- మొదట పాకిస్తాన్ ఆపై శ్రీలంక ఇప్పుడు నేపాల్ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న దేశాల లిస్టులో చేరిపోయింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో నేపాల్ చేరడానికి మరెంతో కాలం పట్టకపోవచ్చు. గతంలో 2008 నుంచి 2014 వరకు ఫ్యాటాప్ గ్రేలిస్టులో ఉంది. ప్రస్తుతం కరోనా కష్టకాలం తరువాత నేపాల్ పరిస్థితి అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. ఇక్కడ కూడా శ్రీలంక మాదిరగానే టూరిజంపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తారు.

కరోనా సమయంలో అమలు చేసిన ఆంక్షల కారణంగా పర్యాటకం పూర్తిగా నెమ్మదించింది. అందుకే ఇప్పుడు నిలదొక్కుకునేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. త్వరలో మరోసారి గ్రేలిస్టు యోగం తప్పదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేపాల్ లో మనీ లాండరింగ్ విషయంలో అమలు చేస్తున్న చట్లాలు బలహీనంగా ఉన్నాయి. దాంతో ఇక్కడ మీనీ లాండరింగ్ టెర్రర్ ఫైనాన్సింగ్ జోరుగా సాగుతోంది.
మనీలాండరింగ్ విషయంలో పారిస్ కేంద్రంగా పనిచేసే ఫ్యాటాఫ్ సహా మరో పదిహేను చట్టాలు, నియమాలు నిబంధనలను పాటించడం నేపాల్ వల్ల కావడం లేదు. ఇప్పుడు మరోసారి గ్రేలిస్టులోకి చేరిపోతే రాబోయే రోజులలో విదేశీ సాయంపై అత్యధికంగా ఆధారపడే నేపాల్ కు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. మనీ లాండరింగ్ విషయంలో స్డడీ చేసేందుకు ఆసియా పసిఫిక్ గ్రూప్, ఫ్యాటాఫ్ సంస్థల ప్రతినిధులు స్వయంగా తరలివచ్చారు.
వారి ఆధ్యయనంలో నేపాల్ ను బ్లాక్ లిస్టులో చేర్చే అన్ని అర్హతలను సంపాదించకుంది. చాలా బలహీనమైన పాలన కారణంగా స్మగ్లర్లు, ఉగ్రవాదులకు నేపాల్ స్వర్గధామంగా మారిపోయిందని ప్రతినిధుల బ్రుందం గుర్తించింది..దీంతో బ్లాక్ లిస్టు కాకపోయినా గ్రే లిస్టులో మాత్రం తప్పక పెట్టాల్సిన అవసరం రావొచ్చని తేల్చారు. ఒకసారి గ్రేలిస్టులోకి చేరిపోతే ఏం చేయాల్సి ఉంటుందో నేపాల్ కు బాగా తెలుసు.
ఓ పరిమిత కాలంలో ఫ్యాటాఫ్ నిర్ణయించిన విధానాలను దేశంలో అమలు చేయాల్సి ఉంటుంది. అమలు చేసే తీరును ఫ్యాటాఫ్ పర్యవేక్షణలో జరుగుతుంటుంది. అయితే ప్రస్తుతం నేపాల్ ను సంకీర్ణ ప్రభుత్వం పాలిస్తోంది. అసలే నేపాల్ లో ఆర్థిక సంక్షోభం తారాస్థాయిలో ఉంది. గత ఏడాది నుంచి నేపాల్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని ఆర్థిక వేత్తలు అంటున్నారు.
ఈ సంక్షోభం నుంచి కొంత మేర కోలుకుంటున్నట్టు సంకేతాలున్నప్పటికీ, కొన్ని ఆర్థిక రంగాలలో మాత్రం ఇంకా తీవ్ర ఇబ్బదికర పరిస్థితులున్నాయని వారు చెబుతున్నారు. వీటి కారణాలు తెలుసుకుని ఆర్థిక సంక్షోభాన్ని అదుపులోకి తేకపోతే, పరిస్థితి మరింత క్లిష్టంగా మారడం ఖాయం. ఇదే ప్రస్తుత ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యంగా ఉండబోతోంది. ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణ రేటు, అత్యధిక వడ్డీ రేటు, నిరుద్యోగం, దుబారా కార్యాలయ ఖర్చులు వంటి వాటిపై ప్రభుత్వం వెంటనే దృష్టిసారించకపోతే, ఇవన్ని కలిసి ప్రభుత్వానికి పెను భారంగా మారబోతున్నాయి.
కొత్తగా ప్రధానిగా ఎన్నికైన ప్రచండ భాగస్వామ్య పార్టీలో ఒక పార్టీ నుంచి ఎంపికయ్యారు. నేపాల్ లో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని దేశీయ, అంతర్జాతీయ అంశాల కారణంగా ఏర్పడ్డాయి. నానాటికీ పెరుగుతున్న పెట్రోలియం ధరలు, బలపడుతున్న డాలర్ వంటి అంతర్జాతీయ అంశాలు నేపాల్ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బకొట్టాయి. వీటిని తగ్గించవచ్చు. కానీ, నియంత్రించలేం.
అలాగే దేశీయంగా చోటు చేసుకున్న ఇబ్బందులను మాత్రం నియంత్రించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. విదేశీ మారక నిల్వలకు ప్రధాన ఆదాయ వనరులైన ఎగుమతులు, పర్యాటకం, విదేశీ పెట్టుబడులు, విదేశీ సాయం వంటి వాటి ద్వారా.. పెరుగుతున్న ఈ ఆర్థిక అస్థిరతను, సంక్షోభాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఈ విషయాల్లో ఏం చేయాలన్నా దానిపై ప్రభుత్వం ఆలోచించాలి.
- నేపాల్ విదేశీ మారకం విదేశాల్లో పనిచేసే నేపాలీలు వెనక్కి పంపే డబ్బులపైనే..!
విదేశాల్లో పనిచేసే నేపాలీలు వెనక్కి పంపే డబ్బులపైనే నేపాల్ విదేశీ మారకం నడుస్తోంది. ఇక్కడ పెట్టుబడుల మాటే ఉండదు. ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే, రోడ్లు, విద్యుత్, నైపుణ్యంగల కార్మికులు లాంటివి చూస్తారు. కానీ, ఇక్కడ అలాంటి పరిస్థితులే లేవు. పైగా ఏదైనా విదేశీ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి వస్తే…అంతా కలసి తమ సంపద దోచుకుపోతున్నట్లు చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు రావడం చాలా కష్టం.
సరకులు, వస్తువులను ప్రజలకు చౌక ధరలకు అందించాలని ప్రభుత్వం అసలే భావించదు. కార్లు, బైకులే కాదు.. ఇక్కడ ఆహారం, పానీయాలు కూడా చాలా ఖరీదైనవిగా ఉంటాయి. నేపాల్‌కు సముద్ర మార్గం లేదు. నేపాల్ అంతర్జాతీయ వాణిజ్యంలో 65 శాతం వరకు భారత్‌తోనే ముడిపడి ఉంది. పైగా ఇదంతా ఏకపక్షమే. అంతా భారత్‌కు అనుకూలంగానే ఉంటుంది. మేం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంటాం.
కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను భారత్‌కు విక్రయిస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో రెవెన్యూను పెంచుకోవడానికి పన్నులు పెంచడమే ఏకైక మార్గంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే దేశం ఆర్థికంగా చిక్కుముడులలో ఇరుక్కుపోయింది. ఈ పరిస్తితులు మారాలంటే అనవసరమైన సంస్థలను తొలగించాలి. కేంద్రం నుంచి రాష్ట్రాలు, స్థానిక ప్రాంతాల వరకు పెరుగుతున్న దుబారా ఖర్చుల భారాన్ని తగ్గించుకోవాలి. దానికి సుస్థిర ప్రభుత్వం ఉండాలి.
కానీ నేపాల్ లో రాజకీయ సుస్థిరత కనుచూపు మేరలో కనిపించడం లేదు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదేనని చెప్పుకోవచ్చు. పైగా ఇటీవల కాలంలో నేపాల్ విదేశీ వ్యవహారాల్లో అంత క్రియాశీలకంగా లేదు. శక్తిమంతమైన దేశాల మధ్యలో వైరుధ్యానికి కేంద్రంగా నేపాల్ మారుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ విధానంలో సమతుల్యత సాధించడమన్నది కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలుగా ఉండబోతోంది.
- నేపాల్ FATF గ్రే లిస్ట్..
నేపాల్ ముందు ఈ సవాలు ఎప్పుడూ మెడ మీది కత్తిలాగే ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి పార్టీ సభ్యుల ఆలోచనల మేరకే నడుచుకోవాలి. ఇటు భారత్ వైపుకు, అటు చైనా వైపుకుమొగ్గు జూపినా నష్టం నేపాల్ దేశానికే ఉంటుంది. ఎటూ మొగ్గు జూపకపోయినా నేపాల్ నష్టపోతుంది. అదే ఇక్కడ ప్రధాని ప్రచండకు కత్తి మీద సాముగా మారింది. ఒకవేళ నేపాల్ విదేశీ విధానంలో పాత పద్ధతినే అనుసరించి, సమతుల్యత సాధిస్తే ఎలాంటి సమస్య ఉండదు.
విదేశీ విధానంలో సమతుల్యత సాధించడం నేపాల్‌కు ఎల్లప్పుడూ ఉండే సమస్యే. కొత్త ప్రభుత్వం ముందు కూడా ఈ సవాలు ఉంటుంది. అమెరికా సహాయ ప్రాజెక్టు విషయంలో కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల నేపాల్ విషయంలో అమెరికా, చైనాకు మధ్య వివాదం మరింత పెరగనుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో, సరిహద్దు దేశాలు, ఇతర దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండేందుకు, సమతుల్యత విధానాన్ని అనుసరించడం నేపాల్ ముందున్న కర్తవ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని పాటించినా సంకీర్ణ ప్రభుత్వంలోని పెద్దల కోరికలు తీర్చడం కూడా ప్రభుత్వం బాధ్యతగా ఉంటుంది.
అక్రమ మార్గాల ద్వారా మనీ లాండరింగ్ చేయడం అక్కడి స్మగ్లర్లకు ఉపాదిగా మారుతోంది. పైగా నేతల కోర్కెలు తీరుస్తూ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడం అంటే ప్రస్తుత ప్రభుత్వానికి చాలా కష్టం. అందులోనూ మాజీ ప్రధాని శర్మ ఓలీ సూచనలు పాటించడం ప్రచండకు మరీ కష్ట సాధ్యంగానే ఉండబోతోంది. శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ బాటలో నేపాల్ ప్రయాణిస్తోంది..పైగా ఇన్ని అననుకూలతల మధ్య నేపాల్ ఎట్టి పరిస్తితుల్లోనూ ఫాటాప్ కోరల్లో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గ్రేలిస్టులోకి మరోసారి చేరిపోక తప్పని పరిస్థితులు కొనసాగుతున్నాయి.