Homeఅంతర్జాతీయంఆర్థిక సంక్షోభంలో మగ్గుతున్నా... మారని పాకిస్థాన్ వక్రబుద్ధి

ఆర్థిక సంక్షోభంలో మగ్గుతున్నా… మారని పాకిస్థాన్ వక్రబుద్ధి

ఓ వైపు ఆర్థిక సంక్షోభం.. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో పాక్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. పాక్ లోని ప్రజలు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఇక చేసేదేమీ లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు.పాక్ సంక్షోభం సామాన్య ప్రజలను ఇరకాటంలో పడేసింది.. బ్రతుకు భారమై పూట గడపడం కోసం ఎన్నో వెతలు పడుతున్నారు పాక్ ప్రజలు.. ఓ వైపు కరెంట్ కోతలు.. మరోవైపు ఆకాశాన్నంటిని పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల జీవనం ధిక్కుతోచని స్థితిలో పడిపోయింది..

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌లో నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడంతో.. అక్కడి ప్రజల బ్రతుకు భారమవుతోంది.. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారం రోజులుగా నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. అనేక నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. క్రమంగా ఆర్థిక సంక్షోభంలోకి పీకల్లోతు కూరుకుపోతున్న దాయాదీ దేశం పాకిస్థాన్ ముంగిట ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి.. పాక్‌లో ధరల పెరుగుదల ప్రారంభమైంది. అంతలోనే వాయవ్య పాకిస్థాన్‌లో వరదలు..

తహ్రీక్ తాలిబాన్ పాకిస్థాన్ఉగ్రవాదుల దాడులు.. తాజాగా ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు పాక్‌ను కోలుకోలేకుండా చేస్తున్నాయి. విదేశీ నిల్వలు కరిగిపోతూ.. అంతర్జాతీయంగా అప్పుపుట్టక, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ షరతులకు తలొగ్గుతోంది.ఇప్పుడు ఆ దేశం పెట్రో కొరత ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో రుణాలు తీసుకుంటూ శ్రీలంక కొంతమేర ఆర్థికంగా పుంజుకుంటున్నా.. పాకిస్తాన్‌ మాత్రం ఆ దేశం నుంచి ఇంకా గుణపాఠాలు నేర్చుకోకపోవడం శోచనీయం. పాకిస్తాన్‌ ఆర్థిక మాంద్యం నుంచి పుంజుకోవడానికి రుణాలను తీసుకున్నా..

వాటిని తిరిగి చెల్లించలేక అవస్థలు పడుతోంది. దాదాపు ప్రపంచంలోనే రుణ ఎగవేతకు దగ్గరలో ఉన్న అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో పాకిస్తాన్‌ ఐదో దేశంగా నిలవనుందని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్‌ లో ద్రవ్యోల్బణం 48 ఏళ్ల గరిష్టానికి చేరింది. దీంతో అక్కడి ప్రజల జీవనం కష్టతరమౌతోంది. ఇక గతేడాది వరదల ప్రభావం అక్కడి ప్రజల పైనా, ఆర్థిక వ్యవస్థపైనా ఇప్పటికీ కొనసాగుతోంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఈ వారంలో పాక్‌ ప్రభుత్వం ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ నుండి 6.5 బిలియన్‌ డాలర్ల రుణం కోసం ప్రయత్నించినప్పటికీ… ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాదిలో జరగబోయే నేషనల్‌ అసెంబ్లీ ఎన్నికలు గందరగోళంగా మారే అవకాశముందని ఊహాగానాలు మొదలయ్యాయి.. గతంలో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ కానీ, ఇప్పుడున్న షెహబాజ్‌ షరీఫ్‌లు కానీ పాక్‌ అభివృద్ధి దిశగా ప్రయత్నాలు చేయకపోవడం ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారని ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ఆర్థికంగానూ, రాజకీయంగానే కాదు.. అక్కడ ఉగ్రవాదం కూడా పెచ్చరిల్లడం ఆ దేశాభివృద్ధికి పెను సమస్యగా దాపురించింది. ఇటీవల పెషావర్‌ నగరంలోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడివల్ల దాదాపు 100 మందికిపైగా మృతి చెందారు.

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అక్కడి ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయని పరిశీలించగా… విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.. ‘పెరుగుతున్న ధరల ద్రవ్యోల్బణం వల్ల స్థానిక వ్యాపారాలు బాగాదెబ్బతిన్నాయి. ఈ శీతాకాలంలో రెస్టారెంట్‌లో సీ ఫుడ్స్‌ 50 శాతం మేర విక్రయాలు తగ్గాయి. ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి కస్టమర్లు సీ ఫుడ్‌కి దూరంగా ఉంటున్నారు. ఇక ‘ప్రభుత్వం గత నెలలో పెట్రోల్‌ ధర పెంచింది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర 262గా ఉంది. దీంతో ప్రయాణీకులు.. తమ ప్రయాణలను తగ్గించుకుంటున్నారు.

లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.200 ఉన్నప్పుడు.. ఒక్కో బంకులలో సుమారుగా 15 వేల లీటర్ల పెట్రోల్‌ని విక్రయించగా.. ప్రస్తుతం రూ. 250కి పైగా ఉండడంతో రోజుకు13 వేల లీటర్లే అమ్ముతున్నారు.. ఒక్కోరోజు అంతకంటే తక్కువగా విక్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థం అవుతోంది.. ప్రస్తుతం పార్కో పాకిస్తాన్‌ లిమిటెడ్‌ పెట్రోల్‌ బంక్‌లు ఖాళీగా ఉంటున్నాయి..చాలా మంది పాకిస్తానీయులు రోజువారీ అవసరాల కోసం అప్పులు చేస్తున్నారు. గత రెండేళ్లలో కూలీల రేట్లు బాగా పెరిగిపోయాయి. వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగాయి. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు..

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచినా.. అవసరాలకు సరిపడా నిల్వలు లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పుడు పాక్ మరో శ్రీలంకలా మారుతోంది. చాలా ప్రావిన్సుల్లో పెట్రోల్ దొరకడం లేదు. బంకులు ఖాళీ అయ్యాయి. అరకొర స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరారు. నెలరోజులుగా పంజాబ్ ప్రావిన్స్‌లో సరఫరా నిలిచిపోగా.. ఒకట్రెండు రోజుల్లో లాహోర్ , ఫైసలాబాద్ ,గుజ్రన్‌వాలా వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొననుంది. డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్‌ రూపాయి మారక విలువ రికార్డు స్థాయిలో కనిష్ఠానికి పడిపోయింది. ఓ దశలో డాలరుతో పోలిస్తే.. 263 పాకిస్థానీ రూపాయలకు విలువలు పడిపోయాయి. దాంతో.. ఆటోమేటిక్‌గా పాక్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల విలువ పడిపోతుంది.

పాకిస్థాన్‌ దిగుమతుల్లో సింహభాగం చమురుదే.. అయితే.. గడిచిన రెండు నెలలుగా పాకిస్థాన్ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన పీఎస్‌వో, ఎల్ఎన్‌జీ లిమిటెడ్‌ లు కొనుగోళ్ల కోసం టెండర్లు పిలవలేదు. పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో.. చమురుకు ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి రావడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక అప్పటికే ఆర్డరిచ్చిన చమురు ఓడలు కూడా సముద్రం మధ్యలోనే ఆగిపోయినట్లు వారం క్రితం వార్తలొచ్చాయి.

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్‌ లలో ఆలస్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదే కారణంతో పలు పెట్రోల్ కార్గోలురద్దయినట్లు సమాచారం. దీంతో.. ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న నిల్వలే దేశ ప్రజల అవసరాలకు సరిపెట్టాలి. లేకుంటే.. మరో వారం రోజుల్లో పెట్రోల్ కొరత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఇస్లామాబాద్‌ లోనూ పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

పాక్ ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం.. ప్రతి నెల ఆ దేశానికి 4.3 మెట్రిక్ టన్నుల పెట్రోల్, 2 లక్షల టన్నుల డీజిల్, ఆరున్నర లక్షల టన్నుల క్రూడాయిల్ అవసరం ఉంటుంది. వీటి విలువ 1.3 బిలియన్ డాలర్లు. పాకిస్థాన్ 2021 డిసెంబరులో 6 లక్షల టన్నుల పెట్రోల్‌ ను దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతులు గత ఏడాది డిసెంబరులో 2.2 లక్షల టన్నులకు పడిపోయాయి. ఈ కారణంగానే పాక్ ప్రభుత్వం వినియోగాన్ని తగ్గించే ఉద్దేశంతో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.

పెట్రో దెబ్బతో పాకిస్థాన్‌ లోని విద్యుత్తు వ్యవస్థ కూడా ఢమాల్ అయ్యే ప్రమాదముందని విశ్లేషకులుఅంచనా వేస్తున్నారు. అందుకు కారణం.. దేశ వార్షిక విద్యుత్తు వినియోగంలో మూడోవంతు ఉత్పత్తి దిగుమతి చేసుకునే సహజ వాయువుతోనే జరుగుతుంది. ఇప్పుడు పాకిస్థానీ రూపాయి రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోవడంతో.. దిగుమతుల కోసం భారీ చెల్లింపులు చేయలేక.. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మిన్నకుంటున్నాయని తెలుస్తోంది.

ఇక చమురు సరఫరా దేశాలు కూడా.. సంక్షోభాల్లో ఉన్న దేశాలకు సరఫరా చేయడంలో వెనకాముందు ఆలోచిస్తాయి. ఈ కారణంగా.. ఇప్పుడు శ్రీలంక, పాకిస్థాన్‌లకు చమురు సరఫరా చేసేందుకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చమురు కొరతతో పాటు.. మరికొన్ని కారణాలు ఆ దేశ విద్యుత్తు వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గత సోమవారం పాకిస్థాన్ వ్యాప్తంగా నేషనల్ గ్రిడ్ సమస్యలతో సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయి. సింహభాగం పాకిస్థాన్ అంధకారంలో కూరుకుపోయింది. గ్రిడ్ సమస్య తీరినా.. కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్ , రావల్పిండి వంటి నగరాల్లోనూ విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. శ్రీలంకలో ఇంధన సంక్షోభం నెలకొన్న సమయంలో భారత్ ఆదుకుంది. ఇప్పుడు పాకిస్థాన్ అదే స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో.. పాక్‌ను మిత్రదేశాలైన చైనా , గల్ఫ్ దేశాలు ఆదుకుంటాయా…? సమస్య నుంచి పాక్ గట్టెక్కుతుందా..? లేదా మరింతగా సమస్యల్లో కూరుకుపోతుందా? వేచి చూడాల్సిందే..

పాకిస్తాన్.. ఇప్పుడు దయనీయ స్థితిలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.. అప్పు కోసం పాక్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రజల జీవనం అస్తవ్యస్థంగా మారింది.. పాక్ ప్రభుత్వం వైఫల్యంపై ప్రజలు రోడ్లపైకి చేరి నిరసనలు చేపడుతున్నారు.

Must Read

spot_img