Homeతెలంగాణపార్టీ లో టికెట్ కోసం రాజకీయ వ్యూహాలు..?

పార్టీ లో టికెట్ కోసం రాజకీయ వ్యూహాలు..?

వారంతా యువనేతలే.. అంతా వేర్వేరు పార్టీలే.. అయినా వారి ఆశయం ఒక్కటే ..లక్ష్యం అదే.. అంతా ట్రెండ్ ను ఫాలో అవుతుంటే, వారు మాత్రం ట్రెండ్ సెట్ చేస్తున్నారట. ప్రజల్లోకి రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారట. తమ గోల్ మిస్ కాకుండా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారట. మరింతకీ పాలిటిక్స్ లో నయా ట్రెండ్ సృష్టిస్తున్న ఆ యంగ్ లీడర్స్ ఎవరో చూద్దామా ?

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఆయా పార్టీల ఆశావహులంతా పాలిటిక్స్ లో స్పీడ్ పెంచేసారు. టిక్కెట్ దక్కించుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు. అలా ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. కానీ ఈసారి మాత్రం నల్గొండ జిల్లా వెరైటీ పాలిటిక్స్ కు వేదికైంది. ఇప్పటివరకూ ఓ లెక్కా.. ఇప్పుడో లెక్కా అంటున్నారు యంగ్ లీడర్స్. సహజంగా ఎక్కడైనా వారసత్వ రాజకీయాలు కామన్. వారసులే రాజకీయాల్లోకి దిగుతుంటారు. జనంలో క్రేజ్ లేకున్నా, తండ్రుల ఇమేజ్ తో రాణిస్తున్నారు. అంటే ట్రెండ్ ను ఫాలో అవుతుంటారన్న మాట. కానీ ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అవుతోంది.

పాలిటిక్స్ లో కొత్త మొఖాలు ఎంట్రీ ఇస్తున్నాయి. ట్రెండ్ సెట్ చేసేందుకు యువనేతలు నయా ఎత్తులు వేస్తున్నారు. సీనియర్ లకు ధీటుగా తొడగొడుతున్నారు. రాజకీయాల్లో “తగ్గేదేలే”అంటున్నారు. అయితే సహజంగా వారసులు పాలిటిక్స్ లో కొస్తే ప్రజల్లో పరిచయం అక్కర్లేదు. మరి కొత్త వారి పరిస్థితేంటి ? ప్రజలను ఆకర్షించేందుకు వీరి ప్లాన్ ఏంటనేదే .. ఇప్పుడు నల్గొండ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనికోసం వీరి ప్రయత్నాలు..ఓ రేంజ్ లో కాక రేపుతున్నాయట. ఇక ఈయన పేరు “పిల్లి రామరాజు”. ఒకప్పుడు టీడీపీలో, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు.

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో విభేదించి బయట కొచ్చారు. అయినా పార్టీలో ఫుల్ యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఈయన నెక్స్ట్ గోల్ ఎమ్మెల్యేనే కావడమేనని స్సష్టం చేస్తున్నారు.. అయితే క్లారిటీ ఇవ్వడమే కాకుండా అందుకు తగ్గట్లు పావులు కూడా కదుపుతున్నారని టాక్. అంతేకాక అయితే పార్టీ టికెట్ పై పోటీ లేదంటే ఇండిపెండెంట్ గా అయినా రెడీ అంటున్నారట.. ఏదేమైనా కానీ బరిలో ఉండడం మాత్రం పక్కా అంటూ ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు పిల్లి రామరాజు. ప్రజల్లో గుర్తుండి పోయేందుకు సోషల్ యాక్టివిటీస్ షురూ చేశారు.

ఆర్.కే.ఎస్ ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవలు చేస్తూ ప్రజలకు దగ్గరై పోయారు. పేదలకు ఆర్ధిక సహాయం, యువతను ఇంపాక్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ అందరి నోళ్ళల్లో నాని పోతున్నారు. అది ఎంతలా అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేంతగా ఎదిగిపోయారని సెగ్మెంట్లో టాక్
వినిపిస్తోంది. పాలిటిక్స్ లో ఫ్యామిలీ బ్యా గ్రౌండ్ లేకున్నా, సోషల్ యాక్టివిటీస్ అస్త్రాలుగా దూసుకుపోతున్నారు పిల్లి రామరాజు.

ఇక నల్గొండ సెగ్మెంట్ లో బీజీపీలోకి జెడ్ స్పీడ్ తో దూసుకొచ్చి హాల్చల్ చేస్తున్నారు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి. వాస్తవానికి ఆరు నెలల ముందు వర్షిత్ రెడ్డి అంటే ఎవరికీ తెలియదు. ప్రస్తుతం బిజెపి వర్శిత్ రెడ్డి, వర్శిత్ రెడ్డి అంటే అంటే బిజెపి అనే స్థాయికి ఎదిగి పోయారు. అతి తక్కువ కాలంలోనే ప్రజలకు దగ్గరై పోయారు. మరి ఇంతలా ఫేమ్ కావడానికి కారణం సోషల్ యాక్టివిటీస్ మాత్రమే. పట్టణంలో వార్డు వార్డు న, గ్రామ గ్రామాన ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల్లో కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పేద రోగులకు ఉచిత వైద్యం, ఆపదలో ఉన్నోళ్లకు ఆర్ధిక సహాయం వంటి కార్యక్రమాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అలా హై కమాండ్ వద్ద కూడా మంచి ఇమేజ్ కొట్టేశారు. ఛాన్స్ ఇస్తే తొడ గొట్టెందుకు రెడీ అవుతున్నారు డాక్టర్ వర్షిత్ రెడ్డి.

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల దిశగా సరైన అభ్యర్థి కోసం అన్వేషణలో ఉన్న BJP పార్టీకి డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ప్రత్యామ్నాయంగా మారడం ఆ పార్టీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కొద్ది కాలంలోనే నాగం వర్షిత్ రెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. వృత్తి రీత్యా వైద్యుడైన నాగం వర్షిత్ రెడ్డి అంతర్గత గ్రూపులు, నాయకత్వ, ఆర్థిక లోటుపాట్లతో సతమతం అవుతున్న పార్టీకి శస్త్ర చికిత్స చేస్తున్నట్లుగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.

ప్రజాగోస బిజెపి భరోసా మీటింగుల్లో డాక్టర్ వర్షిత్ రెడ్డి తన కార్యక్రమాలు, ప్రసంగాలతో పార్టీ నాయకత్వానికి సరికొత్త ప్రత్యామ్నాయంగా, భవిష్యత్తుగా రూపుదిద్దుకోవడంతో కమలం పార్టీ శ్రేణులు..ముఖ్యంగా యువ కార్యకర్తలు ఆయన వైపు ఆకర్షితులవుతున్నారు. ఇక దేవరకొండ నియోజకవర్గం లో రవినాయక్ ది సపరేట్ స్టైల్. కాంగ్రెస్ పార్టీకి చెందిన రవి నాయక్..నియోజకవర్గ వాసులకు పెద్దగా పరిచయం లేరు. ఓయూ విద్యార్థి సంఘ నేతగా హైద్రాబాద్ పాలిటిక్స్ లోనే చక్రం తిప్పారు. ఇదంతా గతం. ఇప్పుడు దేవరకొండలో రవినాయక్ అంటే తెలవని వారు లేరు. ప్రస్తుతం ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు రవి నాయక్. ఏకంగా తన పేరు తోనే ఫౌండేషన్ స్థాపించి సామాజిక సేవలు చేస్తున్నారు. అలా సొంత పార్టీ నేతలకే కాదు, ప్రత్యర్ధి పార్టీ నేతలకు కూడా బరిలో ఉంటానంటూ హింట్ ఇస్తున్నారు.

ముఖ్యంగా యువతకు ఆకర్షించేందుకు రవినాయక్ సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. యువతకు క్రికెట్ కిట్స్, స్టడీ కోచింగ్ వంటి కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్నారు. ఇక పేదలకు ఆర్ధిక భరోసా, ఉచిత విద్య వంటి కార్యక్రమాలతో ప్రజలతో మమేకమైపోయారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో దేవరకొండ సెగ్మెంట్ నుంచి పోటీ చేయడం కోసమేనని టాక్. హై కమాండ్ వద్ద హామీ తీసుకున్న తర్వాతే, దూకుడు పెంచారని దేవరకొండలో ప్రచారం జోరందుకుంది. అందుకే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అనుచరుల మాట.

మొత్తానికీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపద్యంలో….పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేని లీడర్స్ అంతా…సోషల్ యాక్టివిటీస్ నే నమ్ముకున్నారని తెలుస్తోంది. ఈ అస్త్రాలు టికెట్ కోసం ఎంత దోహద పడతాయో తెలియదు కానీ…ఒకవేళ టికెట్ దక్కకున్నా..ఇండిపెండెంట్ గా నైనా సత్తా చాటడానికి ఉపయోగపడతాయనే
భావన తో ఉన్నారట యువనేతలు. అంతేకాదు వీరు తెచ్చుకున్న క్రేజ్ తో గెలుపోటములను ప్రభావితం చేయగలరని కూడా రాజకీయ విశ్లేషకుల అంచనా. అదేసమయంలో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీకి దిగేందుకు సుముఖంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

దీంతో వీరి ప్రయత్నాలు ఏమేరకు సఫలం అవుతాయన్నదీ హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు అధికారపార్టీలో భారీగా ఆశావహులు ఉండడం, మరీ ముఖ్యంగా సీనియర్లు సైతం టిక్కెట్ రేసులోకి రానున్నారని వార్తలు వినిపిస్తుండడంతో..టగ్ ఆఫ్ వార్..మరింత జోరుగా సాగనుందన్న అంచనాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి అవకాశం లభిస్తుందోనన్నది చర్చనీయాంశంగా మారినా, యువనేతలు మాత్రం పట్టు బిగిస్తుండడం.. సెగ్మెంట్లో రాజకీయ వేడికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎంతమేరకు యువనేతలకు మద్ధతిస్తుందన్న దానిపైనా చర్చోపచర్చలు సాగుతున్నాయి.

అయితే పార్టీల టిక్కెట్ తో పనిలేకుండా, ఒంటరిగా బరిలోకి దిగేందుకు కూడా నేతలు సై అంటుండడంతో, వచ్చే ఎన్నికల్లో వీరిపై పార్టీల నిర్ణయం ఏమై ఉంటుందన్న చర్చ అటు రాజకీయ వర్గాల్లో .. ఇటు స్థానికంగానూ వెల్లువెత్తుతోంది. ఒకవేళ .. వీరు గనుక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే, ప్రధాన పార్టీలకు చుక్కలేనన్న అంచనాలు సైతం వినిపిస్తున్నాయి. దీంతో వీరిపై అధిష్టానం .. ఏ నిర్ణయం తీసుకుంటాయన్నదే ఆసక్తికరంగా మారింది.

మరి ట్రెండ్ కే బ్రాండ్ గా మారిన వీరి కెరియర్ ఎలా మారుతుందో చూడాలి..

Must Read

spot_img