Home సినిమా నక్సల్స్ కథలకు కాలం చెల్లిందా..?

నక్సల్స్ కథలకు కాలం చెల్లిందా..?

2022లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయాలు నమోదయ్యాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో లాభాలను అందించాయి. అలాగే కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకువచ్చాయి. అయితే ఒక బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు మాత్రం దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అందులో మెగాస్టార్ సినిమాతో పాటు రానా దగ్గుపాటి సినిమా కూడా ఉంది.

కొన్ని కథలు కొన్ని కాలాలకు మాత్రమే పనిచేస్తాయి. ఆ టైమ్ లో ఆ కథ వస్తేనే అందం. దానికో గుర్తింపు. సీజన్ దాటిపోతే ఆ ఎలిమెంట్ కు అర్థం ఉండదు. ఇప్పుడు ఫ్యాక్షన్ కథ తీస్తామంటే పెద్దగా ఎవ్వరూ ఆదరించరు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ కూడా అలాంటిదే. కాకపోతే చేతులు కాల్చుకునేదాకా ఈ పాయింట్ పనైపోయిందని మన మేకర్స్ తెలుసుకోలేకపోయారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో నక్సల్స్ బ్యాక్ డ్రాప్ ఉంది.

చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు. కానీ ఇప్పటితరానికి నక్సల్స్ బ్యాక్ డ్రాప్ పెద్దగా ఎక్కదు. ఫలితంగా ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది.

చిరంజీవి ఫ్యాక్టర్, చరణ్ ఫ్యాక్టర్, కొరటాల ఫ్యాక్టర్, పూజా హెగ్డే అందాలు.. ఇలా ఏవీ ఈ సినిమాను కాపాడలేకపోయాడు. అలాగే రానా దగ్గుపాటి నటించిన విరాటపర్వం సినిమా కూడా దారుణంగా నష్టాలను కలుగజేసింది. ఈ సినిమా చాలా కాలం పాటు వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ ఏడాది కరెక్ట్ సమయంలోనే విడుదలైనప్పటికీ కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకోలేకపోయింది.

సాయి పల్లవి ఒక ప్రత్యేకమైన పాత్రలో కూడా కనిపించింది. ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ లో నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో దర్శకుడు వేణు ఉడుగుల పలు సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేశాడు.

నక్సల్స్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి ఫ్లాప్ అయిన మరో సినిమా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్. ఈ సినిమాలో కూడా నక్సల్ బ్యాక్ డ్రాప్ ఉంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఆ బ్యాక్ డ్రాప్ ఏమాత్రం కలిసిరాలేదు. ఫలితంగా సినిమా డిజాస్టర్ అయింది. దీనికి కారణం, నక్సల్ బ్యాక్ డ్రాప్ ఈ తరం ఆడియన్స్ కు ఎక్కకపోవడమే. ఈ విధంగా ఈ ఏడాది వచ్చిన నక్సలైట్ బ్యాక్ డ్రాప్ సినిమాలు మూడు కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. మరి రాబోయే రోజుల్లో ఈ తరహా కథల విషయంలో దర్శకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.