Homeఆంధ్ర ప్రదేశ్రాజమండ్రి వైసీపీలో రాజకీయ పరిణామాలు..

రాజమండ్రి వైసీపీలో రాజకీయ పరిణామాలు..

ఆ నియోజకవర్గం తన అడ్డా అంటూ అక్కడి వైసీపీ యువ ఎం.పి ఇప్పటి వరకూ ధీమాగా ఉన్నారు. అయితే మరో యువనేత సైతం తన పట్టు నిరూపణ కోసం
రంగంలోకి దిగారు. ఇప్పటి వరకూ జిల్లా వై.సి.పి అధ్యక్షుడితో సైతం సంబంధం లేకుండా నియోజకవర్గంలో ఎం.పి హవా కొనసాగుతోంది. తాజా పరిణామాలతో .. ఇకపై ఏం జరగనుందో. రాజమండ్రి వై.సి.పి.లో రాజకీయ పరిణామాలు మరో మలుపు తిరిగేలా కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఎం.పి మార్గాని భరత్ రామ్ రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంపై పూర్తి ఫోకస్ తో పనిచేస్తున్నారు. ఇక్కడ అధికార పార్టీకి ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ కోఆర్డినేటర్ లేరు.

దీంతో రాజమండ్రి సిటీలో ఇటు అభివృద్ధి పనులు… అటు రాజకీయ వ్యవహారాల్లో మార్గాని భరత్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వై.సి.పి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం.పి భరత్ పేరే వినిపిస్తోంది. గతంలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో రాజమహేంద్రవరం గడ్డ తన అడ్డా అని ఎంపి మార్గాని భరత్ రామ్ ప్రకటించుకున్నారు. ప్రస్తుతం పార్టీ కోఆర్డినేటర్ గా ఎంపి మార్గాని గుడ్ మార్నింగ్, గడపగడపకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

రాజమహేంద్రవరం రాజకీయాల్లో ఎంపి హవాయే కొనసాగుతోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడైనా, నగరంలో బలం.. బలగం ఉన్నా రాజానగరం ఎమ్మెల్యే, దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు జక్కంపూడి రాజా నగర రాజకీయాల్లో వేలుపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఆయన ప్రమేయం లేకుండానే ఎంపి మార్గాని పలువురు నాయకులను పార్టీలో చేర్చుకుని, పార్టీ, నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం అధికార పార్టీ రాజకీయాలు, అభివృద్ధి పనులు ఎంపి కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఇలా నియోజకవర్గంలో ఎం.పి హవా కొనసాగుతున్న వేళ తాజాగా ఓ పరిణామం చోటుచేసుకుంది.

ఇటీవలే రాజమండ్రికి చెందిన వై.సి.పి యువనేత జక్కంపూడి గణేష్ కు పార్టీ అధిష్టానం కీలకమైన పదవి అప్పగించింది. పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల జోనల్ ఇన్ ఛార్జ్ గా నియమించింది. ఐదు జిల్లాల పరిధిలోని వై.సి.పి యువజన వ్యవహారాలను బలోపేతం చేసే బాధ్యతలను గణేష్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజా సోదరుడు, మాస్ లీడర్ జక్కంపూడి గణేష్ ఎంపి అడ్డాలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే… పార్టీ అప్పగించిన బాధ్యతలతోపాటు తన సొంత నియోజకవర్గం రాజమండ్రి సిటీపైనా జక్కంపూడి గణేష్ ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే వై.సి.పి యువ సమ్మేళనం బహిరంగ సభను రాజమండ్రిలోనే భారీ ఎత్తున నిర్వహిస్తామనీ ప్రకటించారు. ఇకపై రాజమండ్రి వై.సి.పి.లో దూకుడుగా వెళ్లబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.

అయితే ఇప్పటికే ఎం.పి భరత్ హవా కొనసాగుతున్న రాజమండ్రి వై.సి.పి.లో జక్కంపూడి గణేష్ సైతం తన పట్టు కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పదవి లభించిన సందర్భంగా జక్కంపూడి గణేష్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎం.పి భరత్ ఫోటోను ఫ్లెక్సీపై వేయలేదు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సిఎం, వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ మిధున్ రెడ్డి, జక్కంపూడి రాజా, ఇతర నాయకుల ఫొటోలు వేశారు. భరత్ ఫొటోను మాత్రం పక్కన పెట్టినట్లు కనిపించింది. అయితే ఈ సభకు ఎంపి సన్నిహితులు ఇన్నమూరి దీపు, చిట్టూరి ప్రవీణ్ చౌదరి హాజరుకావడం విశేషం.

దీంతో రాజమండ్రి వై.సి.పి.లో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రాజమండ్రి నగరంలో దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కుటుంబానికి మొదటి నుంచీ పట్టు కొనసాగుతోంది. సామాజిక సమీకరణాల కారణంగా గత ఎన్నికల్లో జక్కంపూడి రామ్మోహనరావు మొదటి కుమారుడు రాజాను పక్కనే ఉన్నరాజానగరం నియోజకవర్గం నుంచి పార్టీ అధిష్టానం పోటీ చేయించింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగానూ…జిల్లా వై.సి.పి అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా కొనసాగుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ ఎం.పి మార్గాని భరత్ తో జక్కంపూడి రాజాకు విభేదాలు ఏర్పడి రచ్చకెక్కాయి.

స్వయంగా సి.ఎం జగన్ పిలిపించి మాట్లాడినా అటు ఎం.పి… ఇటు ఎమ్మెల్యేల మధ్య సయోధ్య ఏర్పడలేదు. అయితే కొన్ని నెలల క్రితమే అనూహ్యంగా ఇద్దరూ తమ విభేదాలు పక్కన పెట్టినట్లు ప్రకటించారు. ఎవరి నియోజకవర్గంలో వ్యవహారాలు వారు చూసుకుంటున్నారు. వాస్తవానికి ఎమెల్యే జక్కంపూడి రాజా తూర్పుగోదావరి జిల్లా వై.సి.పి. అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఏడు నియోజకవర్గాల పరిధిలోని రాజమండ్రి సిటీ కూడా ఉంది.

జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తమ కుటుంబానికి ముందు నుంచీ పట్టు ఉన్న రాజమండ్రి సిటీలో జరుగుతున్న వై.సి.పి వ్యవహారాల్లో ఎమ్మెల్యే రాజా జోక్యం చేసుకోవటం లేదు. నగరంలో ఇటీవల టి.డి.పి సహా పలు పార్టీల నుంచి పలువురు నాయకులు వై.సి.పి.లో చేరారు. ఇలా పార్టీలోకి చేరికల సందర్భంగా జిల్లా వై.సి.పి అధ్యక్షుడిగా రాజా ప్రమేయం కనిపించలేదు. ఎం.పి భరత్ నిర్ణయాల మేరకు ఇతర పార్టీల నుంచి వై.సి.పి.లోకి చేరికలు జరిగాయి. పలువురికి నామినేటెడ్ పదవులు సైతం దక్కాయి.

రాజమండ్రి వై.సి.పి వ్యవహారాల్లో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జక్కంపూడి రాజా జోక్యం చేసుకోకపోవటంతో ఎం.పి మార్గాని భరత్ హవా మరింత జోరుగా కొనసాగుతోందని పార్టీ శ్రేణుల్లో అభిప్రాయం ఉంది. అయితే తాజాగా జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ కు వై.సి.పిలో కీలకమైన పదవి రావటంతో వ్యవహారాలు మరో మలుపు తిరగనుందన్నమాట పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. తమ కుటుంబానికి ముందు నుంచీ పట్టు ఉన్న రాజమండ్రి సిటీపై ఇకపై జక్కంపూడి రాజాకు బదులు ఆయన సోదరుడు గణేష్ ఫోకస్ పెడతారనే వాతావారణం కనిపిస్తోంది.

దీంతో నగర వై.సి.పి.లో ఇకపై మరో వర్గం యాక్టీవ్ కానుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజమండ్రి నగరంలో పెద్దఎత్తున జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎం.పి భరత్ ప్లానింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. దీనికితోడు రచ్చబండ వంటి కార్యక్రమాలతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.డి.పి గెలుపొందింది. అప్పటి నుంచీ అటు ఎమ్మెల్యే… ఇటు నియోజకవర్గ కోఆర్డినేటర్ లేక రాజమండ్రి వై.సి.పి శ్రేణుల్లో నైరాశ్యం కొనసాగింది. అయితే కొన్ని నెలల నుంచీ వై.సి.పి అధిష్టానం ఆదేశాలతో రాజమండ్రి సిటీపై ఎం.పి భరత్ పూర్తి ఫోకస్ పెట్టారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మార్గాని భరత్ వై.సి.పి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బలమైన అభ్యర్థి అవుతారనే అనే అంచనాలు ఉన్నాయి.
అయితే గత ఎన్నికల్లో వై.సి.పి అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావు భారీ మెజారీటీతో ఓటమి చెందటానికి కారణమైన ఇక్కడ పార్టీలో గ్రూపుల మధ్య విభేదాలే మరోసారి పార్టీకి మైనస్ అవుతాయా అనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా రాజమండ్రి వై.సి.పి.లో నాయకుల మధ్య సఖ్యత కుదరకపోవటం వల్లే ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలకు అధికార పార్టీ సముఖంగా లేదనే వాదన సైతం ఉంది.

వాస్తవానికి రాజమండ్రి సిటీ నియోజకవర్గంపై ఎం.పి భరత్ పూర్తి ఫోకస్ పెట్టడం పార్టీకి బలోపేతం అయ్యింది. అదే సమయంలో ఎం.పి భరత్ అందరినీ సమన్వయం చేయకపోవటం మైనస్ గా మారుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా నగర రాజకీయాల్లో పట్టు ఉన్నజక్కంపూడి కుటుంబానికి చెందిన గణేష్ సైతం ఎం.పి.తో సంబంధం లేకుండా తన పంథాలో తాను వెళ్తాననే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ఇరువురి మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పదని, ఇరునేతల మధ్య వర్గపోరు .. పార్టీకి తీరని నష్టమని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.

రాజమండ్రి వై.సి.పి.లో ఇకపై ఏం జరగనుందో చూడాలి మరి..


Must Read

spot_img