Homeఅంతర్జాతీయంఫార్మింగ్ పై ఇప్పుడు యువత దృష్టి సారిస్తోంది..

ఫార్మింగ్ పై ఇప్పుడు యువత దృష్టి సారిస్తోంది..

  • వ్యవసాయిక దేశమైన భారత్ లో యువత .. సాగుకు సాయం చేసేందుకు ముందడుగు వేస్తున్నారా..?
  • పెద్ద ఉద్యోగాల్ని వద్దంటూ.. పొలాల్లో రైతుకు అండగా నిలుస్తున్నారా..?
  • వీరికి ఆధునిక సాంకేతికత సైతం మద్ధతు పలుకుతోందా..?
  • వన్ డే ఫార్మింగ్, ఫార్మింగ్ టూరిజం .. ఇప్పుడీ పదాలు .. యువతలో ట్రెండింగ్ గా మారాయా..?
  • సాఫ్ట్ వేర్ కొలువులతోనే కాక వ్యవసాయానికి సై అంటున్నారా..?

మహర్షి .. సినిమాలో .. వన్ డే ఫార్మింగ్ గురించిన చర్చ .. ఇప్పుడు యావత్ యువతలోనూ వ్యవసాయంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ సినిమాలో యువత ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు వ్యవసాయంపై మక్కువ ప్రదర్శించడం, మమేకం కావడం .. వల్లనే దేశ ఆర్థికాభివృద్ధి మాత్రమే కాక యువతకు ఉపాధిగా మారుతుందని అంచనాలు వెల్లువెత్తాయి.

నేటి ఆధునిక సాంకేతిక యుగం.. ఐటీ చదువులు మొదలు అంతరిక్ష జ్ఞానంనం వరకు ఎదిగిపోయింది. కానీ మనిషి బతకడానికి మూలాధారమైన వ్యవసాయాన్ని మాత్రం అన్ని రంగాలకు ధీటుగా అభివృద్ధి చేయలేకపోతోంది. ఆహార భద్రత మరింత అవసరమని ప్రపంచ వేదికలు చెబుతున్నా నిర్లక్ష్యానికి గురవుతోంది.

ఇలాంటి తరుణంలో నగరానికి చెందిన ముగ్గురు యువకులు నగర శివారు ప్రాంతంలో సాయిల్ ఈజ్ అవర్ సోల్ అనే వ్యవసాయ క్షేత్రాన్ని సృష్టించి నేటి తరం యువతను వ్యవసాయం వైపుకు మళ్లించేలా వన్ డే ఫార్మింగ్, ఫార్మింగ్ టూరిజం అంటూ వినూత్న కార్యక్రమాలను చేపట్టారు.

ఐటీ ఉద్యోగులతో పాటు నగరంలోని విద్యార్థులను తమ క్షేత్రానికి తీసుకెళ్లి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. ఘట్ కేసర్ సమీపంలోని 18 ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం పురుడు పోసుకుంది. ఇక్కడ వరితో పాటు తృణ ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, ఫలాలు, ఔషధాలు సాగు చేస్తున్నారు.

బీటెక్ అగ్రికల్చర్ చదివిన రాకేష్, ఐటీరంగంలో అనుభవమున్న మురళీధర్ రావు, శ్రీనివాస్ అనే యువ కర్షకులు ఈ క్షేత్రంలో నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. వ్యవసాయాన్ని విద్యగా మార్చాలని, యువతను సాగు వైపుకు తీసుకురావాలనే సంకల్పలంతో కలిసికట్టుగా మూడేళ్లు శ్రమించి, ఈ క్షేత్రాన్ని తయారుచేశారు.

వన్ డే ఫార్మింగ్ లో భాగంగా వరినాట్లు వేయడం, నీటిపారుదల, కలుపు తీయడం, కూరగాయలు తుండం, చీడపీడల నివారణ తదితర కార్యక్రమాల్ని వివరిస్తూ, రోజంతా రైతులు పడే కష్టాన్ని వివరిస్తారు. ఈ ఫార్మింగ్ టూరిజం కోసం పలు ఐటీ కంపెనీల నుంచి పలువురు వీకెండ్ సెలవుల్లో ఇక్కడ వాలిపోతున్నారు.

మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియని నగర విద్యార్థులకు పంటలు ఎలా పండుతాయనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రాజెక్టుల్లో భాగంగా పాఠశాలలు తమ విద్యార్థులను ఇక్కడికి తీసుకువస్తున్నాయి. మట్టిని తాకితే అపరిశుభ్రం అనే భావనను తొలగించి, మట్టిలో యాక్టినో మైసిటిన్ వంటి బ్యాక్టీరియాలు ఉంటాయని చెబుతూ అవి చేసే సాయాన్ని వివరిస్తున్నారు.

బురద మట్టిలో కబడ్డీ, ఫుట్ బాల్ వంటి మడ్ గేమ్స్ ఏర్పాటు చేసి, మళ్లీ మట్టికి మనుషుల్ని దగ్గర చేస్తున్నారు. వ్యవసాయ డిప్లమో, అగ్రికల్చర్ బీటెక్ విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని ఇంటర్న్ షిప్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నారు. వ్యవసాయం గత వైభవాన్ని, పురాతన పద్ధతులను నేటి తరానికి చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నేలను లీజుకు తీసుకున్నామని, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ విధానంతో .. రచ్చబండ, మంచె, తాటి పాకలు ఏర్పాటు చేసి, సహజమైన జీవనాన్ని రూపొందిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

రసాయనాలు వాడకుండా కూరగాయలు, వరి, పసుపు, అల్లం, కంది, కుసుమ, పశు గ్రాసం సాగు చేస్తున్నామని, వీటితో పాటు మామిడి, జామ, సపోట, పనస, ఉసిరి, సీతాఫలాలు, అలాగే టేకు, మహాగని, సాండిల్, రోజ్ వుడ్ వంటి కలప మొక్కలనూ పెంచుతున్నారు. సమీకృత వ్య వ్యవసాయంలో భాగంగా ఆవులు, కోళ్లు, కుందేళ్లు, చేపలు పెంచుతూ .. వీటి ద్వా రా వచ్చే ఎరువులను సేంద్రీయ ఎరువులుగా వినియోగిస్తున్నారు.

  • పది, ఇరవై ఏళ్లకు లాభాలను అందించేలా దీర్ఘకాలిక వృక్షాలనూ పెంచుతున్నారు.

పచ్చని పంట పొలాల్లో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతూ సంతృప్తి చెందుతున్న చదువుకున్న యువకుల సాగు లాభాల పంట పండిస్తోంది. నూతన వ్యవసాయ పద్ధతులను ఇతర రైతులకు సైతం చెబుతూ, వారిని తమ మార్గంలోకి మళ్లేలా ప్రయత్నిస్తున్నారు. ఆయా రంగాల్లోని యువ రైతులు సంయుక్తంగా తమ ఉత్పత్తులను నేరుగా వివియోగదారులకే చేరవేసేలా మార్కెటింగ్ కూడా చేస్తూ లాభాలు గడిస్తున్నారు.

నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అత్యధిక దిగుబడులు సాధిస్తూ, పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు విశ్లేషకులు .. యువత వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు. భారతదేశం ఒక యువ దేశం ఎందుకంటే ప్రతి ముగ్గురిలో ఒకరు 25 సంవత్సరాల కంటే తక్కువ. 54 శాతం మంది 40 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నారు. సగటు శ్రామికుని వయస్సు 28 సంవత్సరాలుగా ఉంటోంది.

వ్యవసాయం మినహా ప్రతి రంగం యువత క్రియాశీల భాగస్వామ్యాన్ని పొందుతోంది, అయితే ఇక్కడ సగటు రైతు వయస్సు 50కి పైగా ఉంటుంది. వృద్ధాప్యం భారతదేశానికి ఇంకా తీవ్రమైన ముప్పుగా ఉండకపోవచ్చు, కానీ వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ప్రభావాన్ని చూపవచ్చన్నది వీరి అంచనా.

దాదాపు 5 శాతం మంది యువత వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు కానీ 60 శాతం మంది గ్రామీణ ప్రజలు పూర్తిగా లేదా పాక్షికంగా వ్యవసాయం, దాని సంబంధిత కార్యకలాపాల నుండి జీవనోపాధి పొందుతున్నారు. స్పష్టంగా, ఆధునిక యువత వ్యవసాయం పట్ల విరక్తి చెంది, దానిని వృత్తిగా విస్మరిస్తున్నారు.
వ్యవసాయ జనాభా, తత్ఫలితంగా, వృద్ధాప్యం అవుతోంది.

వ్యవసాయం దాని పూర్తి సామర్థ్యానికి ఎదగకుండా ఇది నిరోధించవచ్చు కాబట్టి ఇది భవిష్యత్తుకు హానికరమని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువత మరింతగా వ్యవసాయంలోకి రావాలని వీరంతా కోరుతున్నారు. భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చడంలో భారతీయ వ్యవసాయం పెద్ద పాత్ర పోషించబోతోంది. అయితే ఇందులో గణనీయమైన మార్పులు రావాల్సి ఉంది.

ముఖ్యంగా స్థూల వాతావరణంలో, సమాజం మైండ్‌సెట్‌లో మార్పు.. యువతలో వ్యవసాయదారులుగా మారడానికి ఆకాంక్షలను వేగవంతం చేస్తుంది. వ్యవసాయ, అనుబంధ స్పెక్ట్రమ్‌లో యువతకు నైపుణ్యాలు, ఫుడ్ ప్రాసెసింగ్, సెకండరీ AGRI సెటప్, వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి, మరిన్ని సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించడం, తీసుకురావడం, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, వివిధ వస్తువుల కోసం సముచితమైన సరఫరా, విలువ ఆధారిత గొలుసులను ఏర్పాటు చేయడం, యువ రైతులకు ఆర్థిక ప్రవాహాన్ని ప్రోత్సహించడం, తేనె, పుట్టగొడుగుల పెంపకం వంటి ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం కీలకమని నిపుణులు చెబుతున్నారు.

అదే జరిగితే, భారతదేశ వ్యవసాయం లో యువత భాగస్వామ్యాన్ని పొందుతుందని అంచనా వేస్తున్నారు. ఉపాధి, ఉద్యోగ, వాణిజ్య, వ్యాపార, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ వికాసం, ఆహార సమృద్ధి, పోషకాహార లభ్యత, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అంశాల్లో భారత్ గొప్ప విజయాల్ని సాధిస్తుందని వీరంతా అంటున్నారు. దీనికి యువత మద్ధతు అత్యంత కీలకమని, ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాలని కూడా నిపుణులు ఆశిస్తున్నారు. అదేసమయంలో వన్ డే ఫార్మింగ్, ఫార్మింగ్ టూరిజం వంటివి .. మరింత ఆసక్తిని యువతలో కలగజేస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మహర్షి సినిమాలో చర్చించిన ఫార్మింగ్ పై ఇప్పుడు యువత దృష్టి సారిస్తోంది. వన్ డే ఫార్మింగ్ కు వీకెండ్స్ లో తరలివస్తోంది.

Must Read

spot_img