Homeఆంధ్ర ప్రదేశ్రాజకీయాలతో తెలుగు తమ్ముళ్లలో కుమ్ములాటలు ఆగడంలేదా..?

రాజకీయాలతో తెలుగు తమ్ముళ్లలో కుమ్ములాటలు ఆగడంలేదా..?

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం 2009 లో నియోజకవర్గ పునర్విభజనతో మూడు మండలాలతో కలిపి ఏర్పడిన జనరల్ నియోజకవర్గం.తొలుత కొవ్వూరు అసెంబ్లీలో ఉండే నిడదవోలు పట్టణం కేంద్రంగా 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం .. నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలతో కలసి ఏర్పడింది. మొన్నటివరకూ పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం జిల్లాల పునర్విభజనతో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంతో తూర్పుగోదావరి జిల్లాగా ఏర్పడింది.

అయితే, 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటినుండీ వరుసగా 2009,2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి బూరుగుపల్లి శేషారావు ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. క్షేత్రస్థాయి క్యాడర్ బలంగా ఉన్న నియోజకవర్గం .. తెలుగుదేశానికి కంచుకోటగా 2019 వరకూ కొనసాగింది. వరుసగా రెండుసార్లు నియోజకవర్గంలో ఎదురులేని పార్టీగా నిలబడ్డ తెలుగుదేశం 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందింది. ఇందుకు పార్టీలోని కుమ్ములాటలే కారణమంటూ సర్వత్రా చర్చ నడిచింది. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో పాటు సీటు కోసం అధిష్టానం వద్ద కుందుల సత్యనారాయణ ప్రయత్నించడం, శేషారావుకే అధిష్టానం సీటు ఇవ్వడంతో, పార్టీలో ఏర్పడ్డ చీలికలు ఓ రకంగా పార్టీ కి ఓటమి తెచ్చిపెట్టాయని అప్పట్లో ఓ టాక్ వెల్లువెత్తింది.

ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా అధిష్టానం వీరిమధ్య సంధి కుదర్చకపోవడం, పార్టీని భుజాన వేసుకోవాల్సిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఓటమి తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉండడంతో టీడీపీ కంచుకోట కాస్తా, బీటలు వారిందనే వారూ లేకపోలేదు. దాదాపు రెండున్నరేళ్లపాటు పార్టీ క్యాడర్ కు, ప్రతిపక్షపాత్రకూ మాజీ ఎమ్మెల్యే శేషారావు దూరంగా ఉండి, అమరావతి రైతుల పాదయాత్ర సందర్భం నుండీ మళ్లీ తెరమీదకు వచ్చి, వేగం పెంచారు.

అధికారం కోల్పోయిన రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ ఈ నేతలిద్దరూ తెరమీదకు వచ్చి, ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ, ఎవరికి వారు తామే 2024 అభ్యర్ధి అంటూ ప్రచారం చేసుకుంటుండడంతో మరోసారి పార్టీ క్యాడర్ గందరగోళంలో పడింది. వీరిద్దరితో పాటు, మరో కొత్త ముఖం తెరమీదకు రావడంతో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో త్రిముఖ పోరు పార్టీ శ్రేణులకు సైతం తలనొప్పిగా మారిందని గుసగుసలు వినిపించాయి. దీంతో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో మూడుముక్కలాట చర్చనీయాంశంగా మారుతోంది.

ఎవరికివారే యమునాతీరే అన్నచందంగా నేతల వ్యవహారం ఉండడంతో సర్వత్రా చర్చోపచర్చలు సాగుతున్నాయి. సెగ్మెంట్లో మాజీ ఎమ్మెల్యే శేషారావు, కుందుల సత్యనారాయణలతో పాటు మరో కొత్త నేత ఎంట్రీ ఇవ్వడం .. రాజకీయ వేడిని రగిల్చింది. ఈ దఫా 2024 నిడదవోలు టిక్కెట్ రేసులో ముందున్నానంటూ యండపల్లి దొరయ్య ప్రచారం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన యండపల్లి దొరయ్య అలియాస్ దొరబాబు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీచేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం చేసుకోవడం, అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్లు ధీమా వ్యక్తం చేస్తుండడంతో ఎవరికి వారే యమునాతీరే అన్నచందంగా నిడదవోలు తెలుగుదేశం పరిస్థితి తయారైంది. ఇక్కడ అధికార వైసీపీ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడుపై స్థానికంగా అంత సానుకూలత లేకపోయినప్పటికీ, తమ పార్టీలో కుమ్ములాటలే వైసీపీ కి వరంగా మారనున్నాయని సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లే చర్చించుకుంటున్నారట..

ఇటీవల ఇదేం ఖర్మ రాష్ట్రానికి నినాదంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిడదవోలు నియోజకవర్గం మీదుగా యాత్ర కొనసాగించిన సందర్భంలోనూ ఈ ముగ్గురు నేతలూ ఎవరికి వారు విడివిడిగా క్యాంపు రాజకీయాలు చేయడం పార్టీలో వీరిమధ్య ఉన్న ఆధిపత్యపోరును బహిర్గతం చేసింది. నియోజకవర్గ ఆరంభంలో మాజీ ఎమ్మెల్యే శేషారావు, నిడదవోలు పట్టణ ఆరంభంలో కుందుల సత్యనారాయణ, పట్టణ నడిబొడ్డున యండపల్లి దొరయ్య లు క్యాంపులు ఏర్పాటుచేసి మరీ, జనసమీకరణ చేసి, తమ బల ప్రదర్శన చూపించే ప్రయత్నం చేశారు.

చంద్రబాబు నిడదవోలు చేరుకునేసరికి కాన్వాయ్ వద్ద ప్రధాన నేతలైన శేషారావు – కుందుల సత్యనారాయణ వర్గాల మధ్య బహిరంగంగా త్రోపులాట జరగడం సైతం అధినేత చంద్రబాబును ఆగ్రహానికి గురిచేసింది. దీంతో చంద్రబాబు, నిడదవోలు గ్రూపు రాజకీయాలపై ఘాటుగానే స్పందిస్తూ, ఎవరి స్థానం ఎక్కడ ఉంచాలో తనకు తెలుసని, పార్టీ కి నష్టం చేకూరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇవ్వడంతో పార్టీ క్యాడర్ సైతం ఖంగుతింది. అయితే, ఈ విబేధాలకు, గందరగోళానికి అధినేత స్వస్తి చెబుతారనీ, ఎమ్మెల్యే అభ్యర్ధి ఎవరనేది ప్రకటిస్తారని ఎదురుచూసిన పార్టీ క్యాడర్ కు మాత్రం నిరాశే మిగిలింది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సైతం కోపం తెప్పించిన నిడదవోలు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటకు అధినేత పర్యటనలోనూ క్లారిటీ రాకపోవడంతో ముగ్గురు నేతలూ తమ అంగబలం, అర్ధబలం ప్రదర్శించుకోవడం మాత్రం ఆపడంలేదు.

నియోజకవర్గ ఇన్ ఛార్జ్ శేషారావు పార్టీని నడిపిస్తున్నారంటూ చెప్పిన చంద్రబాబు, రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీ క్యాడర్ ఎవరి వెనుక వెళ్లాలనే సందిగ్దం నెలకొంది. పక్కనే ఉన్న గోపాలపురం నియోజకవర్గంలో ఇదేమి ఖర్మ యాత్రలో వచ్చే ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ అభ్యర్ధి .. మద్దిపాటి వెంకటరాజుగా ప్రకటించిన చంద్రబాబు, తమ నియోజకవర్గంలోనూ ప్రకటిస్తారని పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శేషారావు అయినప్పటికీ, కాబోయే అభ్యర్ధి తానేనని, అధిష్టానం నుండి తనకు స్పష్టమైన హామీ ఉందని కుందుల సత్యనారాయణ ప్రచారం చేసుకుంటుండడంతో, నిడదవోలు లో తెలుగుదేశంలో ఉన్న అంతర్యుద్ధం పార్టీ కి మళ్లీ నష్టం తెచ్చిపెట్టేలా ఉందని ఆ పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతున్నారట.

ఇదేసమయంలో ఈ దఫా పొత్తులు ఉంటాయన్న టాక్ వెల్లువెత్తుతుండడంతో, ఈ స్థానం ఏ పార్టీకి కేటాయిస్తారన్న చర్చ కూడా వినిపిస్తోంది. మరోవైపు .. ఎక్కడికక్కడ అభ్యర్థుల్ని ప్రకటిస్తోన్న చంద్రబాబు .. ఈ సెగ్మెంట్ విషయంలో సైలెంట్ గా ఉండడం .. పలు చర్చలకు తావిస్తోంది. ఈ సీటుపై ముగ్గురి పేర్లు వినిపిస్తుండడంతో సైలెంట్ అయ్యారా లేక జనసేనకు కేటాయించే అవకాశముందా అన్న చర్చ కేడర్ లో వినిపిస్తోంది. దీంతో అధిష్టానం ఇప్పటికైనా తెలుగుతమ్ముళ్లలోని సందేహాలకు స్వస్తి పలుకుతుందా, నిడదవోలు టిక్కెట్ ఎవరికి అనేది ప్రకటిస్తుందా, లేదా, లేక పొత్తు లో నిడదవోలు ను జనసేన పార్టీ కి కట్టబెట్టనుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇక్కడ టిక్కెట్ ఎవరికి కేటాయించినా, రెబల్ బాధ తప్పదన్న ఆలోచనలు సైతం కేడర్ లో వినిపిస్తున్నందున .. బాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏదేమైనా బాబు సైలెంట్ .. పార్టీలో అంతర్గతంగా చర్చోపచర్చలకు దారితీస్తోందన్న వాదనను విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. వచ్చే ఎన్నికలు టీడీపీకి చావో రేవో కావడంతో, ఈ సెగ్మెంట్ లో బాబు వ్యూహం ఏమై ఉంటుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు .. పార్టీలో తలెత్తిన వర్గపోరు.. అధికారపక్షానికి మేలు చేయనుందన్న టాక్ నేపథ్యంలో బాబు వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుని, వర్గపోరుకు చెక్ పెట్టాలని కేడర్ కోరుతోంది.

Must Read

spot_img