ఉభయకొరియాల మధ్య తరచుగా ఉద్రిక్తతలు పెరుగుతుండటం ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.. ఉత్తర, దక్షిణ కొరియాలు దశాబ్దకాలంగా శత్రుదేశాలుగా కొనసాగుతున్నాయి.. అసలు ఉభయ కొరియాల మధ్య ఇంతటి విద్వేషానికి కారణమేమిటి…?
ఉత్తరకొరియా వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుదు ప్రదర్శిస్తోంది.. అమెరికా హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా యధేచ్చగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది.. అంతేకాదు.. అణ్వాయుధాలకూ పదును పెడుతోంది.
ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు ఉత్తరకొరియా నియంత కిమ్ కోట్లాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడా..?
ఉత్తర కొరియా ప్రపంచంలో దూర్త దేశాల్లో ఒకటిగా అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూరప్ దేశాలు గుర్తించిన దేశం. అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. యథేచ్ఛగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. అణ్వాయుధాలకూ పదును పెడుతోంది. తమవైపు కన్నెత్తి చూస్తే ఖబడ్దార్ అంటూ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిస్తున్నారు. అమెరికా – దక్షిణ కొరియా కూటమి సంయుక్తంగా సైనిక విన్యాసాలపై మండిపడుతున్నారు కిమ్. తాజాగా 48 గంటల వ్యవధిలో రెండు సార్లు క్షిపణి ప్రయోగాలు జరిపారు.. ఈ తరహా వరుస క్షిపణి ప్రయోగాలు అంతర్జాతీయ సమాజం ఆందోళనకు కారణమవుతోంది.
ఉభయ కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండటం ప్రపంచ దేశాలను ఆందోళన పరుస్తోంది. ఉత్తర, దక్షిణ కొరియాల శత్రుత్వానిది దశాబ్దాల చరిత్ర. స్వతంత్ర దేశమైన ఉమ్మడి కొరియా ద్వీపకల్పాన్ని 1910లో జపాన్ ఆక్రమించుకుంది. 1945 దాకా నిరంకుశ పాలనలో కొరియా మగ్గిపోయింది. జపాన్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టింది. కమ్యూనిస్టు నేత కిమ్ ఇల్-సంగ్ కొరియా విముక్తి కోసం మంచూరియా నుంచి జపాన్ సైన్యంపై గెరిల్లా యుద్ధం చేశారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్ అధీనంలో ఉన్న కొరియాలోకి సోవియట్ సేనలు అడుగుపెట్టాయి. 38వ ప్యారలెల్ లైన్ దాకా దూసుకొచ్చాయి. దాని దిగువ ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంది. అలా కొరియా విభజనకు బీజం పడింది. 1945లో ప్యారలెల్ లైన్‌కు ఎగువన తమ అధీనంలోని కొరియా ప్రాంతంలో పాంగ్యాంగ్ రాజధానిగా సోవియట్ సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే ఉత్తర కొరియా.. దిగువ ప్రాంతంలో అమెరికా సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పింది… అదే దక్షిణ కొరియా..
కొరియాకు స్వాతంత్య్రం ఇవ్వడానికి ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయాలని సోవియట్ యూనియన్, మిత్రదేశాలు భావించాయి. ప్రపంచాధిపత్యం కోసం అమెరికాతో సాగిన ప్రచ్ఛన్న యుద్ధంలో ఉత్తర కొరియా మద్దతు కోసం అక్కడి కమ్యూనిస్టులను సోవియేట్ ప్రోత్సహించింది. దాని అండతో కిమ్ ఇల్ సంగ్ పెద్ద నేతగా అవతరించాడు. 1948లో ప్రధానిగా పీఠమెక్కాడు. అనంతరం సోవియట్ సేనలు ఉత్తర కొరియాను వీడాయి. మరోవైపు దక్షిణ కొరియాలో అమెరికా సైన్యం కమ్యూనిస్టులను కఠినంగా అణచి వేసింది. అమెరికాలో చదివిన కమ్యూనిస్టు వ్యతిరేకి సైంగ్ మాన్ రీ కి మద్దతిచ్చింది. 1948లో జరిగిన ఎన్నికల్లో సైంగ్‌మాన్ రీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1949లో అమెరికా సైన్యం దక్షిణ కొరియా వీడింది. అక్కడి నుంచి ఇరు కొరియాల మధ్య కొట్లాటకు బీజం పడింది. కొరియా ద్వీపకల్పం మొత్తాన్ని తామే పాలిస్తున్నామని, ఉభయ ప్రభుత్వాలు వాదించడం మొదలుపెట్టాయి. కిమ్ ఇల్ సంగ్ నాటి సోవియట్, చైనాల్లోని కమ్యూనిస్టు పాలకులు స్టాలిన్, మావోల మద్దతు కోరారు. ఇటు సైంగ్ మాన్ రీ కూడా ఉత్తర కొరియాను జయించాలన్న ఆకాంక్షలను దాచుకోలేదు. ఇది కొరియన్ యుద్ధానికి దారితీసింది.
అణ్వాయుధ పరీక్షలతో ఉత్తర కొరియా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే, ప్రపంచంలోనే అత్యంత బలమైన అణుసామర్థ్యం కలిగిన దేశంగా ఎదగాలన్న దాని ఆకాంక్ష..సొంత ప్రజలనే కాదు, పొరుగున ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్ వాసుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. ఉత్తర కొరియాలోని ‘పుంగేరి’ భూగర్భ అణుపరీక్షా కేంద్రం కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, దీంతో ప్రజలకు రేడియోధార్మికత ముప్పు పొంచి ఉందని సియోల్ ఆధారిత ఓ మానవ హక్కుల సంఘం తన తాజా అధ్యయనంలో పేర్కొంది. ప్యాంగ్యాంగ్ ఏడో అణు పరీక్షకు సిద్ధమవుతోందని వార్తలు వస్తోన్న వేళ ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికా, దక్షిణ కొరియా ప్రభుత్వ వివరాల ప్రకారం.. ఉత్తర కొరియా 2006-17 మధ్యకాలంలో ఉత్తర హమ్‌గ్యోంగ్ ప్రావిన్స్‌లోని పుంగేరి సైట్‌లో రహస్యంగా ఆరు అణ్వాయుధ పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలోనే.. ఇక్కడి నుంచి భూగర్భ జలాల ద్వారా రేడియోధార్మిక పదార్థాలు ప్రస్తుతం స్థానికంగా ఎనిమిది నగరాలు, కౌంటీల్లో విస్తరించి ఉండొచ్చని ‘ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్’ తన అధ్యయనంలో అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో పది లక్షలకు పైగా జనాభా నివసిస్తోంది. తాగునీటితో సహా రోజువారీ కార్యకలాపాల్లో వారు భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి పొరుగున ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్‌లకు అక్రమంగా రవాణా అయ్యే వ్యవసాయ, మత్స్య ఉత్పత్తుల కారణంగా.. అక్కడి ప్రజలూ కొంతవరకు ప్రమాదంలో పడొచ్చని నివేదిక పేర్కొంది. 2015లోనే దక్షిణ కొరియా ఆహార భద్రతా సంస్థ.. తాము దిగుమతి చేసుకున్న పుట్టగొడుగుల్లో సాధారణం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా రేడియోధార్మిక సీజీయం ఐసోటోపులను గుర్తించింది. చైనా ఉత్పత్తులుగా వాటిని విక్రయించినప్పటికీ.. వాస్తవానికి అవి ఉత్తర కొరియాలో పండించినవేనని పేర్కొంది.
మరోవైపు.. భూగర్భ జలాల కలుషితాల ఆరోపణలను ఉత్తర కొరియా కొట్టిపారేస్తూ వస్తోంది. అణు పరీక్షల తరువాత ఎటువంటి హానికరమైన పదార్థాలు లీక్ కాలేవని పేర్కొంది. అయితే, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను మాత్రం అందించలేదు. 2018లో పుంగేరి న్యూక్లియర్ టెస్ట్ సైట్‌లోని కొన్ని సొరంగాలను పరిశీలించేందుకు వెళ్లిన కొంత మంది విదేశీ జర్నలిస్టుల ‘రేడియేషన్ డిటెక్టర్ల’నూ జప్తు చేసింది. ‘ఉత్తర కొరియా అణు పరీక్షలు.. అక్కడి ప్రజలకు మాత్రమే కాకుండా, పొరుగు దేశాల్లో నివసించేవారి ఆరోగ్యానికీ హాని కలిగించగలవని నిరూపించడంలో ఈ నివేదిక కీలకమైనది’ అని గ్రూప్ చీఫ్, అధ్యయన సహ రచయిత హూబర్ట్ యంగ్ హ్వాన్ లీ తెలిపారు. ఈ నేపథ్యంలో పుంగేరి పరిసరాల్లోని ప్రజలకు రేడియేషన్ పరీక్షలు నిర్వహించాలని, అంతర్జాతీయ విచారణ చేపట్టాలని కోరారు. ఐరాస, ఇతర ప్రభుత్వ నివేదికలు, అణు, వైద్య నిపుణులతోపాటు ఉత్తర కొరియానుంచి తప్పించుకు వచ్చిన పౌరుల సమాచారం విశ్లేషణ ఆధారంగా ఈ అధ్యయనం రూపొందించారు.
ఇటీవల కాలంలో ఉత్తర కొరియా దూకుడుగా వరుస క్షిపణి ప్రయోగాలకు తెగబడుతోంది. ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన రెండు రోజుల్లోనే మరో రెండు బాలిస్టిక్ కిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ధృవీకరిచింది కూడా. ఎలాంటి హెచ్చరికలు ఖాతరు చేయకుండా ఉత్తర కొరియా అధ్యక్షుడుకిమ్ జోంగ్ ఉన్ వరుస క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి ఉత్తర కొరియా గత శనివారమే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని జపాన్ పశ్చిమ తీరంలో ప్రయోగించింది. దీంతో ఆదివారం అమెరికా ఆదివారం దక్షిణ కొరియా, జపాన్‌తోనూ విడిగా ఉమ్మడి వైమానిక విన్యాసాలను నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా సోమవారం తూర్పు తీరంలో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులను బహుళ రాకెట్ లాంచర్‌తో సుమారు 395 కి.మీ, 337 కి.మీ దూరంలోని లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా పేర్కొంది. ఈ వ్యూహాత్మక అణ్వాయుధం శత్రు ఎయిర్ ఫీల్డ్‌ను నిర్వీర్వం చేయగలదని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది.
అలాగే కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ పసిఫిక్‌ను ఫైరింగ్ రేంజింగ్ మారుస్తామని హెచ్చరించింది. అంతేగాదు అధిక ఫ్రీక్వెన్సీతో మరిన్ని సైనిక చర్యలకు తెగబడటం అనేది యూఎస్ దళాల చర్యలపై ఆదారపడి ఉంటుందని ఆమె గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోవైపు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించిందని, అవి గరిష్టంగా 50 కి.మీ నుంచి 100 కి.మీ ఎత్తుకు చేరుకున్నట్లు తెలిపింది. ఈ పరీక్షల విషయమై అత్యవసర యూఎన్ భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చినట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వెల్లడించారు. ఐతే ఉక్రెయిన్ సంక్షోభం,
అమెరికా గగనతలంలో చైనా నిఘా బెలూన్ వ్యవహారం నేపథ్యంలో అమెరికా చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తదితర కారణాల రీత్యా యూఎన్ ఆంక్షాలు విధించే అవకాశం తక్కువగా ఉంది.
ఇదిలా ఉండగా, దక్షిణ కొరియా మాత్రం ఈ ప్రయోగాలను తీవ్రమైన రెచ్చగొట్టే చర్యగా పేర్కొంది. వెంటనే ఇలాంటి వాటిని నిలిపివేయాలని ఉత్తర కొరియాను హెచ్చరించింది. అలాగే ప్రతిఘటనలపై చర్చించడానికి జాతీయ భద్రత మండలి సమామేశాన్ని నిర్వహించనున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్‌యోల్ కార్యాలయం తెలిపింది. అంతేగాదు ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమాలకు సంబంధించి నలుగురు వ్యక్తులను, ఐదు సంస్థలపై ఆంక్షలను ప్రకటించింది. పైగా దీన్ని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు ప్రతిస్పందనగా పేర్కొంది దక్షణ కొరియా. కచ్చితంగా దీనికి తగిన పర్యవసానాన్ని ఎదుర్కొనక తప్పదంటూ హెచ్చరించింది. దీని గురించి అమెరికా, జపాన్‌తోనూ చర్చిస్తానని దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, యూఎన్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ భద్రతా మండలి తీర్మానాలు ప్రకారం నిషేధించిన కవ్వింపు చర్యలను నిలిపేయాలని, అణ్వాయుధీకరణపై చర్చలు పునఃప్రారంభించాలని ఉత్తర కొరియాను కోరారు.
అమెరికా హెచ్చరికలను సైతం కాదని వరుస క్షిపణి ప్రయోగాలను చేస్తోంది ఉత్తరకొరియా.. ప్రపంచంలోనే అత్యంత బలమైన అణుసామర్థ్యం కలిగిన దేశంగా ఎదగాలన్న దాని ఆకాంక్ష..సొంత ప్రజలనే కాదు, పొరుగున ఉన్న దక్షిణ కొరియా, చైనా, జపాన్ వాసుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది.