HomePoliticsతెలంగాణ న్యూ సిఎస్ నియామకం వెనుక రాజకీయ వ్యూహం..

తెలంగాణ న్యూ సిఎస్ నియామకం వెనుక రాజకీయ వ్యూహం..

  • ఏపీ టార్గెట్ గా సీఎస్ పదవిని భర్తీ చేశారన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
  • ఇంతకీ ఈ అంశంలో వినిపిస్తోన్న వాదనలేమిటి..?

తెలంగాణ సీఎం కేసీఆర్ లెక్కలు పక్కాగా ఉంటాయి. చిక్కడు దొరకడు అన్నట్టుగా.. సమర్థులను.. తనకు అనువైనవారినే ఎంచుకుంటారు. వెనుకటి రాజులు తెలివైన బ్రాహ్మణులనే తన మంత్రివర్గంలో కీలక శాఖలకు, మంత్రులుగా ఎంచుకున్నట్టే.. కేసీఆర్ కూడా రాజకీయంగా.. పాలన పరంగా తనకు అనువైన వారినే ఎంచుకుంటారు. వాళ్లు తెలంగాణ వాళ్లు కాకున్నా సరే.. ఈ ప్రాంతంపై అవగాహన లేకున్నా సరే తీసుకుంటారు.. తెలంగాణ సాధించాక.. ఇక్కడి లోకల్ ఐఏఎస్ లు, ఐపీఎస్ లకు పెద్దపీట వేస్తారని… స్వరాష్ట్రం సాధించుకున్నాక ఇక్కడి ఉద్యోగులు ఆశపడ్డారు.

కానీ బీహార్ కు చెందిన ఐఏఎస్ లు, ఐపీఎస్ లకు కేసీఆర్ ప్రాధాన్యమిస్తుండడంతో ఉన్నతాధికారులు ఉడికిపోతున్నారు. వారికి అవగాహన లేకుండా ఉద్యోగుల విషయంలో తీసుకునే నిర్ణయాలు శాపంగా మారుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్ ను ఏపీ క్యాడర్ కు కేటాయిస్తూ హైకోర్టు తీర్పునివ్వడం.. కేంద్రం రివీల్ చేయడం జరిగిపోయింది.

ఇక సోమేష్ స్థానంలో కొత్తగా తెలంగాణ ప్రభుత్వం సీఎస్ గా శాంతికుమారికి అవకాశం దక్కింది. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం.. ఆమె బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగిపోయింది. నిజానికి సీఎస్ గా ఏపీకి చెందిన సీనియర్ రామకృష్ణరావు సీఎస్ అవుతారని.. కేసీఆర్ సామాజికవర్గం కాబట్టి ఆయనకే పెద్దపీట వేస్తారని అనుకున్నా అనూహ్యంగా శాంతికుమారిని ఎంచుకున్నారు.

అయితే దీనివెనుక రాజకీయ వ్యూహం ఉందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో బీఆర్ఎస్ ను బలోపేతం చేయాలని డిసైడ్ అయిన కేసీఆర్ ఏ అవకాశాన్ని జార విడుచుకోవడం లేదు. పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఏపీలో రాజకీయ లెక్కలు వేసుకునే ఆయన తెలంగాణలో నియామకాలు చేపడుతున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ ఎంపిక వెనుక ఏపీలో కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

ఆమె కంటే సీనియర్లు ఉన్నా శాంతికుమారి వైపే కేసీఆర్ మొగ్గుచూపడానికి కారణాలు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఆమె కేవలం కాపు సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం వల్లే ఆమెకు పెద్దపీట వేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ ను బలోపేతం చేయడంపై పడ్డ కేసీఆర్ కాపు అస్త్రాన్ని సంధించిన సంగతి తెలిసిందే.

ఇలా శాంతికుమారి పేరు ప్రకటించారో లేదో.. సాయంత్రానికి ఏపీ కాపు నేతలు ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, జనసేన సలహాదారుడు అయిన తమిళనాడు మాజీ సీఎస్ ఆర్.రామ్మోహనరావు, పార్ధసారధి తదితరులు కేసీఆర్ ను కలుసుకున్నారు. శాంతికుమారి ఎంపికపై అభినందించారు. తాజా నియామకంతో ఏపీలో బీఆర్ఎస్ కు ఎంతవరకూ ఉపయోగపడుతుందోనని చర్చించారు.

దీంతో ఇది పక్కా పొలిటికల్ వ్యూహంతో సాగినట్టు తెలుస్తోంది. అటు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం కాపు సామాజికవర్గాన్ని ఏపీలో తనవైపు తిప్పుకునేందుకు సీనియర్లకు కాదని శాంతికుమారిని సీఎస్ బాధ్యతలు అప్పగించడంపై ఐఏఎస్ వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. అయితే మున్ముందు ఏపీ రాజకీయాల కోసం ఎన్నెన్నో నియామకాలు జరిపే చాన్స్ ఉందన్న ప్రచారం తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో విస్తరిస్తోంది.

ఏపీలో కాపు సామాజికవర్గంపై దృష్టి పెట్టిన కేసీఆర్.. ఈ కోణంలోనే ఆమెను సీఎస్ గా ఎంపిక చేశారని చెబుతున్నారు. అందుకే ఆ వెంటనే ఏపీ కాపు బీఆర్ఎస్ నేతల్ని ప్రగతి భవన్‌కు ఆహ్వానించారంటున్నారు. ఇలాంటి సమీకరణాల వల్ల ఎంత లాభం వస్తుందో కానీ.. అధికారవర్గాల్లో మాత్రం గతంలో మంత్రి పదవులు మాత్రమే సామాజిక సమీకరణాలు చూసేవారని..ఇప్పుడు అధికారుల్లోనూ చూస్తారన్న చర్చ జరుగుతోంది.

నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఓ పట్టాన అర్థం కావు. ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక రాజకీయ కోణం దాగి ఉంటుందని ఆయనతో సన్నిహితంగా మెలిగినవారు, రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ సీఎస్‌గా శాంతి కుమారిని సెలక్ట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. నేషనల్ పాలిటిక్స్‌లో సత్తా చాటాలని చూస్తున్నారు.

పార్టీని అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించి బీజేపీకి ప్రత్యామ్నాయం కావాలని భావిస్తున్నారు. అందుకు చకచకగా పావులు కదుపుతున్నారు. ముందుగా పక్క రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని చూస్తున్న కేసీఆర్ తెలుగు రాష్ట్రం ఏపీపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అక్కడ బలమైన కాపు సామాజికి వర్గాని చెందిన తోట చంద్రశేఖర్‌ను పార్టీలోకి ఆహ్వానించి ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్థసారధి వంటి నేతలను పార్టీలో చేర్చుకున్నారు. త్వరలోనే ఏపీలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు.

  • వచ్చే ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటాలని కేసీఆర్ ఉవ్విలూరుతున్నారు..

అందులో భాగంగానే సీఎస్‌గా శాంతి కుమారి వైపు కేసీఆర్ మెగ్గు చూపారని తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వైరుధ్యాలు ఉండొద్దని, తమకు ప్రాంతీయ భావన లేదనే మేసెజ్ ఏపీ ప్రజల్లో తీసుకెళ్లెందుకు ఈ స్కెచ్ వేసినట్లు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. అందుకే ఆమె కంటే సీనియర్ ఐఏఎస్‌లు రేసులో ఉన్నా.. ఆమె పైపు మెుగ్గు చూపారని చెబుతున్నారు.

ఒకవేళ ఈ వాదన నిజం కాకపోతే.. 2019లో సీఎస్ ‌గా ఎస్కే జోషి రిటైర్ అయినపుడు శాంతి కుమారిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. సోమేశ్ కుమార్, శాంతి కుమారి ఇద్దరూ 1989 బ్యాచ్‌కు చెందిన వారేనని అప్పుడే ఆమెను సీఎస్‌గా చేయకుండా సోమేశ్ కుమార్‌ను ఎందుకు నియమించారనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతం కోసం ఇప్పటికే ఒక సామాజిక వర్గం లక్ష్యంగా చేరికలను ఆహ్వానించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతికుమారిని నియమించి, ఏపీలో ‘ఒక’సామాజిక వర్గం మొత్తంగా బీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యేలా వ్యూహం పన్నారని అంటున్నారు.

ఆయన వ్యూహం లక్ష్యం సవ్యదిశగానే సాగుతోందనడానికి ఆమె నియామకం జరిగి.. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏపీ కాపు ప్రముఖులు కొత్త సీఎస్ తో కలిసి సీఎం కేసీఆర్ ను కలవడమే నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించిన కేసీఆర్.. రోజుల వ్యవధిలోనే అదే సామాజిక వర్గానికి చెందిన శాంతి కుమారిని తెలంగాణ సీఎస్ గా నియమించి.. ఆ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ ఎనలేని ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇస్తోందన్న సంకేతాలు ఇచ్చారు.

అదే సమయంలో తెలంగాణలో తెలుగు అధికారులకు కీలక పదవులు ఇవ్వడం లేదంటూ తనపై తెలంగాణలో వెల్లువెత్తుతున్న విమర్శలకు కూడా ఆయన శాంతికుమారిని సీఎస్ గా నియమించడం ద్వారా చెక్ పెట్టి ఒకే సారి రెండు ప్రయోజనాలు సిద్ధించేలా పావులు కదిపారు. ఏపీ లక్ష్యంగా కేసీఆర్ వేసిన ఈ ఎత్తుగడ ఏ మేరకు బీఆర్ఎస్ ఆ రాష్ట్రంలో బలపడేందుకు తోడ్పడుతుందో తెలియదు కానీ, ఆమెతో కలిసి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి కృతజ్ణతలు చెప్పడంతోనే ఆయన ఏ ఉద్దేశంతో శాంతి కుమారిని తెలంగాణ సీఎస్ గా నియమించారన్నది స్పష్టమౌతోంది.

అయితే ఏపీ టార్గెట్ గా సీఎస్ నియామకంపై స్థానికంగా విమర్శలు చెలరేగుతున్నాయి. దీనిపై అటు అధికార వర్గంలోనూ, ఇటు రాజకీయవర్గాల్లోనూ చర్చోపచర్చలు సాగుతున్నాయి.

మరి ఈ నిర్ణయం కేసీఆర్ కు ఏమేరకు లాభిస్తుందన్నదే చర్చనీయాంశంగా మారింది..

Must Read

spot_img