ఉత్తరకొరియా గతేడాది రికార్డు స్థాయిలో క్షిపణులను ప్రయోగించింది.. గతంలో ఎన్నడూ ప్రయోగించని విధంగా గతేడాది అనేక క్షిపణులను ప్రయోగించింది.. ఉత్తరకొరియా అణ్వాయుధాల దేశంగా అవతరించిందని కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు..
ఉత్తరకొరియా క్షిపణుల ప్రయోగాలతో కొరియా ద్వీపకల్పంలో ఆందోళనలు మొదలయ్యాయా..? ఉత్తర కొరియా లోపల ఏం జరుగుతోంది..? చైనాతో ఉన్న సరిహద్దులను ఉత్తర కొరియా చివరికి 2023లో తెరవనుందా..? చైనీయులు కొరియా దేశంలో ప్రవేశించటానికి అనుమతిస్తుందా..? సరఫరాలు తిరిగి మొదలవుతాయా..?
ఉత్తర కొరియా 2022లో రికార్డు సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఒక్క ఏడాదిలోనే ఇంతకు మునుపెప్పుడూ ప్రయోగించని క్షిపణులను పరీక్షీంచింది నార్త్ కొరియా.. తన దగ్గరున్న అన్ని క్షిపణుల్లో నాలిగింట 2022లోనే ఉత్తర కొరియా లాంచ్ చేసింది. ఉత్తర కొరియా అణ్వాయుధాల దేశంగా అవతరించిందని కూడా కిమ్ జోంగ్-ఉన్ ఈ ఏడాదిలోనే ప్రకటించారు.
ఈ ప్రకటన కొరియన్ ద్వీపకల్పంలో ఆందోళనలను మరింత పెంచింది. 2017 ఉద్రిక్తతల సమయంలో ‘అమెరికా ఆగ్రహాగ్ని’ని ఉత్తర కొరియా చవిచూస్తుందని నాటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు. 2022లో అణ్వాయుధ దేశంగా అవతరించామని ప్రకటించటంతో పాటు.. రికార్డు సంఖ్యలో క్షిపణుల ప్రయోగించిన కిమ్.. మున్ముందు ఏం చేయబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది..
కిమ్ అణుబాంబు పరీక్షిస్తారా..?
2022లో ఉత్తర కొరియా తన ఆయుధాల విషయంలో గణనీయమైన పురోగతి సాధించింది. దక్షిణ కొరియా లక్ష్యంగా రూపొందించిన తక్కువ రేంజ్ గల క్షిపణులను పరీక్షించడం ద్వారా ఏడాదిని ప్రారంభించింది. జపాన్ ను లక్ష్యంగా చేసుకుని మిడ్-రేంజ్ క్షిపణులు తయారు చేసింది. ఏడాది చివరి కల్లా అత్యంత శక్తిమంతమైన ఖండారత బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్-17ను విజయవంతంగా ప్రయోగించింది.
అమెరికా భూభాగంపై ఎక్కడైనా ఈ క్షిపణి ద్వారా దాడి చేయొచ్చు. సెప్టెంబర్‌లో ఉత్తర కొరియాను అణ్వాయుధాల దేశంగా ప్రకటించిన తర్వాత, ఈ ఆయుధాలను కేవలం యుద్ధాన్ని నిలువరించడానికే కాకుండా, యుద్ధంలో గెలించేందుకు కూడా తాము ఉపయోగించనున్నామని కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఏడాది ముగుస్తున్న సమయంలో, 2023 కోసం లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు తన అధికారిక కార్మికుల పార్టీ సభ్యులతో కిమ్ సమావేశమయ్యారు.
అణ్వాయుధాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలన్నది కొత్త ఏడాది లక్ష్యాలలో అగ్ర స్థానంలో ఉంది. చిన్న, వ్యూహాత్మక అణ్వాయుధాలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయాలని కిమ్ చెప్పారు. దక్షిణ కొరియాతో యుద్ధం చేస్తే వాటిని ఉపయోగించాలన్నది ఉద్దేశం. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామంగా కార్నెగీ ఎండోమెంట్
ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లోని అణ్వాయుధాల నిపుణుడు అంకిత్ పాండా అభిప్రాయపడ్డారు.
ఉత్తర కొరియా వ్యూహాత్మక అణ్వాయుధాలను తయారు చేసేందుకు, తొలుత ఆధునిక టెక్నాలజీతో చిన్న క్షిపణులలో లోడ్ చేయగలిగే న్యూక్లియర్ బాంబును ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ, అలాంటి అణు పరీక్ష 2022లో జరగలేదు. 2023లో ఇది జరిగే అవకాశం ఉంది. కిమ్ న్యూఇయర్ లక్ష్యాల్లో మరొకటి, స్పై శాటిలైట్ . ఈ ఏడాదిలోనే దీన్ని నింగిలోకి లాంచ్ చేసి కక్ష్యలోకి పంపనున్నామని కిమ్ చెబుతున్నారు.
2023లో కూడా 2022 మాదిరిగానే ఎక్కువ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుందని, ఉత్తర కొరియా దేశం దూకుడుగా ముందుకెళ్తుందని అంచనాలు ఉన్నాయి.
తన అణ్వాయుధాల గిడ్డంగులను మరింత విస్తరించి, ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఉల్లంఘిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.. నిజానికి.. కొత్త ఏడాదిలో ప్రవేశించి మూడు గంటలు గడవక ముందే ఉత్తర కొరియా ఈ ఏడాది తన తొలి క్షిపణి పరీక్షను నిర్వహించింది. అయితే.. ఆ దేశం ఈ ఏడాది చేసే చాలా క్షిపణి ప్రయోగాలు.. పరీక్షలు కాకపోవచ్చునని, శిక్షణ కసరత్తులు కావచ్చునని పాండా అంచనా వేశారు.
ఘర్షణ తలెత్తే పక్షంలో తన క్షిపణులను వాడటానికి ఉత్తర కొరియా సిద్ధమవుతోందని పాండా పేర్కొన్నారు..
ఉత్తర కొరియా చైనా, రష్యాలకు దగ్గరగా చేరువవుతోంది..!
కొత్త ఏడాది ఈ లక్ష్యాలను చూస్తుంటే, ఉత్తర కొరియా అధ్యక్షుడు ఈ ఏడాది కూడా అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. 2019లో జరిగిన అణు నిరాయుధీకరణ తుది దశ చర్చలు ముందుకు సాగలేదు.
అప్పటి నుంచి కిమ్ ఈ చర్చలు జరిపేందుకు అంత ఆసక్తి చూపడం లేదు. ఉత్తర కొరియా గత ఏడాది కాలంగా.. చైనా, రష్యాలకు దగ్గరగా చేరువవుతోంది.దీని కోసం తన విదేశీ విధానాన్ని కూడా ప్రాథమికంగా మార్చే ప్రక్రియలో ఉందని.. 20 ఏళ్లుగా అమెరికా ప్రభుత్వానికి ఉత్తర కొరియా నిపుణురాలిగా పనిచేసిన రాచెల్ మిన్‌యంగ్ లీ అభిప్రాయపడ్డారు.. ఒకవేళ ఉత్తర కొరియా తన రక్షణకు, మనుగడకు అమెరికా అవసరం లేదని భావిస్తే, అది భవిష్యత్ అణు చర్చలపై ప్రభావం చూపనుందని భావిస్తున్నారు.
ఇదే సమయంలో, కొరియా ద్వీపకల్పంలో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియా ‘రెచ్చగొట్టే చర్య’కు పాల్పడిందని భావించినప్పుడల్లా.. దక్షిణ కొరియా అదే రీతిలో తిప్పికొడుతోంది. కొన్నిసార్లు అమెరికా కూడా అదే రీతిలో ప్రతిస్పందిస్తుంది. 2022 మే నెలలో దక్షిణ కొరియాకు కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత నుంచి ఇది మరింత తీవ్రతరమైంది.
మిలటరీ బలంతో స్పందించటం ద్వారానే ఉత్తర కొరియాకు చెక్ పెట్టవచ్చని దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్-యోల్ నమ్ముతున్నారు. ఉత్తర కొరియా పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగిస్తున్న ఈ సమయంలో, అమెరికాతో కలిసి మరిన్ని సైనిక కార్యకలాపాలను దక్షిణ కొరియా అధ్యక్షుడు పునఃప్రారంభించారు. దీంతో దెబ్బకు దెబ్బ అన్నచందంగా ఇరువైపుల నుంచీ చర్యలు, ప్రతి చర్యలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలూ సరిహద్దుల్లో యుద్ధ విమానాలను తిప్పారు. సముద్రంలోకి ఫిరంగులను కూడా పేల్చారు.
ఉత్తర కొరియా అనూహ్యంగా నాలుగు డ్రోన్లను దక్షిణ కొరియా ఎయిర్‌స్పేస్‌లోకి పంపడంతో, గత వారం ఈ పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఈ డ్రోన్లను అడ్డుకోవడంలో దక్షిణ కొరియా విఫలమైంది. ఇది ఆ దేశ రక్షణలో ఉన్న బలహీనతను ఎత్తి చూపింది.
సాధారణంగా ఉత్తర కొరియా కార్యకలాపాలను పెద్దగా పట్టించుకోని సామాన్య దక్షిణ కొరియా ప్రజల్లో భయాందోళనలను రేపింది..
ఉత్తర కొరియా రెచ్చగొట్టే ప్రతి దానికి తాము గట్టి సమాధానం చెప్పి తీరుతామని దక్షిణ కొరియా అధ్యక్షుడు ప్రజలకు వాగ్దానం చేశారు. ఇరు కొరియా దేశాల మధ్యలో 2023లో దాడులు తలెత్తే అవకాశం ఉందని, ఈ దాడుల వల్ల మరణాలు కూడా సంభవించవచ్చని.. ఉత్తర కొరియా చర్యలను గమనిస్తున్న అనాలసిస్ సర్వీస్ కొరియా రిస్క్ గ్రూప్ సీఈవో చాద్ ఓకారోల్ అన్నారు.
ఒక పొరపాటు లేదా తప్పుడు లెక్కల వల్ల పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నాయి. 2023లో ఉత్తర కొరియా తన ప్రజల కోసం ఏం చేయనుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సరిహద్దు మూసివేతతో మూడేళ్ల పాటు ఉత్తర కొరియా కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేసింది. కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు వాణిజ్యాన్ని కూడా నిరోధించింది.
దీని వల్ల తీవ్ర ఆహార, ఔషధ కొరత ఆ దేశంలో నెలకొన్నట్టు మానవతా సంస్థలు భావించాయి. గత ఏడాది కిమ్ ‘ఆహార సంక్షోభం’ గురించి ప్రస్తావించారు. 2022 మే నెలలో ఉత్తర కొరియాలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైనట్టు ధ్రువీకరించింది. కానీ, ఆ తర్వాత కొన్ని నెలలకే దీన్ని ఎదుర్కొన్నట్టు పేర్కొంది.
చైనా సరిహద్దులను తెరవటం ఆశావహంగా ఉంది. ఉత్తర కొరియా.. తన చైనా సరిహద్దుల్లో నివసిస్తున్న ప్రజలకు పూర్తిగా వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు చెప్తున్నారు.
అయితే.. ప్రపంచవ్యాప్తంగాను, ముఖ్యంగా సరిహద్దు దేశం చైనా నుంచి కరోనా మహమ్మారి పోయేంత వరకు ఉత్తర కొరియా తన సరిహద్దులను పూర్తిగా తెరవదని లీ అంటున్నారు. మరో ముఖ్యమైన పరిణామాన్ని కూడా మనం గమనించాలి. కిమ్ తర్వాత ఉత్తర కొరియాను ఎవరు పాలిస్తారనే దానిని కూడా పరిశీలించాలి.
ఇప్పటి వరకు కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఎవరన్నది అస్పష్టంగా ఉంది. కానీ, తొలిసారి గత ఏడాది తన పిల్లల్లో ఒకరు, తన కూతురు ‘కిమ్ చు ఏ’ను ఆయన పరిచయం చేశారు. మూడు మిలటరీ కార్యకలాపాల్లో ఆమెతో కలిసి తిరిగిన ఫోటోలు బయటికి వచ్చాయి. న్యూఇయర్ సందర్భంగా మరిన్ని ఫోటోలు కూడా విడుదలయ్యాయి. దీంతో కిమ్ తర్వాత ఉత్తర కొరియా బాధ్యతలను చేపట్టేది ఆమెననే ఊహాగానాలు పెరిగాయి.
గతేడాది రికార్డు స్థాయిలో క్షిపణులను ప్రయోగించింది ఉత్తర కొరియా.. అంతేకాదు.. ప్రపంచంలోనే అణ్వాయుధాల దేశంగా అవతరించిందని ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్.. ఈ ఏడాది నార్త్ కొరియా ఎలాంటి ప్రయోగాలు చేస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్సే..