ఉన్నట్టుండి చైనా నుంచి శాంతి మంత్రాలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇరాన్ సౌదీ దేశాల మధ్య సయోధ్య కుదిర్చిన చైనా ఇప్పుడు ఉక్రెయిన్ వార్ పై ద్రుష్టిపెట్టింది. మొదటిసారిగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రికి ఫోన్ చేసారు చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్.. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుధ్దంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది..సాధ్యమైనంత త్వరగా యుధ్దానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని సూచించింది.
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను లేదా యుద్ధాన్ని చైనా ఇంతవరకూ ఎన్నడూ ఖండించలేదు. అలాగని రష్యా చర్యలను సమర్థించనూ లేదు. అయితే.. తాజాగా, చైనా విదేశాంగ మంత్రి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి, రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ సంక్షోభానికి చర్చలే పరిష్కారమని చైనా మంత్రి స్పష్టం చేసారు. ఇరు దేశాల మధ్య దాదాపు సంవత్సర కాలంగా కొనసాగుతున్న యుద్ధంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. సాధ్యమైనంత త్వరగా ఈ యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని సూచించింది.
ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో చైనా మొదటి నుంచి న్యాయబద్ధంగా వ్యవహరించిందని చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబాకు తెలిపారు. రెండు దేశాల మధ్య చర్చలు జరిగి శాంతి నెలకొనాలని, అందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలన్నది చైనా అభిమతమని క్విన్ గాంగ్ వివరించారు. కానీ లక్షమంది ఉక్రెయిన్ సైనికులు మరణించిన తరువాత చైనా ఫోన్ చేసి మరీ స్పందించడమే కాస్త అసహజంగా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
అయితే ఈ సందర్బంగా చైనా విదేశాంగ మంత్రికి తమ అధ్యక్షుడు జెలెన్ స్కీ శాంతి ఫార్మూలాను వివరించానని, అది ఆచరణాత్మక ఫార్మూలా అని తెలిపానని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా వెల్లడించారు. రష్యా ఆక్రమణకు ముగింపు పలికి, ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే, జెలెన్ స్కీ ఫార్మూలాను అమలు చేయడమొక్కటే మార్గమని స్పష్టం చేశానన్నారు. యుద్ధం ప్రారంభమైన దాదాపు సంవత్సరం తరువాత చైనా ఉక్రెయిన్ కు ఫోన్ చేయడంపై అంతర్జాతీయ సమాజంలో ఆసక్తి నెలకొంది.
రష్యా తమకు అత్యంత సన్నిహిత మిత్ర దేశమైనా.. ఉక్రెయిన్, రష్యా యుద్ధం లో భారత్ బహిరంగంగా రష్యాకు మద్దతు తెలపలేదు. ఇది యుద్ధాల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే కాలం కాదని భారత ప్రధాని మోదీ ఇప్పటికే నిర్ద్వంద్వంగా ప్రకటించారు. కానీ, చైనా మాత్రం రష్యాతో తమది అవధులు లేని స్నేహమని 2022లో స్పష్టం చేసింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఇప్పటివరకు ఖండించలేదు. రష్యాపై యూరోప్ దేశాలు, నాటో ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు, అనూహ్యంగా ఉక్రెయిన్ కు చైనా ఫోన్ చేయడం వెనుక పుతిన్ పన్నుతున్న వ్యూహమేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు ప్రపంచాన్ని తాము చూసే విధానంలో మార్పులు సహజంగా వస్తుంటాయని షీ జిన్ పింగ్ ఇటీవలి తన ప్రసంగంలో వెల్లడించారు.
ఉక్రెయిన్ యుద్దానికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా యుద్దవిరమణకు చైనా పిలుపునిచ్చింది. ఇరు దేశాలు యుధ్ధం విరమించేలా 12 పాయింట్ల సమగ్ర నివేదిక ఇచ్చింది చైనా. యుద్దం ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేసిందనీ, వేలాదిగా అమాయకులు సైనికులు మరణించారనీ మిలియన్ల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారని చైనా ఆ నివేదిక ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేసింది. అయితే పనిలోపనిగా తన శత్రుదేశమైన అగ్రరాజ్యం అమెరికాపై నిప్పులు చెరిగింది. యుద్దం తీవ్రత పెరిగేందుకు అమెరికా దాని మిత్రదేశాలు కూడా కారణమయ్యాయని విమర్షలు గుప్పించింది. అయితే తాము మాత్రం ఈ యుధ్దం తీవ్రతరం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపింది. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపింది. అంతేకాదు..ఆ 12 పాయింట్ల పొజిషన్ పేపర్ లో అణ్వాయుధాలను ఉపయోగించకూడదు,
అలాగే అణుయుధ్దాలను చేయకూడదనీ, బెదిరింపులకు పాల్పడకూడదని నివేదికలో తెలిపింది. చివరగా ఏ దేశమైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయన, జీవ ఆయుధాల పరిశోధన, అభివ్రుద్ది, వినియోగాన్ని వ్యతిరేకించాలని చైనా తన 12 పాయంట్ల నివేదికలో తెలిపింది. చైనా చేసిన ఈ ప్రతిపాదన పట్ల ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. ఇదొక శుభపరిణామమనీ, తమకు చెప్పినట్టుగానే రష్యాకు కూడా వివరించి యుధ్ధవిరమణ కోసం ఒత్తిడి తెస్తుందని ఆశిస్తున్నట్టు ఉక్రెయిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ చైనా ఆ పని మాత్రం చేయలేదు. యుధ్దం కారణంగా రష్యా చవకగా ఇస్తున్న చమురును మాత్రం నిరంతరాయంగా కొనుగోళ్లు చేసింది. మళ్లీ ఇప్పుడు విదేశాంగ మంత్రుల మధ్య ఫోన్ కాల్ రాయభారంతో ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది.