ఉత్తరకొరియా నియంత కిమ్.. తరచుగా క్షిపణి ప్రయోగాలతో శత్రుదేశాలకు సవాల్ విసురుతుంటారు.. కిమ్ ఎల్లప్పుడూ సైన్యం బలోపేతం, క్షిపణి ప్రయోగాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు.. ప్రస్తుతం ఉత్తరకొరియా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందనే వార్త చర్చనీయాంశంగా మారింది..
ఉత్తరకొరియాలో ఇప్పటికే ఆకలి మరణాలు సంభవిస్తున్నాయా..?.
ఉత్తరకొరియా అంటేనే మనకు మొదట గుర్తొచ్చేది ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఉత్తరకొరియా నియంత కిమ్ పాలనలో ఆ దేశ ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్నారని సమాచారం బయటకు వచ్చింది.. ఆ దేశంలో ప్రజలకు తినడానికి ఆహారం లభించడమే కష్టంగా మారిందట. జనాలు ఆకలి తీర్చుకునేందుకు కావాల్సిన కనీస ఆహారం కూడా ఆ దేశంలో దొరకడం లేదని, ఆహార సరఫరా చాలా తక్కువగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తర కొరియాలో ఆకలి చావులు నమోదయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం క్షిపణి ప్రయోగాలతో వార్తల్లో నిలిచే ఉత్తరకొరియా
తీవ్ర ఆహార సంక్షోభంలో చిక్కుకుందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి..
1990 దశకంలో లాంటి అత్యంత దారుణమైన కరువు, ఆహార కొరత పరిస్థితులను ప్రస్తుతం ఉత్తర కొరియా ఎదుర్కొంటోందని నిపుణలు వెల్లడించారు. 1990 దశకంలో కఠినమైన సమయంగా చెప్పుకునే ఆ కాలంలో ఆకలి కారణంగా లక్షలాది మంది ఉత్తర కొరియాలో చనిపోయారు. మొత్తం జనాభాలో 3 శాతం మంది వరకు అప్పట్లో మరణించారు. ప్రస్తుతం కూడా కరువు ఆ దేశంలో ఆహార కొరత ఆ స్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్ డేటా, శాటిలైట్ ఇమేజ్‍లు, ఐక్యరాజ్య సమితి, దక్షిణ కొరియా అధికార వర్గాల అంచాలను బట్టి ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తినట్టు వెల్లడవుతోంది. ప్రజల ఆకలిని తీర్చేందుకు కావాల్సిన కనీస అవసరాల కంటే తక్కువ ఆహారం ప్రస్తుతం ఆ దేశంలో ఉందని తెలుస్తోంది. ప్రజలకు తీవ్రమైన ఆహార కొరత ఏర్పడిందని సమాచారం. ఈ విషయాన్ని పీటర్సన్ ఇన్‍స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ రీసెర్చ్ అనలిస్ట్ లుకాస్ రెంగిఫో కెల్లర్.. వెల్లడించారు.. ఉత్తర కొరియాలో ఆహారం విషయంలో ఉన్నత వర్గాలకు మిలటరీకి ప్రాధాన్యత ఉంటుందని కెల్లర్ చెప్పారు.
ఇప్పటికే ఉత్తర కొరియాలో ఆకలి వల్ల మరణాలు సంభవిస్తున్నాయని దక్షిణ కొరియా భావిస్తోంది. కొవిడ్-19 మహమ్మారికి ముందే ఉత్తర కొరియాలో సగం మంది పోషకాహార లోపంతో ఉన్నారని యూఎన్ ఫుడ్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది. అయితే కొవిడ్-19 వ్యాప్తి తర్వాత ఉత్తరకొరియాలో పరిస్థితులు మరింత దిగజారాయి. మూడేళ్లుగా ఆ దేశం సరిహద్దులను పూర్తిగా మూసేసింది. కొద్దిపాటి దిగుమతులు కూడా నిలిచిపోయాయి. ప్రపంచంలోని ఇతర దేశాలతో వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేసింది ఉత్తర కొరియా. దీంతో వ్యవసాయం కూడా ఆ దేశంలో గణనీయంగా తగ్గిపోయిందని నిపుణులు చెబుతున్నారు. పంటల సాగు పడిపోయిందని వెల్లడించారు. అలాగే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. ఆహార సంక్షోభంపై కాకుండా క్షిపణుల ప్రయోగాలపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా పరిస్థితి తీవ్రంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలోనూ ఆయుధాలు, క్షిపణుల ప్రయోగాలకే ఆ దేశం ఎక్కువగా ఖర్చు చేసిందని అంటున్నారు. కిమ్ ఒంటెద్దు పోకడలతో ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
అక్కడి ప్రజలకు కనీసం తినడానికి ఆహారం కూడా లభించని పరిస్థితులు నెలకొన్నాయా..?
ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ నియంత పోకడలు తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారి తీస్తున్నాయి. తీవ్రమైన ఆహార పదార్థాల కొరత కారణంగా చాలా మంది ఆకలితో చనిపోయిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది. కరోనా కట్టడి చర్యలకు తోడు పలు దేశాలు విధించిన ఆంక్షల కారణంగా దిగుమతులకు కూడా అవకాశం లేక.. ఆహార సంక్షోభం తలెత్తిందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చర్యలు చేపట్టారు. ఇప్పటికే అధికార పార్టీ ప్రముఖులతో సమీక్ష నిర్వహించిన కిమ్.. ఉత్తర కొరియాలో వ్యవసాయ రంగం పరిస్థితులపై చర్చించారు. ఆహారోత్పత్తులను పెంచేందుకు ఇప్పటివరకూ చేపట్టిన చర్యలను సమీక్షించారని ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది.
ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థపై వ్యవసాయ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ, తక్షణం చేపట్టాల్సిన ముఖ్యమైన చర్యలపై కిమ్ చర్చించారు. అయితే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మాత్రం అధికారిక మీడియా వెల్లడించలేదు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని.. ఇటీవల ఉత్తర కొరియా అధికార పార్టీ పొలిట్‌బ్యూరో అభిప్రాయం వ్యక్తం చేసింది. 1990వ దశకంలోనూ.. ఇలాంటి సంక్షోభం ఎదురైందని, అప్పట్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసింది. అయితే ప్రస్తుతం ఆ స్థాయి దుస్థితి లేదని అంటున్నారు. 2011లో కింగ్ జాంగ్ ఉన్ అధికారం చేపట్టినప్పటి నుంచే ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం మొదలైందని పరిశీలకులు అంటున్నారు. అమెరికాతో వైరం కారణంగా ఆంక్షలు, కరోనా కట్టడికి రెండేళ్లపాటు కఠిన లాక్‌డౌన్‌లు.. వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపాయని చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇంధనం, ఎరువులు, పురుగు మందుల ధరలు అమాంతం పెరగడం వల్ల ఉత్తర కొరియా వ్యవసాయ రంగం కుదేలైందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నియంత కిమ్ జాంగ్ ఉన్ పాలనలో ఉత్తర కొరియా మరోసారి తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అణు పరీక్షలతో వైరం కారణంగా అమెరికా ఆంక్షలు, కరోనా కట్టడికి రెండేళ్లపాటు కఠినమైన లాక్‌డౌన్లు వ్యవసాయ సంక్షోభానికి దారితీశాయి. తీవ్రమైన ఆహార కొరత కారణంగా చాలా మంది ఆకలి చనిపోయారు. దీంతో ఈ పరిస్థితిని చక్కదిద్దడంపై కిమ్ సర్కారు దృష్టిసారించింది.