Homeఆంధ్ర ప్రదేశ్ఖమ్మం జిల్లా ఇల్లెందులో మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం..

ఖమ్మం జిల్లా ఇల్లెందులో మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం..

ఖమ్మం జిల్లా ఇల్లెందులో మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం .. మరో మెట్టు పైకి చేరిందట. ఇప్పటికే క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు .. ఏకంగా హైకోర్టులో రిట్ దాఖలు చేయడం.. మరింత హీటెక్కించిందని టాక్ వెల్లువెత్తుతోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ అసమ్మతి పోరు రోజుకో మలుపు తిరుగుతుంది. మున్సిపల్ ఛైర్మన్పై తిరుగుబాటు ప్రకటించిన కౌన్సిలర్లు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఛైర్ పర్సన్పై అవిశ్వాసం పెట్టే అవకాశమున్నా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. 4 రోజులుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించగా ఎట్టకేలకు అర్థరాత్రి కోర్టు దాన్ని స్వీకరించింది. ఈ నెల 21న ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశముంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఇల్లందు మున్సిపాలిటీ పాలకవర్గం పంచాయతీ హైకోర్టు వరకు వెళ్లింది. గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ చైర్మన్ వర్సెస్ వార్డు కౌన్సిల్ సభ్యులుగా నడుస్తున్న వివాదం తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఇల్లందు మున్సిపాలిటీ చైర్మెన్డి.వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు 21వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి సరిత భర్త గణేశ్సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించడం ఇల్లందు పట్టణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 13 మంది కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని ఫిబ్రవరి 6న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ అవిశ్వాస తీర్మానంపై స్పందించకపోవడంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు గణేష్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా స్థానిక నేతలు రంగంలో అసమ్మతి కౌన్సిలర్లను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ అది పెద్దగా ఫలించలేదని చెప్పవచ్చు. మధ్యవర్తులతో మాట్లాడించినా అసమ్మతి కౌన్సిలర్ల బృందం దిగిరాలేదు. రోజులు గడుస్తున్నా కొద్ది వివాదం సద్దుమణుగుతుందని అంతా అనుకున్నప్పటికీ అసమ్మతి కౌన్సిలర్ల బృందం ఏకంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఇదే విషయాన్ని వారి ప్రతినిధి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించడం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కలెక్టర్లకు అందజేసిన ఫిర్యాదులో సంతకం చేసి, రెండ్రోజుల క్రితం వరకు ఇల్లెందులోనే ఉన్న ఏడో వార్డు కౌన్సిలర్ సామాల మాధవి సైతం అసమ్మతి వర్గంలో చేరడం ఇప్పుడు ఒకింత ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. పొంగులేటి వర్గానికి దగ్గరైన 19వ వార్డు కౌన్సిలర్ పత్తి స్వప్న కూడా క్యాంపులో ఉండటం జిల్లాలోని అధికార టిఆర్ఎస్ వర్గాలలో ఆందోళనలు రేకెత్తిస్తోంది.

ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను అసమ్మతి క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తాము పార్టీకి వ్యతిరేకులం కాదని కేవలం చైర్మన్ పట్ల విముఖత ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాసంపై బీఆర్ఎస్​ అసమ్మతి కౌన్సిలర్లు హైకోర్టులో రిట్​ పిటిషన్​ దాఖలు చేయడం పార్టీలో కాక పుట్టిస్తోంది. అవిశ్వాసం విషయంలో స్థానిక నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.

మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇల్లందు మున్సిపల్ చైర్మన్​ డి వెంకటేశ్వరరావుపై అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లు 10 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు తీరుపై వారు ఫైర్​ అవుతున్నారు. వర్గపోరుకు ఎమ్మెల్సీ తీరే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవిశ్వాసం తీర్మానం కాపీని కలెక్టర్​ అనుదీప్​కు ఇచ్చేందుకు వెళ్లగా, ఆయన తీసుకోకపోవడంతో ఇన్​ వార్డులో ఇచ్చి వెళ్లారు. కలెక్టర్​ తీరుపై కౌన్సిలర్లు సీఎస్​కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను బీఆర్ఎస్​కు19 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అసమ్మతి కౌన్సిలర్లకు చెక్​ పెట్టేలా చైర్మన్​ వర్గం పావులు కదుపుతోంది. ఇందులోభాగంగానే తీర్మానంపై సంతకం చేసేందుకు రూ.10 లక్షలు ఆఫర్​ చేశారని ఇద్దరు కౌన్సిలర్లు పోలీసులకు, కలెక్టరేట్​ ఇన్​వార్డులో కంప్లైంట్​ ఇచ్చారు.

ఇక చైర్మన్​ డీవీ వర్గం తమ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టకుండా క్యాంప్​ రాజకీయాలకు తెరలేపారు. 12 రోజులుగా అసమ్మతి కౌన్సిలర్లు అజ్ఞాతంలోనే ఉన్నారు. చైర్మన్​ రాజీనామా చేస్తేనే తాము అజ్ఞాతం నుంచి వస్తామని వీడియో పంపించారు. మరోవైపు ఎమ్మెల్సీ తాతా మధుకు ఇల్లందులో ఏం పని అంటూ వారు ప్రశ్నించారు. ఆయన కారణంగానే గ్రూపులు, వర్గాలు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఈ విషయంపై పార్టీ హైకమాండ్​ సీరియస్​ కావడంతో స్థానిక నేతలు ఏంచేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పురపాలక సంఘాల ఛైర్‌పర్సన్లు, నగరపాలక సంస్థల మేయర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు గతంలో మూడేళ్ల గడువు ఉండగా, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లకు పెంచింది. ఆమేరకు చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి.. చట్టబద్ధత కల్పించేందుకు గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. గవర్నర్‌ ఇంకా ఆమోదించకపోవడంతో గడువు పెంపు అమలులోకి రాలేదు.

చట్ట సవరణ నేపథ్యంలో అవిశ్వాస తీర్మాన నిబంధనల మేరకు మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని అధికారులకు ఇవ్వాలంటే కనీసం 50 శాతం మంది కార్పొరేటర్లు సంతకాలతో నోటీసు ఇవ్వాలి. అవిశ్వాసం నోటీసు ఇచ్చిన 25నుంచి 30 రోజుల వ్యవధిలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. మూడింట రెండొంతుల మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తేనే తీర్మానం ఆమోదం పొందుతుంది. ఈ నిబంధనలనే నూతన చట్టంలోనూ పేర్కొనాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై నిపుణుల అభిప్రాయాలనూ సేకరిస్తున్నారు. ఈ వారం చివరిలోగా నిబంధనలను రూపొందించి న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి.

అదేసమయంలో అవకాశమే అదునుగా పదవులను మునిసిపల్‌ చైర్మన్‌ పదవులను చేజిక్కించుకునేందుకు నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెల రోజులుగా స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల అలజడి కొనసాగుతోంది. ఆర్థిక, భౌగోళిక వనరులు పుష్కలంగా ఉన్న చోట్ల ఈ వ్యవహారం మరింత కుట్రపూరితంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌ స్థానాల్లో ఉన్నవారు అక్రమాలకు పాల్పడిన సందర్బాలు బహిర్గతం కావడంతో అవిశ్వాసాలకు బీజం పడింది. మరికొన్ని చోట్ల పదవులపై ఆశలు పెంచుకున్న నాయకులు తమ పైస్థానంలో ఉన్నవారిని దింపే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్గత ఒప్పందాలతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి పదవుల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

గత ఏడాది సెప్టెంబర్‌లో అసెంబ్లి ఉభయసభలు ఆమోదించిన స్థానిక సంస్థల కొత్త చట్టం ముసాయిదా బిల్లు గవర్నర్‌ ఆమోదం పొంది గెజిట్‌ విడుదలైతే, నాలుగేళ్ళ కాలం ఆగాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్లును ఆమోదానికి రాష్ట్ర గవర్నర్‌కు పంపించగా, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఇతర బిల్లులతోపాటు దీన్ని కూడా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టడం ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారింది. గవర్నర్‌ అప్పుడే ఆమోదించి ఉంటే ఇంతటి రాజకీయ సంక్షోభం ఎదురయ్యేది కాదు. ఈ ఏడాది జనవరి 27తో మూడేళ్ళు ముగియటంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాల్టిల్లో అవిశ్వాస తీర్మానాలు ఒకదాని వెనుక ఒకటిగా మొదలవుతున్నాయి.

దీంతో ఇప్పుడు ఇల్లెందులో ఏకంగా హైకోర్టుకు చేరడం .. మరింత చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img