మొన్నటికి మొన్న మన దేశంలో సెమి హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ రైళ్లను దేశవ్యాప్తంగా అనేక నగరాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మరో విప్లవాత్మక రైలును 2023 వ సంవత్సరంలోనే ప్రవేశబెట్టబోతున్నారనే వార్త సంచలనం స్రుష్టిస్తోంది. అదే హైడ్రోజన్ రైలు.. భారతీయ పట్టాలపైకి సూపర్ ఫాస్ట్‌గా దూసుకొస్తున్న హైడ్రోజన్ రైలుకు అనేక ప్రయోజనాలున్నాయి. ఈ రైలింజను నుంచి పొగ రాదు..ఆవిరి లేదా నీళ్లే వస్తాయి..జీరో కాలుష్యాలతో నడిచే ఈ రైలు వల్ల పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయదు.
పైగా ఇది నడిచిన చోట్లలో పచ్చదనం మరింత పచ్చగా మారుతుంది. భవిష్యత్తులో ఈ రైళ్ల ద్వారానే ప్రయాణాలు కొనసాగనున్నాయి. కొన్ని నెలల క్రితం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఎలక్ట్రిక్ వాహనంలో పార్లమెంటుకు వచ్చారు. తన కారును సభ్యులందరికీ పరిచయం చేశారు. దీంతో ఈ హైడ్రోజన్ కారు వార్తల్లో నిలిచింది. రానున్న కొద్ది కాలంలో నే మన దేశపు రైళ్లు హైడ్రోజన్‌తో నడిచే ఇంజన్లతో నడవనున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. సూపర్ ఇంధనం లేదా భవిష్యత్ ఇంధనంగా చెబుతున్న హైడ్రోజన్ ఉపయోగించుకుని నడవడం చేస్తాయని స్పష్టం చేసారు. మీకు తెలుసా శిలాజ ఇంధనాలైన చమురు బొగ్గు నిల్వలు భూ అంతర్భాగంలో పరిమితంగానే ఉన్నాయి. అవి కూడా అంతరించుకుపోయే దశకు చేరుకున్నాయి.
పైగా వాటి వినియోగం కారణంగా భూమిపై అపారమైన కాలుష్యాలు, ఉష్ణోగ్రతలను పెంచుతూ వాతావరణ వైపరీత్యాలకు కారణమవుతున్నాయి. అటువంటి సమస్యలే లేని ఇంధన వినియోగంపై ప్రస్తుతం ప్రపంచం ద్రుష్టి పెట్టింది. అందులో భాగంగా మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. నిజానికి భూమిపై హైడ్రోజన్ ఇందనానికి కొరత అస్సలు లేదు. రాబోదు..మనకు ఎంతో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. ఎన్నో నదులున్నాయి. ఆ నీటి నుంచి బ్రహ్మాండంగా హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు.

మీకు తెలుసా.. కేవలం 20 నిమిషాల్లోపే రైలుకు కావలసిన ఇంధనాన్ని నింపవచ్చు.
ఒకసారి హైడ్రోజన్ నిండిన ట్యాంక్‌తో రైలింజన్ 1000 కిలోమీటర్ల వరకు సునాయాసంగా ప్రయాణించగలదు. హైడ్రోజన్ వాడకం వల్ల రైలు వేగంలో ఏ తేడాలు ఉండవు.. పైగా ఈ రైళ్లు వాయువేగంతో పోటీ పడతాయని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మాత్రం గంటకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగం సాధ్యపడుతుంది. భవిశ్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే 54.6 సెకండ్లలో 100 కి.మీల వేగాన్ని హైడ్రోజన్ రైలు అందుకోగలదు. హైడ్రోజన్ రైళ్ల కోసం మార్పిడి చేసిన కంబషన్ ఇంజిన్లను వాడతారు. అయితే ఎక్కువగా హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్‌ను ద్వారానే శక్తి ఉత్పన్నమవుతుందని సమాచారం. ఇందులోనూ విద్యుత్ రసాయన ప్రక్రియ జరుగుతుంది. హైడ్రోజన్ ఇంధనం ఆక్సిజన్‌తో చర్య జరపడం ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఈ విద్యుత్ ద్వారా శక్తివంతమైన మోటార్లు రైలును నడిపిస్తాయి. ఇలా చేయడం వల్ల ఇందులో నుంచి కేవలం నీరు, ఆవిరి మాత్రమే బైప్రోడక్టుగా బయటకు వస్తాయి. రైలు పైకప్పులో ఆక్సిజన్‌తో పాటు హైడ్రోజన్ నిల్వ చేయబడుతుంది. రైలు ఆపరేషన్ సమయంలో ఉత్పన్నమయ్యే వేడిమి ద్వారా రైలులోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ నడిచేందుకు ఉపయోగిస్తారు.
అందుకే డీజిల్ ఇంజిన్లకు ప్రత్యామ్నాయం హైడ్రోజన్ ఇంజన్ అని ఘంటాపథంగా చెబుతున్నారు నిపుణులు. ఓ అంచనా మేరకు హైడ్రోజన్ ఇందనం వల్ల ప్రతి ఏటా సుమారు 16 లక్షల లీటర్ల డీజిల్ ఆదా అవుతుంది. ఒక డీజిల్ ఇంజిన్ తో నడిచే రైలు సంవత్సరానికి 4వేల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేస్తుంది. అలా వేలాది రైళ్ల నుంచి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ పర్యావరణాన్ని కాలుష్యమయం చేస్తున్నాయి. దానికి హైడ్రోజన్ వాడకం ద్వారా చెక్ పెట్టవచ్చు. అయితే ప్రస్తుతం కరెంటు రైళ్లే కదా నడుస్తున్నాయి వాటి వల్ల కాలుష్యాలు ఎలా అన్న అనుమానం రావచ్చు.
అయితే ఆ రైళ్లకు వినియోగించే కరెంటు తయారీ థెర్మల్ కేంద్రాలలో జరుగుతుంది. ఆ విద్యుత్ తయారీకి శిలాజ ఇంధనమైన బొగ్గును వినియోగిస్తారు. బొగ్గును మండించడం ద్వారా కరెంటు తయారవుతుంది. సో..అక్కడ కూడా అపారమైన కాలుష్యాలు పర్యావరణంలోకి చేరిపోవడం అనివార్యంగా జరుగుతోంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు రవాణా, సమాచార వ్యవస్థలే జీవనాడులుగా పనిచేస్తాయి. ఇవి లేనిదే పారిశ్రామికీకరణ, వాణిజ్య అభివ్రుద్ధి సాధ్యం కాదు. భారతదేశం లాంటి సువిశాల దేశంలో అభివ్రుద్ధి, ఆధునికీకరణ సాధించాలంటే చవకైన సమర్థవంతమైన రవాణా సాధనాలు తప్పనిసరి. దేశంలోని సుదూర ప్రాంతాలకు ప్రయాణికులను, సరుకులను రవాణా చేయడానికి చవకైన సాధనాలుగా భారతీయ రైల్వేలు గుర్తింపు పొందాయి. దేశంలో అతి ముఖ్యమైన రవాణా సాధనంగా మన రైల్వే వ్యవస్థ పనిచేస్తోంది.
రవాణా రంగంలో అతిపెద్ద వ్యవస్థ కలిగిన రైల్వేల ద్వారా ప్రతి నిత్యం లక్షలాదిగా జనం తమ ప్రయాణావసరాలను తీర్చుకుంటున్నారు. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులున్న పది సంస్థల జాబితాలో 8వ స్థానంలో భారతీయ రైల్వే నిలిచిందని ఇటీవల ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రకటించింది. ప్రస్తుతం భారతీయ రైల్వేల్లో 14 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారి సేవల ద్వారా ప్రయాణీకులు ఒక చోటు నుంచి మరో చోటుకు సురక్షితంగా చేరుకుంటున్నారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న హైడ్రోజన్ రైలు విషయానికొస్తే..దీనికి వినియోగించే ఇంధనం క్లీన్ ఎనర్జీ కిందకు వస్తుంది. హైడ్రోజన్ చాలా శక్తి వంతమైన ఇంధనం..సాధారణంగా రాకెట్ల ప్రయాణాలకు వాడుతున్నారు. భూమిపై ఇది నీరు లేదా హైడ్రోకార్బన్ల వంటి అణువుల రూపంలో కనిపిస్తుంది. హైడ్రోజన్ ఇంధనం పొందడానికి.. విద్యుద్విశ్లేషణ ప్రక్రియ అవసరం. నీటిలోంచి హైడ్రోజన్‌ను వేరు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
ఈ ప్రక్రియలో ఎలక్ట్రోలైజర్ ఉపయోగించబడుతుంది. ఎలక్ట్రోలైజర్ పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ గురించి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. హైడ్రోజన్ ఇంధనంపై ప్రభుత్వానికి ఆసక్తి పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.
వాస్తవానికి హైడ్రోజన్ అనేది ఓ అద్భుతమైన ఇంధనం. దీని శక్తి ఇతర ఇంధనాల కంటే ఎక్కువగా ఉంటుంది.
అలాగే ఇది చౌకగా లభించడం మాత్రమే కాదు తేలికగా కూడా సేకరించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 1 కిలో హైడ్రోజన్ ద్వారా దాదాపు 4.5 లీటర్ల డీజిల్ మండించడం ద్వారా వచ్చే శక్తికి సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఏ దేశానికైనా విదేశీ మారక ద్రవ్యం ఇంధనంగా చెప్పవచ్చు. మరి అంత విలువైన సంపదను మనం శిలాజ ఇంధనాల ఖరీదు కోసం వినియోగిస్తున్నాం.. ప్రపంచాన్ని త్వరలో ఆర్థిక మాంద్యం కమ్మేయనుందనే వార్తల నేపథ్యంలో మన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం చాలా అవసరం. ఇలాంటి సమయంలో.. హైడ్రోజన్ ఇంధనం ఓ మంచి ఎంపికగా చెప్పవచ్చు. ప్రధానంగా కాలుష్యనివారణ పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకంగా మారింది.. కార్బన్ డైయాక్సైడ్ ఏమాత్రం రాని హైడ్రోజన్ ఇంధనం వల్ల కాలుష్యాలను నియంత్రించడం సాధ్యమవుతుంది. ఇందులో పొగకు బదులు H2O బయటకు వస్తుంది. అంటే నీరు దీనిని నుంచి బయటకు వస్తుందన్నమాట.. ఈ నీరు కూడా కాలుష్యపూరితం కాదు.
ప్రకృతికి అవసరమైనది, ఉపయోగకరమైనదిగా చెప్పుకోవచ్చు. హైడ్రోజన్ ఇంధనం వాడకం ద్వారా అన్ని రకాలుగా ప్రయోజనకరంగా చెబుతున్నారు. ఈ మాదిరి హైడ్రోజన్ రైళ్లు ఇప్పుడు జర్మనీలో కొన్ని ప్రాంతాలలో నడుస్తున్నాయి. వచ్చే సంవత్సరంలో మన దేశంలోనూ నడవబోతున్నాయి. వీటి ప్రయాణాల ద్వారా వాతావరణంలోకి నీరు విడుదలవుతుంది. అందుకే హైడ్రోజన్ మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమమైన ఇంధనంగా చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం ప్రభుత్వం అందుకే హైడ్రోజన్ రైళ్ల పైనే స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైడ్రోజన్ తో నడిచే ఇంజన్లను మనదేశం పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఉత్పత్తి చేయనుంది.