ముంబై నాగపూర్ ఎక్స్ ప్రెస్ వే .. కనెక్టివీటికి కీలకంగా మారింది. దేశవ్యాప్తంగా హైవేల అనుసంధానంలో ఇది ప్రధాన పాత్ర పోషించనుంది. దీని ఏర్పాటుతో .. మహారాష్ట్ర ఆర్థిక పురోగతిని సాధించనుంది. మహా సమృద్ధి మార్గ్ .. ప్రధాని కలల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోంది. రూ.55 వేల కోట్ల అంచనాతో .. ఏకంగా పది జిల్లాలకు .. ఈ వే .. ప్రధాన రహదారిగా మారనుంది.
నాగపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్‌వే లోని మొదటి దశ
ఇండియాలో హైవేలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నాగపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్‌వే లోని మొదటి దశను ప్రారంభించారు. మొత్తం 701 కి.మీ వేలో మొదటి దశ 520 కి.మీ ఉంది. సమృద్ధి మహా మార్గంగా పిలుస్తోన్న ఈ హైవే.. నాగపూర్, షిర్డీలను కలుపుతుంది. దేశవ్యాప్తంగా హైవేలతో కనెక్టివిటీ పెరగాలనుకుంటున్న ప్రధానమంత్రి కలల ప్రాజెక్ట్ ఇది.
దీన్ని నాగపూర్ – ముంబై సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. మొత్తం 701 కి.మీ ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్ వే.. దేశంలోని అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వేలలో ఒకటిగా నిలవనుంది. రూ.55వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారి.. మహారాష్ట్రలోని 10 జిల్లాల్లో వెళ్తుంది. అర్బన్ ఏరియాలైన అమరావతి, ఔరంగాబాద్, నాసిక్ గుండా ఇది సాగుతుంది.
ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల మరో 14 జిల్లాలకు కనెక్టివిటీ మెరుగవుతుంది. మొత్తంగా మహారాష్ట్రలోని 24 జిల్లాలకు ఇది మేలు చేస్తుంది. విదర్భ, మరాఠ్వాడ, ఉత్తర మహారాష్ట్రకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రధానమంత్రి గతి శక్తి ప్రాజెక్ట్, సమృద్ధి మహా మార్గం.. త్వరలోనే ముంబై ఎక్స్ ప్రెస్ వే, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్‌ని కలుస్తాయి. అలాగే టూరిస్ట్ ప్రాంతాలైన అజంతా ఎల్లోరా గుహలు, షిర్డీ, వేలూర్, లోనార్ గుండా ఈ రహదారులు సాగుతాయి. సమృద్ధి మహా మార్గం మహారాష్ట్రను ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలున్నాయి. హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ అని దీనికి పేరు పెట్టారు.నాగ్‍పూర్ – షిరిడీ మధ్య 520 కిలోమీటర్ల దూరాన్ని ఈ తొలి దశ ఎక్స్‌ప్రెస్‍వే కవర్ చేస్తోంది.
మొత్తంగా పూర్తయ్యాక, 701 కిలోమీటర్ల పొడవుతో ఉండే ఈ ఎక్స్‌ప్రెస్‌వే నాగ్‍పూర్ తో ముంబైను కలుపుతుంది. మూడు అంతర్జాతీయ, ఏడు దేశీయ విమానాశ్రయాలను ఈ సమృద్ధి మహామార్గ్ కనెక్ట్ చేస్తుంది. రెండు భారీ, 48 మైనర్ షిప్పింగ్ పోర్టులను, 6,000 కిలోమీటర్ల రైల్వే నెట్‍వర్కును కలుపుతుంది. జంతువులు రోడ్డు దాటేటప్పుడు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ఎక్స్‌ప్రెస్‍వే పొడవునా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక యానిమల్ క్రాసింగ్‍లు ఏర్పాటయ్యాయి.
వాహనాల స్పీడ్‍ను, వాహనాల బ్రేక్ డౌన్స్, లేన్ క్రమశిక్షణను పర్యవేక్షిచేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‍మెంట్ సిస్టమ్ ఈ ఎక్స్‌ప్రెస్‍వే పొడవునా ఉంటుంది. మహారాష్ట్రలో రహదారుల కనెక్టివిటీని ఈ ముంబై-నాగ్‍పూర్ ఎక్స్‌ప్రెస్‍వే గణనీయంగా మెరుగుపరుస్తుందని అంచనా. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రతీ 40-50 కిలోమీటర్ల మధ్య ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్‍లు ఉంటాయి. ఫుడ్ ప్లాజాలు, విశ్రాంతి ఏరియాలతో పాటు చాలా సదుపాయాలు ఉంటాయి. ఇది 390 గ్రామాలను దాటి మహారాష్ట్రలోని పది జిల్లాలను దాటుతుంది.ఇది ముంబై, నాగ్‌పూర్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది కూడా గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్, 2015లో ప్రకటించగా, 2017లో భూసేకరణ ప్రారంభమైంది.
ముంబై నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేకి ప్రధాని నరేంద్ర మోదీ పునాది
డిసెంబర్ 2018లో ముంబై నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేకి ప్రధాని నరేంద్ర మోదీ పునాది వేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిని పెంచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రాంతాల అంతటా కనెక్టివిటీ అందించడమే కాక ఇది జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు గేట్‌వేగా పని చేస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, నాగ్‌పూర్‌లోని నాగ్‌పూర్-మల్టీమోడల్ ఇంటర్నేషనల్ హబ్ ఎయిర్‌పోర్ట్ కి కనెక్టివిటీని అందిస్తుంది.
ఎక్స్‌ప్రెస్‌వేను విజయవంతమైన ప్రాజెక్ట్‌గా మార్చడానికి మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రయాణ సమయం ఎనిమిది గంటలు తగ్గుతుందని అంచనా. ప్రయాణికులు ముంబై నుండి నాగ్‌పూర్ మధ్య ఎనిమిది గంటల్లో దూరాన్ని చేరుకోవచ్చు, ఇది ప్రస్తుతం 16 గంటలని అధికారులు చెబుతున్నారు. నాగ్‌పూర్-ముంబై సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్ కోసం ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంను స్థాపించడానికి భారత ప్రభుత్వం, రిపబ్లిక్ ఆఫ్ కొరియా చేతులు కలిపాయి.
ఎకనామిక్ డెవలప్‌మెంట్ కోఆపరేషన్ ఫండ్ రుణం ప్రాజెక్ట్ నిర్మించడానికి ప్రాజెక్ట్‌ను గెలుచుకుంది. అలాగే ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం, ట్రాఫిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ నిర్వహణలో సామర్థ్యాన్ని పెంపొందించడం, టోల్ కలెక్షన్ సిస్టమ్ ఏర్పాటు ద్వారా టోల్ నిర్వహణలో సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలని కేంద్రం పేర్కొంది. ముంబై-నాగ్‌పూర్ సమృద్ధి మహామార్గ్ కోసం మహారాష్ట్ర హైవే పోలీసులు గంటకు 120 కిమీ గరిష్ట వేగ పరిమితిని నిర్ణయించారు.
అక్టోబర్ 4న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎక్స్‌ప్రెస్‌వేపై ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు, క్వాడ్రిసైకిళ్లను అనుమతించరు. M1 కేటగిరీ కింద ఎనిమిది మంది వ్యక్తులతో ప్రయాణించే వాహనాలు గరిష్టంగా 120 kmph వేగంతో ప్రయాణించవచ్చు. అలాగే ఘాట్, సొరంగాల వద్ద వేగ పరిమితి 100 kmphగా నిర్ణయించారు. అదేసమయంలో ప్రయాణీకుల సంఖ్య ఎనిమిది కంటే ఎక్కువ ఉంటే, గరిష్ట వేగ పరిమితి గంటకు 100 కి.మీలని, ఘాట్‌లు, సొరంగాల దగ్గర వేగం 80 కి.మీలని తెలిపారు. ఇక N-కేటగిరీ కిందకు వచ్చే అన్ని వస్తువుల వాహనాలకు, ఎక్స్‌ప్రెస్‌వే అంతటా గరిష్ట వేగ పరిమితి 80 kmphలని పేర్కొన్నారు.
ఆర్థిక పురోగతికే కాక .. గ్రీన్ కారిడార్ గా దేశంలోనే అతి పొడవైన రహదారిగా ఈ ఎక్స్ ప్రెస్ వే నిలుస్తోంది.