Homeతెలంగాణయువ నేతల దూకుడు ఆ మాజీ ఎమ్మెల్యేకు మింగుడు పడడం లేదా ?

యువ నేతల దూకుడు ఆ మాజీ ఎమ్మెల్యేకు మింగుడు పడడం లేదా ?

ముందస్తు ఎన్నికలు తథ్యమని జోస్యం చెప్పిన రేవంత్ కామెంట్స్ పాలిటిక్స్ లో కాక రేపుతున్నాయి. ముందస్తుకు సిద్దం కావాలని కేడర్ కు రేవంత్ హింట్ ఇవ్వడంతో ఆశావహులు ఆల్రెడీ దూకుడు పెంచేశారు. టికెట్ రేసులో నేనున్నానంటూ హైకమాండ్ వద్ద ఎవరికి వారు పైరవీలు మొదలెట్టారు. ఆర్ధిక,సామాజిక సమీకరణాలను బేస్ చేసుకుంటూ, ఒక్క ఛాన్స్ ప్లీస్ అంటూ అగ్ర నేతల చుట్టూ ప్రదక్షణలు చేయడం షురూ చేశారు కొందరు యువనేతలు. ఎస్సీ,ఎస్టీ రిజర్వడ్ స్థానాల్లో కూడా ముగ్గురు, నలుగురు నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకైక ఎస్టీ రిజర్వడ్ స్థానమైన దేవరకొండలో టికెట్ కోసం పోటీ ఓ రేంజ్ లో ఉందట. తమ తమ ఆధిపత్యం, బలాబలాలు నిరూపించుకునేందుకు నేతల మధ్య టగ్ ఆఫ్ వార్ ప్రారంభమైందట. ఎవరికి వారే గ్రూపులు మెయింటైన్ చేస్తూ….అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. కాగా ఒక్కసారి దేవ‌రకొండ పొలిటికల్ ప్రొఫైల్ పరిశీలిస్తే, మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ లేదంటే సీపీఐ పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులే విజ‌యం
సాధిస్తూ వ‌స్తున్నారు. పొత్తులో భాగంగా 2014లో టికెట్ సీపీఐకి కేటాయించాల్సి రాగా, 2018లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసి, ఓటమి పాలైంది.

దీంతో పదేళ్లుగా ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యమే కరువైంది. ఈసారి ఎలా అయినా దేవరకొండలో జెండా పాతాలన్న కసితో కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.కానీ ఆ ప్ర‌య‌త్నాల‌ను పార్టీలో ఉన్న వ‌ర్గ విభేదాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యేకు, యువ నేతలకు మధ్య తగువులు మొదలయ్యాయని లేటెస్ట్ టాక్.

అయితే కాంగ్రెస్ లో వర్గపోరు వేళ .. ఈ రచ్చ మరింత ఎక్కువగా ఉందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. దీంతో ఎన్నికల నగారా మ్రోగకముందే .. టిక్కెట్ రేస్ ఓ రేంజ్ లో సాగుతోందని కేడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెగ్మెంట్లో సీనియర్లకు, జూనియర్లకు టగ్ ఆఫ్ వార్ తప్పడం లేదని, టిక్కెట్ సంగతి తేలేవరకు రచ్చ తప్పదని టాక్ వెల్లువెత్తుతోంది.

మాజీ ఎమ్మెల్యే బాలు నాయ‌క్ ఓ వర్గంగా… ఆయనకు పోటీగా రవి నాయక్, జగన్ నాయక్, బిల్యా నాయక్ మరో వర్గంగా ఏర్పడ్డారట. ఎవరికి వారే విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతున్నారట. ఇదే కేడర్ ను కన్య్ఫూజన్‌కు గురి చేస్తోందని ప్రచారం సాగుతోంది. ఒకప్పుడు దేవరకొండలో ఎదురులేని ఆధిపత్యం సాగించిన బాలు నాయక్ చేజేతులారా ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారని ఆయన అనుచర వర్గం తెగ ఫీలై పోతుంది. 2018 ఎన్నికల సమయంలో బాలు నాయక్ రాంగ్ స్టెప్ వేశారని, బ్లెండర్ మిస్టేక్ చేశారని ఆయన అనుచరులు అంటున్నారు.

2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కారెక్కారు బాలూ నాయక్. ఆ తర్వాత అందులో నైనా కొన్నాళ్ళ పాటు ఉన్నారా అంటే అదీ లేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో దూరారు. ఈ పరిణామంతో హై కమాండ్ వద్ద నమ్మకం కొల్పోయి, కేడర్ వద్ద చులకనయ్యారని ఆయన దగ్గరి
అనుచరులే చెబుతుంటారు. అదే క్రమంలో సెగ్మెంట్ లో కర్చీఫ్ వేసేవారి సంఖ్య పెరగడంతో బాలు నాయక్ కు టికెట్ డౌట్ అన్న టాక్ దేవరకొండలో చర్చనీయాంశంగా మారింది. ఆ నేపథ్యంలోనే బాలునాయక్ కు వ్యతిరేక వర్గంగా ముద్రపడిన యువ నేతలు ఇప్పుడు ఫుల్ యాక్టీవ్ అయిపోవడం కూడా ఆయనను బెంబేలెత్తిస్తోంది.

అంతేగాక యువనేతలు వరుసగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతేకాదు టికెట్ రేసులో నేనున్నానని హింట్ ఇస్తున్నారట. ఇదే ఇప్పుడు బాలు నాయక్‌కు కంటికి కునుకు లేకుండా చేస్తోందట. చేజేతులారా ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న బాలూ నాయక్ .. ఇప్పుడు టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా, దక్కుతుందా అన్నదే హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు సీనియర్లు, జూనియర్ల మధ్య సాగుతోన్న రచ్చ సైతం ఈయనకు కష్టాల్ని తెచ్చిపెడుతోందని అంచనాలు వినిపిస్తున్నాయి.

ఈ దఫా సీనియర్లకు పెద్దగా టిక్కెట్లు రాకపోవచ్చని, రాహుల్ సైతం యువ నేతలకే టిక్కెట్లు కేటాయించాలని సూచించారని సమాచారం. దీనికి తోడు రేవంత్
వర్గం సైతం దూకుడు చూపిస్తుండడంతో, జూనియర్లతో ఓ రేంజ్ లో రేస్ చేయాల్సి వస్తోందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ఇక రేవంత్ ముఖ్య అనుచరుల్లో ఒకరుగా ముద్రపడ్డ రవి నాయక్ టికెట్ ఆశిస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారట. ఈయన ఈ మధ్య దేవరకొండలో విస్తృతంగా పర్యటిస్తూ, పార్టీ పిలుపునిచ్ఛిన కార్యక్రమాలను సక్సెస్ చేసి హై కమాండ్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. తన ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ, యువతలో క్రేజ్ కొట్టేశారు.

ఇక ఈయనతో పాటు జగన్ నాయక్, బిల్యా నాయక్ కూడా తమ వంతు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట.అయితే ఈ ముగ్గురు యువ నేతల అంతిమ లక్ష్యం ఎమ్మెల్యే టికెట్ కాబట్టి తమకు పోటీగా ఉన్న బాలు నాయక్‌కు వ్యతిరేకంగా ఈ మధ్య జట్టు కట్టారని టాక్. వీరంతా కలిసి బాలు నాయక్ పై పీసీసీకి ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం.బాలు నాయక్ ఒంటెద్దు పోకడలు అవలంభిస్తున్నారని, కేడర్‌ను పట్టించుకోవడం లేదని, ఆయన తీరుతో పార్టీ నష్టపోతోందని ఫిర్యాదులో పేర్కొన్నారట. ఇదే సమయంలో సీనియర్ నేతల్ని సైతం కలుస్తున్నారట.

తమకు ఒక అవకాశం ఇవ్వాలని, మొదటి నుంచి పార్టీ జెండాను మోస్తున్నామని చెబుతూనే, బాలు నాయక్ గతంలో పార్టీ మారిన విషయాన్ని, పార్టీని డ్యామేజ్ చేసిన అంశాలను పదే పదే హైకమాండ్ పెద్దలకు గుర్తు చేస్తున్నారట. మరోవైపు రేవంత్ కూడా దేవరకొండపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టున్న దేవరకొండలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు టాక్ వెల్లువెత్తుతోంది. బాలు నాయక్‌కు టికెట్ ఇవ్వాలా, లేదంటే కొత్త నేతకు అవకాశం కల్పించాలా ? అన్న ఆలోచన చేస్తున్నారట. ఒకవేళ కొత్త నేతకు అవకాశం ఇవ్వాల్సి వస్తే మాత్రం ఈ మధ్య పార్టీ కార్యక్రమాల్లో యాక్టీవ్‌గా పనిచేస్తూ వస్తున్న రవి నాయక్‌కు అవకాశం రావచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఈయన ఆర్దికంగా చాలా బలంగా ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉంటారు.

సోషల్ ఆక్టివిటిస్ తో దేవరకొండలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అధికార పార్టీ అభ్యర్థిని డీకొట్టాలంటే అంగ బలం, అర్థ బలం ఉండాలనేది హై కమాండ్ భావనగా తెలుస్తోంది.ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రవి నాయక్ కు టికెట్ కన్ఫామ్ అంటున్నారు జిల్లా సీనియర్ లు. ఈ నేపథ్యంలో బాలు నాయక్‌ పార్టీ టికెట్ నిరాకరిస్తే ఆయన ఊరుకుంటారా అనేది కూడా పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తోంది.దీంతో సెగ్మెంట్ లో ముఖ్యంగా హస్తం పార్టీలో టిక్కెట్ రేస్ .. సీనియర్లు, జూనియర్ల మధ్య ఓ రేంజ్ లో సాగుతుందని విశ్లేషకులు అంటున్నారు.ఇదిలా ఉంటే, ఈదఫా ఎన్నికల్లో ఓయూ విద్యార్థి నేతలకు అవకాశం ఇవ్వాలని రాహుల్ సూచించారని, ఆ ఖాతాలో చూసుకుంటే, రవి నాయక్ కు టిక్కెట్ కన్ఫర్మ్ అని అంచనాలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఈయన రేవంత్ వర్గంగా పేరు తెచ్చుకోవడంతో ఛాన్స్ ఎక్కువగా ఉందని స్థానికంగా టాక్ వినిపిస్తోంది.

Must Read

spot_img