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేసింది.

ఆరుగురు ముద్దాయిలపైన, వారికి ఆశ్రయం ఇచ్చినందుకు మిడతల రామాంజినేయులు, బాలగొండ చంద్రశేఖర్‌పైన చార్జిషీటు దాఖలు చేశారు. కానీ అప్పట్లో ఎమ్మెల్యే ఆదేశాలతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి.

హత్య చేసిన వారిలో నలుగురు వ్యక్తులు గ్రామం విడిచి పోయే పరిస్థితి వచ్చింది. ఇంతలో టీడీపీ అధికారం కోల్పోయింది.. మళ్లీ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి వచ్చారు. దీంతో కేస్ మరో టర్న్ తీసుకుంది. అప్పటి వరకు ఈ కేసు నిలబడదని.. అంతా ధైర్యంగా ఉన్నారు. కానీ కేతిరెడ్డి రాక సీన్ మొత్తం మారిపోయింది. కేసులో సాక్షాలు బలంగా మారాయి. గత కొన్ని రోజులుగా కేసు విచారణ వేగం పుంజుకుంది.

కానీ హత్య చేసిన వారి కుటుంబాల్లో కేసు నిలబడదన్న ధైర్యం ఉండేది. విచారణ పురోగతి చూసి.. భయం పుట్టుకుంది. ప్రాసిక్యూషన తరపున ఏడుగురు సాక్షులను, ముద్దాయిల తరఫున ఒకరిని విచారించారు. నేరం రుజువు కావడంతో ఊహించని విధంగా ఈనెల 24న న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు.

  • ఏ1 నుంచి ఏ6 వరకు జీవిత కాలపు కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి 5వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు..

దీంతో నిందితులు కోర్టులో కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న నిందితుల కుటుంబసభ్యులు కోర్టు వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం శిక్ష పడ్డ వారే నలుగురు యువకులు ఉన్నారు. వారికి ఏడాది నుంచి ఐదేళ్లలోపు పిల్లలు ఉన్నారు. వారంతా కోర్టు వద్దకు రావడంతో గంభీరమైన వాతావరణం కనిపించింది. జీవితకాలపు శిక్ష పడిన తరువాత వారిని కడప జైలుకు తరలిస్తున్న సమయంలో వారి కుటుంబసభ్యులు, బంధువులు రోదించిన తీరు చూస్తే అందరి కళ్లు చెమర్చాయి.

అసలేం జరుగుతుందో తెలియని ఆ చిన్న పిల్లలు బిక్కు బిక్కుమంటూ కనిపించారు. అయితే ఈ అంశంలో రాజకీయాల విషయానికొస్తే.. ఈ కేసులో రాజీ అయ్యేందుకు నిందితుల కుటుంబాలు చాలా ప్రయత్నాలు సాగించాయి. కానీ కొందరు నాయకులు రాజీ కానివ్వకుండా చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఉన్న నాయకుడు కానీ.. ఇప్పుడున్న నాయకుడు కానీ ఇరు కుటుంబాలను రాజీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. 30ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో రాజీ అయ్యారు.

కానీ ఇదే నాయకుల అండ చూసుకుని మళ్లీ జీవితాల్ని నాశనం చేసుకున్నారు. ఇటు చెన్నారెడ్డి హత్యకు గురైన సమయంలో భార్య ఇద్దరు అమ్మాయిలు వంటరిగా మిగిలిపోయారు. వారిలో ఒక అమ్మాయికి వివాహం కావాల్సి ఉంది. అప్పుడు ఆ కుటుంబం పడిన నరకం.. ఇప్పుడు ఈ ఆరు మంది కుటుంబాలు పడుతున్న బాధకు ఎవరు సమాధానం చెబుతారన్నదే ప్రశ్నగా మారింది.

దీనిపై పైకోర్టులకు వెళితే, శిక్ష తగ్గవచ్చు కానీ వెళ్లేంత ఆర్థిక పరిస్థితులు లేవు.. గ్యారంటీ కూడా లేదు. స్వార్థ రాజకీయాలకు బలయ్యేది నాయకులు కాదు.. వారిని నమ్మి అడుగులు వేసిన వారేనన్న వాదన ఇప్పుడు వెల్లువెత్తుతోంది. ఫ్యాక్షన్ కాలంలో ఇటువంటి రాజకీయ హత్యలకు, సంఘటనలకు కొదవే లేదని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అయితే నాటి నుంచి నేటి వరకు ఇదే రాజకీయం .. నడుస్తోందన్నది మాత్రం ఎవ్వరూ కాదనలేని సత్యం.

మరి .. ఇటువంటి సంఘటనలపై రాజకీయాలు ఆపేదెన్నడన్నదే చర్చనీయాంశంగా మారుతున్నాయి.

Must Read

spot_img