పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…ఈ పేరు వింటే ఏదో తెలియని వైబ్రేషన్ కలుగుతుంది. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో కెరీర్ ప్రారంభించిన పవన్ ఇప్పటి వరకూ…తిరుగులేని స్టార్ గా ఉన్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగప్రవేశం చేసి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆయన ట్రెండ్ ఫాలో అవ్వడు..ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. పవనిజం అనే మేనరిజంతో సినీ జగత్తును మెస్మరిజానికి గురి చేసి అవినీతిపై పోరాడే అస్త్రాలుగా అభిమానులను తీర్చిదిద్దుతున్న జనసేనాని సినీ రంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. తాను పుల్ లెన్త్ క్యారెక్టర్ లతో పాటు గెస్ట్ రోల్ లో అభిమానులకు దగ్గర అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి, సినిమాలో మొదట తెరపై కనిపించారు. తాజాగా తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన సినిమాలో కనిపించనున్నారు.
మూడు సినిమాల్లో పవన్ బిజీ..బిజీ..
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ మూడు చిత్రాల్లో నటిస్తు బిజీ బిజీగా ఉన్నారు. ఉత్తమ నంది అవార్డ్ గ్రహీత క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహర వీరమల్లు, సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ.. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న తమిళ హిట్ మూవీ తేరి రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ నటిస్తున్నారు. వీటితో పాటు పవన్ వినోదయ సీతమ్ అనే మరో తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. ఇటు సినిమాలతో పాటు అతిథి పాత్రలో నటించడం పట్ల ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరో పక్క అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మూవీలో కూడా పవన్ నటించబోతున్నట్లు సమాచారం. తమిళ్ రీమేక్ మూవీ గోపాల గోపాల చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుందని, పవన్ మరోసారి దేవుడిగా కనిపించనున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు ఆయన కేవలం 15 నుండి 20 రోజుల మాత్రమే డేట్స్ కేటాయించారట.
షూటింగ్ కు సిద్దమైన పవన్ రీమేక్ మూవీ
తాజాగా పవన్ తమిళ్ రీమేక్ మూవీలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటేల్స్ కూడా ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, రచయిత సముద్రఖని దర్శకత్వంలో 2021లో వచ్చిన వినోదయా సితం మూవీ సూపర్ హిట్ అయింది. చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ మూవీ ఎక్కువ వసూలు చేసింది. పూర్తి వినోదభరితమైన కంటెంట్ తో నడిచే కథను ఎంచుకుని తమిళ ప్రేక్షకులను అలరించాడు. అలాంటి ఈ సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ తో సముద్రఖని చేయనున్నాడు. ఇందులో పవన్ మేనల్లుడు సాయితేజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్టు నేడు షూటింగ్ కు సిద్దమైంది. అందుకు సంబంధించిన ఫొటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు మూవీని నిర్మిస్తున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నాడనే అనిపిస్తోంది. పవన్, సాయితేజ్ లకు సముద్రఖని స్క్రిప్ట్ చూపిస్తూ ఉండటం.. స్క్రిప్ట్ ను పవన్ పరిశీలిస్తూ ఉండటం .. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఈ ఫొటోల్లో కనిపిస్తోంది.
రీమేక్ లతో హిట్ కొడుతున్న పవర్ స్టార్…
పవన్ కళ్యాణ్ ఇటీవల రీమేక్ సినిమాల బాట పట్టారు. ఆయనకు రీమేక్ సినిమాలు బాగా కలిసి వస్తున్నాయని చెప్పవచ్చు. తన కెరీర్ మలుపుతిప్పిన సినిమాలన్నీ రీమేక్ లే. అయితే సినిమా ఏదైన పవన్ క్రేజ్ మాత్రం తగ్గటంలేదు. మొదట సినిమా కూడా రీమేక్ కావడం విశేషం. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి మూవీ హిందీలో అమీర్ ఖాన్ నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన గోకులంలో సీత సినిమా తమిళంలో కార్తిక్ హీరోగా నటించిన గోకులతిల్ సీతై సినిమాకు రీమేక్. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సుస్వాగతం మూవీ కూడా తమిళంలో విజయ్ నటించిన లవ్ టుడే సినిమాకి రీమేక్. ఇక తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపిన ఖుషీ సినిమా కూడా తమిళ రీమేక్. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ కంటే తెలుగులోనే సూపర్ హిట్ అయింది. విజయ్ నటించిన తిరుపాచి మూవీని కూడా అన్నవరం పేరుతో రీమేక్ చేశారు. హిందీలో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించిన లవ్ ఆజ్ కల్ చిత్రాన్ని తీన్ మార్ పేరుతో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కించారు. హరీష్ శంకర్ దర్శకతంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ నుంచి రీమేక్ చేశారు. ఇక మల్టీ స్టార్ సినిమా గోపాల గోపాల మూవీ కూడా హిందీ సినిమా ఓ మై గాడ్ నుంచి రీమేక్ చేయగా అందులో విక్టరి వెంకటేశ్, పవన్ నటించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం మూవీలో అజిత్ తమిళంలో యాక్ట్ చేయగా తెలుగులో కాటమరాయుడిగా పవన్ నటించారు. బిబ్ బీ అమితాబ్ నటించిన పింక్ మూవీని మార్పులు చేర్పులతో తెలుగులో వకీల్ సాబ్ గా తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమా భీమ్లానాయక్ కూడా రీమేక్ సినిమా కావడం.. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టింది కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులకి నాంది పలికింది. తాజాగా సెట్ మీదకు వెళ్తున్న తమిళ్ వినోదయా సితం మూవీపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ పవన్ అభిమానులు మాత్రం రీమేక్ మూవీలు చెయోద్దంటూ నెట్టింట తమ అసహనాన్ని తెలుపుతున్నారు. దీనికి పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.