అయిదు సంవత్సరాలలో ఏడుగురు ఆర్థిక మంత్రులు పాకిస్తాన్ దేశాన్ని సమస్యల నుంచి బయటపడేయ లేకపోయారు. పాలకుల అసమర్థ పాలన కారణంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దాయాది దేశం దిక్కుతోచని స్థతిలో ఉండిపోతోంది. అటు అప్పులు దొరకక ప్రభుత్వం సతమతమవుతుంటే.. ఇటు అధిక ధరల భారాన్ని మోయలేక ప్రజలు అల్లాడిపోతున్నారు.
‘పరిస్థితులను మారుస్తాం’ అంటూ.. గత 5ఏళ్లల్లో ఏడుగురు ఆర్థిక మంత్రులు మారిపోయారు. కానీ అక్కడి ఆర్థిక సంక్షోభం రోజురోజుకు మరింత దారుణంగా తయారువుతోంది!మంత్రులు వస్తున్నారు..తమకు చాతకాక వెళుతున్నారు. పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని షెహ్బాజ్ షరీఫ్.. గత ఏడాది అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇద్దరు ఆర్థికమంత్రులు మారారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న ఇషక్ ధార్.. ఇస్మాయల్ స్థానాన్ని 2022 సెప్టెంబర్‌లో భర్తీ చేశారు. ఇక 2018 ఏప్రిల్‌లో.. మిఫ్తాహ్ ఇస్మాయల్ పాక్ ఆర్థిక మంత్రిగా ప్రమాణం చేశారు. కానీ రెండు నెలలకే ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో.. అదే ఏడాది జూన్‌లో షంషద్ అక్తర్ బాధ్యతలు స్వీకరించారు. అయినా పాక్‌లో పరిస్థితులు మారలేదు. పైగా.. అదే ఏడాదిలో మూడోసారి ఆర్థిక మంత్రిని మార్చింది అప్పటి ప్రభుత్వం.

అసద్ ఉమర్.. ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పిటవరకు మరో నలుగురు ఆర్థిక మంత్రులు మారిపోయారు. ప్రతిసారి.. కొత్త ఆర్థిక మంత్రి రావడం, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించడం, కానీ వారి చర్యలతో అది ఇంకా దారుణంగా తయారవ్వడం జరుగుతూనే ఉంది. గత ఐదేళ్లుగా పాకిస్థాన్‌లో ఇదే జరుగుతోంది. ఫలితంగా గత వారం పాక్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 41.45శాతాన్ని తాకింది. లీటరు పెట్రోల్ ధర 272 రూ.లని తాకింది. ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి ‘ఐఎంఎఫ్’ని ప్రసన్నం చేసుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటివరకు జరిగిన చర్చలు పెద్దగా ఫలితాల్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ డీల్‌కు తగ్గట్టుగా.. పలు ఆర్థిక అంశాలను మార్చేందుకు పాకిస్థాన్ నిర్ణయించింది.
ఎక్సైజ్ సుంకాలు, సేల్స్ ట్యాక్స్ వంటి వాటిని అమాంతం పెంచేసింది. అక్కడి కేంద్ర బ్యాంక్.. వడ్డీ రేట్లను 2శాతం పెంచింది. మార్చ్ 16న జరగనున్న సమావేశంలో మరోమారు వడ్డీ రేట్ల పెంపు అవకాశం ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే.. కష్టకాలంలో పాకిస్థాన్‌కు ఇరాన్, చైనా, ఉజ్బెకిస్థాన్‌లు మద్దతునిస్తున్నాయి. చైనా.. ఇప్పటికే 700 మిలియన్ డాలర్ల నిధులు అప్పుగా ఇచ్చింది. ఇక ఉజ్బెకిస్థాన్.. 1 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఇరాన్ సైతం ట్రేడ్ పరంగా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా ఆ సహాయాలు సమయానికి అందినప్పుడే ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు నిపుణులు. రోజురోజుకూ దిగజారుతున్న ఆర్థిక సంక్షోభం దెబ్బతో పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా మారింది.

ఇంతవరకు ఆకలితో ప్రజలు తల్లడిల్లగా.. ఇప్పడు ఔషధాల కొరతతో రోగులు విలవిల్లాడుతున్నారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు తరిగిపోవటంతో.. మందులు, తయారీకి ఉపయోగించే ముడి సరుకుల దిగుమతులు నిలిచిపోయాయి. ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు నిలిచిపోవడమే కాకుండా ఉద్యోగాలు పోయే ప్రమాదం నెలకొందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ లో ప్రస్తుతం జ్వరం మాత్రలు, దగ్గు మాత్రలు కూడా దొరకడం లేదు. దేశీయంగా ఉత్పత్తి జరిగే మందులకు ముడి పదార్థాలు విదేశాల నుంచి రావాల్సి ఉంది. వచ్చిన వాటిని విడిపించుకునేందుకు విదేశీ మారక ద్రవ్యం అవసరమవుతుంది. పాకిస్తాన్ వద్ద సదరు నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో మందులకు కొరత ఏర్పడింది. ఆపరేషన్లు చేయాలంటే కావలసిన అనస్థటిక్ మందులు కూడా లేకుండా పోవడంతో ఆందోళన మొదలైంది.
ద్రవ్వోల్బణం కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. గోధుమల కొరత కారణంగా పిండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పిండి సరఫరా సరిపడా లేకపోవటంతో గోధుమ పిండికోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మాంసం, పాలు, నూనె, కూరగాయలతో పాటు ఇతర ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగడంతో ప్రజలుతీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ దేశంలోని వేలాది కుటుంబాలు పస్తులుంటున్న పరిస్థితి నెలకొంది. పాక్ విదేశీ మారక దవ్ర్య నిల్వలు 2014 సంవత్సరం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. ఆ దేశంలో మూడు వారాల పాటు దిగుమతులకు సరిపడా విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి.పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి రుణం తీసుకున్నా అవి ఏ మూలకూ సరిపోయేలా కనిపించడం లేదు.