Homeఅంతర్జాతీయంమన దేశానికి ప్రస్తుతం ఏ వైరస్ తోనూ భయం లేదు..

మన దేశానికి ప్రస్తుతం ఏ వైరస్ తోనూ భయం లేదు..

భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు..ఇదీ నిపుణులు చెబుతున్న మాట. దేశానికి ఊరట కలిగిస్తున్న మాట. ఎందుకంటే చైనాలో విజృంభిస్తున్న కరోనా మనల్నేమీ చేయలేదు అని తేలిపోయింది. కానీ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న దేశాలకు మరో తంటాగా మారింది. ప్రత్యామ్నాయ వ్యూహ మేదీ లేకుండానే లోపభూయిష్ఠమైన కఠోర జీరో కోవిడ్‌ విధానాన్ని హఠాత్తుగా చైనా ఎత్తేయడం అందరికీ తలనొప్పి తెచ్చిపెడుతోంది.

చైనాలో వేలల్లో వస్తున్న కోవిడ్‌ కేసుల ఫలితంగా జనవరిలో భారత్‌లో కరోనా విజృంభణ తప్పకపోవచ్చనీ, రానున్న 40 రోజులు మన దేశానికి అత్యంత కీలక మనీ కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం పేర్కొనడాన్ని ఆ దృష్టితో చూడాలి. ఈ ప్రకటన ప్రజలూ, పాలకులూ అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని మరోమారు గుర్తు చేస్తోంది.

అయితే, భారీ సంఖ్యలో కేసులు బయటపడ్డా దేశంలో నాలుగోవేవ్‌ రాకపోవచ్చనీ, వచ్చినా ఆస్పత్రి పాలవడాలు, మరణాలు తక్కువగానే ఉండవచ్చనీ ఆరోగ్య శాఖ చెప్పడం ఒకింత ఊరట. అలాగని చైనాలో పరిస్థితులు, జపాన్‌లో బుధవారం ఒక్కరోజులో జరిగిన 415 మరణాలను మనం తేలికగా తీసుకోకూడదని కూడా నిపుణులు చెబుతున్నారు.

గత రెండు రోజుల్లో దేశంలోని వివిధ నగరాల్లో ర్యాండమ్‌ శాంపిల్‌ టెస్టింగ్‌లోనే 39 మంది అంతర్జాతీయ విమాన ప్రయాణికులు పాజిటివ్‌గా తేలడం లాంటి ఘటనలు పారాహుషార్‌ అంటున్నాయి. ప్రపంచీకరణ వల్ల ఏ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా, ఇతర దేశాలు అప్రమత్తమై, పరిస్థితిని సమీక్షించుకోక తప్పని పరిస్థితి నెలకొంది.

చైనా వార్తలతో మన దేశంలోనూ ఉన్నత స్థాయి సమావేశాలు, అన్ని రాష్ట్రాల్లో ముందుజాగ్రత్తగా మాక్‌ డ్రిల్స్‌ చేసింది. అందుకే. చైనా, జపాన్‌ తదితర 6 దేశాలల నుంచి భారత్‌కు వచ్చే యాత్రికులకు 72 గంటల ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు కూడా చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో టీకాకరణ జోరు పెంచాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రెండు ప్రాథమిక డోసులు మాత్రమే వేసుకున్నవారు మూడోదైన ముందుజాగ్రత్త డోస్‌.. అంటే..బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని అంటున్నారు. ప్రపంచంలో సగటున ప్రతీ 100 మందిలో 30 మందికి పైగా బూస్టర్‌ వేసుకున్నా, మన దగ్గర ఆ సంఖ్య 16 దగ్గరే నిలిచిపోవడం మనలో పెరిగిన అలక్ష్యానికి చిహ్నంగా చడాల్సి ఉంది.

అంటే మనం జాగ్రత్తగా లేమని గుర్తించాలని అంటున్నారు నిపుణులు..కొత్తగా ముక్కులో చుక్కలుగా వేసే భారత్ బయోటెక్ వారి టీకా ‘ఇన్‌కోవాక్‌’కు బూస్టర్‌గా కేంద్రం అత్యవసర అనుమతి నిచ్చింది. జనవరి చివర నుంచి అలా మరో అస్త్రం మన దేశపు జనం చేతికి అందినట్టే. ఇప్పటికే దేశంలో అధిక శాతం మందికి గతంలో కరోనా సోకడంతో సహజ వ్యాధినిరోధకత నిండుగా ఏర్పడింది.

టీకాలు తెచ్చిన వ్యాధినిరోధకత దానికి జత కలసి, హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ వచ్చినట్టయింది. అలాగే, కరోనా మొదటి వేవ్‌ నాటితో పోలిస్తే ఇప్పుడు చికిత్సలో అనుభవంతో పాటు కనీసం 7 టీకాలు వచ్చాయి. జనంలోనూ కరోనాను ఎదుర్కునే విషయంలో మానసికంగా శారీరికంగా బలంగా ఉన్నారనడంలో సందేహం లేదు.అప్పట్లో ప్రజా ఆరోగ్య వ్యవస్థలోని లోపాలన్నీ కరోనా బహిర్గతం చేయడంతో, ప్రభుత్వాల తప్పనిసరి కృషితో చాలా రాష్ట్రాల్లో ఆరోగ్య వసతులు, వ్యవస్థ మునుపటి కన్నా గణనీయంగా మెరుగయ్యాయి. అందుకే, ఇప్పుడు అతిగా ఆందోళన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు.

చైనా దెబ్బకు మళ్ళీ టెస్టులు పెరిగే ప్రస్తుత పరిస్థితుల్లో కేసుల సంఖ్య కన్నా ఆసుపత్రి పాలైన వారి సంఖ్యను కీలకమైన లెక్కగా పరిగణించాలి. అలాగే, పాజిటివ్‌ నమూనాల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టి, వైరస్‌లో కొత్త ఉత్పరివర్తనాలు దేశంలోకి వస్తున్నాయేమో అన్న విషయంపై ఓ కంట కనిపెట్టడం చేయాలి.

  • కోవిడ్‌ కథ కంచికి చేరలేదు… ఇప్పుడప్పుడే చేరే అవకాశమూ కనుచూపు మేరలో కనిపించడం లేదు.

ఒకవేళ అలాంటివేమైనా వస్తే వాటిని అరికట్టే చర్యలు తీసుకోవడమే అతి ముఖ్యం. అయితే ఒక విషయం ఎన్నటికీ మరవకూడదు..కోవిడ్‌ కథ కంచికి చేరలేదు… ఇప్పుడప్పుడే చేరే అవకాశమూ కనుచూపు మేరలో కనిపించడం లేదు. కరోనా వైరస్‌లో ఎప్పుడు ఏ కొత్త వేరియంట్‌ వస్తుందో ఏ శాస్త్రవేత్తలూ చెప్పలేరు. కాబట్టి ఓ మాదిరి నుంచి తీవ్ర ఇన్ఫెక్షన్లు వస్తూ, పోతూ ఉండవచ్చు.

కాబట్టి ఉన్నంతలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, దీర్ఘకాలిక రోగాలకు చికిత్స చేయించుకుంటూ, ప్రాథమికమైన ముందు జాగ్రత్తలతో కోవిడ్‌ అనారోగ్యం నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. చైనాలో ఇప్పుడు కాకరేపుతున్న బీఎఫ్‌.7 ఒమిక్రాన్‌ ఉప-వేరియంట్‌ ఉద్ధృతి కొద్దివారాల్లో ముగిసిపోతుందని అంచనా. అలా చైనాలోని తాజా కరోనా వేవ్‌ ముగిసిపోతే, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కూడా సామాన్య జలుబు, జ్వరం దశకు వస్తుందని శాస్త్రవేత్తల ఆశాభావం.

అది నిజం కావాలని అంతా కోరుకుంటున్నారు. ఏది ఏమైనా కరోనాతో సహజీవనం తప్పదన్న మాటలను ఒకప్పుడు వెటకారం చేసినా, అది అనివార్యమని ఇప్పుడు ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ సుదీర్ఘకాల సహజీవనంలో ప్రపంచంలో ఏ మూల ఎప్పు డైనా కొత్త కేసులు వెల్లువెత్తవచ్చు. తాజా వేవ్‌లు విరుచుకుపడవచ్చు. ఆ ముప్పును గమనంలో ఉంచుకొని, ముందుకు సాగాలి.

భారత్‌ సహా ప్రపంచ దేశాలన్నీ తగు సంసిద్ధతతో ఉండడమే ప్రస్తుత కర్తవ్యం. అంతేతప్ప, పొరుగునున్న మరో దేశంలో కరోనా వేవ్‌ వచ్చిందని వార్త వచ్చినప్పుడల్లా బెంబేలెత్తిపోతే ఉపయోగం లేదు. శాస్త్రీయ ధోరణితో కరోనాపై చర్యలు ముఖ్యం. ఇది వ్యూహాలను ఎప్పటికప్పుడు పునఃసమీక్షా చేసుకోవాల్సిన సమయం. కేంద్రం ఎప్పటికప్పుడు చైనాలో పరిస్థితిని గమనిస్తూ ఉండాలి. పుకార్లు వ్యాపించకుండా ప్రజలకు సమాచారం అందిస్తూ, చైతన్యం తేవాలి. ప్రపంచానికి కరోనా పరిచయమై సరిగ్గా మూడేళ్ళయింది.

ఇన్నేళ్ళుగా అనుసరిస్తున్న కరోనా వ్యూహాలను ఇప్పుడు ఆగి, పరిశీలించుకోవాలి. గత అనుభవాల ఆధారంగా శాస్త్రీయంగా, సాక్ష్యాధారాలపై ఆధారపడి చర్యలు చేపట్టాలి. తాజా పరిస్థితులకు తగ్గట్టు సాక్ష్యాధారాలపై ఆధారపడ్డ కరోనా పోరాట ప్రణాళిక, వ్యూహం సిద్ధం చేసుకోవాలి. పరిశోధన, అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలిచ్చి టీకాలు సహా ఆరోగ్యరంగంలో బలోపేతం కావాలి.

గత మూడేళ్ళుగా పాలకులు పక్కనబెట్టిన టీబీ సహా ఇతర వ్యాధుల నియంత్రణపైనా చర్యలకు విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలేమో కరోనాపై స్వీయ నియంత్రణతో మాస్క్‌ ధారణ సహా జాగ్రత్తలను పాటించాలి. నిజానికి మనదేశంలో పేరుకుపోయిన కాలుష్యాల నేపథ్యంలో నిత్యం మాస్క్ ధరించడం ఓ అవసరంగా మారింది.

అలా మాస్క్ ధరించడం మన నిత్యజీవితంలో భాగంగా మారినప్పుడు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా మన దగ్గరకు చేరే అవకాశం లేకుండా పోతుంది. అలాగే చేతులు శుభ్రం చేసుకోవడం, ఇతరులతో దూరం పాటించడం వంటివి కూడా మనకు రక్షణనిచ్చే చర్యలుగానే ఉంటాయి. అయినా అప్రమత్తత అన్నది మనకోసం మనం చేసుకునే విషయం . దాని వల్ల ఎంతో కొంత లాభమనేది జరిగితే అది మనకే మంచిది. ఎంతైనా మన జాగ్రత్తే కదా మనల్ని రక్షించేది అంటున్నారు విశ్లేషకులు.

Must Read

spot_img