ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి గురించి తెలియని వారెవరూ ఉండరు..ఆర్థికంగా దారుణంగా చితికిపోయి నానా కష్టాలు పడుతున్నారు అక్కడి ప్రజలు. అయితే ఇన్నాళ్లూ సైన్యం పరిస్థితి చాలా బాగుందన్న విషయం కూడా నిజం కాదని తాజా వార్తతో తేలిపోయింది. మీకు తెలుసా.. సైనికులకు రోజుకు రెండు సార్లు కూడా తిండిపెట్టలేకపోతున్నారట.. మరి సరైన విధంగా తినకపోతే డ్యూటీలెలా చేస్తారు.?? డ్యూటీలు సరిగా చేయనట్టైతే ఉగ్రదాడులను ఎలా ఎదుర్కుంటారు..?
అవును అందుకేనేమో ప్రస్తుతం సరైన తిండి తినని పాకిస్తాన్ ఆర్మీ నీరసంతో కనిపిస్తోంది. అందుకేనేమో ప్రస్తుతం పాకిస్తాన్ దేశవ్యాప్తంగా టీటీపీ ఉగ్రవాదులు నేరుగా సైన్యంపైనే గురిపెడుతున్నారు. ఏకంగా మిలిటరీ బ్యారక్ లలో ప్రవేశిస్తూ మెషిన్ గన్ కు పనిచెబుతున్నారు. అసలే సరైన తిండి లేదేమో నీరసపడిపోతూ ఉగ్రముష్కరులతో పోటీ పడలేకపోతున్నారు పాకిస్తాన్ సైనికులు. నిజానికి పాకిస్తాన్ బడ్జెట్ లో అధికశాతం ఆర్మీకే కేటాయిస్తుంటారు. మరి అది సరిపోలేదా లేక అసలు బడ్జెటే లేకుండా పోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే.. సైనికులకు రెండుసార్లు సరిగా తిండి పెట్టలేక పోతున్నాము..దయచేసి గమనించాలంటూ పాకిస్తాన్ ఆర్మీచీఫ్ కు కమాండర్లు లేఖలు వ్రాస్తున్నారు. ఇక ఆర్మీ చీఫ్ స్పెషల్ డ్యూటీ కింద దేశానికి సాయం కోసం విదేశీ టూర్లు చేస్తున్నారు.
మొత్తానికి వీరూ వారని కాకుండా పాకిస్తాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం సైన్యంపై కూడా ప్రభావం చూపిస్తోంది. సైనికుల ఆహార సరఫరా గొలుసును కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఫీల్డ్ కమాండర్ల నుండి కొన్ని లేఖలు రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్వార్టర్ మాస్టర్ జనరల్ కార్యాలయానికి అందాయి. అన్ని ఆర్మీ మెస్‌లలో సైనికులకు ఆహార సరఫరాలో కోత విధించడాన్ని సూచించాయి. టాప్ మిలిటరీ కమాండర్లు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో ఆహార సరఫరా సమస్యలకు సంబంధించిన ఆందోళనలను కూడా లేవనెత్తారు. దేశంలో భద్రతా పరిస్థితి మరియు కొనసాగుతున్న సైనిక కార్యకలాపాల గురించి ఆయనకు వివరించారు.పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు ప్రత్యేక నిధులలో కోత కారణంగా సైనికులకు “రెండు సార్లు సరిగ్గా” ఆహారం ఇవ్వలేకపోతన్నామని రాసారు.
మేము ఇప్పటికే సైనికుల ఆహార నిధిని తగ్గించామని వారు తెలిపారు. ఆఫ్ఘన్ సరిహద్దు వెంబడి తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం మరియు దాని పారామిలటరీ దళాలు దేశవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలలో సరిహద్దుల్లో నిమగ్నమై ఉన్నాయి. లాజిస్టిక్స్ సామాగ్రిలో మరిన్ని కోతలను భరించే స్థితిలో ఇకపై సైన్యం ఉండబోవడం లేదు. అది తమ కార్యకలాపాలను ఆపివేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు. సైనికులకు ఎక్కువ ఆహారం మరియు ప్రత్యేక నిధులు అవసరమని మిలిటరీ ఆపరేషన్స్ డిజి చెప్పారు.సైన్యానికి అత్యవసర ప్రాతిపదికన రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఆహార సరఫరాలు మరియు నిధులతో సహా అన్ని డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్మీ చీఫ్ మునీర్ ఆదేశించారు.
పాకిస్తాన్ బడ్జెట్ 2022-23 ప్రకారం, రక్షణ వ్యయం కోసం 1.52 ట్రిలియన్ల పాకిస్తానీ రూ.లుగా అంటే దాదాపు 7.5 బిలియన్ డాలర్లుగా కేటాయించబడ్డాయి, ఇది మొత్తం ప్రస్తుత వ్యయంలో 17.5% వరకు ఉంటుంది మరియు ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 11.16% ఎక్కువ సగటున, పాకిస్తాన్ సైన్యం ఏటా ఒక సైనికుడికి 13 వేల400 డాలర్లు ఖర్చు చేస్తుంది. థియేటర్ల నుండి రియల్ ఎస్టేట్ వరకు దాదాపు అన్ని డొమైన్లలో పాకిస్తానీ సైన్యం దాని పౌర ఆర్థిక ప్రాజెక్టులలో గణనీయమైన వాటాను లాగేసుకుంటోంది. పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ నిర్వహిస్తున్న సైనిక వాణిజ్య ప్రాజెక్టుల విలువ దాదాపు 26.5 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. అవును మీకు తెలుసా పాకిస్తాన్ లోని సైన్యం వ్యాపారాలు కూడా చేస్తోంది. పెట్రోల్ అమ్మకాలతో పాటు వస్తూత్పత్తి పనులు చేస్తున్నారు. అయితే ఆ సంపాదన అంతంత మాత్రమేనని చెప్పాలి.
ఐఎంఎఫ్ షరతుల మేరకు విదేశీ మిషన్ల సంఖ్యను తగ్గించాలని, వారి కార్యాలయాలు మరియు సిబ్బందిని 15 శాతం తగ్గించుకోవాలని, ఖర్చులను 15 శాతం తగ్గించుకోవాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసారు. నానాటికీ పెరుగుతున్న అప్పులు, ప్రపంచ ద్రవ్యోల్బణం రాజకీయ అస్థిరతలను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ చాలా ఇబ్బందులు పడుతోంది. ఈ నేపధ్యంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ త్వరలో పొదుపు చర్యలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. పొదుపు చర్యలలో సంకోచ ఆర్థిక విధానాలు, ప్రభుత్వ వ్యయంలో కోతలు, ఎంపిక చేసిన పన్ను పెంపుదల, పెన్షన్ సంస్కరణలు మరియు కార్మిక రక్షణలో తగ్గింపులు ఉంటాయి. అందుకే ఇకపై సైన్యం ఇష్టారాజ్యంగా ఉందామంటే వీలు లేదని షెహబాజ్ షరీఫ్ చెప్పకనే చెప్పేసారని అంటున్నారు నిపుణులు.