Homeఅంతర్జాతీయంభారత్ ను కవ్విస్తున్న పాక్ ప్రధాని.. పక్కదారి పట్టించేందుకేనా? 

భారత్ ను కవ్విస్తున్న పాక్ ప్రధాని.. పక్కదారి పట్టించేందుకేనా? 

తినడానికి తిండి దొరకని పరిస్థితిలో సైతం పాకిస్తాన్ తన బుద్ది మార్చుకోలేకపోయింది. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మొన్నటికి మొన్న తమకు గతంలో జరిగిన మూడు యుధ్దాలతో గుణపాఠం నేర్చకున్నామని పనిగట్టుకుని సెలవిచ్చారు. ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ సైతం భారత్ పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించారు. ఇప్పుడు తాజాగా పీఓకేలో కశ్మీరు సంఘీభావ దినోత్సవం పేరుతో జరిగిన సమావేశంలో అడ్డంగా యూటర్న్ తీసుకున్నారు. ఇంతకీ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

మొన్నటికి మొన్నే తమకు బుద్ధి వచ్చిందని, భారత్‌తో ఇకపై సత్సంబంధాలు కొనసాగించాలని అనుకుంటున్నామని పాక్ ప్రధాని షెబాజ్ షెరీఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ, ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా భారత్‌పై బెదిరింపులకు దిగారు. ”పాకిస్తాన్ వద్ద అణ్వాయుధం ఉంది. కాబట్టి, భారత్ తమపై డేగకన్ను వేయలేదు. ఒకవేళ డేగకన్ను వేస్తే.. భారత్‌ని తన పాదాల కింద నలిపేసే శక్తి పాకిస్తాన్‌కి ఉంది” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ‘పీవోకే’లో పర్యటించిన ఆయన.. ఆ సమయంలోనే ఇలాంటి వ్యాక్యలు చేసారు. కొన్నిసార్లు ఈయన హావభావాలు చూస్తే ప్రధానికి తక్కువ కమేడియన్ కు ఎక్కువ అన్నట్టుగా ఉంటాయి. ఎక్కడి పాట అక్కడే పాడటం చేస్తూ చులకనవుతున్నారు.

అంతేకాదు.. కశ్మీర్ ఇష్యూని షెబాజ్ మరోమారు తెరమీదకి తీసుకొచ్చారు. కశ్మీరులకు స్వేచ్ఛ దక్కాలంటే.. ఆర్థిక, రాజకీయ స్థిరత్వం పొందాలని పిలుపునిచ్చారు. అందుకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందనీ..కశ్మీరీలు కోరితే రాజకీయ, దౌత్య, నైతిక సాయం అందిస్తామని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. అణచివేతకు గురైన కశ్మీరి సోదరులు, సోదరీమణులకు పాకిస్థాన్ మొత్తం అచంచలమైన సంఘీభావాన్ని, మద్దతును తెలియజేసేందుకు కలిసి వస్తోందని ట్వీట్ చేశారు. భారత్ నుంచి విముక్తి పొందాలన్న కలను సాకారం చేసుకునేందుకు కశ్మీరి ప్రజలు అవిశ్రాంతంగా పోరాడుతున్నారని, తమ త్యాగాల ద్వారా స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించారని అన్నాడు. కశ్మీరి ప్రజల కలలు త్వరలోనే సాకారమవుతాయని చెబుతూ.. తమ వక్రబుద్ధిని చాటుకున్నారు షెహబాజ్.

అయితే.. జనవరి ప్రారంభంలో దుబాయ్‌కి చెందిన ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని షెబాజ్ అన్నారు. ”భారత్‌తో మూడుసార్లు యుద్ధం చేశాకే మేము మా గుణపాఠం నేర్చుకున్నాం. మా సమస్యలను పరిష్కరించుకోగలిగితే, భారత్‌తో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాము” అని అన్నారు. కశ్మీర్ వంటి బర్నింగ్ పాయింట్స్‌పై ప్రధాని నరేంద్ర మోడీతో నిజాయితీగా చర్చలు జరపాలని ఉందని కూడా తెలిపారు. అనవసరంగా గొడవ పడుతూ.. సమయం, వనరుల్ని వృధా చేసుకోకూడదని అనుకుంటున్నామని.. చర్చల కోసం మోడీకి ఇదే తన సందేశమని అన్నారు. తీరా చూస్తే ఓ వారం కూడా తన మాట నిలుపుకోలేక పోయారు. మరి ఈ విధంగా మాట్లాడాలని సైన్యం తనకు సూచించిందా లేక తానే మాట్లాడారా అన్న అనుమానాలు వస్తున్నాయి.

ఇంతగా బీరాలు పోయే పాకిస్తాన్ ప్రధాని పాలన గురించి చూస్తే అంతబాగా ఏం లేదనే అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే దేశం నిండా దరిద్రం తాండవిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై చాలా ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ డిపాల్టర్‌గా మారిందని కొన్నిసార్లు, దివాలా తీసిందని మరికొన్నిసార్లు వార్తలు వస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్యం కేవలం మరో రెండు మూడు రోజులకు సరిపోతుందనే చెబుతున్నారు. జనాన్ని చూస్తే కిలో గోధుమ పిండిని 150 రూ.లకు కొందామన్నా దొరకడం లేదు. నేతల మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి. పాకిస్తాన్‌లో అంతా బాగానే ఉందని, అంతా సవ్యంగా సాగుతోందని ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ అవాస్తవమని అక్కడి మీడియా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను చూస్తే ఇట్టే తెలిసిపోతోంది.

ఓవైపు పాకిస్తానీ రూపాయి బలహీనపడి రికార్డు స్థాయికి పతనమైంది. డాలరుతో పోల్చితే పాకిస్తాన్ రూపాయి విలువ దాదాపు 250కి చేరుకుంది. అటు ఐఎంఎఫ్ బ్రుందం ఇంకా పాకిస్తాన్ లో నే ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేయాల్సిన పనులను లిస్టు రూపంలో ఇచ్చేసింది. వాటిని చూడగానే ఆయన నివ్వెరపోయారు. వారు చెప్పినవన్నీ చేస్తే మరోసారి అధికారంలోకి రావడం కలలో మాట అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే సైన్యానికి కేటాయించే బడ్జెట్ తగ్గింపు గురించి ఐఎంఎఫ్ ప్రత్యేకంగా అండర్ లైన్ చేసి మరీ చెబుతోంది. కానీ సైన్యం నియమించిన తోలుబొమ్మ లాంటి ప్రధాని ఇప్పుడు సైన్యానికి వ్యతిరేకంగా వ్యవహరించగలడా అన్నది అనుమానంగానే ఉంది. అయితే తాము చెప్పిన పనులన్నీ పూర్తి చేస్తే తప్ప లోన్ ఇవ్వమని ఐఎంఎఫ్ తెగేసి చెప్పిందని సమాచారం.

Must Read

spot_img