HomePoliticsనేదురుమల్లి వారసుడి ఎంట్రీ...

నేదురుమల్లి వారసుడి ఎంట్రీ…

వెంకటగిరి నుండి ఆనంను తప్పించిన నేదురుమల్లి ఇప్పుడు గూడూరు మీద దృష్టి సారించారా..
గతంలో తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఆధీనంలో ఉండిన గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల పై తిరిగి నేదురుమల్లి వారి ఆధిపత్యం కోసం రాంకుమార్ రెడ్డి పాకులాడుతున్నారా.. స్థానిక ఎమ్మేల్యే లేకపోయినా, అధికారులు, కార్యకర్తలతొ సమావేశాలు నిర్వహిస్తూ తానే ఎమ్మెల్యే అనుకుంటున్నారా.. రాంకుమార్ రెడ్డి తీరు పై సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్రు మీదున్నారా..

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడురు నియోజకవర్గం 1978కి ముందు వరకు జనరల్ నియోజకవర్గం. అయితే ఇక్కడ 1978కి ముందు ఐదుసార్లు ఎన్నికలు జరగ్గా రెడ్డి సామాజికవర్గం వారే ఇక్కడి నుండి ప్రాతినిద్యం వహించారు. 1978 తరువాత గూడురు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా రిజర్వేషన్ చేయబడింది. ఎస్సీ నియోజకవర్గంగా మారిన తరువాత గూడురులో పది సార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగు సార్లు టీడిపి అభ్యర్దులు ఇక్కడి నుండి విజయదుందుభి మోగించారు. ఒకసారి ఇండిపెండెంట్, రెండు సార్లు వైసీపి, రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ గూడురు నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. అయితె 1978కి ముందు కాని.. తరువాత కాని ఇప్పటి వరకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాని, ఆయన సతీమణి మాజి మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మీ కాని, వారి తనయుడు వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కాని ఎవ్వరు ఇక్కడి నుండి ప్రాతినిద్యం వహించలేదు. అయినా ఈ నియోజకవర్గం 1978 నుండి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అంటే చనిపోయేంత వరకు ఆయన ఆధీనంలోనే ఉండేది. ఆయన చెప్పిన వారికే కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చేవారు. నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గమే అయినప్పటికీ నియోజకవర్గంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి చెప్పిందే వేదం, చేసిందే శాసనం.

ఎన్నికైన ఎమ్మెల్యే ఏ పార్టీ వారైనా జనార్దన్ రెడ్డి చెప్పిందే వినాలి. అంతటి ప్రాభల్యం చాటుకున్నారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అప్పట్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి డిల్లి నుండి గల్లి వరకు రాజకీయాలు చేయగలడు.. రాజకీయ చాణిక్యుడన్న పేరుండేది. అయితే తండ్రి రాజకీయ వారసత్వాన్ని చేజిక్కించుకోలేకపోయిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి.. ఆయన చనిపోయిన చాలాకాలం తరువాత నేదురుమల్లి ప్రాబల్యం చూపిన నియోజకవర్గాలపై పట్టుకోసం తహతహలాడుతున్నారు అని తెలుస్తుంది. మెన్నటి వరకు నేదురుమల్లి సొంత అడ్డా వెంకటగిరిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని వేధించి హింస పెట్టి నియోజకవర్గానికే రానివ్వకుండా చేసిన రాంకుమార్ రెడ్డి ఇప్పుడు గూడురు పై పడ్డారట. గూడురులొ తన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చూపించిన ఆదిపత్యాన్ని తాను ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్నారని టాక్ వెల్లువెత్తుతోంది.

ఇపుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి దృష్టి గూడూరు పై పడిందట. ఇప్పటికే రెండుమూడు సార్లు అధికారులు, వైసీపి నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించేశారని సమాచారం.

అయితె రాంకుమార్ రెడ్డి నిర్వహించిన సమావేశాలకు, సమీక్షలకు స్థానిక ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు దూరంగా ఉంటున్నారట. అలాగే ఆర్డీవో నిర్వహించిన ప్రత్యేక స్పందన కార్యక్రమాలకు సైతం హాజరు కావడంలేదు. హాజరు కాకపోవడమేముందిలే.. అసలు ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వడమే మానుకున్నారని సమాచారం.

గూడూరులో ఈ మద్య రాంకుమార్ రెడ్డి అధ్వర్యంలో జరిగిన డివిజన్ స్థాయి మీటింగ్ కి కూడా స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉన్న రాకపోవడంతో పార్టీలొ ఉన్న విబేదాలతొ పాటు.. ఎమ్మెల్యే స్థానికంగా ఉండి సమావేశానికి డుమ్మా కొట్టాడంటె.. జిల్లా అద్యక్షుడిని ఏ స్థాయిలొ వేధిస్తున్నాడో బహిర్గతమౌతుంది. ఇదంతా చూస్తుంటే గూడూరు ఎమ్మెల్యే వెలగపళ్లికి కూడా చెక్ పెడుతున్నారని సందేహానికి బలం చేకూరుతుంది. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయనకి చెప్పకుండా ఎటువంటి అభివృద్ధి పనులు చేయరాదని, ఏమి చేయాలన్న తనకు చెప్పి చేయాలని హుకుం జారీ చేసినట్లేనన్న టాక్ తో వెలగపల్లికి చెక్ పెట్టేశారన్న నిర్ణయానికి వచ్చేశారట గూడురు నియోజకవర్గ ప్రజలు. ఇలా సిట్టింగ్ ఎమ్మెల్యేని స్థానిక కార్యక్రమాలకు హాజరు కానివ్వకుండా అధికారులకు ఆదేశాలివ్వడం.. జిల్లా అధ్యక్షుడి హోదాలొ నియోజకవర్గంలొ సమావేశాలు నిర్వహించినా వాటికి ఎమ్మెల్యేకి సమాచారమివ్వకుండా అన్ని తానై రాంకుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్న చర్చ సాగుతుంది నియోజకవర్గంలొ. ఇదే స్థాటజీని వాడి వెంకటగిరిలొ స్థానిక ఎమ్మెల్యేకి పవర్ లేకుండా చేసి కేవలం వెంకటగిరికి అలంకార ఎమ్మెల్యేగా చేసేశాడు రాంకుమార్ రెడ్డి.

ఇప్పుడు అదే స్టాటజీని గూడురులొ ఫాలో అవుతు గూడురు ఎమ్మేల్యే పెత్తనాన్ని నియోజకవర్గంలొ నిర్వీర్యం చేసి తన హవాను సాగించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. దీంతొ ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే మీద లేనిపోనివి అధిష్టానంకి చెప్పి అక్కడి కుర్చీలో కూర్చున్న రాంకుమార్ రెడ్డి.. ఇప్పుడు గూడురు కుర్చీలో కూర్చోని తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని చూస్తున్నట్టు జిల్లాలో చర్చ నడుస్తుంది.

మరోవైపు గూడూరు నియోజవర్గంలో వైసిపీలో వర్గ విబేధాలు తారా స్థాయికి చేరుకున్నారు. ఏకంగా గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్ ఇంటినే, వైసీపీ నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని, పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. ఆయన పైన అవినీతి ఆరోపణలు రావటం కొత్త కాదు. గతంలో ఒక తోళ్ళ పరిశ్రమ ఏర్పాటు విషయంలో, ఆ కంపెనీ యాజమాన్యం నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. అయితే ఈ సారి మాత్రం, ఏకంగా సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే పై తిరగబడ్డారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే, గూడూరు ఎమ్మెల్యే పై, రెండు సార్లు తిరుగుబాటు వచ్చింది.

గూడూరు ప్రాంత ప్రజలు కూడా , ఏకంగా ఒక ఎమ్మెల్యే పై, అదే పార్టీ నేతలు ఆందోళన చేయటం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.

ప్రధానంగా నాలుగు రోజుల క్రిందట, ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి, అలాగే ఇంచార్జ్ మంత్రి బాలినేని, జిల్లా మంత్రి అనిల్, ముగ్గురు కలిసి, గూడూరులో ఉన్న నాయకులును, ఎమ్మెల్యేని కూర్చోబెట్టి, వర్గ విబేధాలు మానండి, పార్టీని బజారున పడేయ వద్దు, ప్రత్యర్ధి పార్టీలకు అవకాసం ఇవ్వకండి, ఇప్పటికే పార్టీ పై వ్యతిరేకత వస్తున్న వేళ, మనం మనం కొట్టుకుంటే కష్టం అంటూ, ఇరు వర్గాలకు నచ్చ చెప్పారు. అయితే ఆ సమయంలోనే రెండు వర్గాల మధ్య మాటలు యుద్ధం జరిగిందని సమాచారం. అయితే సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రులు బాలినేని, అనిల్ లాంటి వాళ్ళు చెప్పినా, అక్కడ వినే పరిస్థితి లేదు. గూడూరుకి నలుగురు ఎమ్మేల్యేలు ఉన్నారు అంటూ, వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద గూడూరులో నాలుగు వర్గాలుగా ఉండటం, అలాగే అధిష్టానం వీరి పై పట్టు తెచ్చుకోలేక పోవటంతో, ఏకంగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి, అవినీతి చేస్తూ, ఇంటి గుట్టు బయట పెట్టుకునే వరకు వచ్చింది. అయితే ఎమ్మెల్యే వరప్రసాద్ మాత్రం, తన పై పై స్థాయిలోనే కుట్ర జరుగుతుందని వాపోతున్నారు. జగన్ తోనే తేల్చుకుంటాను అంటూ, చెబుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో అవినీతి చేస్తుంటే, కావాలని వరప్రసాద్ ని అల్లరి చేస్తున్నారు అంటూ, వరప్రసాద్ వర్గీయలు వాపోతున్నారు.

అయితే మెజారిటీ నియోజకవర్గాల్లో, వైసీపీలో గ్రూపులు ఎక్కవు అయిపోతున్నాయి. ప్రతి చోట రెండు వర్గాలు, పార్టీని రోడ్డున పడేస్తున్నారు. మరో పక్క, జగన్ మొహన్ రెడ్డి మాత్రం, ఎమ్మెల్యేలకు కానీ, నాయకులకు కానీ అప్పాయింట్మెంట్ ఇవ్వకపోవటం, తరుచూ వాళ్ళతో మాట్లాడకపోవటంతో, గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది. ఈ తరుణంలో నేదురుమల్లి వారసుడి ఎంట్రీ మరింత రచ్చ చేస్తోందన్న టాక్ సైతం వెల్లువెత్తుతోంది.

మరి ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

Must Read

spot_img