ఏదో రకంగా వెంటనే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు షెహబాజ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే అరెస్టును తప్పించుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. తోష్‌ఖానా కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు లాహోర్‌లోని ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మొహరించాయి.
ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ నియాజీపై దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 80 కేసుల వరకు నమోదై ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, మహిళా మేజిస్ట్రేట్‌ను బెదిరించారనే ఆరోపణలపై నమోదైన కేసులో జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్‌ను ఇస్లామాబాద్ కోర్టు మంగళవారం సస్పెండ్ చేసింది. అయితే తోష్‌ఖానా అవినీతి కేసులో జారీ అయిన అరెస్ట్ వారంట్లు మాత్రం ఇంకా అమల్లో ఉన్నాయి. తోష్‌ఖానా అంటే ఖజానా అని అర్థం. ఇది పాకిస్థాన్ ప్రభుత్వ శాఖ. కేబినెట్ డివిజన్ పర్యవేక్షణలో ఇది పని చేస్తోంది. పాకిస్థాన్ నేతలు, అధికారులకు విదేశాల నుంచి వచ్చే బహుమతులను దీనిలో ఉంచుతారు. బహుమతి విలువ 30వేల రూ.ల కన్నా తక్కువగా ఉంటే, పాకిస్థాన్ అధ్యక్షుడు లేదా ప్రధాన మంత్రి దానిని తన వద్ద ఉంచుకోవచ్చు.
ఇంత కన్నా ఎక్కువ ఖరీదైన బహుమతులు వస్తే మాత్రం తోష్‌ఖానాలోనే ఉంచాలి. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో ఖరీదైన బహుమతులను తోష్‌ఖానాకు అప్పగించలేదని ఆరోపణలు నమోదయ్యాయి. దీనిపై ఆయన మీద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పాకిస్థానీ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రజలను రెచ్చగొడుతూ ప్రసంగిస్తున్నారు. పాకిస్తాన్ ను కాపాడుకోవాలనీ, తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనీ, దీనిని అడ్డుకోవాలంటూ ముడిపెడుతున్నారు. దాంతో ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున పీటీఐ పార్టీ కార్యకర్తలు, ప్రజలు చేరుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేస్తే సహించబోమని చెబుతున్నారు. ఒక దశలో పోలీసులకు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
లాహోర్‌లోని జమన్ పార్కు నివాసానికి మంగళవారం భారీసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని దారులన్నీ కంటైనర్లు అడ్డుపెట్టి మూసివేసారు. ఆపై ఇమ్రాన్ ఇంటిని ముట్టడించారు. పోలీసుల చర్యలను ప్రతిఘటించడానికి ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు సైతం పెద్దసంఖ్యలో అక్కడికి చొచ్చుకొని వచ్చారు. పీటీఐ కార్యకర్తలను చెదరగొట్టేందుకు బాష్పవాయువు, జల ఫిరంగులను పోలీసులు ఉపయోగించారు. ప్రతిగా కార్యకర్తలు పోలీసుల పైకి రాళ్లు, ఇటుకలు విసిరారు. కర్రలతోనూ దాడికి దిగారు. ఈ పరస్పర దాడుల్లో కొంతమంది పోలీసు అధికారులు, పీటీఐ కార్యకర్తలు గాయపడ్డారు. అయితే మరోవైపు ”నా అరెస్టుతో దేశం ప్రశాంతంగా నిద్రపోతుందని వాళ్లు భావిస్తున్నారు. ఇది తప్పని మీరు నిరూపించాలంటూ జనాన్ని రెచ్చగొడుతున్నారు ఇమ్రాన్ ఖాన్..
తాను జైలుకు వెళ్లినా, తనను హత్య చేసినా ఇమ్రాన్ లేకపోయినా బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడగలం అని నిరూపించుకోవాలంటూ ప్రసంగాలు చేస్తున్నారు ఇమ్రాన్ ఖాన్. ఆ భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఈ యుద్ధం మీ కోసమే చేస్తున్నా” అంటూ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు. ఆ సమయంలో పీటీఐ శ్రేణులు చేసిన దాడిలో ఇస్లామాబాద్ డీఐజీకి గాయాలయ్యాయి. ఇమ్రాన్ ఇంటివైపు వచ్చే అన్ని దారులనూ మూసివేశారు. అయితే, ఏ కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసేందుకు వచ్చారనే విషయంలో మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదని స్థానిక మీడియా తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తూ పీటీఐ నేత ఫరూక్ హబీబ్ ట్వీట్‌చేశారు. మరో నేత ఫవాద్‌చౌదరి మాట్లాడుతూ.. తోషఖానా కేసులో అరెస్టు వారెంట్లను ఛాలెంజ్ చేసినట్టు తెలిపారు.
త్వరలోనే ఈ కేసు విచారణకు వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, పాకిస్థాన్ అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ చీఫ్ ఆర్గనైజర్ మరియమ్ నవాజ్ షరిఫ్ మాట్లాడుతూ.. ఈరోజు ఎవరైనా పోలీసు అధికారి లేదా సిబ్బంది గాయపడితే.. అందుకు ఇమ్రాన్ ఖాన్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఇటీవల ట్రాన్స్‌మిషన్ లైన్ ఫెయిల్యూర్ కారణంగా పాక్ రాజధానితో పాటు ప్రధాన నగరాలు, ఇతర ప్రాంతాల్లో ఒక రోజు పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తాజాగా మరోసారి పాక్ విద్యుత్ వ్యవస్థ వైఫల్యం చెందింది. పాక్ వాణిజ్య నగరం, అతిపెద్ద నగరం అయిన కరాచీ తీవ్ర విద్యుత్ సమస్యలతో సతమతం అవుతోంది. కరాచీ నగరంలో 40 శాతం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.