మీకు తెలుసా..మనకు చాలా కాలంగా తెలిసిన ఓ దేశంలో ప్రజలు పన్నులు కట్టనవసరం లేదు.. విద్య, వైద్యం పూర్తిగా ఉచితం..ఆ దేశంపై కరోనా మహమ్మారి అయినా ఉక్రెయిన్-రష్యా యుద్ధమైనా..ఏదీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అసలు ఆ దేశం దేనికి కూడా తొణకని బెణకని ఆర్థిక వ్యవస్థతో ఉంది. ఆసియాలోని ఈ చిన్నదేశం పేరు ‘బ్రూనే..’ ప్రపంచంలోని ఎన్నో దేశాలు కరోనా మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో అల్లకల్లోలమయ్యాయి. దేశాలకు సంబంధించిన రుణాలు భారీగా పెరిగిపోయాయి. కానీ, బ్రూనైలో మాత్రం పరిస్థితులన్ని అదుపులో ఉన్నాయి.
కరోనా మహమ్మారిని తట్టుకునేందుకు చాలా దేశాలు తమ వ్యయాలు భారీగా పెంచాయి. ఎందుకంటే ఈ అనుకోని ఖర్చులను తట్టుకునేందుకు ఆ దేశాల వద్ద ముందస్తు బడ్జెట్‌లు లేవు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 తీవ్ర ప్రభావాన్ని చూపింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ధరలు భారీగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం కరోనా మహమ్మారి. ఇన్ని సవాళ్లున్నప్పటికీ, బ్రూనైలో ఎలాంటి సమస్య రాలేదు. ఆ దేశ జీడీపీలో రుణం కేవలం 1.9 శాతమే ఉంది. ప్రపంచంలో అత్యంత తక్కువ రుణమున్న దేశం బ్రూనైదే. అయితే తక్కువ రుణం-జీడీపీ రేషియో ఉండటమనేది ప్రతిసారి ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను సూచించదు.
చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో రుణం-జీడీపీ రేషియో తక్కువగానే ఉంటుంది. అంటే వాటి రుణం, సంపద సృష్టి రెండూ తక్కువగానే ఉంటాయి. అయితే, దీంతో బ్రూనైకి సంబంధం లేదు. ఎందుకంటే, ఈ చిన్న దేశం ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన జీవన ప్రమాణాలను కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా ఉంది. దీనంతటికీ కారణం ఆ దేశంలో లభిస్తోన్న ఆయిల్, గ్యాస్ నిల్వలే. అందుకే ప్రపంచంలో నాలుగవ ధనిక దేశంగా బ్రూనై నిలుస్తోంది. బ్రూనై పెట్రో నిల్వలు పుష్కలంగా ఉన్న దేశం. జీడీపీలో క్రూడాయిల్, సహజ వాయువుల ఉత్పత్తి సుమారు 90 శాతంగా ఉంటుంది.
2017 చివరి నాటికి బ్రూనై దేశంలో 1,100 మిలియన్ బ్యారళ్ల ఆయిల్ నిల్వలున్నాయి. అలాగే గ్యాస్ నిల్వలు 2.6 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉన్నాయి. ఆగ్నేయ ఆసియాలోని బ్రూనియో ద్వీపంలో ఉత్తర తీరంలో ఈ దేశం ఉంది. మలేసియా, ఇండోనేసియా దేశాల సరిహద్దులను ఇది పంచుకుంటోంది. ఈ దేశాన్ని పాలిస్తున్న సుల్తాన్ హసానల్ బోల్కియో, ఆయన రాయల్ కుటుంబ సభ్యుల వద్ద అపారమైన సంపద ఉంది. ఈ దేశంలో ప్రజలు ఆదాయపు పన్నులను చెల్లించనక్కర్లేదు. ప్రభుత్వమే యూనివర్సిటీ వరకు ఉచితంగా విద్యను అందిస్తోంది. వైద్య సౌకర్యాలు కూడా ఉచితమే.
దీని రాజధాని బందర్ సెరీ బెగవాన్ చాలా సురక్షితంగా, శుభ్రంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని సందర్శించిన చాలా మంది పర్యాటకులు చెప్పారు. ప్రజల్లో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న సుల్తాన్, పలు ప్రభుత్వ పథకాల కింద ఆ దేశంలోని ప్రజలకు తరచూ భూమి పట్టాలను, ఇళ్ల స్థలాలను అందిస్తుంటారు. జనాభా పరంగా ఇది చాలా చిన్న దేశం. మొత్తంగా ఐదు లక్షల మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఈ జనాభా కూడా దేశంలోని కొద్ది ప్రాంతంలోనే స్థిరపడింది. బ్రూనై రుణం ఇంత తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం, ఆ దేశం పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా ఆర్జించిన ఆదాయమనే చెప్పాలి. పుష్కలమైన ఆయిల్, గ్యాస్ నిల్వలతో పెద్ద మొత్తంలో ఆ దేశం నగదు నిల్వలను కూడా కలిగి ఉంది.
ఈ నగదుతోనే ఆ దేశం తనకున్న ద్రవ్య, వాణిజ్య లోట్లను భర్తీ చేసుకుంటూ.. అప్పును తక్కువగా తీసుకుంటోంది. బ్రూనై చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ. ఆసియాలో ఆయిల్, గ్యాస్ సరఫరా చేస్తోన్న దేశాలో ఇది చాలా ముఖ్యమైంది. ఆయిల్, గ్యాస్ ఎగుమతులతో ఆ దేశంలో కరెంట్ అకౌంట్ మిగులుతో ఉంది. ప్రపంచంలో అత్యంత తక్కువ అప్పులు తీసుకున్న ఏకైక దేశంగా బ్రూనై నిలుస్తోంది. బ్రూనైలోని బ్యాంకులు, ప్రభుత్వ ఖజనాలు పూర్తిగా పెట్రోలియం రెవెన్యూలతోనే నిండి ఉన్నాయి.
- ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న సమయంలో, బ్రూనై ఇంత నిశ్చితంగా ఉండటానికి ప్రధాన కారణమిదే..
ప్రపంచంలోని ఇతర దేశాలు తమ వ్యాపారాలను నిర్వహించడానికి అప్పులు చేస్తూ ఉంటాయి. కరోనా మహమ్మారి సమయంలో, చాలా దేశాలు ప్రైవేట్ లెండార్ల నుంచి అప్పులు తీసుకున్నాయి. అంతేకాక, ప్రభుత్వ రెవెన్యూలు పడిపోయి, వ్యయాలు భారీ ఎత్తున పెరిగాయి. బ్రూనై ఆర్థిక వ్యవస్థకున్న అనుకూలతలో ఒకటి.. ఆ దేశం చెల్లించాల్సిన మొత్తం తక్కువగా ఉండటంగా చెప్పుకోవచ్చు. అంతే కాదు..దాన్ని విదేశీ కరెన్సీలోనే చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరో మంచి విషయమేమిటంటే.. ప్రభుత్వం తన లాభాలన్నింటినీ స్వదేశంలోనే ఉంచుతుంది.
సమర్థవంతమైన ఆర్థిక విధానమనేది ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంటుంది. ఇది ఈ దేశంపై, దేశ ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి కారణమని చెబున్నారు విశ్లేషకులు. బ్రూనై కరెంట్ అకౌంట్ చాలా వరకు మిగులులోనే ఉంటుంది. ఇది విదేశీ రుణాలను తిరిగి చెల్లించడాన్ని సులభతరం చేస్తుంది. ఈ దేశంలో వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి. అయితే, ఇదంతా చూసి ఇంకేం.. బ్రూనైలో అంతా బాగున్నట్టే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే, ప్రపంచ దేశాలు ప్రస్తుతం కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం పెట్రో ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలనుకుంటున్నాయి.
దీంతో పెట్రో ఉత్పత్తుల ఆదాయాలపైనే ఎక్కువగా ఆధారపడ్డ బ్రూనే ఆర్థిక వ్యవస్థ, దాని నుంచి ఇతర ఆదాయ వనరులపై దృష్టిసారించాల్సి ఉంటుంది. పెట్రో ఉత్పత్తులపై ఆధారపడటానికి ముగింపు పలకాల్సి ఉంది. ఒకే ఉత్పత్తిపై ఆధారపడటం ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమే. గ్యాస్, ఆయిల్‌పై ఎక్కువగా ఆధారపడటం మారుతోన్న ఈ ప్రపంచంలో ప్రమాదకరమే. ఎందుకంటే ప్రపంచంలో ఇంధన వినియోగం ప్రస్తుతం మారుతోన్న దశలో ఉంది. అందుకే సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడంతో పాటుగా దేశంలో టూరిజాన్ని అపారంగా పెంచే చర్యలు చేపట్టింది.
బ్రూనై ఒకప్పుడు.. అంటే..1888లో బ్రిటీష్ నియంత్రణలో ఉండేది. 1929లో ఈ దేశంలో ఆయిల్ నిల్వల్ని కనుగొనడం జరిగింది. ఆ తర్వాత ఈ నిల్వల్ని వెలికితీయడం ప్రారంభించారు.1962లో ఈ దేశంలో నిరసనలు నెలకొన్నాయి. ఫెడరేషన్‌లో చేరేందుకు ఒప్పుకోని ఒకే ఒక్క మలేషియా దేశం బ్రూనై. దీంతో, బ్రూనై ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అయితే, ఈ దేశానికి పూర్తి స్వాతంత్య్రం మాత్రం 1984లోనే వచ్చింది. ఈ సమయంలో బ్రిటీషర్లు బ్రూనైను విడిచిపెట్టి వెళ్లిపోయారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, సుల్తాన్ హసనాల్ తనకు తానుగా ప్రధాన మంత్రిగా ప్రకటించుకున్నారు.
ఆ దేశంలో ‘మలయ్ ముస్లిం రాచరిక’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి, అనుసరిస్తున్నారు. ఈ విధానంలో, సుల్తాన్ ఇస్లాం రక్షకుడిగా వ్యవహరిస్తారు. 2014లో తూర్పు ఆసియాలో కఠినతరమైన ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తొలి దేశంగా బ్రూనై నిలిచింది. స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలనే చట్టాన్ని 2019లో ఆయన వెనక్కి తీసుకున్నారు. జార్జ్ క్లూనీ లాంటి సెలబ్రిటీల నుంచి ఒత్తిడి, విమర్శలు వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా అమలు చేస్తోన్న ఉరిశిక్షను కూడా అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత దాని అమలుపై మారటోరియం విధించారు.
అయితే బ్రూనై రాజు మాత్రం బాగా లావిష్ గా జీవిస్తుంటారు. ఈ సుల్తాన్ రూటే సెపరేటన్నట్టుగా లైఫ్ స్టైల్ ఉంటుంది. మీకు తెలుసా ఆయన ఒకసారి చేయించుకునే హెయిర్ కటింగ్ ఖరీదు 15 లక్షలు..సొంతంగా 7వేలకు పైగా లగ్జరీ కార్లున్నాయి. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరిగా రికార్డుల్లోకి చేరారు. ఈ ఘనత మాత్రం ఈయన సొంతం. నిజానికి 1980 వరకు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా ఈయన కొనసాగారు. తర్వాతి కాలంలో వ్యాపార దిగ్గజాలు భారీగా సంపద పోగేసుకోవడం మొదలుపెట్టాక, కొద్దిగా వెనుకబడ్డారు. అచ్చంగా బంగారు తాపడం చేయించిన రోల్స్‌రాయ్స్ కారును ఉపయోగిస్తారు. తనకు 300లకు పైగా ఫెరారీ, ఆరువందల రోల్స్‌రాయ్స్ కార్లు ఉంటాయి. ఈ సుల్తాన్‌గారికి సొంతగా బోయింగ్–747 విమానం కూడా ఉంది. సంపదను పోగు చేయడంలోనే కాదు, విలాసవంతంగా ఖర్చు చేయడంలోనూ బ్రునెయి సుల్తాన్ అభిరుచే వేరని అంటారు విశ్లేషకులు.