Homeఅంతర్జాతీయంపాకిస్థాన్ ఆర్మీ ఆహారం లేదు కానీ ఆయుధాలు కొనుగోలు చేస్తుంది..?

పాకిస్థాన్ ఆర్మీ ఆహారం లేదు కానీ ఆయుధాలు కొనుగోలు చేస్తుంది..?

పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం ఇప్పుడు సైన్యాన్ని కూడా తాకింది. అదెంతగా అంటే గతంలో ఎన్నడూ ఈ పరిస్థితిని ఎదుర్కుని ఎరుగని పాక్ ఆర్మీ ఇప్పుడు రెండు పూటలా తిండి కూడా పెట్టుకోలేని స్థితికి చేరుకుంది. ఇక్కడ మెస్ భోజనాల్లో కోతలే కాదు..జీతాలు కూడా రావడం లేదు. అక్కడే అసలు సమస్య మొదలైంది. వాళ్లకు చాలా నమ్మకం..దేశం ఎటు పోయినా సైన్యం జోలికి ఎవరూ రారు..తాము ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగుతుందని వారి విశ్వాసం. అలాంటిది ప్రభుత్వం నుంచి సైన్యానికి ఈ ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఆర్మీ మెస్ లలో భోజనం మీద రేషన్ విధించిన అధికారులు ఇప్పుడు పాకిస్తాన్ సైనికులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి తారాస్థాయికి చేరుకుంది. సైనికులకు కేవలం రెండు సార్లు మాత్రమే ఫుడ్డు పట్టి సరిపెట్టుకోమంటున్నారు. ఇది వారికి మింగుడుపడకుండా ఉంది. నిజానికి గతంలో రోజుకు మూడు సార్లు పొట్టనిండా భోజనం పెట్టేవాళ్లు.. రోజురోజుకూ దిగజరారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రోజుకు రెండు సార్లు మాత్రమే తిండి పెడుతున్నారు. చికెన్ రేటు 780 రూ.లకు కిలోగా మారిపోవడంతో నిత్యం దానితోనే భోంచేసేవారికి, కూరగాయల భోజనం సయించడం లేదు.

పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో కాపలా కాసే పాకిస్తాన్ సైనికులకు వేళకు ఆహారం సప్లై చేయలేకుపోతున్నారు. సరిహద్దుల దగ్గర ఉండే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి వాహనాలలో రోజూ ఆహారం సప్లై చేస్తారు. కానీ తీవ్రమైన గోధుమల కొరతతో బ్యారక్స్ లలో ఉండే సైనికుడికి రోజుకు రెండు సార్లు కేవలం నాలుగు రొట్టెలు మాత్రమే ఇస్తున్నారు మెస్ నిర్వాహకులు. గోధుమ పిండి మీద రేషన్ విధించడం వలన ఇంతకు ముందులాగా ఎన్ని కావాలంటే అన్ని రొట్టెలు ఇవ్వలేమని సైనికాధికారులు చెబుతున్నారు. నిజానికి బ్యారక్స్ నుంచి సరిహద్దుల్లోకి సరఫరా కావాలంటే వాహనాలకు డీజిల్ మీద కూడా రేషన్ విధించడంతో రోజుకు రెండు సార్లు మాత్రమే వెళ్లి వస్తున్నాయి. మీకు తెలుసా పాకిస్తాన్ విదేశీ అప్పుల మొత్తం 130 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఆ దేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో 95.39 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం విషయానికొస్తే 27.6 శాతంగా ఉంది.

ఇది గత 48 ఏళ్లలోనే గరిష్ట స్థాయి అని నిపుణులు చెబుతున్నారు. అదే ఆహార ద్రవ్యోల్బణం అయితే 42.9శాతంగా ఉంది. ఇది గత సంవత్సరానికి ఇదే సమయంతో పోలిస్తే 4 రెట్లు అయింది. 2022లో ఆహార ద్రవ్యోల్బణం 12.8శాతం ఉంది. ఇక మరోసారి సైన్యానికి భోజనం విషయానికొస్తే గత సంవత్సరం నుంచి ప్రజలకు చేసే సప్లైస్ మీద కోత పెట్టి దానిని ఆర్మీకి తరలిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రజలతో పాటు ఆర్మీకి కూడా ఆహర కొరత ఏర్పడింది. తాము అర్దాకలితో దేశ రక్షణ విధులు నిర్వహించలేమనీ, కాబట్టి రోజుకు మూడు సార్లు భోజనం పెట్టమని కోరుతూ సైనికులు తమ అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నారు. విషయం శ్రుతి మించుతోందని తెలుసుకున్న అధికారులు పై స్థాయి జనరల్స్ ద్రుష్టికి తీసుకువెళుతున్నారు. కానీ ఇది ఆర్మీ నిబంధనలకు విరుద్దం. ఏ దేశ సైన్యంలో అయినా క్రమశిక్షణకు మొదటి స్థానం ఉంటుంది. పై అధికారుల ఆజ్నలను మారు మాట్లాడకుండా పాటించాల్సి ఉంటుంది.

అయితే ఈ వార్త ఇప్పుడే బయటపడ్డా నిజానికి గత నెలరోజులుగా సైనికులకు రెండు సార్లు మాత్రమే భోజనం ఇవ్వాలనే ఆదేశాలు వెళ్లాయి. అంతే కాదు..ఈ విషయంపై అర్దాకలితో ఉంటున్న సైనికులెవరైనా ఎదురు మాట్లాడితే సైనిక కోర్టులో కోర్టు మార్షల్ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిసీ వినతి పత్రం ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ సైన్యంలో డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ హెడ్ క్వార్టర్స్ లోని అధికారులు సరిహద్దుల దగ్గరకు ఆహారం, మందుల సరఫరా తగ్గిపోతోందనీ తద్వారా సైనికులు సామర్థ్యం తగ్గిపోతోందని ఓ రిపోర్టు తయారుచేసి సైనిక అధ్యక్షుడు ఆసం మునీర్ కు పంపించింది. నిజానికి డీజీఎమ్ఓకి ఇలాంటి రిపోర్టు పంపించే అధికారం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితిలో రిపోర్ట్ పంపించింది. వారి ఉద్దేశ్యం మేరకు ఎలాగైనా సైనికులకు అవి పంపించమని చెప్పడానికే ఈ రోపోర్టు పంపించడం సంచలనం స్రుష్టించింది. ప్రస్తుతం పాకిస్తాన్ దేశం మొత్తం బడ్జెట్ లో 16శాతం సైన్యానికే కేటాయించారు.

గత సంవత్సరం కంటే ఇది 4శాతం ఎక్కువ..కానీ కేటాయింపులు జరిగాయి కానీ వాటిని అమలు చేయడంలో పాకిస్తాన్ నూటికి నూరుపాల్లు విఫలమైంది. దాంతో ప్రజలతో పాటు సైన్యానికి కూడా ఆర్థిక సంక్షోభం తాలూకు సెగ బాగానే తగులుతోంది. పాకిస్తాన్ లో కనీసం ఇప్పుడు పారసిటమాల్ ట్యాబ్లెట్ సైతం దొరకడం లేదు. విచిత్రం ఏమిటంటే భారత్ లో తయారైన మందులకే పాకిస్తాన్ లో డిమాండ్ ఎక్కువగా ఉంది. మరోవైపు చైనా నుంచి వస్తున్న మందులను పాకిస్తాన్ ప్రజలు నమ్మడం లేదు. దీనిని ఆసరాగా తీసుకుని స్మగ్లర్లు భారత్ మందులను అక్రమంగా సరిహద్దులు దాటించి వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తున్నారు. సైన్యానికి కూడా ఈ మందుల కొరత సెగ తగలడంతో మిలిటరీ ఆసుపత్రులలో ఉండే ఫార్మసీలలో మందుల మీద కూడా రేషన్ విధిస్తున్నట్టు సమాచారం. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ఇప్పటికే ఖరారైన ఒకటిన్నర బిలియన్ డారల్ల బెయిలవుట్ ప్యాకేజీని విడుదల విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది.

నిజానికి ఐఎంఎఫ్ రుణం ఒక్కసారి మంజూరయితే విదేశాల నుంచి పాకిస్తాన్ కు రుణం దొరికే అవకాశం ఉంటుంది. అందుకే అది చెప్పని షరతులను పాకిస్తాన్ పాటిస్తోంది. ప్రజలపై అపారమైన పన్నులు విధించడానికి కూడా సిద్దపడుతోంది. పెట్రోల్ డిజెల్ రేట్లు చుక్కలు చూపించడం వెనుక ఐఎంఎఫ్ ఆదేశాలున్నాయి. అలాగే పాకిస్తాన్ ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలు చాలా ఎక్కువగా ఉన్నాయనీ, వాటిని పూర్తిగా ఎత్తివేయాలని ఐఎంఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఓ వారం క్రితం దాని ఆదేశాల మేరకు పెట్రోల్ డీజల్ ధరలను మరో 15శాతం పెంచింది అక్కడి ప్రభుత్వం. అది చాలదన్నట్టు మరో 15శాతం పెంచాలని తాజాగా సూచించింది. మరో సంవత్సరంలోగా సాధారణ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న పాకిస్తాన్ విషయంలో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా మారుతోంది. ఇన్నిరకాలుగా ప్రజలను పన్నుల రూపంలో విసిగిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తెలియని విషయమేమీ కాదు. అందుకు తగ్గట్టుగానే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా పెరుగుతున్న ధరలపై ప్రభుత్వాన్ని వెంటబడి తరుముతున్నారు.

ర్యాలీలు తీస్తూ జనంలో ప్రచారం మొదలుపెట్టారు. సైన్యం పట్ల ఉండే ద్రుక్పదం మారనంత వరకు పాకిస్తాన్ బాగు పడదని నేరుగా ప్రకటనలు చేస్తున్నారు. దాంతో షరీఫ్ ప్రభుత్వం విధిలేని పరిస్థితిలో సైన్యం జోలికి పోక తప్పడం లేదు. మొదటిసారిగా పాకిస్తాన్ లో సైన్యాన్ని టార్గెట్ చేసింది ఐఎంఎఫ్. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలి అంటే తమ టర్మ్స్ అండ్ కండీషన్స్ ని తప్పకుండా పాటించాలని కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పింది ఐఎంఎఫ్. ఆ షరతులు ఎలా ఉన్నాయంటే ముందు పాకిస్తాన్ సైన్యాధికారులకు ఇస్తున్న సౌకర్యాలపై కోత విధించాలి. ఇక నుంచి పాకిస్తాన్ ఎలాంటి ఆయుధాలను కానీ, వస్తువులను కానీ ఇతర మిలిటరీకి సంబంధించినవి కొనడానికి వీలు లేదు. పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన అన్ని వ్యాపారాలు, పరిశ్రమల ఉత్పత్తులపైన పన్ను మినహయింపులను తొలగించి వెంటనే వాటి మీద ప్రజల మీద విధిస్తున్న పన్నుల కంటే ఎక్కువగా పన్నులు విధించాలి. పాకిస్తాన్ మార్కెట్లని అంతర్జాతీయ సంస్థలకు అనువుగా విధి విధానాలను కొత్తగా రూపొందించాలి.

అంటే అంతర్జాతీయ మార్కెట్ల కోసం పన్ను రాయితీలతో పాటు భూమి కేటాయింపుల విషయంలో ఉదారంగా ఉండాలన్నమాట. అయితే ఐఎంఎఫ్ విధిస్తున్న ఇలాంటి షరతులకు ప్రభుత్వం విధిలేక ఒప్పుకున్నా ఆర్మీ జనరల్స్ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఎందుకంటే పాకిస్తాన్ లోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన అన్ని విభాగాలకు ఎవరికి వారు నిర్వహించుకుంటున్న సొంత వ్యాపారాలున్నాయి. ఇలా ఏ దేశంలోని సైన్యం సొంతంగా వ్యాపారాలు చేయడం ఉండదు. పాకిస్తాన్ లోనే ఇలా కనిపిస్తాయి. అసలు పాకిస్తాన్ ఆర్మీ వ్యాపారాలకు అంతే ఉండదు. రియల్ ఎస్టేట్, పాలు, పాల ఉత్పత్తులు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, సిమెంట్, హార్డ్ వేర్ షాపులు లాంటి ప్రతీ ఒక్క రంగంలోనూ సైన్యానికి సంబంధించినవి నడుస్తున్నాయి. పైగా ఆ వ్యాపారాలపై ట్యాక్సులు ఉండవు. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో అధిక భాగం ఆర్మీ అధికారుల జేబుల్లోకి పడిపోతుంది. పదీ పరకా చిన్న చిన్న అధికారులకు వెళుతుంది. అంతే కానీ దిగువ స్థాయిలో పనిచేసే సైనికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. అది పాకిస్తాన్ లో దశాబ్దాలుగా కొనసాగుతోంది.

Must Read

spot_img