Homeఅంతర్జాతీయంచేతిలో డాలర్లున్నా ఖర్చు చేయలేని స్థితిలో ఎందుకు వచ్చింది…?

చేతిలో డాలర్లున్నా ఖర్చు చేయలేని స్థితిలో ఎందుకు వచ్చింది…?

మూలిగే నక్క మీద తాటి పడినట్లు ఉంది పాకిస్థాన్ పరిస్థితి. మరి కొద్ది నెలల్లో పాకిస్తాన్ 30 బిలియన్ డాలర్లను విదేశాలకు చెల్లించాల్సి ఉంది. గడువు దగ్గర పడుతున్న కొద్దీ అప్పులు తీర్చలేక దేశం దివాలా తీస్తుందనే భయాలు పెరుగుతున్నాయి. కానీ దివాలా తీసే పరిస్థితి రాదని పాకిస్తాన్ చెబుతోంది.

దాయాది దేశం పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మరో శ్రీలంకలా తయారయ్యేందుకు సిద్ధంగా ఉంది పాకిస్తాన్. దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టేక్కేందుకు పాక్ సర్కార్ నానా కష్టాలు పడుతోంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉంది. ప్రభుత్వ వాహనాలకు ఇంధనాన్ని రేషన్ ఇవ్వడంతో పాటు అధికారిక ప్రయాణాలపై ఆంక్షలు విధించబోతోంది. లీవ్ క్యాష్ మెంట్ నిలిపివేయడంతో పాటు మెడికల్ బిల్లల చెల్లింపులు, అలవెన్స్ లను తొలగించడం వంటి చర్యలను తీసుకోబోతోంది.

ఈ అప్పులను ఎలా తీర్చగలుగుతుంది? పాకిస్తాన్ దివాలా అంచున ఉన్నట్లేనా?

గత ఎనిమిది నెలలుగా పాకిస్తాన్‌లో అస్థిరత రాజ్యమేలుతోంది. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న దేశాన్ని పోయిన ఏడాది వచ్చిన వరదలు మరింత దెబ్బతీశాయి. పెట్టుబడులు తగ్గిపోయాయి. ఆర్థికలోటు పెరిగిపోతోంది. పాకిస్తాన్ రూపాయి అంతకంతకూ క్షీణిస్తూ పోతోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌కు ఏ అంతర్జాతీయ సంస్థ నుంచి ఆర్థిక సాయం అందడం లేదు. విదేశీ మారకపు నిధులు వేగంగా అడుగంటుతున్నాయి. మరి కొద్ది నెలల్లో పాకిస్తాన్ 30 బిలియన్ డాలర్లను విదేశాలకు చెల్లించాల్సి ఉంది. గడువు దగ్గర పడుతున్న కొద్దీ అప్పులు తీర్చలేక దేశం దివాలా తీస్తుందనే భయాలు పెరుగుతున్నాయి. కానీ దివాలా తీసే పరిస్థితి రాదని పాకిస్తాన్ చెబుతోంది. కొందరు రాజకీయ లబ్ధి కోసం దేశం దివాలా తీస్తుందని ప్రచారం చేస్తున్నారు అంటూ పాకిస్తాన్ ఆర్థికశాఖ మంత్రి ఇషాక్ దర్ అన్నారు. విదేశీ మారకపు నిధులు ఆరు బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్న పాకిస్తాన్, ఈ అప్పులను ఎలా తీర్చగలుగుతుంది.

అయితే పాకిస్తాన్ దివాలా తీసే అవకాశాలు తక్కువని ఆర్థికరంగ నిపుణుడు డాక్టర్ సాజిద్ ఆమిన్ అన్నారు. 70ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు పాకిస్తాన్ ఒక్కసారి కూడా దివాలా తీయలేదు. గతంలో చాలా సార్లు ఇప్పటి కంటే తక్కువ విదేశీ మారకపు నిల్వలను పాకిస్తాన్ చూసింది. అప్పులను రెన్యూవల్ చేస్తారు. రుణాలు తీర్చే గడువును పెంచుతారని సాజిద్ తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటుందనే దీమాతో పాకిస్తాన్ ఉందని సాజిద్ అభిప్రాయపడ్డారు.

ఐఎంఎఫ్‌తోపాటు ఇతర మిత్రదేశాల నుంచి కూడా సాయం అందొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే ఐఎంఎఫ్ కేంద్రంగా పాకిస్తాన్ రాజకీయాలు చేయడం మంచిది కాదని సాజిద్ అన్నారు. గతంలో కూడా ఇలాగే రాజకీయాలు చేసింది. ఇప్పుడు అదే చేస్తోంది. ఐఎంఎఫ్‌ను సాయం అడగాల్సిన పరిస్థితులు ఉంటే వెళ్లి అడగాలి. అంతే కానీ పుకార్లకు చోటు ఇవ్వకూడదని ఆయన సూచించారు. పాకిస్తాన్ అనే పేషెంట్‌కు ఊపిరి పోసే డాక్టరే ఐఎంఎఫ్ అని పాకిస్తాన్ ఆర్థికశాఖ మాజీ ప్రతినిధి డాక్టర్ ఖాకన్ నజీబ్ అన్నారు. పాకిస్తాన్ దివాలా తీయకుండా ప్రపంచంలో ఐఎంఎఫ్ మాత్రమే కాపాడగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

గత ఏడాది నవంబరులో జరగాల్సిన ఐఎంఫ్ ప్రోగ్రాం సమీక్ష రెండు నెలలపాటు వాయిదా పడింది. ఆ సమీక్ష జరిగితే నిధులు రావడం మొదలవుతుందని నజీబ్ తెలిపారు. రాబోయే ఆరు నెలల పాటు ఐఎంఎఫ్ ప్రోగ్రాం చాలా కీలక మైనది. ఐఎంఎఫ్‌ సమీక్షకు సంబంధించిన సమస్యలను పాకిస్తాన్ విజయవంతంగా పరిష్కరించుకోగలిగితే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్‌లోకి నిధులు వస్తాయి. కరెన్సీ మార్కెట్స్, క్రెడిట్ మార్కెట్స్‌లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తాయని నజీబ్ అన్నారు. ఐఎంఎఫ్ నుంచి తాము ఏం కోరుకుంటున్నారో పాకిస్తాన్ పాలకులకు స్పష్టత ఉండాలి. వరదలతో కలిగిన భారీ నష్టం తరువాత దేశాభివృద్ధి ఎలా ఉంటుంది? ఈ విషయం గురించి ఐఎంఎఫ్‌కు స్పష్టంగా పాకిస్తాన్ చెప్పగలగాలి అని నజీబ్ అన్నారు.

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దిగుమతులు తగ్గించి ,ఎగుమతులు పెంచుకోవడం, ఫారిన్ ఎక్స్ఛేంజ్ రిసిప్ట్స్ వంటి వాటి ద్వారా పరిస్థితిని కాస్త మెరుగుపరచుకోవచ్చు. కానీ ఇంత తక్కువ సమయంలో అది సాధ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఉన్నందున ఎగుమతులు పెంచుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం విదేశీ పెట్టుబడులు రావడం లేదని సాజిద్ వివరించారు. అప్పులు తీర్చడానికి లేదా దిగుమతి చేసుకునే వస్తువులకు చెల్లింపులు చేయడానికి దేశాలు విదేశీ మారకపు నిల్వలను ఉపయోగిస్తుంటాయి. పాకిస్తాన్ విషయంలో డాలర్లు ఎక్కువగా మిత్ర దేశాల నుంచి వస్తున్నాయి. కానీ ఆ మిత్ర దేశాలు ఇచ్చే డాలర్లతో పాకిస్తాన్ అప్పులు తీర్చడానికి లేదు. వస్తువులు కొనకూడదు. మరి వాటి వల్ల ఉపయోగం ఏమిటి?. పాకిస్తాన్ కరెన్సీ విలువ పడిపోకుండా చూసేందుకు మిత్రదేశాలు ఆ డాలర్లను ఇచ్చాయి. పాకిస్తాన్ వద్ద ఒక్క డాలర్ కూడా లేకపోతే దాని కరెన్సీ అయిన రూపాయి చాలా ఒత్తిడికి లోనవుతుంది. రూపాయి విలువ పడిపోతే మార్కెట్‌లో దాని మీద నమ్మకం పోతుంది. ఈ పరిస్థితి రాకుండా చూసేందుకు మిత్ర దేశాలు బిలియన్ డాలర్లను పాకిస్తాన్ వద్ద ఉంచుతున్నాయి. ఆ డాలర్లను చూసి ఐఎంఎఫ్ వంటి సంస్థలు మరింత సాయం చేస్తాయని పాకిస్తాన్ భావిస్తోందని సాజిద్ వివరించారు.

ఇదిలా ఉంటే..ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ ప్రభుత్వం.. అందిన ప్రతీ ఒక్క వనరును సద్వినియోగం చేసుకుంటుంది. ఇప్పటికే ప్రభుత్వ అధికారుల వాహనాల్లో కోత విధించిన ప్రభుత్వం.. పలు బహుమతులను కూడా విక్రయించింది. సౌదీ అరేబియా నుంచి ఆశించినంత ఆర్థిక సాయం అందలేదు. దాంతో ప్రభుత్వ ఖజానా నిండుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్తులను అమ్ముకునేందుకు సిద్ధపడింది. అమెరికాలోని ఎంబసీ కార్యాలయం ఆస్తులను పాకిస్తాన్‌ అమ్మకానికి పెట్టింది. వాషింగ్టన్‌లోని దేశ రాయబార కార్యాలయంలోని రక్షణ విభాగం ఉన్న భవనాన్ని పాకిస్తాన్‌ అమ్మకానికి పెట్టగా.. మూడు బిడ్లు అందాయి. వీటిలో అత్యధికంగా 6.8 మిలియన్‌ డాలర్లకు బిడ్‌ దాఖలైంది. ఈ బిడ్‌ను జెవీష్‌ గ్రూప్‌ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ భవనంలో ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించాలని జెవీష్‌ భావిస్తున్నట్లు వాషింగ్టన్‌లోని దౌత్య వర్గాలను ఉటంకిస్తూ డాన్‌ వార్తాపత్రిక కథనాన్ని ప్రచురించింది.

కాగా 5 మిలియన్‌ డాలర్ల బిడ్‌ను భారతీయ రియల్టర్‌ ఒకరు దాఖలు చేయగా.. 4 మిలియన్‌ డాలర్ల బిడ్‌ పాకిస్తాన్‌ రియల్టర్‌ నుంచి వచ్చింది. ఇలా ఉండగా, వాషింగ్టన్‌లోని పాక్‌ మూడు దౌత్య ఆస్తుల్లో ఒకటి అయిన ప్రతిష్ఠాత్మక ఆర్‌ స్ట్రీట్‌ ఎన్‌డబ్ల్యూ లోని భవనం కూడా ఉన్నట్లుగా దౌత్య కార్యాలయం వర్గాలు తెలిపాయని డాన్‌ పత్రిక పేర్కొన్నది. ఇలా ఉండగా, పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ అధ్యక్షతన ఇటివల జరిగిన సమావేశంలో న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్‌ హోటల్‌ స్థలాన్ని లీజుకు ఇవ్వడానికి ఆర్థిక సలహాదారును నియమించాలని ప్రైవేటీకరణ కమిషన్‌ను ప్రైవేటీకరణపై పాక్‌ క్యాబినెట్‌ కమిటీ సూచించింది. వాషింగ్టన్‌లోని ఎంబసీ అధికారులు ఈ భవనం విలువను అంచనా వేసేందుకు మదింపుదారుని సంప్రదిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ హోటల్‌ను అమ్మేందుకు పాకిస్తాన్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇక మరోవైపు పాకిస్థాన్‌ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ప్రజలకు కనీసం వంట గ్యాస్‌ కూడా సరఫరా చేయలేని దయనీయ స్థితిలోకి దిగజారిపోతోంది. ఎల్‌పీజీ గ్యాస్‌ను ఇనుప సిలిండర్లకు బదులు పాలథీన్‌ కవర్లలో వంట గ్యాస్‌ నింపి సరఫరా చేస్తోంది. అత్యంత ప్రమాదకరమైన పద్ధతుల్లో గ్యాస్‌ సరఫరా చేస్తోంది ఆ దేశ ప్రభుత్వం. దీంతో పాక్‌ ప్రజల జీవనం దినదిన గండంగా మారిపోతోంది. ప్లాస్టిక్‌ కవర్లలో గ్యాస్‌ వినియోగించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఒకరకంగా ఇంట్లో బాంబ్‌ పెట్టుకున్నట్లే. ఇదంతా తెలిసినా వేరే గత్యంతరం లేక పాక్‌ ప్రజలు వాటినే వాడుతున్నారు. అర్ధిక కష్టాలతో ప్రజలు…ప్రభుత్వం తీవ్ర ఇబ్బంది పడుతుంది. గత పాలకులు చేసిన తప్పుల వల్లే… అర్ధిక పరిస్థితి ఇలా అయిందని ప్రస్తుత పాలకులు చెప్తున్నారు. ఏది ఏమైనా… విదేశీ మారకపు నిధులు ఆరు బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్న పాకిస్తాన్….ఈ అప్పులను ఎలా తీర్చగలుగుతుంది..? పాకిస్థాన్ ఎవరు అప్పు ఇస్తారు…? అనేది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.పాకిస్థాన్ మంత్రి ఎన్ని చెప్పిన పాకిస్తాన్ దివాలా అంచున ఉన్నది వాస్తవమని దేశ, విదేశ అర్ధిక నిపుణులు చెప్పున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో…

Must Read

spot_img