Homeఅంతర్జాతీయంపాకిస్తాన్ బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్...

పాకిస్తాన్ బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్…

పాకిస్తాన్ బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ విషయంలో ఓ ఆధారం దానంతటదే బయటకు వచ్చింది. పైగా అది అగ్రరాజ్యం అమెరికా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి తన పుస్తకంలో కోట్ చేసారు. అంతే కాదు మరో బాంబు కూడా పేల్చారు మైక్ పాంపియో. సర్జికల్ స్ట్రైక్ కాగానే పాకిస్తాన్ భారత్ పై అణ్వస్త్రాన్ని ప్రయోగించాలని అనుకుందట. ఆ విషయం తెలియగానే అమెరికా శరవేగంగా కదలడంతో ఆ ప్రమాదం తప్పిపోయిందని తన పుస్తకంలో రాసేసుకున్నారు పాంపియో.

బాలాకోట్‌పై భారత్‌ సర్జికల్ స్ట్రైక్స్‌ చేసింది నిజమే అని అమెరికా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మైక్‌ పాంపియో తన తాజా పుస్తకం ‘నెవర్‌ గివ్‌ యాన్‌ ఇంచ్‌’ లో వివరంగా రాశారు. అప్పుడు భారత్‌-పాకిస్తాన్‌ మధ్య సంఘర్షన అణు దాడికి ఎంత దగ్గరగా వచ్చిందో ప్రపంచానికి తెలియదన్నారు. ఈ విషయాలను ఆయన తన తాజా పుస్తకంలో వెల్లడించారు. భారత్‌లో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఈ విషయాలను తనతో పంచుకున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. కాగా, మైక్‌ పాంపియో చేసిన వాదనలపై అమెరికా హోం శాఖ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. కానీ భారత్ లో మాత్రం దీన్నో జోక్ అని అంటున్నారు విశ్లేషకులు. పాంపియో తన పుస్తకానికి హైప్ ఇవ్వడానికి ప్రమోట్ చేసుకోడానికి లేని కథ స్రుష్టించారని వారంటున్నారు.

అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్‌ పాంపియో ‘నెవర్‌ గివ్‌ యాన్‌ ఇంచ్‌’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌కు సంబంధించి 2019 ఫిబ్రవరి 27, 28 తేదీల్లో అమెరికా-నార్త్‌ కొరియా శిఖరాగ్ర సమావేశంలో సుష్మాస్వరాజ్‌ తనతో చెప్పిన విషయాలను ఈ పుస్తకంలో వివరంగా రాశారు. బాలాకోట్‌పై తాము సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయడంతో వారు తమ ఆణ్వాయుధాలను బయటకు తీసి దాడి చేసేందుకు సిద్ధమయ్యారని కూడా సుష్మా చెప్పారనిఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్‌ అణ్వాయుధాలను ఎదుర్కొనేందుకు భారత్‌ కూడా సన్నాహాలు చేసినట్లు ఆయన తెలిపారు.

అంటే ఈ విషయం మన దేశంలోని వారికి కూడా తెలియనంత సీక్రెట్ గా జరిగిపోయిందని రాసుకొచ్చారు. ఇది మరీ విచిత్రమైన కథనం అని అంటున్నారు నిపుణులు. 2019 ఫిబ్రవరిలో ఇండియా-పాకిస్తాన్ మధ్య ఘర్షణ వాతావరణం అణు దాడికి ఎంత దగ్గరగా వచ్చిందో ప్రపంచానికి కూడా తెలియదని తాను అనుకుంటున్నానన్నారు. ఎందుకిలా అనే ప్రశ్నకు సరైన సమాధానం కూడా తనకు తెలియదని, అయితే రెండు దేశాలు మాత్రం అణు దాడికి చాలా దగ్గరగా వచ్చాయన్న విషయం తనకు తెలుసునని తన పుస్తకంలో వెల్లడించారు.

ఒకవైపు ఉత్తర కొరియా అణ్యాయుధాలపై, మరోవైపు ఇండియా-పాక్‌ మధ్య కశ్మీర్‌ విషయంపై అణు ఆయుధాల దాడిపై జరిగిన చర్చలను తన జీవితంలో మరిచిపోని రోజని పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్‌ చెప్పిన విషయాల మేరకు పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వాకు ఫోన్‌ చేయగా.. అణ్వాయుధ దాడికి సిద్ధమవుతున్న వార్తలు అవాస్తవమని చెప్పారని మైక్‌ పాంపియో తెలిపారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్‌-పాకిస్థాన్‌ దేశాల మధ్యలో ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. అది మాత్రం నిజం..

ఎందుకంటే 2019 ఫిబ్రవరిలో జైష్‌ ఎ మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారత ఆర్మీ బస్సుపై దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది జవాన్‌లు ప్రాణాలు కోల్పోయారు. అందుకు ప్రతీకారంగా భారత్‌ అదేనెల 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్లో జైషే ఎ మహ్మద్‌ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌కు పాల్పడింది. ఆ తర్వాత భారత భూభాగంలోకి వచ్చిన పాకిస్థాన్‌ యుద్ధవిమానాన్ని తరుముతూ వెళ్లి భారత ఫ్లైట్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్థాన్‌ ఆర్మీకు చిక్కారు. అదే సమయంలో అమెరికా-ఉత్తరకొరియా శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఆ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మైక్‌పాంపియో వియత్నాంలోని హనోయ్‌లోగల ఓ హోటల్‌లో తన బృందంతో కలిసి బసచేశారు..

ఆ సందర్భంగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధాన్ని నివారించేందుకు తాను ఒక రాత్రంతా నిద్రలేకుండా గడిపానని పాంపియో తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ తనకు ఫోన్‌ చేసి.. పాకిస్థాన్‌ తమపై అణుయుద్ధానికి ఏర్పాట్లు చేసుకుంటున్నదని చెప్పారనితెలిపారు. దాంతో పరిస్థితి తీవ్రం కాకుండా ఉండేందుకు తాను, తన బృందం ఆ రాత్రంతా నిద్రపోలేదని చెప్పారు. రెండు దేశాల బాధ్యులతో చర్చలు జరిపామని అన్నారు. ఆఖరికి అప్పటి పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వాకు ఫోన్‌ చేసి సుష్వాస్వరాజ్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించగా ఆయన తోసిపుచ్చారని, తాము అణుయుద్ధానికి సిద్ధమయ్యామనడంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారని పాంపియో పేర్కొన్నారు.

Must Read

spot_img