Homeఅంతర్జాతీయంమహారాష్ట్ర లో రోడ్డుపై పారేస్తున్న ఉల్లిగడ్డ...?

మహారాష్ట్ర లో రోడ్డుపై పారేస్తున్న ఉల్లిగడ్డ…?

మనదేశంలో ఉల్లిపాయలకు ధరలేదు..అదే విదేశాలలో వాటి రేట్లు ఆకాశంలో ఉండటంతో కొనలేరు.. ఇదీ ప్రస్తుతం ఉల్లి విషయంలో జరుగుతున్న వింత పరిస్థితి. అవును మహరాష్ట్రాలలో మొన్నటికి మొన్న రైతులు విపరీతంగా ఉల్లిని సాగు చేసారు. అత్యధికంగా ఉత్పత్తి అయిన ఉల్లిని అమ్మేందుకు పోతే..కిలో రెండు రూ.లు పలికింది. దాంతో తాము కష్టపడి పండించిన వాటిని నేలపాల్జేసారు. ఇక్కడ ధర లేదు.. అక్కడ కొనలేరు..ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కన్నీరు పెట్టిస్తోంది ఉల్లి..ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత.. కానీ ఇక్కడ రేటు లేకపోతే అక్కడైనా అమ్మి పెట్టాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో రైతు కంట నీరు తప్పడం లేదు. ఫిలిప్పీన్స్‌ దేశంలో కిలో వెయ్యి రూ.లకు పైనే అమ్ముతోంది. దాయాది దేశం పాకిస్తాన్ లో 250 రూ.లకు కిలో చొప్పున కొందామన్నా దొరకడం లేదు. అటు యూకేలో సైతం కనీసపు కూరగాయలు దొరకడం లేదు. ఇటు చూస్తే మన దేశంలో కొనేవారు లేక కూరగాయలను రోడ్లపై పారబోస్తున్నారు రైతులు.

ప్రపంచ వ్యాప్తంగా ఉల్లి ధరలు రైతులు, కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బ్రిటన్‌, ఫిలిప్పీన్స్‌, పాకిస్థాన్‌, అజర్‌బైజాన్‌, తుర్కియే దేశాల్లో ద్రవ్యోల్బణ ప్రభావంతో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతుండగా మన దేశంలో మాత్రం కిలోకు రెండు రూపాయలు ఆఫర్ చేస్తుండటంతో రైతులు రోడ్లపై పారబోస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావానికి, వాతావరణ మార్పులు కూడా తోడవటంతో పలు దేశాల్లో కూరగాయలు, నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. అనేక ప్రభుత్వాలు వాటిని నియంత్రించలేక ఆపసోపాలు పడుతున్నాయి. మొరాకో, తుర్కియే, కజక్‌స్థాన్‌లు ఎగుమతులు ఆపేశాయి. ముఖ్యంగా ఉల్లి కోసం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచబ్యాంకు సైతం ప్రపంచవ్యాప్తంగా ఉల్లి కొరతపై హెచ్చరించాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ ఉల్లిపాయల్ని వంటల్లో తప్పనిసరిగా వాడతారు.

ఏటా 10.6 కోట్ల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతుంది. కానీ ఈసారి దిగుబడి తగ్గింది. స్పెయిన్‌, ఉత్తర ఆఫ్రికాల్లో కరవు తదితర వాతావరణ ప్రతికూలతలతో పంట చేతికి రాలేదు. ఫలితంగా బ్రిటన్‌లో కొరత ఏర్పడింది. ఉల్లితో పాటు అనేక కూరగాయలను కూడా రేషన్‌ పద్ధతిలో అమ్ముతున్నారు. ఇంతకుమించి కొనుగోలు చేయటానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు. పాకిస్థాన్‌లో నిరుడు వచ్చిన భారీ వరదలతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో కిలో ఉల్లి ధర 371% పెరిగి 250 రూ.లకు పైగా ధర పలుకుతోంది. ”ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఒక క్యారెట్‌, ఒక ఆలు… అంటూ వినియోగదారులు కొనుక్కోవడం చూసినప్పుడు మనవారి కడుపు తరుక్కుపోతోంది. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని మొరాకోలోని వ్యాపారులు వాపోతున్నారు. ఇక ఫిలిప్పీన్స్‌లోనైతే మాంసం కంటే ఉల్లి ధరే ఎక్కువగా ఉంది. కిలోకు 1200 రూ.లకుపైగా ధర పలుకుతోంది. అంతపెట్టినా దొరికే పరిస్థితి లేదు. విదేశాల నుంచి వచ్చేవారు విమానాల్లో ఉల్లిగడ్డలను దొంగతనంగా స్మగ్లింగ్ చేసి మరీ తెచ్చుకుంటున్నారు. ఉల్లి స్మగ్లింగ్‌పై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉజ్బెకిస్థాన్‌, తజిక్‌స్థాన్‌, అజర్‌బైజాన్‌, బెలారస్‌ల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రపంచమంతా ఉల్లి కోసం వెంపర్లాడుతుంటే… ఇక్కడ మన దేశంలోనేమో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. పండించిన పంటకు ధరలేక మహారాష్ట్రలో రైతులు ఉల్లిని రోడ్లపై పారేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి వ్యాపార కేంద్రంగా పేరొందిన నాసిక్‌ ప్రాంతంలో కిలో ధర రూపాయి లేదా రెండు రూపాయలు మాత్రమే పలుకుతోంది. సాధారణంగా మహారాష్ట్రలో ఉల్లి రైతులు మూడుసార్లు… ఖరీఫ్‌ తర్వాత రబీ లో పంటలు వేస్తారు. ఖరీఫ్‌ పంటను జనవరిలో అమ్ముతారు. తర్వాతి పంటను మే, జూన్‌లలో మార్కెట్‌లోకి తెస్తారు. ఈసారి ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు కాస్త పెరగటంతో పంట పాడవుతుందనే భయంతో ఖరీఫ్‌ తర్వాత వేసిన పంటను కూడా తొందరగా మార్కెట్లోకి తెచ్చారు. దాంతో సరఫరా పెరిగిపోయి ధర పడిపోయింది. నిల్వచేసుకునే సదుపాయాలు ఎక్కువగా లేకపోవటం రైతులకు ఇబ్బందికరంగా మారింది.

ధరల విషయంలో కనిపిస్తున్న అతిశయోక్తి కారణంగా కొంత కాలంగా రోజూ ఉల్లి గురించిన వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైతు బజార్లలో అత్యంత ఖరీదైనది, సామాన్యుడు కొనలేని స్థితిలో ఉన్న ఆహార వస్తువు ఉల్లిగడ్డ. ఉల్లి ధరలపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉల్లి గురించి చారిత్రక విశేషాలను ఒకసారి చూద్దాం. ప్రపంచంలో అనేక దేశాలలో ఉల్లిని పండిస్తున్నారు, తింటున్నారు. అంత ఆదరణ మరే కూరగాయకూ లేదు. ఉల్లిగడ్డలు పండించే ప్రయోగాలు దాదాపు 4,000 ఏళ్ల ముందు నుంచే జరిగాయి. యేల్ విశ్వవిద్యాలయం భద్రపరచిన మెసొపొటేమియా నాగరికత నాటి ఓ పత్రంలో ఆ విషయం స్పష్టమవుతోంది. 1985లో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త జీన్ బొట్టెరో ఆ పత్రాన్ని గుర్తించారు. అప్పటి వరకూ ఉల్లికి అంత చరిత్ర ఉందన్న విషయం ఆధునిక ప్రపంచానికి తెలియలేదు.

ఉల్లితో పాటు, ఉల్లి కాడలు, వెల్లుల్లి, అడవి ఉల్లిని కూడా మెసొపొటేమియన్లు వినియోగించినట్లు తెలుస్తోందని బొట్టెరో చెప్పారు. “జన్యువుల విశ్లేషణ ఆధారంగా చూస్తే ఉల్లి మూలాలు మధ్య ఆసియాలో ఉన్నాయని అర్థమవుతోంది. ఐరోపాలో ఉల్లి వినియోగం కాంస్య యుగం కాలంలో మొదలైనట్లు ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం కూరగాయల్లో ప్రపంచంలో అత్యంత ఎక్కువగా విస్తరించింది ఉల్లిగడ్డేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం, కనీసం 175 దేశాలలో ఉల్లి సాగుచేస్తున్నారు. గోధుమ పండిస్తున్న దేశాల సంఖ్యకు అది రెండింతలుగా చెబుతున్నారు. సాగు విస్తీర్ణం పరంగా చూసినా కూడా ఉల్లి ప్రపంచంలోనే అతిపెద్ద పంటగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వంటకాలన్నింటిలోనూ ఉల్లిని వాడతారు. ఉల్లి వాడకం కారణంగా వంటలకు మంచి రుచితోపాటు, పోషక పదార్థాలు కూడా తోడవుతుంటాయి. అందుకే జనం ఉల్లికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉల్లి దిగుబడిలో, వినియోగంలో భారత్, చైనా దేశాలు అగ్ర స్థానాల్లో ఉన్నాయి. దిగుబడిలో 45 శాతం వాటా ఈ రెండు దేశాలదే. వ్యవసాయ, శుద్ధి చేసిన ఉత్పత్తుల ఎగుమతుల సంస్థ (అపెడా) గణాంకాల ప్రకారం, విస్తీర్ణంలో చూస్తే చైనా కంటే భారత్‌లోనే ఉల్లి పంట అధికంగా సాగవుతోంది. కానీ, చైనాలో ఒక హెక్టారుకు సగటున 22 టన్నుల దిగుబడి వస్తుండగా, భారత్‌లో అది 14.2 టన్నులుగానే ఉంది. ఉల్లి వినియోగంలో లిబియా అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో ప్రతి వ్యక్తీ ఒక్క 2011 సంవత్సరంలోనే సగటున 33.6 కిలోల ఉల్లి తిన్నారని ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో వెల్లడైంది. అదే ఏడాది పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్‌లో ఒక్కో వ్యక్తి సగటున 21.7 కిలోలు వినియోగించారు. బ్రిటన్‌లో తలసరి ఉల్లి వినియోగం 9.3 కిలోలుగా ఉంది. భారత్‌లో రోజూ సగటున 40,000 నుంచి 50,000 టన్నుల ఉల్లిగడ్డలు వినియోగిస్తున్నారని అంచనా. ప్రస్తుతం పండుతున్న ఉల్లిలో 90 శాతం మేర ఆయా దేశాల్లోనే వినియోగానికే సరిపోతోంది. మిగిలిన 10 శాతం దిగుబడులు మాత్రమే విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉల్లిలో సహజ సిధ్దమైన చక్కెర, విటమిన్ ఎ, బీ6, సీ, ఈ, సోడియం, పొటాషియం, ఐరన్, పీచు పదార్థం, ఫోలిక్ ఆమ్లం దొరుకుతుంది.


“ఉల్లి తక్కువ కెలొరీలున్న ఆహార వస్తువు. ఇందులో కొవ్వు పదార్థాలు అస్సలు ఉండవు. విటమిన్ సి ఉల్లిలో పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల ఉల్లిలో ఉండే పోషక పదార్థాల గురించి మాట్లాడుకుంటే ఇందులో 4 మిల్లీగ్రాముల సోడియం, 1 మిల్లీగ్రాము ప్రోటీన్లు, 9-10 మిల్లీగ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 మిల్లీగ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా ఉల్లిపాయలు తినాలని సలహా ఇస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉండటం వల్ల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉల్లిపాయను తరచూ ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లి గడ్డలో 85 శాతం నీరు ఉంటుంది. ఉల్లిగడ్డను కోసినప్పుడు ‘సిన్- ప్రొపేన్‌థయాల్- ఎస్- ఆక్సైడ్’ అనే రసాయన పదార్థం వెలువడుతుంది. దానివల్లే మన కళ్లలో నీళ్లు వస్తాయి.

Must Read

spot_img