Homeఅంతర్జాతీయంజోషిమఠ్ పుణ్యక్షేత్రంలో ప్రకృతి వైపరీత్యం.. అసలు కారణం అదేనా? 

జోషిమఠ్ పుణ్యక్షేత్రంలో ప్రకృతి వైపరీత్యం.. అసలు కారణం అదేనా? 

దేశంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ధార్మిక ప్రదేశం జోషీమఠ్..వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం..అలాంటి పుణ్యక్షేత్రం ఇప్పుడు క్రుంగిపోతోంది. రేపటికి ఏదైనా అనుకోని అనర్థం జరిగితే..ప్రక్రుతి ప్రకోపిస్తే అంతర్థానమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. దీనంతటికి ప్రక్రుతి వైపరీత్యం ఒక్కటే కారణం కాదు. ఈ క్రుంగిపోవడం వెనుక మానవ తప్పిదాలు దాగిఉన్నాయి.

అభివ్రుద్ది పనుల పేరిట ఆ ప్రాంతంలో జరిగిన విద్వంసమే కారణమని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఎవరి పాపం ఇది? నిజానికి అది సాక్షాత్తూ శంకరాచార్యుడు నడయాడిన నేల. ఆయన ప్రవచనాలు విని పులకించిన పుణ్యభూమి. ఆయన చేతుల మీదుగా దేశంలో ఏర్పాటైన నాలుగు ప్రధాన పీఠాల్లో జ్యోతిర్మఠం కూడా ఒకటి. ఈ పట్టణం పేరు దాన్నుంచే వచ్చింది. హిరణ్యకశిపుడిని వధించిన ఉగ్ర నరసింహుడు శాంతమూర్తిగా మారింది ఈ ప్రదేశంలోనేనని వ్యాసుడు రచించిన స్కంధపురాణం అంటుంది. నిత్యం వేలాదిమంది భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి.

ఇక్కడి ఎత్తయిన హిమాలయ పర్వతాలు, దట్టమైన అడవులు, నిత్యం గలగలపారే హిమానీ నదాలను వీక్షించటానికి వచ్చే పర్యాటకులు కూడా తక్కువేమీ కాదు. పైగా చైనా సరిహద్దును ఆనుకుని వున్న ప్రాంతం గనుక వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. హిమశిఖరాల అధిరోహణకు తరలివెళ్లే బృందాలు ఈ ప్రాంతం మీదుగానే ట్రెక్కింగ్ మొదలుపెడతాయి. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఇంతటి ఘనమైన పౌరాణిక, చారిత్రక, పర్యాటక ప్రదేశమైన జోషిమఠ్‌ సంబంధించి కొన్ని వారాలుగా వెలువడుతున్న వార్తలు హడలెత్తిస్తున్నాయి. అక్కడి నివాస గృహాలు ఉన్నట్టుండి బీటలు వారుతుండటం, నేల నెర్రెలు వారడం స్థానికులకు కునుకు లేకుండా చేస్తు న్నాయి. జోషిమఠ్ ఉన్న చమోలీ జిల్లాలోనే కర్ణప్రయాగ్, గోపేశ్వర్‌ పట్టణాలున్నాయి. తెహ్రీ జిల్లాలోని ఘన్సాలీ, పితోర్‌గఢ్‌ జిల్లా మున్సియారి, ధార్చులా.. ఉత్తరకాశీ జిల్లా భట్వారీ.. ఇంకా పౌరీ, నైని టాల్‌ తదితర పట్టణాలకు సైతం ఇలాంటి ముప్పే పొంచివున్నదని నిపుణులు అంటున్నారు.

అయితే జోషీమఠ్ పట్టణానికి ఇది ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ముప్పు కాదు. గత కొన్ని దశాబ్దాలుగా మనుషులు చేసిన, చేస్తున్న పాపాలకు పర్యవసానమేనని చెబుతున్నారు. ఈ ఉత్పాతానికి కారణం.. లాభార్జన తప్ప మరేమీ పట్టని కార్పొరేట్‌ సంస్థలేనని ఆరోపణలు వస్తున్నాయి, అక్రమార్జనకు అలవాటుపడిన నేతలు ఏకమై ప్రకృతి వనరులను దోచుకు తింటున్నారు. ఈ కారణంతో ఉమ్మడి ఉత్తరప్రదేశ్‌లో ఉత్తరాఖండ్‌ వాసులు సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నారు. అవి కొన్నిసార్లు హింసాయుత రూపం కూడా తీసుకున్నాయి.

వృక్షాలను హత్తుకునే అహింసాయుత చిప్కో ఉద్యమం ఈ నేల పైనే పురుడు పోసుకుంది. తమ జీవనాధారమైన అడవులను నేలమట్టం చేస్తున్న తీరుపై 1973లో వేలాదిమంది గ్రామీణులు సుందర్‌లాల్‌ బహుగుణ నేతృత్వంలో ప్రారంభించిన ఉద్యమం దీర్ఘకాలం ప్రభావవంతంగా కొనసాగింది. ఈ ఉద్యమంలో మహిళల పాత్ర అత్యంత ప్రధానమైనదిగా కొనసాగింది. అనంతరకాలంలో ప్రపంచ పర్యావరణ ఉద్యమాలకు ఊపిరులూదిందీ, ప్రేరణగా నిలిచింది చిప్కో ఉద్యమం. తెహ్రీ డ్యాం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఎన్నో ఉద్యమాలు సాగాయి. స్థానిక వనరులపై సంపూర్ణావగాహన కలిగిన వారంతా తమ ప్రాంతంవారు పాలకులైతే తప్ప ఈ దోపిడీనీ, ఈ అరాచకాన్నీ నివారించలేమన్న భావనతో స్థానికులు ఉద్యమబాట పట్టారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం ఇందుకోసమే ఉద్యమించారు. ఆ పర్యవసానంగానే… వారి త్యాగాల ఫలితంగానే 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌ అనే కొత్త రాష్ట్రం ఆవిర్భవించింది. అయితే గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ జరిగిందీ, జరుగుతున్నదీ పూర్తిగా వేరు. బలమైన నాయకత్వం కొరవడిన ఈ రాష్ట్రం అనతి కాలంలోనే అస్థిరత్వంలోకి జారుకుంది. రాష్ట్రం ఈ 22 ఏళ్ల కాలంలో ఇప్పటికే 13 మంది ముఖ్యమంత్రులను చూసింది. రెండు దఫాలు రాష్ట్రపతి పాలన కూడా పెట్టాల్సి వచ్చింది.

దీనిని బట్టి పార్టీలకు అతీతంగా నాయకగణం ఎలా భ్రష్టుపట్టిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అపురూప ప్రదేశంలో అభివృద్ధి పేరుతో నిర్మించిన జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, బహుళ అంతస్తుల భవంతులు, కొండల్ని పిండిచేసి నిర్మించే రహదారులు, సొరంగాలు అక్కడి పర్యావరణ సమతౌల్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయింటే అతిశయోక్తి కాదు. ప్రాంతాలకు అభివ్రుద్ది అవసరమే..కానీ ఈ ప్రాంతం భూకంపాలకు ఆలవాలమైన ప్రాంతం. పైగా ఇక్కడి నేల భారీ కట్టడాలను ఓపలేదు..కార్పోరేట్ల చేతిలో అడవుల విధ్వంసం సరేసరి.

ఎన్నడో 1976లోనే ఎంసీ మిశ్రా కమిషన్‌ ఈ ప్రాంత ప్రత్యేక భౌగోళిక స్థితిపై నివేదిక వెలువరించింది. జోషిమఠ్‌ భూగర్భంలోని అంతర్వాహినులవల్ల ఈ నేలకు కుంగి పోయే అవకాశం ఉంటుందని స్పష్టంగా హెచ్చరించింది. కానీ ఆ నివేదికను ఎవరూ పట్టించుకోలేదు. వారి ఘోష ఎవరూ వినలేదు. దశాబ్దాలుగా అన్ని హెచ్చరికలనూ పాలకులు పెడచెవిన పెట్టారు. కేవలం ప్రజల ముందు చేసిన ప్రసంగాలలో అభివృద్ధి మంత్రం జపించారు. ఆ పర్యవసానంగా అక్కడి ప్రజానీకం భయం గుప్పెట్లో బతుకులీడుస్తున్నారు.

ఈ ప్రాంతంలో సాగిస్తున్న నిర్మాణాల తీరుతెన్నులు చూస్తే ఎవరికైనా భయాందోళనలు కలుగుతాయి. ఆసియాలో అతిపెద్దదైన, దీర్ఘమైన రోప్‌వే ప్రాజెక్టు నిర్మాణం ఇక్కడిదేనని చెబుతున్నారు. 420 మెగావాట్ల విష్ణుప్రయాగ్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టు, ఎన్‌టీపీసీకి చెందిన 520 మెగావాట్ల తపోవన్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టులు భారీ యూనిట్లుగానే చెప్పుకోవాలి. అంతే కాదు.. చార్‌ధామ్‌ ప్రాజెక్టు పేరిట విశాలమైన రహదారులు, సొరంగాలు నిర్మాణ మవుతున్నాయి. ఇవన్నీ నదీ ప్రవాహాలకు ఆటంకం కలిగించేవని నిపుణులు చెబుతున్నారు. వీరు అడ్డం పడటం కారణంగా అవి తమ దోవ తాము వెదుక్కుంటున్నాయి. అది ప్రక్రుతి సహజం. అడ్డు వచ్చినప్పుడు ఏ ప్రవాహమైనా పక్కనుంచి తప్పుకోజూస్తుంది.

ఇంకా అడ్డం పెడితే భారీగా పెరిగి మొత్తాన్ని ఊడ్చేసే శక్తి నీటికి ఉంటుంది. దానిని ఎదిరించి నిలిచిన వారెవరూ చరిత్రలో లేరు. ఇకపోతే వలసలతో నానాటికీ పెరుగుతున్న జనాభా సంగతి చెప్పనవరసరమే లేదు. పైగా మనం ముందే చెప్పుకున్నట్టు ఈ ప్రాంతం భూకంప జోన్‌లో ఉంది. ఇక్కడ కంపల్సరీగా కొన్ని రకాలైన నిర్మాణాలు చేయడానికి వీలు లేవు. ఇందుకు ఇండోనేషియా జపాన్ దేశాల నుంచి గైడ్ లైన్స్ తీసుకోవచ్చు. నిపుణులను కలిసినా వారు పూర్తిగా జ్నానం ప్రసాదిస్తారు. కానీ ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా పాలకులకు కొరవడింది.

మనిషి మనుగడకు ప్రకృతి వనరుల వినియోగం తప్పనిసరి..అందులో అనుమానం లేదు..అయితే ఇటువంటి ప్రత్యేకమైన ప్రదేశంలో జాగ్రత్తలు కూడా అత్యవసరంగా భావించాల్సిందే.. సహజంగా ప్రక్రుతికి సంబంధించి సమతుల్యత ఏదోమేరకు దెబ్బతినడం కూడా అనివార్యంగా జరిగిపోతుంది. కానీ దాన్ని కనిష్ట స్థాయిలో ఉంచటం, మరీ ముఖ్యంగా ఎంతో సున్నితమైన హిమాలయ పర్వాతాలుండే ప్రాంతంలో ప్రకృతిపట్ల భయభక్తులతో మెలగటం అవసరం. ఎందుకంటే అవి ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు..వాటి భరువు అపారంగా ఉంటుంది.

ఆ బరువు అక్కడి భూమిపై ప్రభావం చూపించకుండా ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అభివృద్ధి పేరిట సాగిస్తున్న నిర్మాణాలే ప్రస్తుత దుస్థితికి కారణమని జోషిమఠ్‌ పీఠాధిపతి స్వామి అవిముక్తేశ్వరానంద్‌ చేసిన ఆరోపణల్లో నిజం లేకపోలేదు. ఇప్పటికైనా పాలకులు మేల్కొనాలి. పరిస్థితులు చేయిదాటిపోకుండా తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. ఉత్తరాఖండ్‌ భౌగోళిక స్థితిగతుల ఆధారంగా పకడ్బందీ మాస్టర్‌ప్లాన్‌ రూపొం దించి, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలి.

కార్పొరేట్‌ సంస్థల దురాశకూ, కాంట్రాక్టర్ల లాభార్జనకూ, స్వీయప్రయోజనాల రక్షణకూ యధేచ్ఛగా పర్యావరణ విధ్వంసానికి పూనుకుంటే ఏమవుతుందో జోషిమఠ్‌ ఉత్పాతం తెలియజెబుతోంది.

Must Read

spot_img