పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది దాయాది దేశం పాకిస్తాన్. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి ‘ఐఎంఎఫ్’ బెయిలౌట్ ప్యాకేజ్ కోసం తాత్కాలిక ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందంపై పాక్ మాజీ ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్ చికిత్సకు డిస్ప్రిన్ ను వాడతారా..? అంటూ మండిపడ్డారు. దీంతో ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిధ్ధం చేసిందని సమాచారం..
చూస్తుండగానే పాకిస్తాన్ కూడా శ్రీలంకలాగానే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఐఎంఎఫ్ బ్రుందం పది రోజుల పాటు పాకిస్తాన్ వ్యవహరాలపై స్టడీ చేసి రుణం గురించి ఎటూ తేల్చకుండానే వాషింగ్టన్ వెళ్లిపోయారు. వర్చువల్ గా పాకిస్తాన్ తో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. ఇదిలా ఉండగా ఐఎంఎఫ్ సూచించిన విధంగా దేశంలో నిత్యవసర వస్తువులపై విపరీతంగా పన్నుల భారం మోపేందుకు కూడా సిధ్దమైంది.
ఇది చూసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమరాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఐఎంఎఫ్ బెయిలవుట్ ప్యాకేజ్ కోసం ఇన్ని రకాలుగా సామాన్యులను హింసించడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు. అసలు రోగం ఒక్కటైతే దానికి సంబంధించిన మందులు వేరని ఆయన అన్నారు. క్యాన్సర్ చికిత్సకు డిస్ప్రిన్ ను వాడతారా..? అంటూ మండిపడ్డారు.
రుణాల భారంతో నానాటికి మునిగిపోతుండటం పాకిస్తాన్ ను పెను విపత్తులోకి నెడుతుందని.. ఐఎంఎఫ్ ఒప్పందం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుందని అన్నారు. బుధవారం తన జమాన్ పార్క్ నివాసం నుంచి టెలివిజన్ ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇన్ని షరతులకు అంగీకరించిన తరువాత కూడా ఐఎంఎఫ్ కన్విన్స్ కాకుండానే వెళ్లిపోయిందని ఆయన ఎద్దేవా చేసారు.
తనను రాజకీయాలకు దూరంగా ఉంచేందుకు పాకిస్తాన్ ను నాశనం చేయవద్దని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని.. శ్రీలంక వంటి గందరగోళ పరిస్థితుల్లో ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై గ్లోబల్ రేటింగ్ సంస్థ ఫిచ్ ఇచ్చిన రిపోర్టును ప్రస్తావిస్తూ పాక్ ప్రభుత్వాన్ని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.
పాక్ కరెన్సీకి ఇష్యూర్ డీఫాల్ట్ రేటింగ్ ను ‘CCC-‘ గా ఇచ్చింది. ఇది పాకిస్తాన్, శ్రీలంక పరిస్థితికి దిగజారడాన్ని సూచిస్తుంది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ‘CCC+’ రేటింగ్ లో ఉండేదని గుర్తు చేసారు. పాకిస్తాన్-ఐఎంఎఫ్ డీల్ లో భాగంగా ప్రజలపై మరిన్ని పన్నులు రుద్దేందుకు సర్కార్ మిని బడ్జెట్ ను బుధవారం తీసుకువచ్చింది. ఈ బడ్జెట్ మరో ద్రవ్యోల్భాణానికి దారి తీస్తుందని, ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్ డిఫాల్ట్ దిశగా ప్రయానిస్తుందని, ఐఎంఎఫ్ ఒప్పందం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడం, ప్రజలు ఆదేశించిన ప్రభుత్వం మాత్రమే కఠిన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ఈ స్థితి నుంచి బయటపడేయదని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కొన్న గంటలలోనే పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు.. లాహోర్‌లోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ‘పీటీఐ’ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇమ్రాన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, పీటీఐ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులకు వ్యతిరేకంగా పీటీఐ నేతలు నినాదాలు చేశారు. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ గతేడాది అక్టోబర్‌లో విదేశీ ప్రభుత్వాల నుంచి వచ్చే బహుమతులను పర్యవేక్షించే విభాగం తీరుపై పీటీఐ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
దీనిపై ఇమ్రాన్ సహా పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, ఈ కేసులో ఇమ్రాన్ అరెస్ట్ కావాల్సి ఉండగా.. గతేడాది నంబరులో వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఇమ్రాన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, ఈ కేసులో ఇమ్రాన్‌కు బెయిల్ ఇచ్చారు. ఈ కేసులో కోర్టు హాజరయ్యేందుకు కొంత సమయం ఇచ్చారు.
అయితే, కేసులో భాగంగా కోర్టులో హాజరు కాకుండా ఇమ్రాన్ జాప్యం చేయడంతో ఇమ్రాన్ బెయిల్‌ను రద్దు చేశారు. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు ‘ఏటీసీ’ న్యాయమూర్తి రజా జవాద్ అబ్బాస్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టు ఎదుట హాజరు కావడానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. కానీ ఆయన దీన్ని అలుసుగా తీసుకున్నారని ఫైర్ అయ్యారు. దీంతో, ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది.