అప్పుల సుడిగుండంలో కూరుకుపోయిన దాయాది దేశం దివాలా తీసిందనే వార్తలు వస్తున్నాయి. అణ్వాయుధ దేశంగా చెప్పుకునే పాకిస్తాన్ అప్పుల కోసం ఇతర దేశాలను అడుక్కోవడం, సిగ్గుగా ఉందని ఏకంగా ఆ దేశం ప్రధాని షాబాజ్ షరీఫే అంటున్నారు.
ఇంతకీ పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది..?
పాకిస్థాన్ దేశంలో ఆహార సంక్షోభం తారా స్థాయికి చేరుకుంది. దీంతో ఆ దేశ ప్రజలకు పూట గడవడం గగనంగా మారింది. ఫలితంగా పాక్ ప్రజలు తిండి కోసం అల్లాడిపోతున్నారు. గోధుమ పిండి లోడుతో వెళుతున్న ట్రక్‌ను వందలాది మంది ప్రజలు వెంటబడే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలకు తెగించి ఆ ట్రక్కు వెనుకభాగంలో ఎక్కడం వీడియోలో కనిపిస్తుంది. ఇది ఆ దేశంలో నెలకొన్న ఆహార సంక్షోభానికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను ప్రొఫెసర్ సజ్జద్ రాజా షేర్ చేశారు. ఇది బైక్ ర్యాలీ కాదు. గోధుమ పిండి కోసం పాక్ ప్రజలు పడుతున్న కష్టాలకు ఇది నిదర్శనమన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు. పాకిస్థాన్‌తో భవిష్యత్ ఉందని ఇప్పటికీ భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.
కాగా, పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం రోజురోజుకు ముదురుతుండడంతో భద్రతా దళాల పర్యవేక్షణలో గోధుమ పిండిని పంపిణీ చేస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం రాయితీపై అందించే గోధుమ పిండి కోసం ఖైబర్ ఫక్తుంఖ్వా, సింధ్, బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి క్యూల్లో నిల్చుంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పాకిస్థాన్‌లో అత్యధిక శాతం మంది ప్రజలు గోధుమపిండినే ఆహారంగా ఉపయోగిస్తారు. కాగా, పాకిస్థాన్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడంతో అది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. మరోవైపు, పాక్‌లో విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటాయి. ఈ నేపథ్యంలో పాక్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలను చేస్తోంది..
అయితే న్యూక్లియర్ పవర్ ఉన్న పాకిస్థాన్ డబ్బుల కోసం విదేశాల దగ్గర చేయి చాచడం సిగ్గుగా ఉందని ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ అన్నారు. శనివారం జరిగిన పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ వేడుకకి ముఖ్య అతిథిగా షరీఫ్ హాజరై మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు అప్పులు చేయడం సరైన పరిష్కారం కాదని, తీసుకున్న రుణాలను తిరిగి తీర్చక తప్పదని ఆయన తెలిపారు. ఇటీవల తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయాద్ వంద కోట్ల డాలర్లు అప్పుగా ప్రకటించారని షరీఫ్ చెప్పారు. ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అంతేకాదు విద్యుత్ ఆదా చేయడం కోసం రాత్రిపూట తొందరగా షాపులు మూసేయాలని పాక్ ప్రభుత్వం ప్రజలను కోరడం సంచలనంగా మారింది.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఇప్పటికే డిపాల్టర్‌గా మారిందని, దివాలా తీసిందనే వార్తలు వస్తున్నాయి. కరెంట్ అకౌంట్, ద్రవ్య లోటును పరిశీలిస్తే దేశం దివాలా తీసిందనడానికి సాక్షంగా చెబుతున్నారు. పాకిస్థాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 4.5 బిలియన్ డాలర్లు మాత్రమే మిగిలాయి. అందులో 3 బిలియన్లను బయటకు తీయడానికి వీలు లేకుండా సౌదీ అరేబియా ఆంక్షలు విధించింది. వాటిని కేవలం చూపించడానికి మాత్రమే పనికివస్తాయి. పాకిస్తానీ రూపాయి బలహీనపడి రికార్డు స్థాయిలో పతనమైంది. డాలరుతో పోల్చితే పాకిస్తాన్ రూపాయి విలువ 285 పాకిస్తాన్ రూ.లకి చేరుకుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇప్పుడు అన్ని ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఎందుకంటే ఆదాయంలో 40 శాతాన్ని పాక్ కేవలం వడ్డీ చెల్లించడానికే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అసలు పాకిస్తాన్ లో ఆదాయం అన్నదే లేనంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తోటి ఇస్లాం దేశాలు పాకిస్తాన్ ను కష్టకాలంలో ఆదుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడూ అంతే..పాకిస్తాన్ కఠోరా పట్టుకుని బెగ్గింగ్ కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నట్టు చెబుతున్నారు. సౌదీ అరేబియా ప్రిన్స్ ఎంబీఎస్ పాకిస్తాన కు సాయం చేసే మార్గాలను అన్వేషిస్తుండగా యూఏఈ ఏకంగా మరో బిలియన్ డాలర్ల సాయానికి అంగీకరించింది. తనకు చెల్లించాల్సిన పాత అప్పుల వసూళ్లను కొన్నాళ్ల వరకు పట్టించుకోమని చెబుతూ పాకిస్తాన్ కు ఉపశమనం కలిగించేలా వ్యాఖ్యలు చేసింది. ఈ సారికి ఏదో రకంగా ఈ పరిస్థితి నుంచి బయటపడుతుంది. కానీ ఇంకెంత కాలం ఈ అడ్డుక్కు తిని బతకడం అంటూ ప్రశ్నిస్తున్నారు దేశ ప్రజలు..