వ్యాధులు బాధిస్తుంటే మందులు వాడతాం..వాటి ద్వారా ఉపశమనం పొందుతాం. ఒక్కోసారి అవి మోతాదు మించితే సైడ్ ఎఫెక్టుల బారిన పడతాం..లేదంటే ఒక్కోసారి అవి మన శరీరతత్వానికి సరిపోకుండా ఉంటాయి. దాంతో మరెన్నో సమస్యలను ఎదుర్కుంటాం.. అందుకే మన శరీరాలను జెనెటికల్ గా ఎలా స్పందిస్తాయో తెలుసుకుని ఏ మందులైతే మనకు సరిపోతాయో తెలుసుకుని వాటినే ఆ మోతాదులో వాడటం అనే కొత్త వైద్యవిధానం అందుబాటులోకి వస్తోంది. దానినే ఫార్మాకోగెనొమిక్స్ అంటున్నారు.ఆ పరీక్ష ద్వారా మన శరీరతత్వానికి సరిపడే మందులను నిర్ణయించడం సాధ్యమవుతుంది. ఆపై మనం వాడే మందులు సరిగ్గా పనిచేస్తాయి. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం పురోగతి అతివేగంగా సాగిపోతోంది.
పంటలను పండించే క్రమంలో సాధించిన విప్లవాత్మక మార్పులు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయపరంగా, సేంద్రీయపరంగా అనేక ప్రపంచ వేదికలపై ప్రస్తుత శాస్త్రీయ సమాజం మాట్లాడుతోంది. వ్యవసాయ ఉత్పత్తులు పోషక సమతుల్యతను ఇస్తుంటే, రసాయన ఉత్పత్తులు, ఔషధాలు మానవప్రగతిని వెనుకంజ వేయిస్తున్నాయి. ఔషధాలే ఆహారంగా, చికాకు, అలజడి కలిగించే దృశ్యంగా మారిన ఈ కాలంలో, మంచి చెడుల మధ్య తేడాను గుర్తించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మనిషి ఎదుగుదల ప్రతి స్థాయిలో విలక్షణంగా సాగుతోంది. జన్యు స్థాయిలో మనం తీసుకునే ఆహారం, ఔషధాల విషయంలో శరీరం నిర్దిష్టంగా వివిధ వాతావరణాలకు భిన్నంగా స్పందిస్తుంది. ఔషధ చికిత్సకు ప్రతిస్పందనగా జన్యువులు చెప్పే వాస్తవాలు దాదాపు అర్ధ-శతాబ్దానికి పైగా ప్రసిద్దిగాంచాయి.
మాదకద్రవ్యాలకు ప్రతిచర్యలు, దీర్ఘకాలిక మరణాలకు అతిపెద్ద కారణంగా ప్రతిస్పందనలు ఉంటున్నాయి.. ఇవి రహదారి ప్రమాదాలు, జీవనశైలి వ్యాధుల కంటే ముందు స్థానంలో ఉన్నాయి. అయినప్పటికీ, ఔషధాలు ప్రతి వ్యక్తికి భిన్నంగా పనిచేస్తాయనే ప్రాథమిక అవగాహన జనంలో ఇప్పటికీ కలగడం లేదు.
ఇది గానీ గుర్తించగలిగితే మరణాలను నివారించడం సాధ్యమవుతుందా…?
ఫార్మాకోజెనొమిక్స్ అని పిలవబడుతున్న ఈ కొత్త శాస్త్రం సైన్స్ అందించిన మరో అద్భుతమైన వరంగా నిలవనుంది. ఇదెలా ఉంటుందంటే..మందులు మనకు ఆహారం కారాదు. ఆహారమే మనకు మందుగా మారాలి’ ఇది ఆధునిక ఆరోగ్య సూత్రంగా చెబుతున్నారు పరిశోధకులు.. అవి, ఇవి అని అడ్డమైన గడ్డి తిని లేని రోగాలు తెచ్చుకొని మందులు తింటూ బాధ పడటం మనం చూస్తుంటాము.. ఏ మందులు అవసరం లేని, ఏ రోగాలు దరిచేరని మనకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆచితూచి తినడం దీనికి పరిష్కారం. ఇందువల్ల మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పది కాలాలపాటు హాయిగా జీవించొచ్చని చెబుతున్నారు. అందుకే ఇప్పటి సమాజంలో కియో డైట్, వీరమాచినేని డైట్ అంటూ సరైన ఆహారం గురించి ప్రచారం జరుగుతోంది. వారు చూపించిన దారిలో జనం నడుస్తున్నారు. వారు సూచిస్తున్న త్రుణధాన్యాలు లాంటి ఉత్పత్తులు మార్కెట్లో ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు వీటికి భిన్నంగా పూర్తి శాస్త్ర విఙ్ఞానపరంగా మరో విధానం అమల్లోకి వస్తోంది..అదే ఫార్మాకోజెనొమిక్స్..మన డీఎన్‌ఏను విశ్లేషించి జన్యుపరంగా సంక్రమించే జబ్బులేవో అంచనా వేసి, ఆ జబ్బులు నివారించడానికి పరిపడే మందులు తెలుసుకుని తీసుకోవడమే ఆ విధానం.
ఈ మందులను ఆలోపతి వైద్యులే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ పద్ధతి నార్వేలో ఊపందుకుంది. అక్కడకుగానీ, భారత్‌లోని డీఎన్‌ఏ సెంటర్లకుగానీ మన లాలాజలం తీసి పంపిస్తే చాలు మన డీఎన్‌ఏ జన్యుక్రమాన్ని విశ్లేషించి నివేదిక పంపిస్తారు. భవిశ్యత్తులో మనకు వచ్చే అవకాశం ఉన్న జబ్బులు గురించి కూడా అందులో పూర్తిగా విశ్లేషిస్తారు. ఉదాహరణకు ‘కార్డియో వాస్కులర్ డిసీసెస్’ వచ్చే అవకాశం ఉందంటే, మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ కన్నా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్లయితే ఆ విషయం అందులో ఉంటుంది.
ఫార్మాకోజెనోమిక్ పరీక్ష చేయించుకునేముందు మీ జన్యువులు ఔషధాలకు ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడం జరుగుతుంది. అందుకు చికిత్స కాంబినేషన్ ఎన్ని రకాలుగా చేయవచ్చో తెలుసుకోవడం జరుగుతుంది. అంతే కాదు..చికిత్సలో ప్రత్యామ్నాయాలు, శరీరంలో ఏర్పడే సైడ్ ఎఫెక్టులు, దుష్ప్రభావాలు తెలుసుకొనేందుకు వీలవుతుంది. గతాన్ని పరిశీలిస్తే ఔషధ సామర్థ్యం ఒక అపోహగానే మిగిలిపోయింది. ఔషధాల అమ్మకం కోసం వైద్యులు విచ్చలవిడిగా మందులు రాయడం వలన అవి రోగులపై ప్రతికూల ప్రభావాలు పడి మరణాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు ఆస్పత్రులలో ఇచ్చే మందులు చికిత్స చేయకపోగా రోగ లక్షణాలను మాత్రమే తొలగిస్తున్నాయి. ఔషధాలలో రకాలు గురించి తెలుసుకోవడం వలన ఎన్నో వాస్తవాలను తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఈసమాచారం అవాంఛిత ప్రమాదాన్ని తగ్గించి, మెరుగైన చికిత్స అందించే అవకాశాన్నిస్తుంది. సీక్వెన్సింగ్, జన్యు పరిశోధనతో కలిగే సాంకేతిక పరిజ్ఞానంతో రోగి జన్యు ప్రొఫైల్‌ను పరీక్షించి, అనేక ఔషధాలకు శరీర ప్రతిస్పందనను అర్థం చేసుకోవడానికి అవకాశముంటుంది.
జన్యు అమరిక ఆధారంగా ప్రొఫైల్‌ను గుర్తించటానికి, మెడిసిన్ రెస్పాన్స్ ప్రొఫైల్‌ను విశ్లేషించే అత్యాధునిక ఫార్మాకోజెనోమిక్ పరీక్ష అందుబాటులోకి వచ్చింది. దీనినే మెడికామాప్ అని కూడా అంటారు. మెడికామాప్ అంటే కేవలం కాస్త లాలాజలంపై చేసే పరీక్ష. ఈ పరీక్ష 99% డేటా ఖచ్చితత్వంతో పాటు FDA సిఫార్సు చేసిన పరీక్షగా చెబుతున్నారు. ఈ నివేదిక ద్వారా వైద్యుడికి రోగి గురించి ఒక స్పష్టమైన అంచనా వస్తుంది. దాంతో రోగి శరీరానికి సరిపడని మందుల విషయాన్నీ తెలిసిపోతాయి. ఈ పరీక్షతో, వైద్యుడు రోగికి తగిన చికిత్స చేయడంతో పాటు ఔషధాల మోతాదును కచ్చితంగా సూచిస్తారు.