Homeఅంతర్జాతీయంకూటమి నిర్ణయం చమురు ధరలు ఆకాశాన్నంటేలా చేయనున్నాయా..?

కూటమి నిర్ణయం చమురు ధరలు ఆకాశాన్నంటేలా చేయనున్నాయా..?

ఒపెక్ ప్లస్ దేశాల అనూహ్య నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఏ మేరకు పెరగనున్నాయి..? తాజా నిర్ణయం ఎలా ఉండబోతోంది..? బైడెన్‌ చెప్పినా వినకుండా రష్యా, చైనాల వైపు సౌదీ అరేబియా వేస్తున్న అడుగులు భౌగోళిక రాజకీయాల్లో దేనికి సంకేతం..? ఈ నిర్ణయంతో సౌదీ, రష్యాలకు లాభమా…?

ఓ వైపు ఉక్రెయిన్, రష్యాల మధ్య ఏడాదికిపైగా కొనసాగుతున్న భీకర యుద్ధం, మరోవైపు.. అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రపంచ దేశాలపై పెట్రోబాంబు పడుతోంది. ఈ ఏడాది చివరి దాకా రోజువారీ చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ ప్లస్ దేశాల కూటమి నిర్ణయించింది. ఇందులో ప్రధాన భాగస్వామైన సౌదీ అరేబియా తన మిత్రదేశం అమెరికాను కాదని రష్యాకు మేలు చేసేలా వ్యవహరించటం కీలక పరిణామం. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగితే.. దీని ప్రభావం ఎలా ఉండబోతోందనేది అందరికీ తెలిసిందే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పినా వినకుండా రష్యా, చైనాల వైపు సౌదీ అరేబియా వేస్తున్న అడుగులు భౌగోళిక రాజకీయాల్లో మార్పులకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు..

చేతికి చమురు అంటకుండా సాగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఒపెక్‌ ప్లస్ దేశాల తాజా నిర్ణయం ఓ కీలక పరిణామం. దీని ప్రకారం ఒపెక్‌ ప్లస్ దేశాలు వచ్చే నెల నుంచి ఈ ఏడాది చివరి వరకు రోజుకు 10 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి తగ్గిస్తాయి. గత అక్టోబరులో నిర్ణయించిన రోజుకు 20 లక్షల బ్యారెళ్లకు ఇది అదనం. అంటే… మే నుంచి ఒపెక్‌ ప్లస్ దేశాలు సాధారణంగా చేసే ఉత్పత్తి కంటే రోజుక 30 లక్షల బ్యారెళ్లను తక్కువ చేస్తాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరా 3 నుంచి 4శాతం తక్కువగా అందుబాటులో ఉంటుందని అంచనా. ఫలితంగా చమురు డిమాండ్‌ పెరుగుతుంది.

ధరలు పెరుగుతాయి. దాని ప్రభావం గొలుసుకట్టుగా మిగిలిన అన్నింటిపైనా పడుతుంది.

ముడి చమురు ఉత్పతి, ఎగుమతి చేసే దేశాల కూటమిలో సౌదీ అరేబియా, రష్యాలు అత్యధిక ముడిచమురు ఉత్పత్తి చేస్తాయి. ఉక్రెయిన్‌పై దాడి చేసిందనే కారణంతో రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు భారీ ఆంక్షలు విధించాయి. ఇందులో భాగంగా రష్యా చమురు ఉత్పత్తులపై ధరను సైతం తక్కువగా నిర్ణయించి… అంతకంటే ఎక్కువకు అమ్మితే కొనేది లేదని ఐరోపా దేశాలు కట్టడిచేశాయి. తద్వారా చమురు ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా రష్యా ఆదాయం పొందకుండా దెబ్బతీయాలని చూశాయి. అదే సమయంలో… ఒపెక్‌ ప్లస్ దేశాలలోని తన మిత్రదేశం సౌదీ అరేబియాతో కలసి అమెరికా చమురు ధరలు పెరగకుండా జాగ్రత్త పడుతూ వస్తోంది. ఒకవేళ ముడి చమురు ధరలు పెరిగితే… అది తమ దేశంలోనూ ధరల పెంపుదలకు కారణమవుతుంది. ఫలితంగా ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీస్తుంది. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలున్న నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్‌ సౌదీని బుజ్జగిస్తూ వస్తున్నారు. కొద్దికాలం కిందట బైడెన్‌ సౌదీలో పర్యటించి వెళ్లారు కూడా.. ఒపెక్‌ ప్లస్ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గించవద్దని, ధరలు పెంచకుండా చూడాలని సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ను కోరి వెళ్లారు.

అమెరికా అధ్యక్షుడు ముందస్తుగా జాగ్రత్తపడినప్పటికీ.. బైడెన్‌ మాటల్ని పెడచెవిన పెడుతూ సౌదీ అరేబియా తాజాగా… ఒపెక్‌ ప్లస్ పేరుతో చమురు ఉత్పత్తిలో కోత పెడుతున్నట్లు ప్రకటించటం అమెరికాకు అనుకోని షాక్‌ ఇచ్చినట్లయింది. చైనాతో చర్చల తర్వాత సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకోవటం మరింత కీలకమైంది. చైనాతో సంబంధాలను పునరుద్ధరించుకుంటున్న సౌదీ… అమెరికాకు దూరమవుతోందనటానికి దీన్ని సంకేతంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పై రష్యా దాడిని కూడా సౌదీ అరేబియా ఖండించకపోవటం విస్మయానికి గురిచేస్తోంది. తద్వారా చమురు రాజకీయాల్లో అమెరికాను కాదని… రష్యా వర్గంలోకి సౌదీ చేరుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఒపెక్‌ ప్లస్ దేశాలు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు మద్దతుగా నిర్ణయాలు తీసుకుంటోందని అమెరికా ఇప్పటికే తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

రష్యా,చైనాలు కలసి అమెరికాను ఇరుకున పెట్టడానికి ఒపెక్‌ ప్లస్ దేశాల నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయనే సందేహం కూడా లేకపోలేదు.

పెట్రోలియం ఉత్పత్తి, ఎగుమతి చేసే దేశాలన్నీ కలసి 1960లో ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌గా ఏర్పడ్డాయి. ఇరాన్‌, ఇరాక్‌, కువైట్‌, సౌదీఅరేబియా, వెనెజువెలా దీని స్థాపక సభ్య దేశాలు. తర్వాత ఖతార్‌, ఇండోనేసియా, లిబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌,అల్జీరియా, నైజీరియా, ఈక్వెడార్‌, గాబన్‌, అంగోలా, ఈక్వటోరియల్‌ గినియా, కాంగోలు కూడా చేరాయి. ఆ తర్వాత ఈక్వెడార్‌, ఇండోనేసియా, ఖతార్‌లు ఇందులోంచి బయటకు వచ్చాయి. 2016లో మరో పది చమురు ఉత్పత్తి దేశాలు- రష్యా, అజర్‌బైజాన్‌, బహ్రెయిన్‌, బ్రూనై, కజఖ్‌స్థాన్‌, మలేసియా, మెక్సికో, ఒమన్‌, దక్షిణసూడాన్‌, సూడాన్‌లతో కలసి ఒపెక్‌ కాస్తా ఒపెక్‌ ప్లస్ గా రూపాంతరం చెందింది. ప్రపంచ ముడిచమురు సరఫరాలో 79శాతం ఈ ఒపెక్‌ ప్లస్ దేశాల చేతుల్లోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, సరఫరాలను నియంత్రిస్తూ… ధరలను ఈ కూటమి ప్రభావితం చేస్తుంటుంది.

ఒపెక్‌లోని మిగిలిన దేశాలను సంప్రదించకుండా సౌదీ, రష్యాలు కలసి ఈ కోత నిర్ణయం తీసుకున్నాయని అమెరికా మీడియా వెల్లడించింది. ఉత్పత్తిలో కోత కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతాయి. అది మిగిలిన ఒపెక్‌ సభ్య దేశాలతో పాటు ఎక్కువగా ఉత్పత్తి చేసే సౌదీ, రష్యాలకు భారీ లాభం చేకూరుస్తుంది. విజన్‌ 2030 అంటూ పెట్టుబడుల ప్రాజెక్టు చేపట్టిన సౌదీ ప్రభుత్వం అందుకు కావల్సిన నిధులను సమకూర్చుకోవటానికి దీన్నీ ఓ సాధనంగా వాడుకుంటోందని భావిస్తున్నారు. మరోవైపు… ఆంక్షల నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న రష్యా తన చమురు రిజర్వ్‌లను పెంచుకోవటానికి ఇది ఉపయోగపడుతుందంటున్నారు. ఈ చమురు రాజకీయంలో రష్యాను చక్రబంధంలో ఇరికించాలని చూస్తున్న నాటో దేశాలు చివరకు తామే ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తున్నాయి. ముడిచమురు ధరలు పెరిగితే అమెరికాలో ప్రజల నిత్యావసరాలపై ప్రభావం పడుతుంది.

ఇప్పటికే అమెరికా బ్యాంకింగ్‌ రంగం సంక్షోభం అంచున్న ఉందని వార్తలు వస్తున్న వేళ… బైడెన్‌ సర్కారుకు ఇది అనుకోని దెబ్బ. అందుకే ఒపెక్‌ తాజా నిర్ణయంపై అమెరికా తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసింది. ”ప్రస్తుత ప్రపంచ మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తిని తగ్గించాలన్న ఒపెక్‌ నిర్ణయం ఏమాత్రం సబబు కాదు. మా దేశంలో ధరలు పెరగకుండా జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అని అమెరికా జాతీయ భద్రతమండలి ప్రతినిధి వాట్సన్‌ స్పందించారు. తమ దేశంలో చమురు ఉత్పత్తుల ధరలు పెరగకుండా ఉండాలంటే… అమెరికా తన షేల్‌ చమురు నిల్వలను విడుదల చేయాల్సి రావొచ్చు అని అభిప్రాయపడ్డారు.. గతేడాది రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంతో ఒక్కసారిగా ముడిచమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి.. ఆ తర్వాత క్రమంగా తగ్గుకుంటూ ఇటీవల బ్యారెల్ ముడిచమురు 70 డాలర్ల దిగువకు చేరింది. అయితే ఇప్పుడు మళ్లీ బ్యారెల్ చమురు 2023 డిసెంబర్ కల్లా 95 డాలర్లకు చేరుకుంటుందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది. ప్రస్తుతం అయితే 10 డాలర్ల వరకు పెరగొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక చమురు దిగుమతిలో మూడో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్.. చమురు, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు 70 శాతానికిపైగ పైగా ఒపెక్, దాని అనుబంధ దేశాలపైనే ఆధారపడుతోంది. దీంతో ఇప్పుడు ఒపెక్దేశాలు ఉత్పత్తిని తగ్గిస్తే భారత్‌ చేసుకునే దిగుమతులపై ప్రభావం పడుతుంది. మన డిమాండ్‌కు తగినంతగా అందకపోవచ్చు. తద్వారా రేట్లు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే భారత దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు రికార్డు స్థాయిలోనే ఉన్నాయి… తాజా పరిస్థితులతో ధరలు మరింతగా పెరిగే ఛాన్స్ఉండటంతో మరో కొత్త ఆందోళన మొదలైంది.

మే నెల నుంచి ఈ ఏఢాది చివరి వరకు ముడిచమురు ఉత్పత్తిలో కోత విధించాలని ఒపెక్ ప్లస్ దేశాలు తీసుకున్న నిర్ణయంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. న్యూయార్క్ మర్కంటైల్ఎక్స్ఛేంజీలో యూఎస్ బెంచ్ మార్క్ క్రూడాయిల్ ధరలు 5.6 శాతం అంటే బ్యారెల్ కు 4.24 డాలర్లు పెరిగి 79.91 డాలర్లకు చేరాయి. గత అక్టోబర్ లో ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గించగా.. ఇప్పుడు మరోసారి అదే నిర్ణయం తీసుకోవడం అమెరికాకు ఆగ్రహం తెప్పించింది.. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర 5.4 శాతం ఎగబాకింది. అంటే బ్యారెల్ కు 4.35 డాలర్లు పెరిగి 84.24 డాలర్లకు చేరింది.. చమురు ఉత్పత్తిలో కోత విధిస్తామనే ప్రకటన అంతర్జాతీయ మార్కెట్ లో తక్షణం చమురు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఫలితంగా గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయన్న అంచనాలతో ఇంధన ధరలు భారంగా మారిన అనేక దేశాలకు మరో సమస్యను తెచ్చిపెట్టాయి. ఈ అధిక చమురు ధరలు…ద్రవ్యోల్భణాన్ని నియంత్రించడానికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకిగా మారతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు మార్కెట్లో స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఉత్పత్తిలో కోతలు విధిస్తున్నట్లు ఒపెక్ దేశాలు ప్రకటించాయి..

క్రూడాయిల్ ధరలు తగ్గించడం ద్వారా రష్యా ఎకానమీపై దెబ్బ కొట్టాలని యూఎస్ ఆశిస్తోంది. కానీ..చమురు ఉత్పత్తి, ఎగుమతి చేసే దేశాలలో కీలకమైన సౌదీ అరేబియా.. అగ్రరాజ్యం అమెరికాకు
వ్యతిరేకంగా రష్యా, చైనాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం బైడెన్ సర్కార్ కు షాక్ ఇచ్చినట్లయింది..

Must Read

spot_img