దగ్గుబాటి రానా ఒక వైపు హీరోగా చేస్తూనే ఛాన్స్ దొరికితే విలన్ గానూ మెప్పిస్తున్నాడు. లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయిన రానా.. ఆ తర్వాత వరుస సినిమాలతో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తున్నాడు రానా. ఇదిలా ఉంటే రానా హీరోగా త్వరలో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం బాలయ్య డైరెక్టర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ హంక్ రానా ‘విరాటపర్వం’ తర్వాత రూట్ మార్చుతానని ప్రామిస్ చేశారు. విరాట పర్వం ప్రచార సమయంలో మళ్లీ ఇలాంటి సినిమాలు చేయనని…ప్రయోగాలకు దూరంగా ఉంటానని..కమర్శియల్ చిత్రాలకు దగ్గరవుతానని అన్నారు. అప్పటి నుంచి రానా కమర్శియల్ కథల కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంతవరకూ ఏ దర్శకుడు ఆయన్ని ఆ తరహా కథతో మెప్పించినట్లు కనిపించలేదు.
విరాటపర్వం రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ రానా నుంచి కొత్త సినిమా కబురు రాలేదు. మరి ఈ డిలేకి కారణం ఏంటి? అంటే సరైన కథ కుదరకే సినిమా చేయలేదు అన్న వాదన తెరపైకి వస్తుంది. టాలీవుడ్ లో కమర్శియల్ కథలకి కొదవేముంది? మన రైటర్లు అంతా ఆ తరహా కథలు రాడంలో దిట్ట అయినా…రానాని మెప్పించే కథ దొరకకపోవడమే ఆసక్తికరం. ఒకప్పుడు కమర్శియల్ కథలతో హిట్లు ఇచ్చిన వారంతా ఖాళీగా ఉంటున్నారు.
సక్సెస్ ల్లో ఉన్న దర్శకులంతా పాన్ ఇండియా సినిమాలంటూ పరుగులు పెడుతున్నారు. మధ్యలో ఇలా రానా లాంటి వాళ్లు టర్న్ తీసుకుంటే? ఈ రకమైన ఇబ్బందులు. అందుకే ఇక లాభం లేదనుకున్న రానా .. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుని రంగంలోకి దించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు గుసగుస వినిపిస్తుంది. టాలీవుడ్ కమర్శియల్ చిత్రాల దర్శకులందర్నీ జల్లెడ వేసి పడితే రానాకి బోయపాటి అయితే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్లు వినిపిస్తుంది.
బోయపాటి అయితే కథలో కాస్త కొత్త దనం తో పాటు…హీరో ఎలివేషన్లు పీక్స్ లో ఇవ్వగలరు. యాక్షన్ సీన్స్ తో హీరోని ఆకాశానికి ఎత్తడంలో ఆయన తర్వాతే ఏ దర్శకుడైనా. అందుకే రానా ఇప్పుడు ఆయన వెంట పడుతున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. ఇటీవలే బోయపాటిని కలసి సరైన కథ ఉంటే చెప్పండి…సినిమా చేద్దామని ఆఫర్ చేశారట. దానికి ఆయన తప్పకుండా చేద్దామని అన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి రామ్ తో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటికి ఏ హీరోతోనూ కమిట్ మెంట్ కూడా లేదు. కాబట్టి రానా ప్లాన్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది.