Homeఅంతర్జాతీయంతాలిబన్ల చేతుల్లోకి పాకిస్తాన్..

తాలిబన్ల చేతుల్లోకి పాకిస్తాన్..

మూలిగే నక్కపై తాటికాయ పడితే ఎంత నొప్పిగా ఉంటుందో సరిగ్గా అలాగే తయారైంది మన పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి. ఎన్నో రకాలుగా ఎంతో కాలంగా పాకిస్తాన్ పాలకులు చేస్తున్న స్వయంక్రుతాపరాధాల కారణంగా ఇప్పుడు అక్కడి ప్రజలు శిక్షను అనుభవిస్తున్నారు. పాలకుల అవినీతి అక్రుత్యాల కారణంగా దేశం అలా దిగజారిపోయింది. చివరకు ఒక్క బిలియన్ డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్ ముందు సాగిలపడి వేడుకునే స్థితి ఏర్పడింది.

అందుకోసం దేశ ప్రజల బట్టలూడదీసేందుకు కూడా పాకిస్తాన్ సిద్దమైంది. నిత్యవసరాల ధరలను అపారంగా పెంచేయడంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. దివాలా తీయబోతోంది మరో రెండు వారాల వరకే విదేశీ మారక ద్రవ్యం ఉంది అంటూ చెబుతున్న మాటలు అబద్దాలని తేలింది. సాక్షాత్తూ పాకిస్తాన్ రక్షణ మంత్రి స్వయంగా ప్రకటించారు. ఏమనో తెలుసా.. పాకిస్తాన్ ఇప్పటికే దివాలా తీసిందని. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే నేతలు మాత్రం తమ విలాసాలకు లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికీ విదేశాలకు ప్రైవేటు విమానాలను ఉపయోగిస్తున్నారు. లక్షల విలువ చేసే సూట్లు ధరిస్తూ ఫైవ్ స్టార్ హోటళ్లలో వారాల తరబడి బస చేస్తున్నారు. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. పాకిస్తాన్. పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. కరెంటు సరఫరా లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీంతో వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ముప్పు ఏర్పడింది.

ఆర్థిక ఇబ్బందుల వల్ల ముడి పదార్థాలు దిగుమతి చేసుకోలేక పలు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే పాకిస్తాన్‌లో కార్యకలాపాలు నిలివేశాయి. సుజుకీ మోటార్ కార్పోరేషన్ మరికొన్ని రోజుల పాటు కార్యకలాపాలు నిలివేస్తున్నట్లు ప్రకటించింది. టైర్లు, ట్యూబ్‌లు తయారు చేసే ఘాంధారా టైర్, రబ్బర్ కంపెనీ తమ ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది. ముడిసరుకు దిగమతికి ఇబ్బందులు, వాణిజ్య బ్యాంకుల నుంచి కన్‌సైట్‌మెంట్ క్లియరెన్స్‌ పొందడానికి అడ్డంకులు ఎదురవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ రెండు కంపెనీలు కేవలం ఉదాహరణలే. ఫర్టిలైజర్స్, స్టీల్, టెక్స్ట్‌టైల్స్ రంగాలకు చెందిన అనేక పరిశ్రమలు పాకిస్థాన్‌లో కార్యకలాపాలను ఇప్పటికే తాత్కాలికం అన్న పేరుతో నిలిపివేశాయి. పాకిస్తాన్‌ విదేశీ కరెన్సీ నిల్వలు 2.91 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ మొత్తం కూడా పాకిస్తాన్ సొంతం డబ్బులు కావు. అవి సౌదీ అరేబియా అప్పుగా ఇచ్చిన మొత్తంగా చెబుతున్నారు. నిజానికి మూడు బిలియన్ డాలర్లు కేవలం రిజర్వు ఫండ్ గా మాత్రమే వినియోగించుకోవాలి. అంతే తప్ప వాటిని ఖర్చు చేయడానికి వీలు లేదు. అలాంటి ఒప్పందం మీదనే సౌదీ పాకిస్తాన్ కు సాయం అందజేసింది.

కానీ పాకిస్తాన్ మాత్రం వాటిని కూడా వినియోగించడం మొదలుపెట్టింది. సైన్యాధికారులు, ఉన్నతాధికారులు గతంలో ఆర్డర్ చేసిన ఖరీదైన మెర్సిడెజ్ కార్లను విడుదల చేయడానికి వాటిని వినియోగించినట్టు సమాచారం. అయితే సామాన్య జనం కోసం దిగుమతి చేసుకున్న దినుసులు కూరగాయలు పోర్టులో అలాగే పడి ఉన్నాయి. కనీసం ఆ డబ్బులను వీటిని విడుదల చేసుకోవడానికైన ఉపయోగించుకుంటే బాగుండేదని జనం విమర్షిస్తున్నారు. పోర్టుల్లోని కంటెయినర్లలో వస్తువులు చెడిపోతుండటంతో చేసేదేం లేక సదరు ఓడలు తిరుగ ప్రయాణం మొదలుపెడుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తోందో ఎలాంటి చర్యలు తీసుకోబోతోందో చెప్పడానికి ఎవరూ లేరు. ఇక్కడ ఈ పరిస్థితి ఉంటే ప్రధాని షెహబాజ్ షరీప్ తగుదనమ్మా అని తుర్కియే భూకంప బాధితులకు దైర్యం చెప్పడానికి స్పెషల్ ఫ్లైట్ లో తన అనుచర గణంతో సహా తరలివెళ్లారు. అక్కడి చివరి బాధితుడిని రక్షించేదాకా పాకిస్తాన్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీలు గుప్పిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో తన వెంట తీసుకుపోయిన తుర్కియే భూకంప సహాయక సామాగ్రి బండారం బయటపడటంతో నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు పాకిస్తాన్ నుంచి షెహబాజ్ షరీఫ్ వెంటతీసుకుపోయిన వస్తు సామాగ్రి గతంలో తుర్కియే పంపించిందే అవడం అందుకు కారణం. అంటే పాకిస్తాన్ వరద బాధితులకు పంపిన సామాగ్రిని జనానికి అందజేయలేదని స్పష్టం అయింది. దీనిపై భవిశ్యత్తులో షరీఫ్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వస్తే..పాకిస్తాన్ లో పరిశ్రమలు మూతపడితే నిరుద్యోగం పెరిగి ఆర్థిక వృద్ధిపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని పాక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో పరిశ్రమలు మూతపడటం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. సుజుకీతో పాటు హోండా మోటార్, టొయోటా మోటార్ కూడా కొద్దివారాల క్రితమే కార్యకలాపాలు నిలిపివేశాయి. దీంతో పాకిస్తాన్‌లో కార్ల సేల్స్ జనవరిలో 65శాతం పడిపోయాయి.

ఆర్థిక సంక్షోభం వల్ల డిమాండ్ భారీగా తగ్గడమూ దీనికి మరో కారణం. ఇదలా ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ ను కొత్త ప్రమాదం ముంచుకు వస్తోంది. అదేంటంటే.. టీటీపీ తాలిబన్లు పాకిస్తాన్ ను కూడా ఆక్రమించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఇదీ అంతర్గతంగా పాకిస్తాన్ సైన్యాన్ని కూడా వేదిస్తున్న సమస్యం. అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాద తాలిబన్ల చేతిలో పడితే ఆ తరువాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అన్నది పాకిస్తాన్ నే కాదు ప్రపంచాన్నే వేదిస్తోంది. గతంలో అంటే..2021, ఆగస్టు 15 రోజున అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో పాకిస్తాన్‌లో సంబరాలు జరిగాయి. తమ కనుసన్నల్లో మెలిగిన తాలిబన్లు అమెరికానే తరిమి కొట్టారని, అగ్రరాజ్యంపై ఇస్లాం ఘన విజయం సాధించిందంటూ నాయకులందరూ ప్రకటనలు గుప్పించారు. ఆ నాటి పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ ఫయాజ్‌ హమీద్‌ కాబూల్‌కు వెళ్లి తాలిబన్ల ప్రభుత్వ స్థాపనకు స్వయంగా ఏర్పాట్లు చేసి మరీ వచ్చారు. వారి ద్వారా భారత్ ఆధీనంలో ఉన్న కశ్మీరును తేలికగా స్వాధీనం చేసుకుని పాకిస్తాన్ లో కలుపుకుందామని ఆశయంగా పెట్టుకుంది పాకిస్తాన్..

అయితే నెల రోజులు గడిచేసరికి సీన్ మారింది. అఫ్గాన్‌లో అధికారంలోకొచ్చిన తాలిబన్ల అండతో ఇటు పాకిస్తాన్ లోని తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్తాన్‌ ‘టీటీపీ’ రెచ్చిపోవడం ప్రారంభించింది. పాకిస్తాన్‌ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నిస్తూ దాడులకు దిగడం మొదలు పెట్టింది. 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు వరకు పాక్‌లో కనీసం 250 దాడులు జరిగాయని పాక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పీస్‌ స్టడీస్‌ ‘పీఐపీఎస్‌’ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే దాడుల సంఖ్య రెట్టింపు అయింది.

ఈ దాడుల్లో 95శాతం బెలూచిస్తాన్, ఖైబర్‌ పఖ్‌తుఖ్వా(కె.పి)లో కీలక ప్రాంతాలు లక్ష్యంగా జరిగాయి. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే దాడులు జరుపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో 100 మంది ప్రాణాలను బలితీసుకున్న పెషావర్‌ మసీదు దాడి ఘటన జరిగిన కొద్ది రోజులకే కరాచీలో పోలీసుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్తాన్‌ను టీటీపీ అని పిలుస్తారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల మద్దతుతో వీళ్లు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 2001లో అమెరికాపై ట్విన్‌ టవర్స్‌ దాడి తర్వాత అగ్రరాజ్యం చేసిన ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమానికి పాకిస్తాన్‌ అండగా నిలవడంతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన వీరంతా ఒక గూటి కిందకి చేరారు. పాక్‌ విధానాలను వ్యతిరేకిస్తూ దక్షిణ వజిరిస్తాన్‌లో బైతుల్లా మెహసూద్‌ నేతృత్వంలో 2007లో తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్తాన్‌ టీటీపీ ఏర్పాటైంది.

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా మారిపోతాయని పాక్‌ ప్రభుత్వం భావించింది. రెండు దశాబ్దాల పాటు అఫ్గాన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సాయం అందించి అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించుకున్న భారత్‌ ఓ పక్కకి వెళ్లిపోతుందని ఆనందపడింది. అయితే సరిహద్దు రూపంలో తాలిబన్లతో సమస్య మొదలైంది. పాకిస్తాన్‌ కొత్త ఆర్మీ చీఫ్‌గా గత ఏడాది నవంబర్‌లో జనరల్‌ అసీమ్‌ మునీర్‌ బాధ్యతలు స్వీకరించగానే పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడులు, ప్రభుత్వ అధికారుల కిడ్నాప్‌లు, బెదిరింపులు మొదలయ్యాయి.

ఇన్నాళ్లూ అఫ్గాన్‌లో మంచి తాలిబన్లు, పాక్‌లో ఉన్న టీటీపీ చెడ్డ తాలిబన్లు అని భావించిన పాక్‌కు ఇద్దరూ చేతులు కలపడంతో అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అని నిట్టూరుస్తోంది.

Must Read

spot_img