Homeఆంధ్ర ప్రదేశ్ఎమ్మెల్సీ ఖాళీ అవుతుండడంతో మరోసారి హాట్ పాలిటిక్స్

ఎమ్మెల్సీ ఖాళీ అవుతుండడంతో మరోసారి హాట్ పాలిటిక్స్

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవి కాలం కొద్దిరోజుల్లో ముగియనుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా కొనసాగుతున్న ఎలిమినేటి .. ఇక వచ్చే నెలలో ఎలిమినేట్ కానున్నారు. ఈ క్రమంలోనే ఆశావహులంతా ఆ స్థానంపై కర్చీఫ్ వేస్తున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ద్వారా కొందరు పైరవీలు చేస్తుండగా, ఇంకొందరు మాత్రం ఏకంగా ప్రగతిభవన్ లోనే చక్రం తిప్పేందుకు యత్నిస్తున్నారని టాక్. కాగా ఈ స్థానానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకి తప్పా బయటి వారికి ఛాన్స్ ఇవ్వరనే సంకేతాలు రావడం తో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు పావులు కదుపుతున్నారట జిల్లా నేతలు. ఇక ఆశావహుల్లో ఎక్కువగా ఉద్యమకారులే ఉన్నారు. అంతేకాదు మునుగోడు బైపోల్ లో టికెట్ కోసం ప్రయత్నించిన నేతలు సైతం ఎమ్మెల్సీ పై ఆశ పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇంకొందరు ఉద్యమ కారులు మాత్రం హైకమాండ్ కు రిక్వెస్ట్ తో పాటు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారని సమాచారం. ఇక ఆశావాహుల లిస్ట్ లో ముందు వరసలో ఉన్నారు బీఅర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి.

ఈయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేయడమే కాక మొదటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు. 2018 ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ టికెట్ ఆశ చూపి బిగ్ హ్యాండ్ ఇచ్చింది హై కమాండ్. అయినా పార్టీ సిద్దాంతాలు,యనిబంధనలకు కట్టుబడి పనిచేసుకుంటూ పోతున్నారు చాడా. ఇక ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న చాడా కిషన్ రెడ్డి ఈ మధ్య దూకుడు పెంచేశారు. తన అనుచర వర్గాన్ని ఏకం చేసి ఇటీవల నల్గొండ శివారులో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ అధిష్టానం ఉద్యమకారులకు పదవి ఇవ్వాలనేది ఈ సమావేశం సారంశమని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈయన నెక్స్ట్ గోల్ నల్గొండ అసెంబ్లీ టికెట్ అయినా, అధిష్టానం బుజ్జగించి ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇవ్వక పోదా అని ఆశతో ఉన్నారట చాడ.

అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పైరవీలు చేస్తూనే, అధిష్టానాన్ని ఆకర్షించేందుకు ఈ మధ్య బలప్రదర్శన కూడా చేస్తున్నారని టాక్. ఇక ఈయనతో పాటు మరో ఉద్యమకారుడు చకిలం అనీల్ కుమార్ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఈయన కూడా హై కమాండ్ దృష్టిలో పడేందుకు ఇటీవల “తెలంగాణ ఉద్యమ కారుల ఆత్మీయ సమ్మేళనం”పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఉద్యమకారులు, మేథావులు, కళాకారులను ఏకంచేశాడు.ఉద్యమ కారులకు అధిష్టానం గౌరవం ఇవ్వడం లేదని, పదవుల్లో స్థానం కల్పించడం లేదనేది సమావేశం సారాంశం. కాగా అనీల్ కుమార్ గోల్ కూడా నల్గొండ అసెంబ్లీ టికెట్ నేనని టాక్. రెండో ఆప్షన్ గా నైనా ఎమ్మెల్సీ ఇవ్వక పోరా అనే ఆశతో ఉన్నారట చకిలం. ఇటు హై కమాండ్ కూడా ఎమ్మెల్సీ స్థానంలో అసంతృప్తులను కూర్చోబెట్టాలనే ఆలోచన చేస్తుందట.

ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో జిల్లాలో ఉన్న అసంతృప్తికి చెక్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యమ కారుల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్న బాస్ ఈ స్థానాన్ని ఉద్యమ కారులకు కట్టబెట్టి కొంత రిలీఫ్ కావాలనే ప్లాన్ తో ఉన్నారని టాక్వెల్లువెత్తుతోంది. ఇక ఇదే జరిగితే చాడ కిషన్ రెడ్డి లేదంటే చకిలం అనీల్ కుమార్, ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ రావొచ్చని పార్టీ పెద్దల నుంచి లీకులోస్తున్నాయి. ఎందుకంటే చాడా కిషన్ రెడ్డికి నల్గొండతో పాటు నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కొంత పట్టుంది. చాలా మంది ఉద్యమ కారులు ఈయన వెంటే ఉన్నారు. ఇక మాజీ ఎంపి చకిలం శ్రీనివాస్ రావు అంటే గుర్తు పట్టని వారుండరు. ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. ఉద్యమంలో పని చేసిన అనుభవం, తండ్రి పలుకుబడి కలిసొస్తుందనే ఆశతో ఉన్నారు చకిలం శ్రీనివాస్ రావు తనయుడు అనీల్ కుమార్.

ఈ ఈక్వేషన్స్ గనుక గులాబీ బాస్ పరిగణనలోకి తీసుకుంటే, ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఉద్యమకారుల గొడవ ఇలా ఉంటే, మా సంగతేంటంటూ, మునుగోడు బైపోల్ లో టికెట్ కోసం కోట్లాడిన నేతలు కూడా హై కమాండ్ ను గట్టిగా ప్రశ్నిస్తున్నారట. మునుగోడు నియోజకవర్గానికి చెందిన నారాబోయిన రవి ముదిరాజ్ ఒక్క ఛాన్స్ ప్లీస్ అంటూ తన గురువు మంత్రి జగదీష్ రెడ్డి ద్వారా పైరవీలు మొదలెట్టేసారని టాక్. కాగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నారబోయిన రవికి ఇవ్వాలనే ఓ ఆలోచన కూడా చేస్తుందట హై కమాండ్.

ఎందుకంటే మునుగోడు సెగ్మెంట్ లో ముదిరాజ్ ల ఓట్లు అధికంగా ఉంటాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలెవరూ పెద్ద పదవుల్లో లేరు. అందుకే నారబోయిన రవికి ఎమ్మెల్సీ పదవిస్తే, ముదిరాజ్ లను గౌరవించి నట్లేననే భావన లో ఉన్నారట బాస్. ఇక మునుగోడు నియోజకవర్గానికి చెందిన మరో నేత బొల్లా శివశంకర్ కూడా తన ప్రయత్నాల్లో తానున్నారు. ఉద్యమకారుల కోటాలో ఈయన మునుగోడు టికెట్ కోసం అప్పట్లో గట్టి ప్రయత్నాలే చేశారు. ఆ తర్వాత హైకమాండ్ బుజ్జగింపులతో తగ్గారు. ఆ సమయంలో ఎలాంటి హామీ ఇచ్చారో ఏమో గానీ, ఈసారి మాత్రం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బొల్లా శివ శంకర్ .. క్యాస్ట్ ఈక్వేషన్ లో నైనా బాస్ కనుకరించక పోరా అన్న యోచనలో మంత్రి జగదీష్ రెడ్డితోమంతనాలు జరుపుతున్నారట. ఇక తాజాగా పార్టీలో చేరిన బూడిద భిక్షమయ్య గౌడ్ కూడా ఎమ్మెల్సీపై గురి పెట్టారట. మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ బిజెపి లోకి వెళ్ళాక హడావిడిగా భిక్షమయ్య గౌడ్ కు గులాబీ కండువా కప్పారు బాస్. ఆయన కూడా గౌడ సామాజిక వర్గ నేత కావడంతో, బూర పార్టీని వీడిన సమయంలో ఆసామాజిక వర్గం నుంచి వ్యతిరేకత రావొద్దనే ఉద్దేశం తో భిక్షమయ్య గౌడ్ ను పార్టీలో చేర్చుకున్నారని అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. దాంతో భిక్షమయ్య గౌడ్ పార్టీ చేరే సందర్భంలో ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదు కానీ, ఈయన కూడా ఎమ్మెల్సీ కోసం ప్రతిపాదన పెట్టారని సమాచారం. కానీ పార్టీ సీనియర్ లు మాత్రం బూర స్థానం భువనగిరి పార్లమెంట్ స్థానాన్నే భిక్షమయ్య గౌడ్ కు అప్పజెబుతున్నట్టు లీకులుస్తున్నారు.

ఇక ఇదే నిజమైతే భిక్షమయ్య గౌడ్ కు ఎమ్మెల్సీ అవకాశం దక్కక పోవచ్చు. ఇక వీరు కాక ఇతర పార్టీల నుంచి జంపైన మరికొందరు నేతలు కూడా హైకమాండ్ వద్ద ప్రతిపాదనలు పెడుతున్నారని టాక్. ఇప్పటికైతే స్పష్టమైన హామీ ఎవరికి ఇవ్వలేదు కానీ, ఆర్ధిక, సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకత లేకుండా చూడాలనే భావన తో ఉందట హై కమాండ్.ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కారుల నుంచి నిరసన సెగ రుచిచూస్తున్న హై కమాండ్ .. వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఓ ఆలోచన కూడా చేస్తోందట. ఈ సీటు కేటాయిస్తే, ఉద్యమకారుల మద్ధతుతో పాటు పార్టీ వ్యతిరేకతను తగ్గించుకోవాలని హైకమాండ్ బావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. దీంతో గులాబీ బాస్ .. ఉద్యమకారులకు ఓటేస్తారో.. గత హామీలకు కట్టుబడతారో.. లేక కొత్తవారికి అవకాశం ఇస్తారోనన్నది మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img