Homeతెలంగాణఆ నియోజకవర్గం లో అదికార పార్టీ నేతల మధ్య పోరు మళ్ళీ రచ్చ కెక్కిందా ?...

ఆ నియోజకవర్గం లో అదికార పార్టీ నేతల మధ్య పోరు మళ్ళీ రచ్చ కెక్కిందా ? ఎమ్మెల్యే వైఖరే అందుకు కారణమా ?

సూర్యాపేట జిల్లా కోదాడలో అధికార పార్టీ నేతల మధ్య పోరు నివురు గప్పిన నిప్పులా మారుతోంది. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, కేడర్ మధ్య వార్ ఎంతలా సాగుతుందంటే, పచ్చ గడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ సర్దుకుపోవాల్సిన వివాదాలపై పార్టీ శ్రేణులు సైతం .. వీధిపోరుకు సిద్ధమవుతున్నాయి. అందుకు ఎమ్మెల్యే బొల్లం ఏక పక్ష నిర్ణయాలు, నిరంకుశ వైఖరే కారణమని కేడర్ తీవ్రంగా మండిపడుతోంది. ఎమ్మెల్యే మాత్రం ఇదంతా తనను దెబ్బతీయడానికే అసమ్మతుల కుట్ర అని అంటున్నారు. ఇరువర్గాల వాదన ఏమైనా .. ఇప్పుడు కోదాడ సెగ్మెంట్ లో అధికార పార్టీ నేతల మధ్య రచ్చ పెద్ద చర్చకే తెరలేపింది.


ఈ పరిణామం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. కాగా కోదాడ పంచాయితీపై అంతకు ముందే అగ్రనేతలు జోక్యం చేసుకున్నా, ఎవరూ దారికి రావడం లేదు .. పంతం వీడడం లేదన్న టాక్ వెల్లువెత్తుతోంది. దీంతో ఈ గొడవలు ఎటు నుంచి ఎటు వెళ్తాయోనని కిందిస్థాయి కేడర్ డైలమాలో పడుతోంది. 2018 ఎన్నికల సమయంలో హడావిడిగా సైకిల్ దిగి కారెక్కారు బొల్లం మల్లయ్య యాదవ్. టికెట్ చేజిక్కించుకుని విజయం సాధించారు. ఇక అప్పటి నుంచే సెగ్మెంట్లో గొడవలు షురూ అయ్యాయి. చాప కింద నీరులా నియోజకవర్గంలోని కొత్త, పాత నాయకత్వాల మధ్య వివాదం రాజుకుంది. దీన్ని సర్దుబాటు చేసుకోవాల్సిన ఎమ్మెల్యే తనవారికి మద్ధతు పలకడంతో, ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేకు యాంటీ అయిపోయారు. దీనికితోడు అప్పటికే సెగ్మెంట్లో ఉన్న నేతల్ని పక్కన పెట్టి మరీ ఎమ్మెల్యే మల్లయ్య సొంత నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా సీనియర్ లకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించడంతో వారి అసంతృప్తికి కారణమైంది.

అంతేకాక ఎమ్మెల్యే అనుచరవర్గం దూకుడు .. పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో కేడర్ లో అసంతృప్తి ఇంతింతై, వటుడింతై అన్నట్లు కొండలా పెరిగిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో ముందస్తు టాక్ వెల్లువెత్తుతున్న వేళ ఈ కేడర్ అసంతృప్తి రాగం .. ఎమ్మెల్యేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని సెగ్మెంట్లో వెల్లువెత్తుతోంది. దీంతో కేడర్ నుంచి ఎమ్మెల్యే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. సిట్టింగ్ లకే టిక్కెట్లు అన్న కేసీఆర్ ప్రకటన బొల్లం .. నెత్తిన పాలు పోసినా, సెగ్మెంట్లో రాజుకుంటోన్న అసంతృప్తులు .. మాత్రం టెన్షన్ పెడుతున్నాయట.

కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావుకు, ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు మొదట్లో మంచి సఖ్యతే ఉండేది. ఇద్దరూ ఒకప్పుడు టీడీపీలో కలిసి పనిచేసిన వారే. అంతేకాదు గురుశిష్యులు గా మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేశారు. ఇక ఎప్పుడైతే బొల్లం ఎమ్మెల్యేగా గెలిచారో, అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. తన అనుచరవర్గానికి ప్రాధాన్యత లభించకపోవడం, తనకూ సీనియర్ అని గౌరవం ఇవ్వక పోవడం వంటి కారణాలతో ఎమ్మెల్యేపై చందర్ రావు అలక వహించారని పార్టీ శ్రేణుల్లో టాక్.


చాలా కాలం నుంచి ఎమ్మెల్యే ఆధిపత్యానికి బ్రేకులు వేయాలని చందర్ రావు వర్గం ప్లాన్ చేస్తోంది. ఇక తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డిది కూడా సేమ్ సీన్. 2014లో కారు గుర్తు మీద పోటీ చేసి ఓటమి పాలయ్యారు శశిధర్ రెడ్డి. ఒకప్పుడు పార్టీలో ఈయన హవానే నడిచేది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బొల్లం మల్లయ్య గులాబీ గూటికి చేరాకా …శశిధర్ రెడ్డి ఆధిపత్యం తగ్గింది. మరోవైపు పార్టీలోనూ ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పదవులు మొత్తం ఎమ్మెల్యే అనుచర వర్గానికే ఇవ్వడంతో ఆయన సైతం బొల్లం వ్యవహారశైలిపై అసహనం తో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

దాంతో ఈయన వర్గం కూడా వీలు చిక్కినప్పుడల్లా ఎమ్మెల్యే పై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు షురూ చేసిందని సమాచారం. ఇక ఎమ్మెల్యే మల్లయ్య అనుచరుడు వనపర్తి లక్ష్మి నారాయణ కూడా రివర్స్అవడంతో, బొల్లానికి మరింత టెన్షన్ తప్పడం లేదట. ప్రస్తుతం లక్ష్మి నారాయణ సతీమణి శిరీష కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. కౌన్సిల్ సమావేశాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు నిధులు రాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఎన్నో సార్లు బహిరంగంగా ఆందోళన చేసారు చైర్ పర్సన్ శిరీష లక్ష్మి నారాయణ.

అంతేకాదు చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టాలనే ఎమ్మెల్యే కుట్ర కు తెరలేపిన ఇష్యూ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఇష్యూలో ఎమ్మెల్యే బొల్లం తన తీరుతో .. అధిష్టానం నుంచి అక్షింతలు కూడా వేసుకున్నారు. అయినప్పటికీ సద్దుమణగకపోవడంతో ఏకంగా గులాబీ బాసే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామం వల్ల పార్టీ ఇమేజ్ కేడ్యామేజీ ఏర్పడింది. దీంతో అధిష్టానం వెంటనే స్పందించి, అవిశ్వాసం పెట్టకుండా అంతర్గతంగా ఇష్యూను క్లోజ్ చేయించింది.

ఇక అప్పటి నుంచి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మధ్య వివాదం ఓ రేంజ్ లో సాగుతోంది. తాజాగా మరోసారి రచ్చ రచ్చ అయ్యింది. కోదాడ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వేలు పెట్టడం,అధికారులను గ్రిప్ లో పెట్టుకుంటూ వేధిస్తుండడం .. సెగ్మెంట్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ చైర్ పర్సన్ శిరీష లక్ష్మి నారాయణ నానా రచ్చ చేసారు. ఇక శత్రువుకు శత్రువు మిత్రులన్నట్టు శిరీష లక్ష్మి నారాయణ కు సంఘీభావంగా నిలిచారు మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, సీనియర్ నేత శశిదర్ రెడ్డిలు. కాగా సొంత పార్టీలో నేతలు విభేదాలతో రోడ్డెక్కడంతో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక, డైలమాలో పడడం అగ్ర నేతల వంతయ్యిందట.

ఈ పరిణామంతో కార్యకర్తలు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి తలెత్తింది. ఇటు గ్రూపు గొడవలతో కేడర్ ఆందోళన చెందుతున్నా, అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని కార్యకర్తలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోవైపు సిట్టింగ్ లకే సీట్లు అనే ప్రకటన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు కొంత ఊరట నిచ్చే అంశమే అయినా, కేడర్ తిరుగు బాటు తన టికెట్ కు ఎక్కడ ఎసరు తెస్తుందోనన్న ఆందోళన లో ఆయన ఉన్నారన్న టాక్ .. సెగ్మెంట్లో వెల్లువెత్తుతోంది. సొంతపార్టీలోనే గ్రూపు రాజకీయాలు పీక్స్ కు చేరడంతో, కోదాడ సెగ్మెంట్ పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. అటు అధిష్టానం సైతం స్థానికంగా తలెత్తుతోన్న వర్గ విబేధాలపై సైలెంట్ గా ఉండడం సైతం సెగ్మెంట్లో రాజకీయాల్లో వేడిని రాజేస్తోంది.


అయితే అదే సమయంలో .. స్థానికంగా పట్టు పెంచుకుంటేనే, సిట్టింగ్ లకు టిక్కెట్లన్న కేసీఆర్ సూచన .. ఇప్పుడు బొల్లంకు టెన్షన్ పెట్టిస్తోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బొల్లంపై కారాలు మిరియాలు నూరుతోన్న మాజీ, సీనియర్ నేతలు .. చందర్ రావు, శశిధర్ రెడ్డిలు.. ఏం చేస్తారన్నదీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు కేడర్ సైతం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్న వేళ .. ఇదే విషయాన్ని అధిష్టానం గనుక పరిగణనలోకి తీసుకుంటే, టిక్కెట్ చేజారిపోవచ్చన్న వాదనలు .. సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. దీంతో ముందస్తు టాక్ వేళ అటు కేడర్ ను, ఇటు సీనియర్లను బొల్లం ఏమేరకు మచ్చిక చేసుకుంటారన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే ఈ దఫా బొల్లంకు టిక్కెట్ రాకుండా .. అడ్డుకునేందుకు నేతలు, కేడర్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని, దీన్ని బొల్లం ఏవిధంగా ఎదుర్కొంటారోనని సర్వత్రా చర్చలు సాగుతున్నాయి. దీంతో కోదాడ పంచాయితీపై అధిష్టానం సీరియస్ గా జోక్యం చేసుకుంటే తప్పా గొడవ కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లేదంటే బొల్లం మెట్టు దిగి అసంతృప్తులను బుజ్జగించే చర్యలు చేపట్టినా వివాదాలకు చెక్ పడొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.

Must Read

spot_img