Homeఅంతర్జాతీయంప్రపంచాన్ని భయపెడుతున్న విమానాలు..!

ప్రపంచాన్ని భయపెడుతున్న విమానాలు..!

ప్రపంచాన్ని విమానాలు భయపెడుతున్నాయి. అయితే అందులో మందుబాబులు తాగి చేస్తున్న చండాలం గురించి కాదు..వాటి ద్వారా చైనా నుంచి సప్లై అవుతున్న కరోనా వేరియంట్ల నుంచి. దాదాపు చైనా నుంచి వస్తున్న ప్రతీ విమానంలో వైరస్ ఆనవాళ్లు గుర్తిస్తున్నారు.

రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ భూతం మళ్లీ కోరలు చాస్తోంది. దేశ విదేశాల్లో ప్రయాణికుల ద్వారా, ప్రయాణాల ద్వారా ఈ వైరస్ మరోసారి వేగంగా వ్యాప్తి చెందుతోంది.

ప్రపంచాన్ని విమాన ప్రయాణాలు భయపెడుతున్నాయి. దాదాపు ప్రతీ విమానంలోనూ కరోనా మహమ్మారికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు గుర్తించి, శాంపిల్స్ ను ల్యాబ్ లకు పంపి పరిశోధనలు చేస్తున్నారు. మలేషియాలో ఇలా చేస్తున్న పరిశోధనల తర్వాత ఓ కీలక వాస్తవం బయటపడింది. ప్రస్తుతం మలేషియా గాల్లో ఎగురుతున్న దాదాపు ప్రతీ విమానంలోనూ కరోనా వైరస్ ఆనవాళ్లున్నట్లు గుర్తించారు.

మలేషియాకు చెందిన నేషనల్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీ ప్రకారం కౌలాలంపూర్‌లోని 29 విమానాల నుండి తీసిన మురుగునీటి నమూనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు వాటిలో 28లో కరోనావైరస్ కనుగొన్నారు. 29వ నమూనాపై పరీక్ష జరుగుతోంది.

జూన్ నుండి డిసెంబర్ 2022 వరకు అంతర్జాతీయ ఎంట్రీ పాయింట్ల వద్ద ఈ శాంపిల్స్ సేకరించారు. అదే సమయంలో ల్యాబ్ దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 15 సెంటినల్ స్థానాల నుండి 301 నమూనాలను పరీక్షించింది. ప్రస్తుతం ప్రయాణిస్తున్న విమానాల్లో 95.7% వాటిలో “సార్స్ కోవ్ 2, 288’ శాంపిల్స్ ద్వారా గుర్తించారు.

ఆరోగ్య డైరెక్టర్ జనరల్ డాక్టర్ నూర్ హిషామ్ అబ్దుల్లా మలేషియా వార్తాపత్రిక సినార్ హరియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎయిర్‌క్రాఫ్ట్ మురుగునీటి నిఘా ప్రక్రియలో శుద్ధి చేయని మురుగునీరు, మురుగు కాలుష్యం కోసం శాంపిల్స్ పరీక్ష ఉంటుంది. “సార్స్ కోవ్ 2, 288’ వైరస్ యొక్క RNA శకలాలు ప్రయాణికుడి ఆరోగ్యంతో సంబంధం లేకుండా మలంలో కనిపిస్తాయి.

అలాగే మురుగునీటి పరీక్షల ద్వారా వీటిని గుర్తిస్తారు. వైరస్ ఈ రూపం అంటువ్యాధి మాత్రం కాదని, మలం ద్వారా సంక్రమించదని గుర్తించారు. విమానం నుంచి మురుగునీటిని సెప్టిక్ ట్యాంక్ ట్రక్ ద్వారా విమాన వ్యర్థాలను పారవేసే సదుపాయానికి తీసుకువెళతారు. అలాగే అనుమానం ఉన్న విమానాలను గుర్తించిన తర్వాత, అధికారులు మురుగునీటిని శుద్ధి చేయడానికి ముందు శాంపిల్స్ తీసుకుని వాటిని ల్యాబ్ కు పంపుతున్నారు.

విమానం నుండి మురుగు నీటి నమూనాలను వారానికి రెండుసార్లు తీసుకుని ఇలా ప్రయోగాలు చేస్తున్నట్లు డాక్టర్ అబ్దుల్లా వెల్లడించారు. కోవిడ్ ప్రమాదంలో ఉన్న దేశాల్ని గుర్తించేందుకు మలేషియా ఆరోగ్యశాఖ ఇలా శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహిస్తోంది.

ప్రయాణికుల్ని ముందస్దుగా హెచ్చరించేందుకు ఇది ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే వీటిని చైనా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. పైగా చైనాను ప్రపంచం నుంచి ఒంటరిని చేస్తున్నారనీ, పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపణలు చేస్తోంది. అయితే గతంలో ప్రపంచం మొత్తంగా కరోనా ఉద్రుతి పెరిగిన సమయంలో చైనా తన దేశంలోకి విదేశాల నుంచి విమానాలను రానీయలేదు.

అంతకు ముందు ప్రయణీకులకు క్వారంటైన్లు, టెస్టుల పేరుతో నరకం చూపించింది. ఇప్పుడు తన దేశంలో కరోనా ఆంక్షలు ఎత్తివేసి కొత్త పాట పాడుతోంది. అయితే చైనా ఈ ప్రవర్తనను అనేక దేశాలు అనుమానిస్తున్నాయి. ఇది మరో కుట్రగా భావిస్తున్నాయి. విమానాలలో కరోనా లోడ్ లను పంపిస్తున్నట్టు చెబుతున్నారు.

కరోనా పుట్టినిళ్లైన చైనాలో కరోనా మరోసారి భీకరంగా విజృంభిస్తున్నది. ఇప్పట్లో తగ్గే సూచనలు కనపించడం లేదు. దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనాలో మూడో అతిపెద్ద ప్రావిన్స్‌ అయిన హెనాన్‌లో దాదాపు 90 శాతం మంది ప్రజలు కరోనా బారినపడ్డారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ప్రావిన్స్‌లోని మొత్తం జనాభాలో 89 శాతం మందికి వైరస్‌ సోకిందని సెంట్రల్‌ హెనాన్‌ ప్రావిన్స్‌ హెల్త్‌ కమిషన్‌ డైరెక్టర్‌ కాన్‌ క్వాన్‌చెంగ్‌ అన్నారు. ప్రావిన్స్‌లో మొత్తం 9 కోట్ల 94 లక్షల మంది జనాభాలో సుమారు 8 కోట్ల 85 లక్షల మంది మహమ్మారి బారినపడ్డారని వెల్లడించారు. జ్వరం లక్షణాలతో క్లినిక్‌లకు వచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నదని చెప్పారు.

Must Read

spot_img