Homeఅంతర్జాతీయంతన గోతిలో తానే పడిన చైనా..!!!

తన గోతిలో తానే పడిన చైనా..!!!

కోవిడ్19 లాంటి మహమ్మారికి జన్మనిచ్చిన చైనాకు ఆ పాపం ఊరికే పోవడం లేదు. చైనాలో ప్రస్తుతం చెలరేగిపోతున్న కరోనా వేరియంట్లపై చైనా టీకాలేం పనిచేయడం లేదు. పైగా తాజా సమాచారం మేరకు అక్కడ ఈ వింటర్ లో మూడు వేవ్ లు రానున్నాయనీ, అందులో ఒకటి మాత్రం చాలా తీవ్రంగా ఉండనుందని తెలిసింది..

విధి చేయు వింతలను తప్పించడం మనిషికి సాధ్యం కాదు. ఎవరు చేసిన ఖర్మకు వారు అనుభవించాల్సిందే..అదే ఇప్పుడు చైనా విషయంలో జరుగుతోంది. మొన్నటి దాకా బీరాలు పోయి జీరో కోవిడ్ పాలసీని ప్రాణం పోయినా వీడనని భీష్మించుకున్నారు షీ జిన్ పింగ్.. చైనా ప్రజలను ముప్పు తిప్పలు పెట్టారు. ఎక్కడ ఒక్క కేసు బయటపడినా ఆ ప్రాంతం మొత్తాన్ని లాక్ డౌన్ చేసి నరకం చూపించారు. దీంతో దేశ ప్రజలు ఒక్క ఉదుటున ఆందోళనబాట పట్టారు.చివరకు అదెక్కడిదాకా పోయిందంటే జిన్ పింగ్ గద్దె దిగాలనే డిమాండ్ ఉద్రుతమైంది. దాంతో జిన్ పింగ్ దారికి వచ్చారు. జీరో కోవిడ్ తన పదవికి ఎసరు పెట్టేలా ఉందని ఆలోచించారు. కొవిడ్‌ ఆంక్షల సడలింపుకు ఆదేశాలు జారీ చేసారు.

దాంతో చైనా ప్రజలు తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒక్కసారిగా విజ్రుంభించింది కరోనా వైరస్.. చూస్తుండగానే వేల సంఖ్యలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. అది కాకుండా కొత్త విషయం కూడా చైనాలో డేంజర్ బెల్స్ మోగించింది. తాజాగా చైనీస్‌ ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ చీఫ్‌ ఎపిడమాలజిస్ట్‌ వూ జున్‌యూ ఓ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు. ఈ శీతాకాలంలో మెుత్తం 3 వేవ్‌లు వస్తాయని అందులో ఒకటి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం మెుదటి వేవ్‌ నడుస్తోందని తెలిపారు.

ఈనెల 15 నుంచి ప్రారంభమైన కొవిడ్‌ తొలివేవ్‌ జనవరి 15 వరకు కొనసాగుతుందన్నారు. ఇక రెండో వేవ్‌ జనవరి చివరి నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉంటుందని తెలిపారు.

కొత్త సంవత్సరం సందర్భంగా చైనాలో జనవరి 21 నుంచి సెలవులు ప్రకటిస్తారు. ఈ సమయంలో దేశ విదేశాల నుంచి లక్షలాదిగా జనం సొంత గ్రామాలకు పట్టణాలకు ప్రయాణాలు చేయనుండడంతో కేసులు భారీగా పెరుగుతాయని జున్‌యూ అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరి చివరి నుంచి మార్చి 15 వరకు మూడో వేవ్‌ ఉంటుందని తెలిపారు. అది విహారయాత్రల నుంచి ప్రజలు తమ ఇళ్లకు చేరుకునే సమయం కాబట్టి అప్పుడూ కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు. మరోవైపు 2023లో కొవిడ్‌ కారణంగా చైనాలో 10 లక్షలకుపైగా మరణాలు సంభవిస్తాయని ఇప్పటికే అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ నివేదిక వెల్లడించింది. దీంతో చైనా పరిస్థితి ఇప్పుడు ముందుకెళితే నుయ్యి వెనక్కు తగ్గితే గొయ్యిగా మారింది.

మరో దారి లేక.. జీరో కొవిడ్ ఆంక్షల్ని ప్రభుత్వం సడలించింది కానీ నిజానికి చైనా లాంటి దేశంలో ఆ కఠిన ఆంక్షలే కరోనాను కట్టిపడేశాయి. ఎందుకంటే చైనా వాళ్లు అందరికన్నా ముందు కనిపెట్టిన కరోనా వ్యాక్సిన్ నిజానిక ఏ ప్రభావమూ చూపించలేదని ఆలస్యంగా తెలుసుకుంది చైనా. అది కోట్లాది డాలర్లు సంపాదించుకుని విదేశాలకు సప్లై చేయగా ఎవరికీ లాభం జరగలేదు. అంతెందుకు తన సోదర దేశం పాకిస్తాన్ లో సైతం టీకాలు పనిచేయడం లేదని గగ్గోలు పెట్టింది. టీకాను నమ్మి కరోనా బాధితుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంది పాకిస్తాన్. అటు ఆఫ్రికా దేశాలకు చేరిన చైనా వ్యాక్సిన్ ను వాడాలా వద్దా అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నారని సమాచారం. అసలు ఏమాత్రం పనిచేయకపోవడంతో అక్కడ మళ్లీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ఈ పరిస్థితిని ఇక్కడ కట్ చేస్తే వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నాటికి చైనాలో కొవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని అధ్యయనాలు హెచ్చరించేసాయి.. మరోవైపు.. మళ్లీ కరోనా విలయతాండవం చేస్తుండడంతో.. డ్రాగన్‌ కంట్రీ మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.. కేసులు భారీగా వెలుగు చూస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారట… దీంతో రోడ్లన్నీ బోసిగా దర్శనమిస్తున్నాయి. నిన్న ప్రధాన నగరాల్లోని రోడ్లన్నీ దాదాపుగా ఖాళీగా కనిపించడం కరోనా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మీడియా నివేదికల ప్రకారం, బీజింగ్‌లో కోవిడ్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది, అందుకే ఎవరు చేసుకున్న ఖర్మను వారు అనుభవంచక తప్పదన్నది చైనా విషయంలో నిజమైందని అంటున్నారు విశ్లేషకులు…

Must Read

spot_img