Homeఅంతర్జాతీయంకొత్తగా విజృంభిస్తున్న లాంగ్ కోవిడ్..

కొత్తగా విజృంభిస్తున్న లాంగ్ కోవిడ్..

ఎప్పుడో సద్దు మణిగిందన్న కరోనా ఏదో రూపంలో ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే అనేక వేరియంట్లు మానవాళిని సతాయించగా ఇప్పుడు కొత్తగా లాంగ్ కోవిడ్ తన ప్రభావం చూపిస్తోంది. కోవిడ్19 సోకినవారు, వ్యాక్సిన్లు తీసుకున్నవారు ఏడాది తరువాత అవయవ సమస్యలు ఎదుర్కుంటున్నారు. తీవ్రమైన అలసట, శ్వాస సమస్యలు, ఛాతి కీళ్ల నొప్పులు జనాన్ని వేదిస్తున్నాయి..

కొవిడ్‌19 కారణంగా ఏడాది తరువాత కరోనా బాధితుల అవయవాలు అతలాకుతలం అవుతున్నాయి. మూడేండ్లు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా దాని ప్రభావం మాత్రం వీడటం లేదు. వైరస్‌ లక్షణాలు బయట పడ్డ ఏడాది తర్వాత ఏదో ఒక అవయవ సమస్య తలెత్తుతోంది. కరోనా సోకినవారిలో 59 శాతం మంది బాధితులుగానే ఉంటున్నారు. 29 శాతం మందిలో మల్టీ ఆర్గన్‌ డ్యామేజ్‌ బయటపడుతోంది. ఈ విషయాలు తాజాగా జరిగిన అధ్యయనాలలో వెల్లడయ్యాయి. కరోనా బాధితులను దీర్ఘకాల కొవిడ్‌ లేదా ‘లాంగ్‌ కొవిడ్‌’ లక్షణాలు పట్టి పీడిస్తూన్నాయి. అలసట, శ్వాస సమస్యలు, ఛాతి, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెదడు సంబంధ సమస్యలు, నిద్రలేమి, ఆందోళన, మనోవ్యాకులతతో రోగులు నిత్యం సతమతమవుతూనే ఉన్నారు.

కాగా, దీర్ఘకాల కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న 59 శాతం మందిలో కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడ్డ ఏడాది తర్వాత శరీరంలోని ఏదో ఒక అవయవం దెబ్బతింటున్నదని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కొవిడ్‌ బారినపడినప్పుడు పెద్దగా ఇబ్బందులు పడని వారిలో కూడా ఈ సమస్య ఆలస్యంగా కనిపిస్తోందని పరిశోధకులు గుర్తించారు. 536 మంది కొవిడ్‌ రోగులపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.

ఇందులో 13 శాతం మంది కరోనాతో ఆసుపత్రికి చేరినవారు కాగా, 32 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ 536 మంది రోగులకు ఆరు నెలల తర్వాత 40 నిమిషాల పాటు మల్టీ ఆర్గాన్‌ ఎంఆర్‌ఐ స్కాన్‌ నిర్వహించారు. ఈ ఫలితాలను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో విశ్లేషించగా, ఇందులో షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. ఈ అధ్యయన ఫలితాలు ‘జర్నల్‌ ఆఫ్‌ ది రాయల్‌ సొసైటీ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రచురితమయ్యాయి. అధ్యయనం నిర్వహించిన 536 మంది రోగుల్లో 62 శాతం మంది..అంటే 331 మందికి 6 నెలల తర్వాత ఏదో ఒక అవయవ సమస్యతో బాధపడ్డారు.

155 మందిలో ఒకటి కంటే ఎక్కువ అవయవాలు దెబ్బతిన్నాయి. వీరిలో 6 నెలల నుంచి ఏడాది పాటు ఆయా లక్షణాలు క్రమంగా బయటపడటంతో పాటు, అవయవ క్షీణతను పరిశోధకులు గమనించారు. కరోనా లక్షణాలు బయటపడ్డ ఏడాది తర్వాత 59 శాతం మందిలో ఏదో ఒక అవయవం దెబ్బతింటున్నది. ప్రతి ఐదుగురిలో కనీసం ముగ్గురికి ఒక అవయవం దెబ్బతింటున్నది. ప్రతి నలుగురిలో ఒకరికి మల్టీ ఆర్గాన్‌ డ్యామేజ్‌ సంభవిస్తున్నది. లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు జీవన నాణ్యత, పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి.

  • దీర్ఘకాల కొవిడ్‌ బాధితుల్లో ఏడాది వరకు లక్షణాలు కనిపిస్తున్నాయి..

మహిళలు, యువతలో ఆరు నుంచి ఏడాదిలో లక్షణాలు ఒకే విధంగా ఉంటున్నాయి. వీరిలో ఒకే అవయవం దెబ్బతింటున్నది. ప్రతి ఐదుగురిలో కనీసం ముగ్గురికి కనీసం ఒక అవయవం దెబ్బతింటున్నట్టు మా పరిశోధనలో తేలింది. ప్రతి నలుగురిలో ఒకరికి ఒకటి కంటే ఎక్కువగా మల్టీ ఆర్గన్‌ డ్యామేజ్‌ నష్టం వాటిల్లుతున్నట్టు గుర్తించాం. కొన్ని కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేకుండానే ఇది సంభవించడం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ లాంగ్‌ కొవిడ్‌ సమస్యలు చాలామందిలో జీవన నాణ్యత, పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలపై ఈ ప్రభావం అధికంగా ఉన్నది. 180 రోజుల తర్వాత సమస్యలు తలెత్తాయి. కొందరికి గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తినట్టు కూడా చెబుతున్నారు. అయితే చాలా మంది తాము తీసుకున్న వ్యాక్సిన్ల వల్లే ఈ సమస్యలు వస్తున్నాయేమోనని అనుమానిస్తున్నారు. ఎందుకంటే రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో చాలా మందికి దీర్ఘకాలిక కరోనా ప్రభావం చూపినట్టు చెబుతున్నారు వైద్య నిపుణులు.

అయితే వాటిపై పరిశోధనలు జరుగుతున్నాయనీ, వాటి ఫలితాలు రాకముందే ఓ నిర్ణయానికి రాకూడదని చెబుతున్నారు. అయితే చాలా చిన్న వయసులోనే ఇప్పుడు గుండె జబ్బులు సోకి కొన్ని సెకండ్లలోనే మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఏ ఒక్క చోట మాత్రమే కాదు..దేశంలోని పలు ప్రాంతాలలో గుండె జబ్బులు బయటపడుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. దాంతో జనంలోనూ ఈ సమస్య పట్ల ఆందోళన మొదలైంది.

Must Read

spot_img