Homeఅంతర్జాతీయంగ్లోబల్‌ వార్మింగ్‌తో సముద్రాలు వేడెక్కుతున్నయ్​

గ్లోబల్‌ వార్మింగ్‌తో సముద్రాలు వేడెక్కుతున్నయ్​

నిన్నమొన్నటి దాకా అమెరికా కెనడా దేశాలను పలకరించిన బాంబ్ సైక్లోన్ అల్లకల్లోలం స్రుష్టించింది. ఇంకా మంచు తుఫాన్ ప్రభావం చాలా ప్రాంతలను వణికిస్తూనే ఉంది. దాదాపు 80 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అయితే ఇప్పుడు హీట్ డోమ్ పేరుతో మరో కొత్త పేరు రంగంలోకి దిగింది. హీట్ డోమ్ కారణంగా అమెరికా పక్కనే ఉన్న యూరోప్ దేశాలలో హీట్ వేవ్ మొదలైంది. అక్కడి వారికి భరించలేని ఉక్కపోతలు మొదలయ్యాయి. శీతాకాలంలో వేసవి కాలపు ఉక్కపోతలు నమోదవుతున్నాయి. అందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా భూతాపం అపరిమితంగా పెరుగుతూ ఉండటమే అంటున్నారు వాతావరణ పరిశోధకులు. మరీ ముఖ్యంగా వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నియమించిన ఐపీసీసీ విడుదల చేసిన నివేదిక మేరకు హిందూ మహాసముద్రం అతిగా వేడెక్కుతోంది..ప్రపంచ వ్యాప్తంగా అపరిమితంగా పెరుగుతోన్న భూతాపాన్ని తక్షణమే కట్టడి చేయాలి..లేదంటే రాబోయే కొద్ది కాలంలోనే విపత్తులు మరింత భీకరంగా ఉంటాయని ఐరాస కమిటీ తన నివేదికతో హెచ్చరించింది.

మరికాస్త వివరంగా చూస్తే కొంత కాలంగా భూతాపం ప్రభావం కొన్ని దేశాలలో తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల ఊహించని స్థాయిలో ఉష్ణోగ్రతలూ హెచ్చుస్థాయిలోనే నమోదు కానున్నాయి. మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియా, అమెరికా సహా యూఏఈ దేశాలలో ముందెన్నడూ చూడనంతటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీన్ని తక్షణమే అడ్డుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇవి అదుపు తప్పుతాయి..అప్పుడు చేసేదేమీ ఉండదు.. మనం కట్టడి చేయలేం.. రాబోయే పదేళ్లలో కరవు, వడగాల్పులు, కార్చిచ్చులు, తుపాన్లు మరింత వేగంగా, తీవ్రంగా, విస్తృతంగా ఉండబోతున్నాయి. పైగా ఈ ఉష్ణోగ్రతల కారణంగా ద్రువ ప్రాంతాలలోని మంచు కరగడం కారణంగా సముద్ర మట్టాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని నాసా కూడా హెచ్చరించింది.

భూతాపంపై ఐపీసీసీ వెల్లడించిన ఈ ఆందోళనకర విషయాలపై పలు దేశాలలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కొన్ని దేశాలలో ఇలాంటి తీవ్ర పరిస్థితులు కొనసాగుతున్నాయి. అరుదుగా..వందేళ్లకోసారి సముద్రమట్టం పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు..రేపటి కాలంలో తరచూ సంభవించే అవకాశం ఉంది. ఓ అంచనా మేరకు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమై ప్రతీ ఏటా ఇలాంటి విపత్తులు క్రమం తప్పకుండా సంభవిస్తాయని నివేదిక హెచ్చరించింది. సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దమంతా కొనసాగుతుందని అంచనా వేసింది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కొన్ని తీర ప్రాంత దేశాలను సముద్రం కబలించే అవకాశాలు లేకపోలేదు.

ఇప్పుడున్న భూతాపం మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగితే..పరిస్థితులు దారుణంగా మారతాయి. తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘకాలం వేసవి వాతావరణం, చలికాలం నిడివి గణనీయంగా తగ్గడం సంభవిస్తాయి. ఈ సంచలన విషయాలను పూర్తి అధ్యయనం తరువాత నివేదిక రూపకర్తలు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల మార్కును కూడా దాటితే తీవ్రత మరింత పెరిగి వ్యవసాయంపైనా, ఆరోగ్యంపైనా పెను ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు… ఇక నుంచి తరచూ నమోదవుతాయి. అదే వరసలో భూతాపం మరో డిగ్రీ మేర పెరిగితే ఈ ముప్పు ప్రతి ఏటా కనిపిస్తుందని స్పష్టం చేశారు.

‘‘భూతాపం పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకుముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ హద్దును దాటే ప్రమాదం పొంచి ఉంది. అయితే తగిన చర్యలు తీసుకున్నా పెరిగిన భూతాపం తగ్గడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది. ఇదంతా ఓ చైన్ రియాక్షన్ ను పోలి ఉంటుందని వారు చెబుతున్నారు. గతంలో ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం… భూతాపాన్ని 1.5 డిగ్రీల మేర తగ్గించాలని ప్రపంచదేశాలన్నీ లక్ష్యం నిర్దేశించుకున్నాయి.

అయితే వాటి అమలులో చూపిస్తున్న అలసత్వం కారణంగా 2030 నాటికి భూతాపం 1.5 డిగ్రీల మేర పెరిగిపోతుందని ఐపీసీసీ హెచ్చరించింది. భూతాపంపై తాజా నివేదికను మానవాళికి రాబోయే రోజుల్లో జరగబోయే ప్రళయంగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ఇది ఏ ఒక్క దేశానికో కాదు..భూమండలంపైన ఉండే సమస్త ప్రాణికోటి తీవ్ర విపత్తును ఎదుర్కొంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 234 మంది శాస్త్రవేత్తలు అన్ని ప్రాంతాలలో చేసిన రీసెర్చ్ తరువాత 3 వేలకుపైగా పేజీల్లో నివేదికను రూపొందించారు.

ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా భారత్‌ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. వాయు ఉద్గారాల పెరుగదల కారణంగా గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. మిగతా సముద్రాలతో పోల్చితే- హిందూ మహాసముద్రం త్వరగా వేడెక్కుతోంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్‌లో వానాకాలం చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఇది అనేక సమస్యలకు కారణం కానుంది. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమ కోల్పోతుందని, కరవు పరిస్థితులు అధికమవుతాయని ఈ పరిశోధనలో పాలు పంచుకున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టాపికల్‌ రీసెర్చ్‌ నిపుణుడు చెబుతున్నారు.

పట్టణీకరణకు, పట్టణాల్లో వర్షపాతం పెరగడానికి మధ్య అనివార్యమైన సంబంధం ఉందంటున్నారు. ప్రపంచం ఇంతలా భూతాపం ప్రభావానికి లోనుకావడం వెనుక ఐదు కీలక అంశాలు ఉన్నాయి. అన్నింటికన్నా మొదటిది మానవ తప్పిదం. పారిశ్రామికీకరణకు ముందు నుంచే కార్బన్‌-డై-ఆక్సైడ్‌, మీథేన్‌ వంటి వాతావరణాన్ని వేడెక్కించే వాయువుల విడుదల ఆరంభమైంది. విపరీతమైన విద్యుత్ వినియోగం, పరిశ్రమలలో బొగ్గు, కలప, సహజ వాయువులను మండించడమే ఇందుకు ప్రధాన కారణం. నిజానికి ఉష్ణోగ్రతలు పెరగడంలో ప్రకృతి శక్తుల పాత్ర చాలా స్వల్పంగా ఉంటుంది..

అవసరాలకు మించి వాహనాలను వినియోగించడంతో ఇంధన వినియోగం పెరిగింది. వాటి నుంచి వెలువడే ఉష్ణోగ్రతలు భూతాపానికి కారణమవుతున్నాయి. గతంలో పర్యావరణంపై పారిస్ లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆపై ప్యారిస్‌ వాతావరణ ఒప్పందానికి దాదాపు అన్ని దేశాలూ అంగీకరించాయి. భవిశ్యత్తులో ఏం చేయాలో అన్న విషయంపై పలు తీర్మాణాలు చేసారు. 19వ శతాబ్దపు ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకుని… 2100 సంవత్సరం నాటికి భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్‌కు కట్టడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటనివ్వకుండా ప్రయత్నించాలని కూడా గట్టిగా నిర్ణయించాయి.

కానీ, వాటి అమలు విషయంలో ఎవరికి వారు ప్రదర్శించిన అలసత్వం కారణంగా 2030 నాటికి, లేదా అంతకుముందే భూతాపం 1.5 డిగ్రీల సెంటీగ్రేడు హద్దును దాటేసే పరిస్థితి అనివార్యం కానుంది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతోంది. ఫలితంగా సముద్ర నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. వేడి గాలులు, కరవు, తుపాన్లు, వరదలు, కార్చిచ్చులు మరింత అధికమవుతాయి. ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా, భీకరంగా సంభవించే ముప్పుంది.

మంచు కరగడం వల్ల సముద్రాల్లో నీటి మట్టాలు పెరుగుతాయి. దీనివల్ల సముద్ర జలాలలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోతాయి.. దాంతో అవి మరింతగా యాసిడిటీ గా మారిపోతాయి ఇదే గాని జరిగితే… వందల, వేల సంవత్సరాల పాటు కోలుకోలేని దెబ్బ తగిలినట్టే.. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. తీర ప్రాంత దేశాలకు ఇది చాలా ప్రభావం చూపించనుంది. ఆ మేరకు జనవాసాలు నీట మునుగుతాయి.ఏది ఏమైనా గత కొన్ని వేల సంవత్సరాలతో పోల్చితే వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు చాలా విస్తృతంగా, వేగంగా, తీవ్రంగా ఉంటున్నాయి. వచ్చే దశాబ్దంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల కట్టడికి తక్షణం సమర్థ చర్యలు తీసుకోవాలి. అలాగైతేనే ముప్పును కొంతవరకూ తగ్గించుకోవచ్చు.

Must Read

spot_img