ఇరాన్ లో మతోన్మాదుల రాక్షసకాండ పరాకాష్టకు చేరుకుంది. హిజాబ్ ఉద్యమం మహోగ్రంగా చెలరేగడంతో ఇరాన్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. దేశంలో మహిళలు బురఖా ధరించడం విషయంలో స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అప్పటికి తలవంచినట్టు చేసి ఆ తరువాత వారిపై ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది ఇరాన్ ప్రభుత్వం. చాలా దారుణమైన విషవాయువుల ప్రయోగాలు మొదలుపెట్టింది.
ఈ 21వ శతాబ్దంలో ఏ దేశంలోనైనా సరే చాందసవాదానికి తావుండదు. నాగరిక ప్రపంచంలో వివక్షకు తావులేదు. ఆడా, మగా తేడా చూపడం నైతిక సూత్రాల ప్రకారమే కాదు, చట్ట ప్రకారమూ ముమ్మాటికీ నేరమే. బాలికలకు విద్యను నిరాకరించడం, వారికి చదువుకొనే అవకాశాలు దూరం చేయడం రాక్షసత్వమే అనిపించుకుంటుంది. ఇస్లామిక్ దేశమైన ఇరాన్లో ఇప్పుడు అచ్చంగా అలాంటిదే జరుగుతోంది. కేవలం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకొని విష వాయువుల ప్రయోగానికి పాల్పడుతున్నారు. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరనేది మాత్రం అంతు చిక్కడం లేదు.
మరోవైపు దుండగుల దుశ్చర్యపై బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతోందో తెలియక వణికిపోతున్నారు. క్రమంగా ఇరాన్ సమాజంలో అశాంతి నెలకొంటోంది. విష వాయువుల ప్రయోగాల గుట్టును రట్టు చేస్తామని, దోషులను కచ్చితంగా శిక్షిస్తామని ఇరాన్ ప్రభుత్వం హామీ ఇవ్వడం కొంత ఊరట కలిగిస్తోంది. ఇరాన్లో 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. బాలికలు, యువతులపై ఆంక్షలన్నీ దాదాపుగా తొలగిపోయాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి నిర్భయంగా చదువుకుంటున్నారు.
పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్ తరహా పరిస్థితులు ఇరాన్లో మొన్నటిదాకా కనిపించలేదు. బాలికల విద్యాభ్యాసాన్ని, మహిళలు ఉద్యోగాలకు వెళ్లడాన్ని తాలిబన్ ప్రభుత్వం నిషేధించడం పట్ల ఇరాన్ తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. తాలిబన్లు తమ పద్ధతి మార్చుకోవాలని, మహిళలపై ఆంక్షలు ఎత్తివేయాలని అక్కడి పాలకులను హెచ్చరించింది.
- ఇరాన్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి..
అలాంటిది ఇరాన్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తలపై బురఖా, మొహానికి సక్రమంగా హిజాబ్ ధరించనందుకు 22 ఏళ్ల మహసా అమీనీ అనే యువతిని గత ఏడాది సెప్టెంబర్‌లో ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధించారు. చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే మూడు రోజులపాటు కోమాలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన అమీనీ సెప్టెంబర్ 16న మృతి చెందింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు, యువతులు, బాలికలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. నైతిక నియమావళి పేరిట తమను అణగ దొక్కుతున్నారని, గొంతు నొక్కు తున్నారని, హక్కులు హరిస్తున్నారని ఆరోపిస్తూ నెలల తరబడి ఆందోళన కొనసాగించారు. నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని నినదించారు. వందలాది మంది ప్రాణాలు పోయాయి.
వారి ఆందోళన మహోగ్ర ఉద్యమంగా మారింది. అయితే చిలికి చిలికి గాలివానగా మారిన మహిళల ఉద్యమానికి ఇరాన్ లోని పురుషులు, విద్యార్థులు తోడై నిలిచారు. ప్రభుత్వాన్ని ఊపిరి తీసుకోకుండా నిరసన ప్రదర్శనలు జరిపారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చింది. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మహిళలంతా శాంతించాలని కోరింది.
మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉద్యమించడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, దిగి వచ్చేలా చేయడం మతోన్మాదులకు, పిడివాదులకు కంటగింపుగా మారింది. బాలికలను విద్యాసంస్థలకు వెళ్లకుండా, చదువుకోకుండా చేయడమే లక్ష్యంగా కొత్త కుతంత్రానికి తెరలేపారు. భయభ్రాంతులకు గురిచేసి, ఇళ్లకే పరిమితం చేయడానికి విష వాయువుల ప్రయోగం అనే దొంగదారిని ఎంచుకున్నారు. విద్యార్థినులెవరూ రాకపోతే పాఠశాలలు మూతపడతాయన్నది వారి ఉద్దేశం.
ముసుగులు ధరించి, తరగతి గదుల్లోకి హఠాత్తుగా ప్రవేశించడం, విష వాయువులు వదిలి, క్షణాల్లో మాయం కావడం చేసారు. దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈ కుట్ర మొత్తం ఇలాగే కొనసాగింది. వివరాలను చూస్తే..ఇరాన్లో 30 ప్రావిన్స్‌లు ఉండగా, 21 ప్రావిన్స్‌ల్లో 50కి పైగా పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు జరిగాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటిదాకా 50కి పైగా పాఠశాలల్లో 700 మంది విద్యార్థినులు ఈ ప్రయోగాల బారినపడినట్లు ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు.
బాలికలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. బాధితుల్లో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. తలనొప్పి, వికారం, వాంతులు, తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపించాయి. బాధితులు కాళ్లు, కడుపులో నొప్పితో విలవిల్లాడారు. దుండుగులు ప్రయో గించిన వాయువులు కుళ్లిన నారింజ పండ్ల వాసన, క్లోరిన్ వాసన, టాయ్లెట్లు శుభ్రం చేసుకొనే రసాయనాల వాసన వచ్చినట్లు బాధితులు చెప్పారు.